మబ్బులు కమ్ముకుని
చీకటితో వెలితిగా ఉండే ఆకాశం
చెప్పదు కురిసేది కురవంది
కొత్తవాళ్ళు పాతవాళ్ళమూ కలిసి
ఏడు ద్విచక్రవాహనాలు, ఇరవైఒక్క మనుషులు
మళయాళీలు పద్దెనిమిది, తెలుగోళ్ళు ముగ్గురు
ట్రిపుల్ రైడ్ – ఎవరం ముఖాలని హెల్మెట్తో కప్పక
పయనం మొదలయ్యాక
తోడుగా చినుకులజల్లు రాలుతూ
చల్లగాలిలో దేహంపై తేమను మోసుకుంటూ
DLF – Friends Food దాకా.
సందడి
కొత్తవాళ్ళ మొహమాటానికి నవ్వుపూయిస్తూ పాతవాళ్ళ కలుపుకోలు
కొన్ని నవ్వుకోలు ముచ్చట్లు – శబ్దపూరిత నవ్వులు
చలచలమంటూ రాలే చినుకుల్లాగ
మెల్లిమెల్లిగా
ఇక కొత్త రకాల రుచులు
కొత్తు పరోటా
చికెన్ ఇడియప్పమ్
పొంగనాలు
పాల్పరోట
ఒకదానికొకటి నోటికిమళ్ళే వేళ్ళకీ రుచి తెలిసేలా
మాటలు ఊసులూ కథలూ
రుచులను పంచుకున్నట్టే రూపాయిలనీ పంచుకుని
తిరిగి తలుచుకునే క్యాంపస్కి
చినుకులు
వానలా మారి
సూదుల్లా చీమల్లా నొప్పించే చినుకుల సలుపులతోటే
పెట్రోలూ నింపుకుని
వెనుక కూర్చున్న మళయాళీ పెణ్కుట్టీలు
వానకి తడిసి
కొత్తవానను చూసి పకపకా నవ్వుతూ
మధ్యలోని దేవి నా వీపుపై తన తలమోపి
బహుశా గౌరి ఈమెపై వాలిపోయి
కళ్ళపై ఎడమ చేతిని
దూరం కనబడని ముదసలిలాగ ఆన్చి
నిప్పుల్లా వెలిగే వాహనాల లైట్లను దాటుకుంటూ
మూడు కిలోమీటర్ల దూరం
జ్ఞాపకమే ఇక నాకు
(చేతులు గొంతులు డప్పులు కళ్ళు
విప్లవగీతాలు పాడి
మతిస్థిమితం లేని చీఫ్ వార్డెన్ని ఓడించడం పూర్తయ్యాక )
*
Add comment