ఎన్నో వివక్షలకు సమాధానం తెలంగాణ కథ

రూబిడి ఆవిష్కరణ అక్టోబరు పది ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ సోమాజీ గూడా ప్రెస్ క్లబ్ లో…

వర్తమాన తెలంగాణ కథలో చాలా ఖాళీలు ఉన్నాయి. కొంత మంది సీరియస్ కథకులైనా ఈ ఖాళీలను పూరించడానికి ప్రయత్నిస్తున్నారు. నాలుకలు తెగిపడిన వారి పక్షాన నిలబడి, నాలుకలున్నా మాట్లాడలేని వాళ్ళ మనసులో నలుగుతున్న సలపరింతను దోసెడు అక్షరాల్లో చెప్పిన కథలు ఏ కాలంలోనైనా తక్కువే. ఆ కాసిన్ని కథలైనా కాలపు జల్లెడ కింద జారిపోకుండా ఒడిసి పట్టుకొని, వాటి పరిమళాన్ని సహృదయ పాఠకులకు చేరవేసే ఒక మాధ్యమం లాంటి పాత్ర ఇది. వర్తమాన సామాజిక చరిత్రను రికార్డ్ చేయడంతో పాటు రేపటి తరాలకు తెలంగాణ కథ వైభవాన్ని చాటి చెప్పడం కూడా మా మరో బాధ్యత.  ఈ ‘తెలంగాణ కథ’ ఎన్నో ప్రశ్నలకు జవాబు. ఎన్నో వివక్షలకు సమాధానం. ఎన్నో ఆశలకు, కలలకు వాస్తవ రూపం.

                                                                                                         –డా. వెల్దండి శ్రీధర్

 

బాధ్యతగా భావిస్తున్నాం!

తెలంగాణ సమజం నడిచి వస్తున్న దారిని, పాదముద్రలను చిత్రికగట్టే ప్రయత్నమే తెలంగాణ కథ. వివిధ పత్రికలు, వెబ్ మ్యాగజైన్ లలో వచ్చే మెరుగైన కథలను ఎంపిక జేసి తెలంగాణ తల్లికి దండగా సమర్పిస్తున్నాము. ఇది పూర్తిగా కృతజ్ఞత లేని పని. అదే థాంక్ లెస్ జాబ్. అయినా తెలంగాణ ఉద్యమంలో పనిజేసిన వారిగా మా వంతు బాధ్యతగా సింగిడి తెలంగాణ రచయితల సంఘం తరపున ఈ సీరిస్ ని వెలువరిస్తున్నాము. ఇప్పటికి ఏడేండ్లుగా వరుసగా అనేక ఇబ్బందులను అధిగమిస్తూ ఈ పుస్తకాలను తెస్తున్నాము. వాటికి పెట్టిన పేర్లను బట్టి ఆ సంవత్సరం కథకులు ఎట్లా స్పందించారో తెలుసుకోవచ్చు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ సీరిస్ లో తమ కథలను జోడించాలని కొంతమంది మా మీద వత్తిడి తెస్తున్నా వాటన్నింటిని అధిగమిస్తున్నాము. సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలింప జేస్తది. ఈ ప్రతిఫలనాల నుంచి ఎవరికి వారు అంటే ప్రజలూ.. ప్రభుత్వాలు గుణపాఠం నేర్చు కోవాలి.  మెరుగైన, మానవీయ, ప్రగతిశీల సమాజం కోసం ఇది తోడ్పడుతందని భావిస్తున్నాం.

                                                                                                    -సంగిశెట్టి శ్రీనివాస్

మా ఊరే నాకు కథా వస్తువు

          మా ఊరు కరంజి (ఐ) ఆదిలాబాద్ జిల్లాలో పచ్చని చేలు, నిష్కల్మషమైన వాతావరణంతో నిండిన ఒక సరిహద్దు గ్రామం. మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టాను. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే అమ్మగంగమ్మ క్యాన్సర్ తో, తరువాత కొన్నేండ్లకు నాన్న ఊశన్న అనారోగ్యంతో మరణించారు. ఇలాంటి కష్ట కాలంలో ఆదరించి బతుకు దారి చూపించిన మేన మామ మాజీ సర్పంచ్ గుర్ల శివ్వన్న సాయం మరువలేనిది. చిత్రంగా ఈ ప్రపంచం నేను కష్ట కాలంలో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అందంగానే కనిపించింది. ఆదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాలలో Diploma in Commercial and Computer Practice (DCCP) పూర్తి చేశాను. బాల్యం నుంచే రామాయణ, భారత, భాగవత నాటకాలు ఆసక్తిగా వినేవాడిని.

పాలిటెక్నిక్ చదువుతూనే గ్రామంలోని సమస్యలను ఈనాడు ఆఫీసుకు వెళ్ళి ఇవ్వటం అవి పబ్లిష్ కావటం ఒక ఉత్సాహం. ఆకాశవాణి శ్రోతగా ఉత్తరాలు రాయడం రేడియోలో పేరు విని ఆనందిచడం.. ఈ క్రమంలోనే 1989లో ఈనాడు తాంసీ మండల రిపోర్టర్ గా చేరాను. అప్పటి నుంచి గ్రామాల్లోని ప్రతి వృత్తిని నిశితంగా గమనించటం వాటిలోని సంక్షోభాలకు అక్షర రూపం ఇవ్వటం మొదలైంది. కొంత ఆధ్యాత్మిక భావన, ప్రశ్నించే తత్వం అలవడింది. జర్నలిస్టుగా, రచయితగా సాధ్యమైనంత వరకు బాధితులు, పేదల పక్షాన్నే నిలబడాలనే ఆరాటం.. ‘మాండ్వి అంగడిలో మాయ జన గాథ’ అనే కథానిక 1993లో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారం అయింది. ఆకాశవాణిలోనే మూడు ధారావాహికలు ప్రసారం అయ్యాయి. కథ, నవల, వ్యాసం, వార్త ఏది రాసినా నా ఊరే నాకు ప్రధాన వస్తువు.

-మంగారపు రమేశ్ యాదవ్

కొన్ని చర్యల పట్ల కలిగే అసహనమే నన్ను రచయిత్రిని చేసింది.  

          రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం మాది. ‘శతపత్ర మంజరి’ అనే కలం పేరుతో రచనలు చేస్తుంటాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు చేసాను. తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నాను. పెరిగిన ప్రదేశాలు, భిన్న కుటుంబ నేపథ్యాల ఆధారంగా నేనో కాస్మోపాలిటన్ అని చెప్పవచ్చు.  నేను కూడా రచయిత్రినంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. మొదటిసారి పాఠాలు వినడానికి కాకుండా పాఠాలు చెప్పడానికి తరగతి గదిలో అడుగు పెట్టినప్పుడు కలిగిన అదే ఆందోళన ఇప్పుడు కూడా కలుగుతుంది. నేను విద్యార్థినిని అలాగే మంచి పాఠకురాలిని కూడా. ఇక విద్యార్థి ముదిరి అధ్యాపకురాలు అయినట్లు, పాఠకురాలు ముదిరి రచయిత్రి అయినట్లు అన్నమాట. నాకు బలంగా తెలుసు అనుకున్న విషయం పదిమందికి తెలియజేయకుండా ఉండలేని నిస్సహాయత వలన, అన్యాయంగా, అక్రమంగా జరిగే కొన్ని చర్యల పట్ల కలిగే అసహనం వలన నా నుండి కథలు, వ్యాసాలు వస్తుంటాయి. వాటి ప్రామాణికత ఎంతో కూడా నాకు తెలియదు. నచ్చిన వారు అచ్చేసుకుంటారు. నచ్చకపోతే మానేస్తారు. దీనితో కూడా నాకు సంబంధం లేదు. ఇప్పటికీ ఒక ఎనిమిది కథలు అచ్చయ్యాయి.

                                                                                                                                        -కావేటి సరిత

 

 సామాజిక జీవితంలోని అసమానతలే నా కథలు

          సుందరమ్మ, గోపాల్ అమ్మానాన్నలు. ఖమ్మం జిల్లా, పల్లిపాడు (వైరా)లో 13 అక్టోబరు 1981న పుట్టిన. మాది వ్యవసాయ కుటుంబం. ఏడో తరగతి చదివేప్పుడు.. స్కూల్ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్లలో కల్చరల్ సెక్రటరీగా గెలిచిన. స్కూల్ లైబ్రరీ నిర్వహణ బాధ్యత వల్ల పుస్తకాలతో సావాసం పెరిగింది. ప్రభుత్వ కళాశాల(ఖమ్మం)లో బీఎస్సీలో చేరిన. అప్పటికే నాకు పి.డి.ఎస్.యు.తో పరిచయం ఉంది. ఆ సంస్థ ప్రభావంతో తరగతి గదిలో కంటే ఉద్యమాల్లోనే ఎక్కువగా సమాజాన్ని చదువుకున్న. ‘పల్లెలే మన పాఠశాలలు.. ప్రజలే మన గురువులు’ అప్పటి మా నినాదం. ఆ ప్రజల నుంచి నేర్చుకున్నది అక్కడక్కడా సభలో విద్యార్థులకు చెబుతూ ఉండేవాడిని. వ్యవసాయం అంటే బాగా ఇష్టం. ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజీలో 2010లో చేరిన. కాలేజీలో శిక్షణ పూర్తి కాగానే ఫీచర్స్ డెస్క్ ల్లో సబ్ ఎడిటర్ గా ఆంధ్ర జ్యోతిలో, నమస్తే తెలంగాణ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ పనిచేశాను. ప్రస్తుతం ప్రభాత వెలుగులో పనిచేస్తున్నాను. రిపోర్టర్ గా చేస్తున్నప్పుడు చూసినవన్నీ రాయలేం. రాసిన వన్నీ అచ్చు కావు. అలా మిస్సయిన వాటిని వ్యంగ్యంగా కథలుగా మలుస్తున్న. మొదటి కథకు మంచి స్పందన వచ్చింది. రెండు నెలలకే ఇంకో (రెండో) కథ రాసిన. అదే “రూబిడి’ తెలంగాణ కథ – 2019లో చోటు చేసుకున్న  ‘పెసిరెంట్ పోశెట్టి’ కథ.

సమాజంలో ఎన్నో అసమానతలున్నాయి. అలాగే ఎన్నో రూపాల్లో దోపిడీ జరుగుతోంది. వాటి గురించి జర్నలిస్ట్ లకు ఇతరుల కంటే ఎక్కువ అవగాహన ఉంటుంది. ప్రజల పక్షం ఉండాలన్నది జర్నలిజం నైతికత. రచయితల బాధ్యత కూడా అదే. కాబట్టి కథ రాయడం కష్టంగా అనిపించలేదు. ఇప్పటి వరకు రాసిన మూడు కథలూ రాజకీయ వ్యంగ్య కథలే. ప్రజలెలలా మోసపోతున్నారో, ప్రేమగా మాట్లాడే పాలకుల బుద్దులు ఎంత విషపూరితమో నా కథల్లో చెప్పాను. ఆంధ్ర ప్రాంత ప్రభావంతో కలగాపులగం అయిన భాష మాది. తెలంగాణ ఉద్యమకాలంలో న్యూస్ కవరేజ్, హైదరాబాద్ సభల వల్ల కొంత తెలంగాణ మాండలికం ఎక్కువగా అర్థమయ్యేది. రాసే వాక్యం అర్థవంతంగా, కథనం ఆలోచింపజేసేదిగా, ఎలా మొదలుపెట్టి ఎలా ముగిస్తే బాగుంటదో జర్నలిజంలోనే నేర్చుకున్నాను. యార్లగడ్డ రాఘవేంద్రరావు, వక్కలంక రమణ, నరసిహారావు (తెలుగు సార్)నాకు రాయడం నేర్పారు. ప్రజల తర్వాత గురువులు వీళ్లు. ఇక ముందు కథల్లోనూ సామాజిక జీవితంలోని అసమానతలనే నా కథల్లోకి తీసుకువస్తాను.

                                                                                                    -నాగవర్ధన్ రాయల

 

అశాంతిని ఖాళీ చేయించే క్రమమే కథలు

భూములు లేవు. ఆస్తులు లేవు. కూలికి పోతేనో చేపలు పడితేనో పూట గడిచే కుటుంబం మా నాయన కొమురయ్యది. రాజకీయాల మీది  ఆసక్తి వలన పేపరులో అక్షరాలు కూడబలుక్కుని చదివేవాడు. మా అమ్మ ఉప్పలమ్మకు చదువు రాదు. మా నాయన రైల్వేలో గ్యాంగ్ మెన్  గా పని చేసేవాడు.  ప్రాథమిక విద్య నెక్కొండ గ్రామంలో, బిఎస్సి జమ్మికుంటలో పూర్తయింది. తెలుగు సాహిత్యంపై ఆసక్తితో ఎమ్మెస్సీ చేయకుండా పీజీ తెలుగు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో చేశాను. ఎంఫిల్  కోసం కాకతీయ యూనివర్సిటీలో చేరాను. కానీ గైడ్ భీతావహ ధోరణి వల్ల మధ్యలో వదిలేశాను. పట్టుదలతో తెలుగు అకాడమీ “తెలుగు” పత్రికలో వ్యాసాలు రాసి నేరుగా పీహెచ్డీలో చేరినా  ఒకవైపు రాజ్యం మరోవైపు ఇతర కారణాల వలన దాన్నీ వదిలేశాను. అయితే ఈ వ్యాసాలు పుస్తకంగా వేయాల్సి ఉంది.

తొమ్మిదవ తరగతి లోనే రాడికల్ విద్యార్థి సంఘం నాకు దగ్గర అయింది. నేను దానికి దగ్గరైయ్యాను. మహబూబాబాద్, జమ్మికుంట, ఉస్మానియా యూనివర్సిటీ, రాడికల్ విద్యార్ధి సంఘం తోనే పయనమయ్యాను. 90 లో ఉస్మానియా RSU సెక్రటరీ అయ్యాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ, మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్, ఇలా సిటీ మొత్తం కార్యరంగం. అదే సమయంలో రాయలసీమ పర్యటన…  చాబాల క్యాంపు. ఈ కొత్త చూపు నిచ్చిన రాజకీయాల క్రమంలోనే ఏదో వెంటాడుతున్నట్టు…  ఏదో చేయాలి. ఏదో రాయాలి. ఎక్కడా నిలబడనీయని అశాంతి. ఎక్కడా కూర్చోనీయని అశాంతి. బుర్రలోంచి ఆ అశాంతిని ఖాళీ చేయించె క్రమమే కథలు… కవిత్వమయ్యాయి. నా మొదటి కథ ‘ఊబి ‘ఆంధ్రప్రభ సప్లిమెంట్ యువ ప్రభలో పడింది. చిత్రంగా రచయిత పేరు వేయలేదు. నా పేరు చూసుకోవాలనే ఆసక్తితో వారికి ఉత్తరం రాసిన నా పేరు ప్రకటించలేదు.  అలా మొదలై  ఇలా ‘భూమాట’దాకా నడిచాను. అంతో ఇంతో సమాజాన్ని చదవడం వచ్చాక… మనుషులను చదవడం వచ్చాక ఉత్తచేతుల్తో వుండటం ఎవరికీ సాధ్యం కాదు కదా! నేను అంతే.

                                                                                          -వడ్డెబోయిన శ్రీనివాస్  

 *

  

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఉత్త చేతులతో ఉండటం చాతగాక ఖాళీలు పూరించడానికి రాతలోకి దిగిన కథకులకు అభినంధనలు.

  • శ్రీధర్ గారూ నమస్తే,
    కథల పట్ల మీరు చేస్తున్న కృషిలోనూ వున్న ‌ కొన్ని ఖాళీలను కూడా మీరు పూరించగలరని నమ్మకం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు