మధునా పంతుల వారి అడుగుజాడల్లో…

తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలంలో పల్లిపాలెం అనే పదహారణాల తెలుగు పల్లెటూరు ఉంది. యానాం కు వెళ్లే జాతీయ రహదారి మీద కుడి పక్కకు మళ్ళగానే ఆకుపచ్చని పొలాల మధ్య పావు గంట ప్రయాణం చేస్తే అలనాటి ఆంధ్ర పురాణం రూపు దిద్దుకున్న మధునా పంతుల వారి నివాసానికి వెళ్తాం. విద్య, వైద్యం రెండు చేతులతో నెరపిన, నేర్పిన ఆ ఇంటి లోగిలి ఈనాడు ‘మధునా పంతుల ఫౌండేషన్’ గా తెలుగు సాహిత్యానికి సాంస్కృతిక ప్రాంగణం అయ్యింది.

తమ పెద్దల బాటలో వారి సాహిత్య సేవను ప్రామాణికంగా తీసుకుని, ప్రస్తుత తెలుగు సాహిత్యానికి ఏటేటా ఉత్సవాలు జరిపే ‘మధురమైన’ బాధ్యతను తీసుకుంది. ఈ సాహిత్య కార్యక్రమానికి ఆ ఇంటి అన్నదమ్ములు తమ పూర్వీకుల వేరుకు పట్టుకొమ్మలై, సమకాలీన తెలుగు సాహిత్యానికి పట్టం కడుతున్నారు.ఒకప్పుడు ఆ గ్రామం లోని విద్యార్థుల కోసం ఉచిత ఇంగ్లీష్ మీడియం పాఠశాలను నడిపిన అచ్చోటనే, శ్రీ కిరణ్ మధునాపంతుల దిగ్గజ సాఫ్ట్వేర్ రంగ నిపుణుడు స్వీయ సాహిత్యాభిలాషతోతాను పుట్టిన ఊరికి కానుకగా విద్యా, వైద్య, కళా, సాంస్కృతిక రంగాలకు స్థిరమైన కేంద్రంగా తీర్చిదిద్దారు.

ఈ మధునాపంతుల ఫౌండేషన్ కు కార్యదర్శి వెంకట చలపతి గారు , ఉపాధ్యక్షులు మధునాపంతుల సత్యనారాయణ మూర్తి గారు, అధ్యక్షులు కిరణ్ మధునాపంతుల గారు.శ్రీ కిరణ్ తమ తండ్రి, కథా రచయిత మధునా పంతుల వెంకటేశ్వర్లు గారి పేరు మీద ‘మధుశ్రీ’ కథా గౌరవ పురస్కార సభను 2022 నుంచి నిర్వహిస్తున్నారు. సాహితీరంగం లో లబ్ధ ప్రతిష్టులైన కథకులతో పాటు, మొదటి కథా సంపుటి ప్రచురించిన ఒక కథకుని గౌరవించడమనే ఒక బృహత్కార్యాన్ని తలపెట్టి అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు.

సాహిత్యమే ఒక సముద్రం.మానవ జీవన గమనానికి అది దర్పణం. అందుకే ఏ అంతరాలు, సరిహద్దులు పరిమితులు పెట్టుకోకుండా నిష్పాక్షికం గా శ్రద్ధాభక్తులతో సాహిత్యాన్ని చదువుకునే తమ కుటుంబ సభ్యుల నిశిత పరిశీలనతో, కొందరు ఆంతరంగిక సాహితీ మిత్రులతో కలసి సమాలోచన చేసి ఈ కథా గౌరవ పురస్కారాలకు విశిష్ట కథకులను ఎంపిక చేస్తారు.అంతేకాదు, ఆయా రచయితల సాహితీ ప్రయాణం గురించి ప్రసంగించే వక్తలతో ప్రత్యేకంగా గౌరవ పురస్కారానికి అభినందన చందన సేవ సమర్పిస్తారు.

ఇలా ఒక భాషకు సంబంధించి కథకు పట్టం కట్టడం అరుదైన, అపురూపమైన విషయం. ఇప్పటిదాకా సర్వశ్రీ తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి- మధురాంతకం నరేంద్ర- చిరంజీవి వర్మ, అనామకుడు-దాట్ల దేవదానం రాజు -ముక్కామల చక్రధర్, నామిని సుబ్రహ్మణ్య నాయుడు-వాడ్రేవు వీరలక్ష్మి దేవి- కాళ్లకూరి శైలజ వరుసగా 2022 నుంచి 2025 వరకు ఈ గౌరవ పురస్కారాలను అందుకున్నారు.

రేపు 8 ఫిబ్రవరి న పల్లిపాలెంలో ‘కామరాజు సాంస్కృతిక ప్రాంగణం’లో ‘రత్నప్రభా గ్రంథాలయం’ సరసన, సాహితీకారులకు, వారి కథా రచనకు కథా గౌరవ పురస్కారాలు అందజేయబడతాయి. ఈ సంవత్సరం శ్రీ వి. రాజారామ మోహనరావు, కుప్పిలి పద్మ, రుబీనా పర్వీన్ లను ఎంపిక చేశారు. ఈ సభ సాహితీ విందు, ఆపైన అసలైన తెలుగు భోజన విందు. మృదు’మధు’రంగా.

*

శైలజ కాళ్ళకూరి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • విజయనగరం లో విజయభావన సాహితీ మిత్రా సమాఖ్య నిర్వహించిన ఉగాది వేడుకల్లో శ్రీ మధునాపంతుల గారిని ప్రత్యక్షంగా కలుసుకునే అదృష్టం కలిగింది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్న రోజులు.ఆ సభలో వారి ప్రసంగం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వారి కుమారులు మధునాపంతుల సత్యనారాయణ మూర్తి ఆంధ్రప్రభ విజయనగరం ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా పని చేస్తుండేవారు. మంచి స్నేహశీలి. మితభాషి.
    మధునాపంతుల వారి పేరుపైన సాహితీ పురస్కారాన్ని అందజేయడం ఎంతో ఆనందంగా వుంది. నేటి ఆధునిక అభ్యుదయ భావాలతో రచనలు చేస్తున్న వారికి ఈ పురస్కారం అందజేయడం ఎంతో అభినందనీయం.

    • మంచి జ్ఞాపకాలు పంచుకున్నారు.సంతోషం అండి.

  • గత సంవత్సరం వేడుకలకు హాజరయ్యే అదృష్టం
    డా. వీరలక్ష్మీదేవిగారి వల్ల దక్కింది.

    వారికి పురస్కార ప్రదానం పల్లిపాలెంలో జరుగుతుందని తెలిసి ఉండబట్టలేక బయలుదేరాను. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారి పట్ల, వారి గ్రామం పల్లిపాలెం పట్ల, ఆంధ్ర కుటీరం పట్ల నా ఆరాధన అటువంటిది.

    తెనాలి నుండి పల్లిపాలెం వరకు సాగిన రోడ్డు ప్రయాణం, అక్కడి సాహితీ సంరంభం, నాకు అత్యంత అభిమాన పాత్రులైన డా. వీరలక్ష్మీదేవి, డా. శైలజ, డా. సుబ్రహ్మణ్యం నాయుడు గార్లకి పురస్కార ప్రదానం, సాహిత్య ప్రపంచంలో మహామహుల సందర్శనం, కొసమెరుపుగా మరపురాని ఆంధ్ర భోజనం, ఇవన్నీ కలిసి నా జీవితంలో ఒక మరపురాని అనుభవాన్ని కలిగించాయి.

    అది నాకు దక్కిన అదృష్టం గా భావిస్తాను.

    ముందు తెలిస్తే ఈ నాటి సంరంభానికి కూడా హాజరయ్యేవాడిని.

    I wish the programme a huge success.

  • Commendble literary services to the enrichment of Telugu literature by the
    renowned family of scholars.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు