ఆమె అనుభవాలు నేర్పిన పాఠాలు!

మనసులో సుళ్లు తిరుగుతున్న తీవ్ర అలజడి తగ్గటానికి, స్థిమితంగా ఒక మార్గం ఏర్పరుచుకోటానికి, నిబ్బరంగా వుండటానికి నాకు తెలియకుండానే ఆవిడ అనుభవం ఒక ఊతమైందేమో!

కొండపల్లి కోటేశ్వరమ్మ అంటే నాకెందుకింత అభిమానం అంటే వివరించటం చాలా కష్టమేమో! ఎందుకంటే ఆవిడతో గత మూడు దశాబ్దాలుగా పరిచయం వున్నప్పటికీ ఎప్పుడూ కూడా ఆవిడతో పట్టుమని రెండురోజులు కూడా పూర్తిగా గడిపింది లేదు. ప్రత్యక్షంగా చూసినదానికన్నా ఆవిడ ఇంటర్వ్యూ ‘‘మనకు తెలియని మన చరిత్ర’’ లో చదివిన తర్వాతే ఆవిడతో ఒక ఆత్మీయానుబంధం ఏర్పడింది. నిజానికి స్త్రీ అనుభవాలను, చరిత్రను ఎలా చూడాలి అని ఒక దృక్కోణాన్ని అందించిన పుస్తకం అది.

ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లంగానే కాక, అప్పటికే మా నాయనమ్మ వాళ్ల సంభాషణల్లో ఆ పేరు విని వుండటం వల్ల  కలిగిన కుతూహలం  కూడా వుండేది. వాళ్లు కూడా అప్పటి కమ్యూనిస్టు ఉద్యమంతో సన్నిహితంగా వుండటం, రాజ్యహింసను భరించటం వల్ల  చాలా జ్ఞాపకాలు  వాళ్ల మాటల్లో దొర్లుతుండేవి. ముఖ్యంగా బెజవాడలో వున్న కమ్యూన్‌ గురించి బాగా చెప్పేవాళ్లు. అలానే బెజవాడలో రౌడీలు  స్వైరవిహారం చేస్తూ, ఆడవారిని వీధుల్లో బాగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కార్యరంగంలోకి దిగి వారిని తరిమికొట్టిన కర్రసాము దళాల్లో  మా తాత వున్నారన్న సంగతి చిన్నప్పటి నుంచి విన్నదే. దానికోసం ప్రత్యేకంగా గ్రామాల్లో శిక్షణా శిబిరాలు  పార్టీ నిర్వహించిందని విన్నాను. అలా అప్పటి ఉద్యమం గురించి, నాయకుల  గురించి వింటూ వచ్చాం. నా చిన్నప్పుడు పుచ్చలపల్లి సుందరయ్యగారు, గుంటూరు బాపనయ్యగారు ఇంటికి వస్తూ వుండటం లీలగా గుర్తు. ఏడవ తరగతిలో వుండగా అనుకుంటా ద్రోణవల్లి అనసూయమ్మ ఇంకా చాలామంది బందరులో మా ఇంటికి వచ్చి వెళ్లటం గుర్తుంది.

అప్పుడు మా వీధి చివరిలోనే ఒక మీటింగ్‌ పెట్టి చాలా పాటలు కూడా పాడారు. ఇంకా ఎంతోమంది ఎవరెవరో  నాయకులు , కార్యకర్తలు  వస్తూవుండేవారు. అలా కొండపల్లి సీతారామయ్య గారి గురించి కూడా చాలా వినివున్నాను. ఆ తర్వాత నేను హైదరాబాదుకి చదువుకోడానికి వెళ్ళిపోయాను. కాకినాడ పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుకోటానికి వెళ్లిన మా పిన్నికూడా వాళ్ల వార్డెన్‌ కొండపల్లి కోటేశ్వరమ్మగారని చెప్పటం గుర్తుంది. నేను పది తర్వాత మళ్లీ విజయవాడలో ఇంటర్‌ చదవటానికి వెళ్లాను. నేను విజయవాడలో వున్నప్పుడు ఆవిడ కాకినాడ గర్ల్స్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో హాస్టల్‌ వార్డెన్‌గా వుండేవారు. ఆవిడ ఉద్యోగ విరమణ చేసి విజయవాడకు పూర్తిగా వచ్చేసే సమయానికి నేను మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేశాను. నిజానికి కోటేశ్వరమ్మ గారితో సాన్నిహిత్యం ఆవిడ హైదరాబాద్‌లోని చండ్ర రాజేశ్వరావు వృద్ధాశ్రమానికి వచ్చిన తర్వాతే పెరిగింది. అంత చిన్న గదిని కూడా ఆవిడ ఎంత ఆహ్లాదంగా వుంచుకునేవారో  తలు చుకుంటే ఆశ్చర్యం అనిపించేది. అక్కడున్న మిగతావారికంటే ఆలోచనల్లోనూ, ప్రవర్తనలోనూ ఆమె చాలా విభిన్నమనే విషయం చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది. అందరితో స్నేహంగా వుండేవారు. వచ్చిన వాళ్లను చాలా బాగా రిసీవ్‌ చేసుకునేవారు. వస్తూవుండమ్మా వీలున్నప్పుడల్లా అని చెప్పేవారు. తన మనసుకు దగ్గరగా అనిపించిన వారిదగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసేవారు.

1986లో స్త్రీ శక్తి సంఘటన ‘మనకు తెలియని మన చరిత్ర’ ను ప్రచురించింది. అదే సంవత్సరం నేను విద్యార్థి సంఘం నుంచి బయటకు వచ్చేసి (కాస్ట్‌ అండ్‌ జండర్‌ అంశాల పట్ల వున్న వివక్షాధోరణులకు నిరసనగా) దారీతెన్నూ తెలియని బతుకుపోరులో (అప్పటికి నా వయసు 20) వున్న రోజుల్లో ఆ పుస్తకంలోని ఆవిడ ఇంటర్వ్యూ నా మనసుకు దగ్గరగా అనిపించింది. కాలం, నేపథ్యం, పరిస్థితులు, అనుభవాలు వేరైన్పటికీ ఉద్యమాల్లోకి చిన్నతనంలోనే వెళ్లటంలో వుండే అమాయకత్వం, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ముందుకు వెళ్లే ఉత్సాహం, చొరవ, ఎవరినైనా ప్రశ్నించగలిగే నిర్భయత్వం, ఉద్యమం మీదా, నాయకుల మీదుండే భ్రమలు, వారినుంచే ఎదురుదెబ్బలు  తిన్నప్పుడు పడే అవమానాలు` ఇలా వీటన్నిటిలోనూ ఆవిడ ఇంటర్వ్యూలో నన్ను నేను చూసుకున్నాను. బహుశా మనసులో సుళ్లు తిరుగుతున్న తీవ్ర అలజడి తగ్గటానికి, స్థిమితంగా ఒక మార్గం ఏర్పరుచుకోటానికి, నిబ్బరంగా వుండటానికి నాకు తెలియకుండానే ఆవిడ అనుభవం, అలానే ఆ పుస్తకంలోని అనేక అనుభవాలు  ఒక ఊతమయ్యాయేమో అని ఇప్పుడు విశ్లేషించుకోగలుగుతున్నాను.

నిజానికి కోటేశ్వరమ్మ గారికంటే ముందు వాళ్ళ అమ్మ అంజమ్మ గారిని చూశాను. 1980-`82 ప్రాంతంలో విజయవాడలోని మొగల్రాజపురంలో మేము సుంకర అజాద్‌ గారింట్లో అద్దెకు వున్నప్పుడు వారం పదిరోజుల కొకసారి పొద్దున్నే ఒక ముసలావిడ వచ్చి ‘బాబూ అజాదూ, మోటరు పనిచేయటం లేదయ్యా, నీళ్ళు లేవు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కొంచెం వచ్చి చూస్తావా’ అనుకుంటూ వచ్చేది. ఆ తర్వాతెప్పుడో తెలిసింది ఆవిడ కొండపల్లి కోటేశ్వరమ్మ గారి అమ్మ అని. అజాద్‌ గారి నాన్న సుబ్బారావు గారు.( వాసిరెడ్డి భాస్కరరావు గారితో కలిపి మాభూమి, ముందడుగు నాటకాలు  రాసిన సుంకర సత్యనారాయణ గారి తమ్ముడు.) వాళ్ళది కూడా కమ్యూనిస్టు పార్టీతో బాగా అనుబంధం వున్న కుటుంబం.

ఆయన సాయంత్రాలు  కొడుకు ఇంటికి వచ్చినపుడు తన అనుభవాను కథలు కథలు గా చెప్పేవారు. ఆయనకు మంచిశ్రోతను నేను. అలా కోటేశ్వరమ్మగారి గురించి చాలా విషయాలు  ఆయనద్వారా విన్నాను నేను. ‘అమ్మాయి చాలా కష్టపడిందమ్మా జీవితంలో, అంత ధైర్యంగా వుండాలి ఎవరైనా గానీ, ఇప్పటి మీ పిల్లలకు ఆ ఓపికలేదు’ అని కాస్త నిష్టూరంగా అనేవారు. అప్పటికీ కొండపల్లి కోటేశ్వరమ్మ గారి పేరు వినివుండటమే తప్పించి ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. విజయవాడ మాంటిస్సోరి కాలేజీలో ఇంటర్‌ జేర్పిస్తున్నప్పుడు ఆ కాలేజీ నడిపేది కోటేశ్వరమ్మ అనే ఆవిడ అని విని కొండపల్లి కోటేశ్వరమ్మగారేమో అని కొంచెం కుతూహలపడ్డాను. కాదని తర్వాత తెలిసింది.

ఆవిడ హైదరాబాద్ సిఆర్‌ ఫౌండేషన్‌ కి వచ్చివుంటున్నప్పటికీ మధ్య మధ్యలో చుక్కు, చిన్ని దగ్గరకు వెళ్లి వస్తూ వుండేవారు. నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళినా ఆవిడ అక్కడవుంటే గనుక తప్పనిసరిగా వెళ్లి కలిసేదాన్ని. 1992-93లో అనుకుంటా ఒకసారి లలిత (‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తక సహ రచయిత్రి), దియ(లలిత కూతురు), నేను విజయవాడకు ఒక మీటింగ్‌ కోసం వెళ్లి కోటేశ్వరమ్మ గారిని, ద్రోణవల్లి అనసూయమ్మ గారిని, ఉదయం గారిని కలిసి వచ్చాం. విజయవాడలో వున్నప్పుడు అనసూయమ్మతో బాగానే పరిచయం నాకు. 98లో అనుకుంటా, ఉరిశిక్షల  మీద (చలపతి, విజయవర్థనం కేసు ఆధారంగా) డాక్యుమెంటరీ తీస్తున్నపుడు కొంత ఫండ్‌ రైజింగ్‌ కోసం విజయవాడ వెళ్లినపుడు చాలా అభ్యుదయంగా కనిపించే వ్యక్తులలోనూ పైకి కనిపించకుండా ఎంత వివక్ష కరడు కట్టివుంటుందో అర్థమయింది. చర్చను కూడా అంగీకరించని మనస్తత్వాలను  చూసి ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు.

ఆశ్యర్యంగా, కోటేశ్వరమ్మ గారు ఆ మొత్తం విషయాన్ని ఒక వ్యతిరేకతతో కాకుండా మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ మాట్లాడటంతో అప్పటివరకూ పడిన టెన్షన్‌ కూడా మర్చిపోయాను. అదే ఆవిడ వ్యక్తిత్వంలో వున్న గొప్పదనం అనిపించింది. నాలుగేళ్ల క్రితం వైజాగ్‌ వెళ్లి కలిసినపుడు, తన దగ్గరి వ్యక్తుల జీవితాల్లో ఏర్పడిన ఒక సంక్షోభాన్ని గురించి చెప్తూ, కులాంతర మతాంతర వివాహాల్లో ఏర్పడే అగాధాలకు కేవలం వ్యక్తులే కారణం కాదని, వారి వారి సామాజిక నేపధ్యాలు  బలమైన ప్రభావాన్నే కలిగిస్తాయని, ఒక్కోసారి వాటిని అధిగమించడం ఇరువైపులా అసాధ్యమైపోతుందని, అటువంటప్పుడే ఒంటరిగా బతకటానికి ఆడపిల్లలు అధైర్యపడకూడదని అన్నారు.

ఆవిడతో మరో మంచి అనుభవం,  తనను తార్నాకలోని ఆనందభారతి అనే ఒక చిన్న ఇన్‌ఫార్మల్‌ బడికి తీసుకువెళ్లటం. ఆ బడి చిన్నది అంటే నిజంగా చిన్నదే. మొత్తం కలిపి ముఫ్పై నలభై మంది కూడా వుండరు. ఆరేడేళ్ళ వయసు నుంచి పద్నాలుగు పదిహేనేళ్ళ వయస్సు వున్న ఆడపిల్లలు. వీళ్ళందరి నేపథ్యం కూడా బడికి వెళ్ళలేని పరిస్థితుల్లో జీవిస్తున్నవారే. వాళ్ళ తల్లిదండ్రులు ఇళ్ళల్లో పనివారుగానో, లేదా గృహనిర్మాణ కార్మికులుగా వుంటూ నిరంతరం సంచార పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నవాళ్లో అయివుంటారు. ఆ పిల్లలు  పొద్దునపూట తమకు చేతనైన పనులు  చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి 5 గంటల వరకు వుండి రకరకాల  అంశాలు నేర్చుకునేవారు. ముంబాయిలో టీచర్‌గా పనిచేసి రిటైరయిన జానకీ అయ్యర్‌ గారు ఆ స్కూల్‌ని తన స్నేహితుతో కలిసి 1989లో ప్రారంభించారు. వాళ్లు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినం, జనవరి 26 రిపబ్లిక్‌ డే ను ఎంతో నిబద్దతతో జరిపేవారు. ఒక్కో సంవత్సరం ఒక్కో అతిథిని పిలిచి ఆ రోజు ప్రాముఖ్యతను పిల్లలతో పంచుకునేలా చేసేవారు. అలా ఒకసారి జానకి గారితో కోటేశ్వరమ్మగారి గురించి చెప్తే ఆవిడను 2006 లో అనుకుంటాను రిపబ్లిక్‌ డే  ఫంక్షన్‌ కు అతిథిగా ఆహ్వానించారు. ఇలా ఒక బడి నడుస్తోంది మీరు రావాలి అని చెప్పంగానే దూరం అని కూడా ఆలోచించకుండా వెంటనే వస్తానని ఒప్పుకున్నారు ఆవిడ.

తను వుండేది కొండాపూర్‌ లోని సిఆర్‌ ఫౌండేషన్‌లో. అక్కడి నుంచి తార్నాక వచ్చి అక్కడున్న పిల్లలతో కలిసి రెండు మూడు గంటలు  గడిపారు. తనకు పదేళ్ల వయసులో మహాత్మాగాంధీ  విజయవాడ పరిసర ప్రాంతాలకు వచ్చినపుడు ఇంట్లోవాళ్ళు వద్దని వెళ్లనివ్వకపోయినా గానీ, వాళ్ల కళ్లు కప్పి తను ఎలా ఆ యాత్ర జరుగుతున్న ప్రాంతానికి  వెళ్లిందీ, తన దగ్గరవున్న కొద్దిపాటి నగలను ఎలా ఇచ్చేసిందీ, ఆ తర్వాత ఇంట్లో వాళ్లు ఎలా మొత్తుకుందీ చమత్కారంగా వివరించి చెప్తుంటే ఆ పిల్లల కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం, విస్మయం, ఆరాధన నిజంగా చూసితీరాలి. వాళ్లు మొదటిసారి ప్రత్యక్షంగా స్వాతంత్య్ర పోరాటకాలం నాటి వ్యక్తిని చూడటం. ఆ తర్వాత కోటేశ్వరమ్మ గారు అక్కడినుంచి తన ప్రయాణం ఎలా జరిగిందో కూడా వివరిస్తూ, ఆడపిల్లలు ఎన్ని కష్టాలున్నాగానీ తప్పనిసరిగా చదువుకోవాలని చెప్పారు. తను రాసిన కొన్ని పిల్లల పాటలను పాడి వినిపించారు. పిల్లలందరూ ఆవిడ దగ్గరకు వచ్చి తనతో కరచాలనం చేయటానికి పోటీు పడ్డారు. మేము వెళ్శేంతవరకూ ఆవిడను చుట్టుకుని చుట్టుకునే వున్నారు.

అత్యంత అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఆ పిల్లలకు ఇప్పటివరకూ కూడా చదువు అనేది ఆమడదూరంలో వుండిపోవటం అత్యంత విషాదకరం. తిరిగి కార్లో కొండాపూర్‌ వెళుతున్నప్పుడు ఆవిడ అదే విషయం చెప్పి చాలా బాధపడ్డారు. అంత చిన్నపిల్లలు ఇళ్లల్లో పనిచేస్తూ చదువుకోవటానికి ఇంత కష్టపడటమేమిటమ్మా, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కనీసం చదువుని అందించలేని ప్రభుత్వాలు ఎందుకు? మార్పు రావాలమ్మా, మీలాంటి వాళ్లు ఆ మార్పుకోసం బాగా పనిచెయ్యాలి అన్నారు. పెద్దపెద్ద మీటింగు కన్నా ఇలా కల్లాకపటంలేని చిన్నపిల్లలతో గడపటం చాలా బాగుందని ఆనందపడ్డారు.

2002 లో విజయవాడలో వుండే మా అక్క విజయకు ఆరోగ్యం బాలేకపోతే వెళ్లి కొన్నిరోజులు తనతో అక్కడే వున్నాను. అప్పుడు గుంటూర్లో ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ నాయకులు  పులుపుల  శివయ్యగారి వర్థంతి రోజున ఆయన జ్ఞాపకార్థంగా కోటేశ్వరమ్మగారిని సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. చుక్కుకు ఏదో పనివుండి వెళ్లలేక ‘అమ్మమ్మకు తోడుగా నువ్వు వెళ్లగలుగుతావా’ అని అడిగితే సరే అని ఆవిడను తీసుకుని వెళ్లాను. ఆవిడతో మాట్లాడటం, ఆవిడ ఇంటర్వ్యూని చదవటం కాకుండా, మొదటిసారి ఆవిడ ఉపన్యాసాన్ని కూడా విన్నాను. ఉద్యమ సహచరులను అప్పటి ఉద్యమాన్ని తలుచుకుని చాలా ఉద్వేగపూరితంగా, అభిమానంగా మాట్లాడారు ఆవిడ.

2017లో వైజాగ్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌ సందర్భంగా నేను, రమేష్‌, ఆశా కలిసి రైలు దిగి నేరుగా వాళ్లింటికే వెళ్లాం. అంతకు ఒకరోజు ముందే ఆవిడ ‘నేను బుక్‌ ఎగ్జిబిషన్‌ చూడాల్సిందే’ అని అడిగి మరీ వచ్చి తిరిగి వెళ్లారట! ఎవరన్నా ఇంటికి వస్తున్నారని చెబితే తను చాలా సంబరపడిపోయి వాళ్లు వచ్చేంతవరకూ ఎదురుచూస్తూ ఇంకా రాలేదేమిటని అడుగుతున్నారట!

ఆవిడని టెన్షన్ పెట్టటం ఎందుకని మేము వస్తున్న విషయాన్ని చుక్కు తనకు చెప్పలేదు. ఉదయాన్నే ఇంట్లోమమ్మల్ని చూసి ఎంత ఆనందపడిపోయారో చెప్పలేను. ఆ రోజంతా మాట్లాడుతూనే వున్నారు. తన సహచరులందరినీ గుర్తుచేసుకుంటూ అప్పటి తమ అనుభవాలను చెప్తూనే వున్నారు. తనను ఎప్పుడు కలిసినా గానీ, ఆనాటి సహచరులను గుర్తుచేసుకోవటం, ముఖ్యంగా ఆడవారు పార్టీలో, కుటుంబాల్లో చేసిన త్యాగాలను పేరు పేరునా  గుర్తుచేసుకోవటం వాళ్లందరి గురించి కూడా కమ్యూనిస్టు పార్టీలు రాయాలని, అది చాలా ముఖ్యమైన చరిత్ర అవుతుందని, వేరు వేరుగా కాకుండా అందరూ కలిసి పనిచేస్తేనే మార్పు వస్తుందని  కోరుకునేవారు. తన ‘నిర్జనవారధి’ పుస్తకం వచ్చిన తర్వాత ఎవరెవరి నుంచి తాను విమర్శను ఎదుర్కొన్నానో చెప్తూ ‘అది నాఅనుభవం. నా అనుభవాన్ని నాకెదురయినట్లుగానే చెప్తాను కానీ, మార్చి చెబితే అది నా అనుభవమెట్లవుతుంది’ అన్నారు. వ్యక్తిగతంగా ఎవర్నీ ఒక్కమాట కూడా అనలేదు. ఎంతో హుందాగా చెప్పారు తప్పించి ఎక్కడా ఒక్క పొల్లుమాట కూడా అనలేదు. తన పుస్తకం కన్నడ, ఇంగ్లీషుల్లోకి రావడం పట్ల చాలా ఆనందపడ్డారు. ఇదంతా వసంతక్ష్మి, గీతారామస్వామి వల్లే అని మురిపెంగా చెప్పారు. ఈ సంవత్సరం ఒక నెల క్రితమే వైజాగ్‌ వెళ్లినపుడు చూసివచ్చాను. మళ్ళీ ఆవిడ వందో పుట్టినరోజు వేడుకకు వస్తామని చెప్పివచ్చాను. ఇప్పుడు ఆగష్టు 5 ఆత్మీయ సమావేశానికి అందరం పొలోమంటూ ఒక గ్యాంగ్‌లాగా వెళ్తున్నాం. ఆ రోజంతా ఆవిడతో గడిపి, బోలెడన్ని కబుర్లు చెప్పించుకుని వాటిని గుండెల్లో దాచుకుని వస్తాం.

నిండు నూరేళ్ల అనుభవాన్ని మాకందరికీ అందించినందుకు కోటేశ్వరమ్మగారూ మీకు మా అందరి హృదయాలింగనాలు. బోలెడన్ని ముద్దులు. మీ అంత కాకపోయినప్పటికీ మాకు చేతనైన రీతిలో ఈ అసమాన సమాజ మార్పు కోసం కృషి చేస్తామని మీకు మాట ఇస్తూ

ప్రేమతో

మీ సజయ

*

 

 

 

సజయ. కె

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు