పాలేరు కొడుకు గెలిచిన బతుకు కథ

40 వ దశాబ్దం లో జన్మించిన ఒక పేద దళిత బాలుడు 60 వ దశాబ్దానికి ఐ.ఏ. యస్. లో ప్రవేశించి బాధ్యతలు చేపట్టటం అరుదైన విషయమే. కాకి మాధవరావు గారి విషయంలో అది సాధ్యమైంది. ఆదర్శవంతుడైన, నిజాయితీ పరుడైన , పనిమంతుడైన ఒక పాలేరు కొడుకాయన. తన లాగానే తన కొడుకు కూడా మంచి పాలేరు గా పేరు తెచ్చుకోవాలనుకున్న తండ్రి కలలను కల్లలు చేసి, తన కొడుకు చదువుకుని ఆఫీసరు కావాలని పట్టు బట్టిన తల్లి కోరికను నెగ్గించిన సుపుత్రుడాయన.

గ్రామంలో, వాడ , పేదరికంలో చదువుకోవటమంటే చావు బతుకుల పోరాటమైన పరిస్థితులలో, అక్షరాలా గుప్పెడు మెతుకులు పెట్టే ఒక వసతి గృహం లో ఉంటూ చదువుకున్నాడు. ఆ పరిస్థితులను ఎలాంటి సంకోచాలు లేకుండా తన ఆత్మకథ “ సంకెళ్ళ ను తెంచుకుంటూ” లో రాశారు కాకి మాధవరావు గారు. తన చదువు కోసం అన్నయ్య చదువు మానటం తో కుటుంబం పట్ల బాధ్యత పెరిగింది. కాలేజీ, యూనివర్సిటీ చదువుల తర్వాత సివిల్ సర్వీసెస్ కు వెళ్ళటంతో ఒక స్థిమితం చిక్కింది. చిన్నతనం నుంచీ ఆత్మాభిమానం, ఆత్మ గౌరవాలనూ కాపాడుకోవటం కోసం ఇంటా, బైటా పోరాటం చేయటం అలవాటైంది. సాహసాలు చేయటం ఆయన సహజ స్వభావం. పరోపకారం కూడా – ఆయా సంఘటనలు ఆయన చాలా చాలా సాధారణం గా  ఒకో సారి సరదాగా చెబుతున్నట్లు చెప్పారు గానీ అవి ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచెబుతున్నాయి.

ఐ. ఏ. ఎస్. శిక్షణ రోజుల్లో అమితంగా దొరికే ఆహారాన్ని ఆయన ఆస్వాదించ లేకపోయారు. గుప్పెడు మెతుకులతో కడుపు నింపుకున్న రోజుల జ్ఞాపకాలతో మితాహారి అయ్యారు. పేదరికపు  అంచులలో జీవించిన మనిషి గనుక పేదలకు ఏం చేయగలను, ఎలా చేయగలనని అధికారంలో ఉన్నంతకాలం ఆలోచిస్తూనే ఉన్నారు. అధికార విరమణ తర్వాత కూడా పౌర సమాజం లో భాగం గా ఉద్యమాలలో భాగమై అరెస్టయిన తొలి చీఫ్ సెక్రెటరీ మాధవరావు గారు.

ఉద్యోగపు తొలి రోజులలో శ్రీకాకుళం జిల్లాలో వెంపటాపు సత్యం గారికి బెయిల్ ఇచ్చినప్పుడు గానీ, వరంగల్ జిల్లాలో దొరలకు వ్యతిరేకంగా పేదల పక్షాన పని చేసి “ నక్సలైటు కలెక్టర్” అని వార్తా పత్రికల్లో , ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి పత్రికలలో తన గురించి రాసినప్పుడు గానీ ఆయనకు నక్సలైట్ ఉద్యమంలో ఏ సంబంధం లేదు. పేదల పక్షాన నిలబడటం, దొరల ప్రయోజనాలకు దెబ్బ తీసిన వాడు నక్సలైట్ అనుకునే రోజులవి.

తన ఉద్యోగ జీవితం లో మాధవరావు గారు చాలా ఇష్టం గా తలుచుకున్నది. ఎస్. ఆర్. శంకరన్ గారితో కలిసి పని చేసిన రోజులను. వారిద్దరూ కలిసి ఒక వ్యూహం ప్రకారం వెట్టి చాకిరిలో మగ్గుతున్న వారిని దాని నుంచి ఎలా బైట పడేశారో చాలా ఆసక్తికరంగా రాశారు. అనేక శాఖలలో, అనేక మంది ముఖ్యమంత్రులతో, అనేక మంది అంకిత భావం తో పని చేసే సహచరులతో కలిసి తాను చేసిన పనులను ఆయన వివరించారు. అందరికీ అర్థమయ్యేలా రాశారు. ప్రభుత్వ పాలసీలను రూపొందించటం, జి. వో. లు తయారు చేయటం, మంత్రుల ఆమోదాన్ని పొందటం ఇవన్నీ చేయటానికి ఆ అధికారులకు ఉండవలసిన జ్ఞానం , వివేకం, ప్రజానుకూలత, సమయస్పూర్తి, కార్య నిర్వహణ చాతుర్యం, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ మనకు ఈ పుస్తకం లో అర్థమవుతాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక ప్రజానుకూలమైన నిర్ణయానికి ఆమోద ముద్ర సంపాదించటం అధికారులకు ఎంత కష్టమవుతుందో కూడా అర్థమవుతుంది.  అధికారం లో మెట్లు ఎక్కుతున్న కొద్దీ కత్తి మీద సాము చేయాల్సిన పరిస్థితులు కొందరికి వస్తే, మరి కొందరు ఆ అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటారు. కొందరు మేలు, కీడు ఏదీ చేయని తటస్థులుంటారు. సాహసం, చాతుర్యం, అంకిత భావం ఉంటే తప్ప సాధ్య పడని పనులు తన పదవీ కాలం లో మాధవరావు గారు అనేకం చేశారు.

‘ ఆత్మ కథ ‘ రాయటం సులువైన పనేమీ కాదు. ఎన్నో విషయాలను నిర్మొహమాటంగా, ఇబ్బంది పడకుండా రాయాలి. అసత్యాన్ని, స్వీయ ఆరాధన ని దూరంగా పెట్టాలి. ఆసక్తి కరంగా రాయగలగాలి. మాధవ రావు గారి ఆత్మ కథ ఇలాగే సాగింది. చేయి తిరిగిన రచయిత రాసినట్లు గా, కథన ధోరణి లో ఉంది. తన బలాలను, బలహీనతలను సమానం గానే బేరీజు వేసుకోగలిగారు. హాస్యం, కోపం, జుగుప్స, కరుణ, శాంతం, భయం అన్నీ రసాలు  కలగలసిన రసవత్తర జీవితాన్ని జీవించారు. దానిని అంత రసవత్తరంగానూ ఆవిష్కరించారు.

స్వీయ చరిత్రలు తప్పనిసరిగా సామాజిక చరిత్రలవుతాయి. ప్రధాన స్రవంతి చరిత్ర కారులు రాసే పాలకుల చరిత్రలకు భిన్నంగా సామాన్యుల స్వీయ చరిత్రలు ప్రజా చరిత్ర కు కావాల్సిన వివరాలను, వనరులను అందిస్తాయి. “ ప్రభువెక్కిన పల్లకీ కాదోయ్, అది మోసిన బోయీలెవరు?” అన్న ప్రశ్న కు సమాధానాలు దొరికే స్వీయ చరిత్ర “ సంకెళ్ళను తెంచుకుంటూ”. ఇందులో పల్లకీ లోని లొసుగులను, లోటుపాట్ల ను  వివరిస్తూ , ప్రయాణించవలసిన దారి లో ఎదురయ్యే ముళ్ళూ . రాళ్ళూ, అవాంతరాలను ఎలా దాటొచ్చో సూచిస్తూ ఒక ప్రజాస్వామిక పాలనా ప్రయాణం చిత్రించబడ్డది.

స్వీయ చరిత్రలు సాహిత్యం లో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ గా కూడా నిలుస్తాయి. “ సంకెళ్ళను తెంచుకుంటూ” పుస్తకం లోని సాహితీ విలువలను పరిశీలిస్తే ఒక చేయి తిరిగిన రచయిత, శిల్ప రహస్యాలను తెలిసిన రచయిత రాసిన పుస్తకం లా ఆసక్తికరంగా సాగిపోతుంది. పుస్తకమంతా ఒక సున్నితమైన హాస్యం అంతర్వాహిని గా ఉంటుంది. తన జీవితాన్ని, చుట్టూ ఉన్న సామాజిక జీవితాన్నీ చాలా గంభీరంగా పరిశీలిస్తూ, అర్థం చేసుకుంటూ దానిని హాస్య ధోరణీ లో చెప్పగలగటమనేది విశిష్టమైన రచనాశిల్పం, శైలి. దానిని మాధవరావు గారు చాలా సులువు గా సాధించారు. ఒకవేళ ఆయన కష్టపడినా అది పాఠకులకు తెలియదు. బహు గ్రంధ పఠనం వల్ల అది సాధ్యమైంది. జాషువా గారి రచనలను ఆంగ్లం లోకి అనువాదం చేసిన ప్రతిభాశాలి రచనా సామర్ధ్యం  మనకు ఈ పుస్తకం లో కనిపిస్తుంది.

అధికార యంత్రాంగం రాజ్యాంగ స్ఫూర్తి తో పని చేస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ఈ పుస్తకం లో మనకు అర్థమవుతుంది. తన జీవితం గురించి రాస్తున్నప్పుడు మాధవ రావు గారు ప్రధానం గా చెప్పదలచింది దేశం లోని అసమానతల గురించీ, ఆ అసమానతలను తొలగించటానికి రాసుకున్న రాజ్యాంగం గురించీ, ఆ రాజ్యాంగాన్నీ లెక్క చేయకుండా పాలన సాగించాలనుకునే ప్రభుత్వాల గురించీ, ఆ ప్రభుత్వాల చేతనే, తమకు రాజ్యాంగం కల్పించిన రక్షణల సాయంతో ప్రజలకు మేలు చేయవచ్చని నిరూపించిన అధికారుల గురించి. రాజ్యాంగం గురించిన చర్చలు జరుగుతున్న వర్తమాన కాలం లో, రాజ్యాంగాన్నీ ఇష్టం వచ్చినట్లు ఉల్లంఘిస్తున్న ఈ కాలం లో “ సంకెళ్ళను తెంచుకుంటూ” పుస్తకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పుస్తకం చదివి ప్రేరణ పొంది – సామాజిక అసమానత లను తొలగించటానికి రాజ్యాంగాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలనే ఆలోచన ను స్ఫూర్తిని, యువతరం పొందుతుందని ఆశిస్తూ..

*

ఓల్గా

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని ఏర్పడుతుందో అధర్మం పెరిగిపోతుందో ఆ ఆ సమయాల్లో నన్ను నేను ప్రకటించుకుంటాను. సాధు స్వభావం కలవారిని రక్షించడానికి దుష్టులను నాశనం చేయడానికి ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తాను

  • “ఉద్యోగపు తొలి రోజులలో శ్రీకాకుళం జిల్లాలో వెంపటాపు సత్యం గారికి బెయిల్ ఇచ్చినప్పుడు గానీ” శ్రీకాకుళం జిల్లాలో ఏసంవత్సరంలో ఆయన ఏ హోదాలో ఉండగా ఈ విషయం జరిగిందని ఆ పుస్తకంలో ఉందో చెప్పండి. ప్లీజ్ .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు