“He makes my feet like the feet of a deer; he causes me to stand on the heights.”
– Psalm 18:33
వటవృక్షం కింద కొంతసేపు విశ్రమించిన నేను కళ్ళు తెరిచి చూశాను. దూరంగా ఒక కుక్క నా వంక చూస్తూ నిలబడి ఉంది. అది లోకజ్ఞానం తెలియని స్వచ్ఛమైన స్థితిలో ఉన్న కుక్క. నేను దానిని పలకరించి దగ్గరకు వెళ్లాను. అది భయపడుతూ వెనక్కి వెళ్ళిపోయింది. నేను నా వద్ద ఉన్న ఆలూ చిప్స్ దానికి పెట్టాను. ఈ వింతైన నాగరికుడిని నమ్మవచ్చా లేదా అతడు పెట్టిన ఆహారాన్ని తినవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చుకోలేక ఆ కుక్క చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. కానీ ఆహారం కదా వదులుకోలేక కొంత సేపటికి ధైర్యం తెచ్చుకుని సందేహంగా, భయంగా, కొంచెం కొంచెం తినడం మొదలుపెట్టింది. ఇటువంటి స్వచ్ఛ స్థితిలో ఉన్న జీవుల్ని కలిసినప్పుడల్లా నేను జీవితం యొక్క మూలాలకు ఎంత దూరంగా జరిగి ఉన్నానో తెలుస్తుంది. ఆ కుక్క యొక్క స్వచ్ఛ స్థితిని చూసి అసూయ కలిగింది.
నేను మరిన్ని తినుబండారాలు దానికి పెట్టాను. కొంతసేపటికి దాని బెరుకు తగ్గి నా దగ్గరకు వచ్చింది. నాతో తెచ్చుకున్న ఆహారాన్ని అంతా దానికి ఇచ్చేసి దాని వద్ద సెలవు తీసుకుని బయలుదేరాను. వస్తూ వస్తూ వెనక్కి చూసినప్పుడు సోనీ దీని రూపంలో పునర్జన్మించిందా అనిపించింది.
ఆ ఊహ బావుంది.
జన్మలు ఉన్నాయో లేవో నిర్ధారించగల వారు లేరు. మన జీవితం ఎంత విచిత్రమైనది! దేనికి సంబంధించిన ఏ విధమైన సమాచారమూ మన వద్ద అందుబాటులో ఉండదు. పుట్టుక, మరణం, జీవితం – దేనికీ మనకు అర్థం తెలియదు. మన తత్వశాస్త్రాలన్నీ మన నిస్సహాయత నుండి వచ్చినవేనని అనిపిస్తుంది. We are cruelly uninformed. ఈ క్రూరమైన అనిశ్చితి నుండి పారిపోవడానికి మనం అందమైన ఊహల్లో బతకడానికి అలవాటు పడ్డామేమో!
ఈ కొండ దిగితే చాలు నేను వచ్చిన NH-516E గ్రీన్ హైవేకి చేరుకుంటాను. అటుఇటుగా ఫుట్ బాల్ నుండి క్రికెట్ బాల్ సైజుల వరకూ ఉండే రాళ్లతో నిండిన కొండ శిఖరం నుండి కిందకి వెళ్ళే గమ్మత్తయిన రాళ్ళ బాటలో నా బైక్ కిందకి వెళ్లే అవకాశం లేదు. చీకటి పడడానికి కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఎదురుగా లోయలో గ్రీన్ హైవే కనిపిస్తోంది. కానీ దాన్ని చేరుకోవడానికి అవకాశం లేదు. ఏం చెయ్యాలో పాలుపోక అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయాను. దూరంగా లోయలో చింతపల్లి గ్రంథాలయం కనిపించింది. మనసు గతంలోకి వెళ్ళింది.

చింతపల్లి గ్రంథాలయం వెలుపల పుస్తకాలను రెండు గోనె సంచుల్లో వేసి గుర్రానికి చెరువైపులా వ్రేలాడదీసి, జీను మీదకి నన్ను రుత్తల ఎరకయ్య నాయుడు తాత గారు ఎక్కించి “ఇన్ని పుస్తకాలు ఎందుకు? ఇరవయ్యో, ముప్పయ్యో పట్టుకొని వెళ్లొచ్చు కదా! సరే. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు!” అని వీడ్కోలు చెప్పేవారు.
ఆయన లైబ్రరీ నుండి ఒక విడత కనీసం 200 పుస్తకాలయినా నేను గోనె సంచుల్లో నింపుకొని ఇంటికి తీసుకుని వెళ్లేవాడిని. అందరి లైబ్రేరియన్ ల మాదిరిగానే ఆయన కూడా గ్రంథాలయంలోని పుస్తకాలు పట్ల విపరీతమైన మమకారం కలిగి ఉండేవారు. అయితే అంత చిన్న వయసులో అన్నేసి పుస్తకాలు చదువుతున్న నా విచిత్రమైన మానసిక స్థితిని, ఆతృతని చూసి జాలి పడి, ఆయనకు కాస్త బాధ కలిగినా నేను ఎంచుకున్న పుస్తకాలన్నిటినీ కాదనకుండా ఇచ్చేవారు. అంత చిన్న వయసులో పెద్దవారు చదివే పుస్తకాలు చదవడం ఆయనకు వింతగా తోచేది.
అది ఒక విచిత్రమైన వ్యవహారం. పుస్తకాలను ఇస్తే ఆయనకు బాధ కలుగుతుంది, ఇవ్వకపోతే నాకు బాధ కలుగుతుంది. నాది జిజ్ఞాస, ఆయనది మమకారం. పుస్తకాలను ఇచ్చినప్పుడల్లా ఆయన ముఖంలో దిగులు కనిపించేది. ఎందుకంటే తీసుకుని వెళ్ళిన ఏ పుస్తకాలనూ ఆయనకు తిరిగి ఇచ్చేవాడిని కాదు. తిరిగి ఇవ్వడానికి నాకు మనసు వచ్చేది కాదు.
Daniel Defoe రాసిన Robinson Crusoe మూడు భాగాల పుస్తకాలనూ ఎప్పుడూ తలగడ కింద పెట్టుకుని నిద్రపోయేవాడిని. ఒంటరి దీవిలో Crusoe లా జీవిస్తున్నట్టు ఊహించుకునేవాడిని. అడవిలో గుర్రం మీద వెళ్తున్నప్పుడు
నరమాంస భక్షకులు కనిపిస్తారని కలత చెందేవాడిని. సుదూర దీవిలో crusoe యొక్క ఏకాంత జీవితంలోని ధ్యానాత్మకత నా బాల్యం మీద చెదరని ముద్ర వేసింది. ఒంటరితనాన్ని ఏకాంత అనుభవంగా మారుతున్న అతని వివేకం మీద నాకు గొప్ప గౌరవం కలిగింది.
పుస్తకాలే నా బాల్యం. అవే నా ఊపిరి.
తాత గారిని బాధ పెడుతున్నాను అనే అపరాధనభావం కలిగేది. అయితే నాన్న గారు చెప్పారు, నేను పుస్తకాలను ఎంచుకుంటున్న ఆ చీకటి నిండిన ఆ లోపలి గదిలోని పుస్తకాలను ఎవరూ తీసుకు వెళ్ళడానికి ఆయన అనుమతించరు అని. ఆయన బయట గదిలోని పుస్తకాలను మాత్రమే ప్రజలు తీసుకెళ్లడానికి అనుమతించేవారు. ఎందుచేతనో నాకు కారణం తెలియదు. అయితే ఆయన కన్నుగప్పి లోపలి గదిలోని మహానిధిని నేను కనిపెట్టాను. ఆ నిధిని కొంచెం కొంచెం నా ఇంటికి తరలించాను. ఆ పుస్తకాల నడుమనే జీవించాను.
చింతపల్లి శివారుకు చేరుకొని రాళ్లతో నిండిన దారిలో కొండ ఎక్కుతున్నప్పుడు దట్టంగా నిండి ఉన్న రాళ్లను తప్పించుకుంటూ గుర్రం అటూఇటూ, పైకి కిందకి విచిత్రంగా కదులుతూ ఉంటే – దానిపైన ఎక్కి ఉన్న నాకు ఒక గమ్మత్తయిన అనుభవం కలిగేది. అందుకే ఎత్తైన టేకు చెట్ల నడుమ నుండి కొండ శిఖరం వరకు సాగే ఈ రాళ్ళ దారి అంటే నాకు ఎంతో ఇష్టం.
ఇప్పుడు ఈ దారిని ఎలా దిగాలి? బైక్ ఎక్కి ముందుకు వెళ్లడం సాధ్యం కాదు.
“వెళ్లవచ్చు…వెళ్ళవచ్చు” అజ్ఞాత రుషితుల్యుని మాటలు వినిపించాయి. నేను బైక్ దిగి లెక్కకు మించిన రాళ్ళ నడుమ నుండి బ్రేకులు పట్టుకుని జాగ్రత్తగా దానిని కిందికి నడిపించడం మొదలు పెట్టాను. నిదానంగా రాళ్ళ నడుమ అడుగులు వేసుకుంటూ దుస్సహమైన విన్యాసాలు చేస్తూ బైక్ ను కిందకు దింపుతుంటే, అది ఎన్నో సార్లు పడిపోయింది. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం ఇంత మంచి high suspension honda bike ని కొన్నందుకు నాకు నేను మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
ఎలాగోలా ఎన్నో బాధలు పడి కొండ కిందికి చేరుకున్నాను. అక్కడ ఒక అత్యాధునికమైన వీధి ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ ఆధునిక భవనాలు, వాహనాలు బారులు తీరి ఉన్నాయి. కొండ దిగగానే బాలల వసతిగృహం కనిపించేది. పిల్లల నవ్వులు సందడి వినిపించేది. ఇప్పుడు ఇక్కడ జీవం లేదు. క్రమంగా నాగరికత అడవుల్లోకి చొచ్చుకుని వస్తోంది.
గ్రీన్ హైవే వచ్చింది. చీకటి పడింది. వర్షం పెరిగింది. లంబసింగి వైపు నా బైక్ వేగంగా దూసుకునిపోయింది. లంబసింగి జంక్షన్లో ఆగి స్పెషల్ అరకు కాఫీ ఒకటి తాగాక వణుకు తగ్గింది. శక్తి వచ్చింది. ఈ పర్వతాలు దిగి మైదానంలో ఉన్న మా ఇంటికి చేరడానికి ఇంకా 30 నిమిషాల సమయం పడుతుంది.
ఇక్కడితో అద్భుతమైన తుఫాను యాత్ర ముగిసిందని భావిస్తాను.
*








Add comment