ఈ క్షణంలో ఇక్కడ…

చిటికెడు కర్పూరపు ముద్ద వెలిగినంత సేపు కూడా నిలవదు నా ధ్యానం. పని తరవాత పని చేసుకుంటూ పోతుంది దేహం. కనురెప్ప తాటింపులో కరిగిపోయే జన్మం!

***

మా ఇల్లు నీకు దగ్గరే. నీ ఇల్లే నాకు బహుదూరం ఎప్పుడూ. ఇదేం పెద్ద వింత కాదు, తప్పు చేసిన మనిషిని బట్టి శిక్షలు మార్చగల శక్తి మనసుకు మిగిలినంత కాలమూ…

విరిగిన పాత్రను బంగారపు పూతతోనే అతికించాలనేమీ లేదు. నేలవైపు చూపు సారించి నడిస్తే ఏ బంకమన్నో దొరక్కపోదు. పగిలిన మనసు ముక్కలని, అమూర్తమైన ప్రేమతోనే కలపనవసర్లేదు. ఆకాశంలో మబ్బులు, కాగితం మీది రంగులు, వీటితో పాటు – మనలాగే మరికొందరు మనుషులు రోజూ గుండెమరకి కీ ఇచ్చుకుంటూ బ్రతుకుతున్నారనే ఊహ కూడా చాలు.

***

వేసంగి రాబోతుంది. తల్లిని ఎడబాసిన పిల్లికూన నిద్రలో నోరాడిస్తుంది. చనుబాల జ్ఞాపకం అంత త్వరగా మాసేది కాదు. ఎంచేతనో కానీ ఈవేళ – పుట్టుకకు ముందటి పురాస్మృతులు నీరెండ అద్దంలో మెరుస్తున్నాయి.

***

“సంతోషంగానే ఉన్నావా?”

“ఈ క్షణంలో ఇక్కడున్నాను, అంతే చెప్పగలను.”

*

స్వాతి కుమారి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గతాన్ని మైనింగ్ చేసే మనసున్న దేహం ఒక యంత్రంలా మారుతుంది, పని తర్వాత ఏపని అని ఆలోచించే ఆ చిన్నపాటి మనసు తప్పుకున్న క్షణంలో ఉన్న ఊరట అనుభూతి చెందిన వారికే ఎరుక, ఎరుకే ఉంటే మనసు ఎక్కడ మిగులుతుంది, దూరాలు, శిక్షలు స్వ-గతాలు ఇంకెక్కడ.
    స్వాతి వాక్యాలు సినిమా కాదు కొన్ని మనం ఎరిగిన జీవితాలు కళ్ళ ముందు కనిపిస్తాయి .భావోద్వేగాల అలలపై ఒక రౌండ్ వేయించి దించుతాయి , అపుడు ఆలోచన రేగుతుంది నర్మగర్భంగా ఇలా చెప్పిందా రచయిత్రి అని ఆశ్చర్యం తో ..తత్త్వ చింతన మొదలవుతుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు