పర్ఫెక్ట్ మర్డర్

సిద్ధాంతం బానే ఉంది. ఇద్దరు జ్ఞానమూర్తులూ ఒకే సోఫాలో తన ఎదురుగా ఇదివరలాగానే నవ్వుతూ కూర్చోవాలనే కోరికనుంచి ఎలా బయట పడటం? ఇన్నాళ్ళ తన ప్రగాఢ ప్రయత్నం ఫలితం శుద్ధశూన్యమని ఎలా ఒప్పుకోటం? ఈరెండు మొండిగోడలు దూకితేగాని ప్రశాంతత లేదు.

ర్ఫెక్ట్ మర్డర్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు, ఇక జరగబోదు అని మేథావుల ధీమా. కానీ ఇక్కడ జరిగిందే! తన అత్యంత సన్నిహితుల ఇంట్లో. హత్య జరిగి రెండు సంవత్సరాల పైనే అయింది కూడా. ఎంత నిశితంగా ఎంతమంది గాలించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం, హత్యకి మోటివ్ ఎవ్వరూ కనిపెట్టలేక పోయారు. ఛేదించగలిగిన షెర్లాక్ హౌమ్స్ పృధ్విలో ఇక

తనొక్కడే మిగిలాడు. ఒకరకంగా ఈ కేసు పరిష్కరణ తనకీ ఒక ప్రాణావసరం.

సూర్య భగవానుడు కొలువుతీర్చి అరగంట కూడా కాలేదు. ఊరికి చివరగా ఉన్న సావిత్రత్తయ్య ఇంటివైపు నడుస్తున్నాడు నచికేత. సావిత్రత్తయ్యని కలవబోతున్నాననే స్ఫురణమాత్రం యాంత్రిక నడకని ధ్యాననడకగా రూపు దిద్దుతుంది. రోజూ చూసే పిచ్చిపూలు కొత్తజీవం తెచ్చిపెట్టుకుని తట్టితట్టి పలకరిస్తాయి. విహంగ స్వనాలలో బీథోవెన్ వినిపిస్తాడు.

తూర్పు కిటికీనుంచి ఏటవాలుగా ప్రసరిస్తున్న భానుడి కిరణాలు     నేలనుంచి గోడకి, గోడనుంచి ఈజీ చెయిర్‌లో కూర్చుని లాప్‌టాప్ చూసుకుంటున్న సావిత్రి ముఖానికి పరావర్తనం చెంది అప్పుడే ప్రవేశించిన నచికేతకి దృశ్యానందం కలగజేశాయి.

“రారా నచికేతా, వారంనుంచీ కనబడలేదే? ఫైనల్ ఫరీక్షలకి ఇంకా నెలరోజులున్నాయిగా?” అమ్మ మాటంత ఆప్యాయంగా ఉంటుంది అత్తమాట.

“పరీక్షలకింకా ప్రిపరేషన్‌ మొదలు పెట్టలేదత్తయ్యా. జీవితంలో పరీక్షలకి మించినవి చాలా ఉంటాయని నువ్వే నేర్పించావుగా!” టేబుల్ మీద ఉన్న ఫ్లాస్కులోంచి పక్కనే కడిగితుడిచి బోర్లించి ఉన్న రెండు కప్పుల్లో కెమోమైల్ టీ పోసి ఒకటి సావిత్రికిచ్చి తనొకటి తీసుకుని స్టూల్‌ మీద కూర్చున్నాడు. ఆ చిన్న గదిలో రెండు కుర్చీలు, ఒక స్టూల్, పశ్చిమం గోడకు ఆనుకుని ఒక అల్మిరా ఉన్నాయి. ఆ‌ పాతకాలపు పెంకుటిల్లు ఎలా అద్దెకు దొరికిందో ఆవిడకి. ఆగది, గదికి లోంచి ముప్ఫై చదరపు అడుగుల వంటగది, తూర్పున వసారా వాకిలి, అంతటితో ఇల్లు పూర్తి. కానీ ఇంటికి నలువైపులా ఖాళీస్థలం, మొక్కలు పెట్టుకోవడానికి సౌకర్యం, పుష్కలంగా గాలీ వెలుతురూ.

“ మొన్న మావయ్యని ఇంటికి వెళ్ళి కలిశానత్తయ్యా. వాళ్ళన్నయ్య స్పెషల్ వెన్నుండలు చేసి అమ్మ ఇచ్చి రమ్మంది.” అత్త ముఖంలో ఎటువంటి స్పందనా లేదు.

“మావయ్య రాసిన ‘తెలుగు సాహిత్యానికి వరం కాబోతున్న కృత్రిమ మేధస్సు’ వ్యాసం రాజమహేంద్రవరం కవి సమ్మేళనంలో చర్చించుకున్నారట.” ఇంకో ప్రయత్నం చేశాడు నచికేత.

“శనివారం నుంచి నాలుగు రోజులు ఊళ్ళో ఉండనురా. హంపీతో మొదలుపెట్టి కర్ణాటక టూర్. ఈసారి టూర్‌లో నేనొక్కతినే ఆడదాన్ని.”

హతవిధీ. మేధస్సు మంచితనం సమపాళ్లలో పుణికి పుచ్చుకున్న వీళ్ళిద్దరూ విడివిడిగా ఉండవలసిన అవసరం, అగత్యం ఏమిటో కనుక్కోవటానికి ఎన్ని కోణాలలో ప్రయత్నం చేసినా అంగుళంకూడా అడుగు ముందుకు పడదుకదా!

నచికేత చిన్నబుచ్చుకున్నాడని గమనించిన సావిత్రి అతన్ని ఓదారుస్తున్న గొంతుతో, “ ఆయనకి ఎన్ని గౌరవాలు జరిగినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు” అంది తన ట్రేడ్‌మార్క్‌ చిరునవ్వు జోడించి.

నలభై వసంతాలు ఇంకా పూర్తిచేసుకోని  సావిత్రి రూపంలో వయస్సు ముప్ఫైకి తక్కువగా, హుందాతనంలో ఏభైకి ఎక్కువగా కనిపిస్తుంది చూపరుల దృష్ట్యనుసారంగా. పధ్నాలుగేళ్ళుగా భార్యాభర్తల నెవరూ మీరు పిల్లలు వద్దనుకున్నారా అని వారు కలిసి ఉన్నప్నుడు అడగటానికి సాహసించలేక పోయారు.  ఇప్పుడు ఎందుకు విడిగా ఉంటున్నారు అని అంతకంటే అడగలేకపోతున్నారు. ప్రశ్నలు అడగటానికి నచికేత ఒకడే మిగిలాడు.

“ అత్తయ్యా, నిన్ను ఎటువంటి ప్రశ్నైనా అడగగలిగే హక్కు, చనువు నాకు ఉంది. నీ తరువాతే మావయ్య. అవునంటావా?”

లాప్‌టాప్ నుంచి తల ఎత్తలేదు సావిత్రి. “సమాధానం అవసరంలేని ప్రశ్న. చాలా విషయాలు బరిహ్గతం చేసుకుంటే సొగసు కోల్పోతాయి!”

ఈ ద్వారం మూసుకుపోయింది.

“ పర్ఫెక్ట్.  సమాధానం నాకు చాలా అవసరమయిన ఇంకో ప్రశ్న. వివాహం సజావుగా నడవటానికి సెక్సు భార్యాభర్తల మధ్యే పరిమితం అయి ఉండి తీరాలా?”

“ఇది ‌బలహీనమైన ప్రశ్న. సజావు అంటే ఒకరిపట్ల ఒకరికి ప్రేమాభిమానాలా? కీచులాడుకోకుండా ఉండటమా? ఒకే కప్పుకింద బతకడమా? సమాజానికీ చట్టానికీ సమాధానం చెప్పుకోనవసరం లేని స్థితిలో ఉండటమా? సెక్సు బంధం ప్రాముఖ్యత సంబంధిత వ్యక్తుల పరిణతి మీద ఆధారపడి ఉంటుంది.”

“వివాహానికి ప్రాముఖ్యత ఏమిటి? లివింగ్ ఇన్‌లతో జీవితాలు గడిపెయ్యచ్చుగా? ఆటవికుల్లాగా విచ్చలవిడిగా బతకచ్చుగా?”

“ఏ వ్యవస్థలో గడిపామన్నది లెక్కలోకి రాదు. ఎలా గడిపామన్నది ముఖ్యం. చిత్తవృత్తి మీద అవగాహన ఉన్న వ్యక్తి ఎటువంటి బాహ్యం లోనయినా నిర్మలం గానే ఉంటాడు. చిత్‌స్పృహ లేని వ్యక్తి రామరాజ్యం లో కూడా దుఃఖిస్తూనే ఉంటాడు.”

భారీ డైలాగుల్లో సమాధానం దొరకదు. ప్రత్యక్ష దాడి తక్షణ కర్తవ్యం. అత్తయ్య చిరునవ్వు చెదరదని ధైర్యం.

“ అన్నీ తెలిసిన దానివి  అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు? నీ నిర్ణయం మీద ఇంకొకరి జీవితం ఆధారపడి ఉందికదా?”

నచికేత కళ్శలోకి సూటిగా చూసింది సావిత్రి. ఆచూపుల్లో సానుభూతి ఉందేమో కాని‌ కోపం లేదు. నిదానంగా సిస్టమ్‌ మూసి పక్కన పెట్టి లేచి వంటిట్లో కెళ్ళి రెండు నిముషాల తర్వాత వసారాలోకి నడిచింది. నచికేత ఆమె పక్కనే నిలబడి ఆమెతో పాటుగా పారిజాతం చెట్టు చుట్టూ రాలిన పూలకేసి చూశాడు.

“హృదయం, నిబద్ధత ఉన్నవాళ్ళకి ‘ఫలానా పని ఎందుకు చేశావ్’ అన్న ప్రశ్నకి సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం రాదు. నిజాన్ని కప్పిపుచ్చటానికి వంద అబద్ధాలు పుట్టించవచ్చు. కానీ ఉన్న నిజం ఒకటే. మనం ఏపని చేసినా తప్పనిసరిగా కనీసం ఎవరో ఒకరు ప్రభావితమవుతారు. నిర్మలత్వపు పునాదుల్లోంచి జరిగే ప్రభావం తప్పనిసరిగా నిర్మలంగా ఉంటుంది.”

“నీవల్ల గతంలో పొరపాటు జరిగిందని గుర్తించి నువ్వు పశ్చాత్తాపపడ్డ సంఘటన లేమయినా జరిగాయా?”

“నేను పొరపాటు చేశానని మరొకరు అనుకోగల సంఘటనలు జరిగాయి. ఇంకా జరుగుతాయి కూడా. పొరపాటు అంటే బుద్ధిపూర్వకంగా మరొకరికి హానిచెయ్యడం. ఆపని నేనెన్నడూ చేయలేదు. చేయనుకూడా. ప్రతి సంఘటనా ఒక కూడలి వంటిది. కూడలి నించి ఏదో ఒకమార్గం తన వివేచనా సామర్థ్యానుగుణంగా మనిషి ఎంచుకుంటాడు. పర్యవసానం అనుభవిస్తాడు. మనం ఏమార్గం ఎంచుకున్నా ఇంకో మార్గంలో వెళ్ళి ఉండాల్సింది అని ఇతరులు విమర్శించవచ్చు. సమతౌల్యం లేనివారిని అంతరాత్మే విమర్శించవచ్చు!

గతం తలుచుకుని బాధపడటం, విమర్శించుకోవడం, పశ్చాత్తాపపడటం నాకెన్నడూ జరగలేదు. వర్తమానాన్ని ఆస్వాదించడానికే సమయం  చాలటం లేదు, గతం తవ్వుకుని దిగులు పడటానికి సమయం ఎక్కడినించి అరువు తెచ్చుకోను!?”

ఈవిడ తను ఎన్ని ప్రశ్నలు వేసినా కర్మవేదాంతిలా సమాధానాలు చెబుతుంది. ఆలోచింంచిన కొద్దీ మరింత అర్ధం అవగల సమాధానాలు అవలీలగా చెబుతుంది. మావయ్యని వదిలి ఎందుకు విడిగా ఉంటోందో అన్న ప్రశ్నకి తప్ప అన్ని బ్రహ్మసూత్రాలకీ వివరణ ఇస్తుంది.

“ బయల్దేరుతాను అత్తయ్యా, మళ్ళీ కలుస్తాను.” మళ్ళీకలుస్తాను అని అనూచానంగా అన్నాడేకాని ఈగుమ్మం మళ్ళీ తొక్కడేమోనని లోపలెక్కడో అనిపిస్తోంది.

*****

చివరి ప్రయత్నంగా మామయ్యని కదిలించి చూడాలి. కదిలించడం చాలదు. కుదిపేయాలి. ఏమిటీ ఘర్షణ తనకి? అత్తయ్య మావయ్యల మధ్య ఏంఘర్షణలు జరిగాయో తెలుసుకుందామనే తపన దేనికి? అత్తయ్య విడిగా ఇల్లుతీసుకుని స్వశక్తితో ఒంటరి జీవితం ఎందుకు గడుపుతోందో అన్న సమస్య ఛేదించి తీరాలనే దుగ్ధ ఎందుకు?

సావిత్రి అత్తయ్య, సత్యమూర్తి మావయ్య తనకి జీవితంలో అత్యంత ఆప్తులు కనక. ఆమ్మ నాన్నలతో సహా ఈ జటిలత్వం ఎవరినీ బాధించటంలేదు కనక. ఇద్దరిమధ్య ఇంత చీలిక అసాధ్యం అని తను నమ్మాడు కనక. తన ఆధ్యాత్మిక శక్తి మీద క్రమేపీ నమ్మకం సన్నగిల్లుతోంది కనక.

ఆయన తీరికగా ఉండే ఒక ఆదివారంనాడు సత్యమూర్తి తలుపు తట్టాడు నచికేత.

image.png

మేనల్లుడిని కౌగలించుకుని,” ఏరా, చాలా రోజుల తర్వాత కనబడుతున్నావ్, వంటింట్లోకి పద. పులిహోర చేసుకుందాం.” అన్నాడు సత్యమూర్తి ఉత్సాహంగా.

అదును చూసుకుని వెన్నుండలు లోపల పెడుతూ అడిగేశాడు నచికేత. “ మావయ్యా, ఎన్నాళ్ళిలా బ్రహ్మచారి జీవితం గడుపుతావ్? బ్రహ్మచారి జీవితం అంటే ఏమిటి అని నన్ను చిక్కు ప్రశ్న లు వెయ్యకు.  అత్తయ్య నీతో ఎందుకు ఉండటం లేదు?”

పులిహోరలో ఘుమఘుమ లాడే తిరగమూత కలియపెడుతూ, “మీ అత్తయ్య ఫలానా పని చెయ్యడంలేదని నన్నడుగుతావేరా?”

ఏమడిగితే కావాల్సిన సమాధానందొరుకుతుంది కనక?

“ పెళ్ళి చేసుకునే వ్యక్తులకి కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు వచ్చి పడతాయని నాకు తెలుసు. హక్కుని గౌరవించడం భాగస్వామి బాధ్యత అనీ తెలుసు. భార్యాభర్తలకి సమాజం పట్లకూడా దంపతులుగా హక్కు బాధ్యతలుంటాయని తెలుసు. కానీ ఇదమిత్థంగా ఆ హక్కులేమిటో బాధ్యతలేమిటో తెలియదు.” ఇంకో నచికేత ప్రశ్న.

“ డూౙ్ అండ్ డోంట్స్ జాబితా ఎంతోకొంత స్పష్టతతో అందరికీ తెలుసు, వివేచనాపరుడివిగా నీకు మరింత స్పష్టంగా తెలుసు. బంధానికి సౌరభం చేకూర్చే పునాది తెలియడం ముఖ్యం. ప్రతి వ్యక్తికీ ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇద్దరు భాగస్వాములూ ఎదుటవారి వ్యక్తిత్వాన్ని గుర్తించాలి, గౌరవించాలి, కాపాడుకోవాలి. అప్పుడే అప్రయత్నంగా ఒక సమిష్టి వ్యక్తిత్వం అంకురించి శోభాయమానంగా రూపుదిద్దుకుంటుంది.”

నచికేతకి ఓడిపోయానన్న భావం సుస్పష్టమయింది. అఫరాధపరిశోధనకి తను అనర్హుడు! ఏమడిగినా సత్యమూర్తి మావయ్య మనసుకి హత్తుకుపోయే సమాధానాలు చెపుతాడు కానీ భార్యని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇల్లు వదిలి వెళ్లి విడిగాఉండడానికి ఎందుకు కారణభూతుడయ్యాడో చెప్పడు. విచిత్రమేమిటంటే ఏప్రశ్ననీ దాటి వేస్తున్నట్లు కనబడడు. ఈ విషయంలో సావిత్రత్తయ్యదీ అదే దారి.

గంటసేపు విభిన్న విషయాలమీద మావయ్యతో సంభాషించి శలవు తీసుకున్నాడు. యథాప్రకారం, పుస్తకాలలో దొరకని విజ్ఞానం మావయ్యతో మాట్లాడితే అలవడుతుందని రూఢి అయింది.

*****

గత నాలుగు రోజులుగా నచికేత ఎంతో వ్యాకులపడుతున్నాడు. చదువుమీద దృష్టి సారించలేనంత మధనపడుతున్నాడు. అత్తయ్య మావయ్యల చానల్ తప్ప బుఱ్ఱలో మరేదీ మెదలటంలేదు. వాళ్ళు విడిపోదామని పరస్పరం నిర్ణయించుకుంటే తనేం చెయ్యగలడు? ఇద్దరూ తనకంటే వయస్సులోనూ మేధస్సులోనూ ఎంతో పెద్దవారు. ఎవరి ఆనందంలో వారున్నారని సిద్ధాంతపరంగా మనం స్థిరపడిపోతే మనకూ ఆనందమే కదా. ఆనందో బ్రహ్మ!

సిద్ధాంతం బానే ఉంది. ఇద్దరు జ్ఞానమూర్తులూ ఒకే సోఫాలో తన ఎదురుగా ఇదివరలాగానే నవ్వుతూ కూర్చోవాలనే కోరికనుంచి ఎలా బయట పడటం? ఇన్నాళ్ళ తన ప్రగాఢ ప్రయత్నం ఫలితం శుద్ధశూన్యమని ఎలా ఒప్పుకోటం? ఈరెండు మొండిగోడలు దూకితేగాని ప్రశాంతత లేదు.

మార్గం ఒకటే మిగిలింది. మావయ్య దగ్గరకి దూసుకెళ్ళి ఖరాఖండిగా తన మానసిక స్థితి పూసగుచ్చినట్టు చెప్పి, కొన్నాళ్ళవరకూ మీకూ నాకూ రామ్‌రామ్ అనెయ్యటమే.

ఒకకోణంలో చూస్తే ఇవ్వబోయే ఈ ఉపన్యాసం తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. పదాలు, వాక్యాలు పద్ధతిగా కూర్చుకుని ముఖతా వెళ్ళగక్కాలి.

మావయ్యా, నన్ను మన్నించు. నీ మంచితనం నాకు మొండితనంగా కనిపిస్తోంది. నీ జీవశక్తి, అత్తయ్య జీవశక్తులు ఒకే జ్వాలలా కలిసి వెలిగితే విడి జ్వాలలకి నాలుగింతల ప్రకాశం ప్రసరిస్తుంది. ఆ సంగతి మీఇద్దరికీ తెలుసు. తెలిసీ ఎందుకు మీ ఇద్దరిమధ్య అగాధం ఏర్పడనిచ్చావు? ఈ ఉత్పాతానికి నీ ప్రమేయం ఏదీలేదని బుకాయించకు. నువ్వు తలుచుకుంటే అత్తయ్యని దూరం అవకుండా ఆపగలిగే వాడివి‌. నీవలన ఏదయినా తప్పు జరిగిఉంటే క్షమించమని అత్తయ్యని అడిగేపాటి ఔన్నత్యం నీలో లోపించిందని నమ్మమంటావా?

నీదృష్టిలో అత్తయ్య నిన్ను నొప్పించి ఉంటే, అత్తయ్య అడగకుండానే మన్నించే హృదయం నీలో లేదని నమ్మమంటావా? మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గి ఎండిపోయిందని నమ్మమంటావా? ఈ ప్రశ్నలకి నువ్వు సరయిన సమాధానం తప్పక చెప్తావు, కానీ నేనాశించే సూటి సమాధానం నాకు ఎలాగూ రాదు. ఈ బరువుని నేనిక మొయ్యలేను. నువ్వు పనిమీద పిలిస్తే తప్ప నా అంతట నేను ఇక నిన్ను కలవను. ఇక ఇప్పుడే నేను అత్తయ్యని కూడా కలిసి ఇదే విషయం ఇదే భాషలో చెప్పదలుచుకున్నాను.   బై.

ఒకటికి రెండుసార్లు డైలాగు రిహార్సల్ వేసుకుని వడివడిగా అడుగులేసుకుంటూ మావయ్య ఇంటికి నడిచాడు.

సత్యమూర్తి ఇంటి ముఖద్వారం చూడగానే ఆ క్షణంవరకూ బలపడుతూ వచ్చిన నచికేత మానసిక దృఢత్వం ఆశ్చర్యంగా పలచబడిపోయింది. ధృడత్వం స్థానంలో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత చోటుచేసుకుంది.

తలుపు తట్టిందే తడవుగా తెరుచుకుంది. తలుపుతెరిచింది మావయ్య కాదు.

సరస్వతీదేవిని తలపించే సావిత్రి. “ ఏరా నచికేతా, చాలారోజుల తర్వాత కనబడుతున్నావు! ఏంప్రశ్నలు వేయాలో బాగా తయారయి వచ్చినట్లున్నావు!” అంటూ ఆహ్వానించింది అత్తయ్య ఆప్యాయత మూర్తీభవించిన అవతారంతో. వంటింట్లో ఉన్న భర్తతో, “ సత్యా, మూడు కెమోమైళ్ళు చేయండి.” అంది. ఆగొంతులో అజ్ఞాపన ఎంత ఉందో అభ్యర్ధన అంత ఉంది.

ఇంకేం ప్రశ్నలు మిగిలాయి? ఇంటి ప్రతి అంగుళంలోను  అత్తయ్య ఉనికి దర్శనమిస్తోంది. గోడకి సావిత్రి సత్యమూర్తుల ఫొటో ఎప్పటిలాగే ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది.

సోఫాలో సావిత్రి పక్కనే సత్యమూర్తి కూర్చున్నాడు. ఎదుటి సింగిల్ సోఫాలో కూర్చుని ఇద్దరినీ చూసుకుంటూ టీ ఆస్వాదిస్తున్నాడు నచికేత.

పర్ఫెక్ట్ మర్డర్.

*****

మల్లాది లక్ష్మణ శాస్త్రి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ippude chadivaanu, bagundi. murder ayindi attaiah mamaiah la relation kaadu; vaalla madhya erpaddayi anukonna abhipraya bhedaalanu tana madhyavarthtvam toh teerchudaamanukonna nachiketudi asha!

    • మీ వ్యాఖ్యకి అనేక ధన్యవాదాలండీ. మీరిచ్చిన కొండంత బలంతో తప్పక ప్రయత్నిస్తాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు