కవిత రాస్తున్నప్పుడు….

విరాటరాజు కొలువులో
గరిట పట్టుకొని
వంటలొండు తున్న భీముడిలా
కొత్త సత్తువ నాలోకి
వచ్చి వాలతాది
కవిత రాస్తున్నప్పుడు
కోడి పిల్లలను గెద్ద
తన్నుకు పోవాలనుకున్నపుడు
తల్లి కోడి మెలకువ
నాలో తలుక్కు మంటాది
కవిత రాస్తున్నప్పుడు
ఇల్లు కడిగి
ముగ్గులేస్తున్నట్టు
పొయ్యిలో సురీడులా మండే
పిడకని
కుట్టుగర్రతో పొడిసినట్టు
కవిత రాస్తున్నప్పుడు
మంగలి సీతారావుడు మావ
సిన్నప్పుడు నా సింపిరి బుర్రను
సిక్కులు తీసి
కత్తిరించి నూన రాసి
నున్నగా దువ్వినట్టే వుంటాది
కవిత రాస్తున్నప్పుడు
మా ఊరి స్వర్ణకారుడు
సినమేత్తు బంగారాన్ని
సిత్ర మైన ముక్కుపుల్ల జేసి
మురిసిపోయి నట్టి గుంటాది
కవిత రాస్తున్నప్పుడు
చంటిపిల్లకి
తాన మాడించి చేదు పట్టి
తలను దువ్వి గౌను తొడిగి
ముస్తాబు చేసినట్టు వుంటాది
కవిత రాస్తున్నప్పుడు
ముల్లు ముట్రా ఏరి
గడ్డి పీకి గట్లు చెక్కి
మడి చక్కని వుడుపు మడికోసం
తయారు చేసి నట్టే వుంటాది
కవిత రాస్తున్నప్పుడు
సరాసరి పూర్తి కావచ్చే సరికి
నన్ను నేను
తేరుకొని చూసుకుంటాను
ఒక సన్నకారు రైతు లా
నాకు నేనే అనిపిస్తాను.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం

చింతా అప్పలనాయుడు

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు