అంజిగాడి తల్లి

రవయ్యేళ్ల జయలక్ష్మికి నలభై అయిదేళ్ల కాంతారావుతో పెళ్లయ్యింది. కాంతారావు మొదటి భార్య అనారోగ్యంతో నాలుగు నెలలు మంచం మీదుండి చనిపోయింది. రెండో పెళ్లి జరిగేనాటికి కాంతారావుకి పదిహేనేళ్ల కొడుకున్నాడు. వాడి పేరు ఆంజనేయులు.

****

జయలక్ష్మి అమాయకురాలు. అమ్మానాన్నా చిన్నప్పుడే పోయారు. ఇంట్లో పెత్తనమంతా అన్న రాంబాబుదే. తాగుడు, పేకాట, కోడిపందాలు.. వాడికి లేని సరదా లేదు. ఎకరంన్నర పొలం కరిగిపోయి ఒకటే కుంట మిగిలాక వాడికి తత్వం బోధపడింది. ఉన్న కొంచెం భూమినీ చెల్లెలి పెళ్లి కోసం వృధా చేయడం వాడికి ఇష్టం లేకపోయింది. పైసా ఖర్చు కాకుండా ఆమెని ఎలా సాగనంపాలా అని ఆలోచిస్తుండగా, అనుకోకుండా అదే ఊరి సంబంధం ఒకటి తగిలింది. దగ్గర్లో ఉన్న పట్నానికి షటిల్ సర్వీసు నడిపే ప్రైవేటు బస్సు డ్రైవర్ గా చేస్తాడు కాంతారావు.  పెట్టుపోతల పీడా లేదు, నాలుగు మెతుకులు వండిపడేసే ఆడమనిషైతే చాలు అన్నాడు పెళ్లిళ్ల పేరయ్య. కట్నం ఆశించకపోగా, పెళ్లి ఖర్చులు కూడా తానే భరిస్తానని ముందుకొచ్చిన కాంతారావు బంగారుబాతులా కనిపించాడు రాంబాబుకి. వచ్చిన చిక్కల్లా ఒక్కటే. పిల్లలు పుట్టకుండా జయలక్ష్మి ఆపరేషన్ చేయించుకోవాలని షరతు పెట్టాడు కాంతారావు.

వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం ఎక్కడ మొహం చాటేస్తుందో అని కంగారు పడిపోయాడు రాంబాబు. కాంతారావులో ఏ లోపం ఉన్నా సిగ్గు విడిచి ఎలాగోలా చెల్లిని ఒప్పించి ఉండేవాడు. వాడిది మొరటు, కసాయి మనసు అనడంలో సందేహం లేదు. కానీ అంతటి వెధవ కూడా చూస్తా చూస్తా “పిల్లల్ని కనకపోతే ఏం పోయిందిలే” అని అనలేకపోయాడు. మొగుడు మీనమేషాలు లెక్కించడం చూసి రాంబాబు భార్య సుకన్యకి ఒళ్లు మండిపోయింది. ఉన్నదంతా ఆడపడుచు ఊడ్చుకుపోయినట్టు, ఇద్దరు పిల్లల్నేసుకోని తాను బజార్న పడినట్టు రోజూ పీడకలలే ఆమెకి. ఈ సంబంధం వద్దులే అని మొగుడు ఎక్కడ మెత్తబడతాడో అని సునీతలో ఆందోళన మొదలైంది.

“నేనొకసారి మాట్లాడి చూస్తాను, తను సంతోషంగా ఒప్పుకుంటే సరేసరి. లేదంటే ఈ సంబంధం సంగతి మర్చిపోదాం” అంది రాంబాబుతో.

నయానో భయానో సుకన్య తన చెల్లిని ఒప్పించి తీరుతుందని రాంబాబుకి తెలుసు. ఈ ఒక్కసారికీ మనసు రాయి చేస్కోని ఈ వ్యవహారానికి తాను దూరంగా ఉండకపోతే ఏం జరగడానికి అవకాశం ఉందో ఆలోచించుకున్నాడు. అటు డబ్బులూ పోయి, ఇటు పెళ్లాంతో మాటలూ పడి ఎందుకొచ్చిన బాధ అనిపించింది వాడికి. ఇలాంటి విషయాలు ఆడోళ్లూ ఆడోళ్లూ మాట్లాడుకోవడమే కరెక్ట్ అనే నానుడిని గుర్తు చేసుకొని తెలివిగా పక్కకి తప్పుకున్నాడు.

జయలక్ష్మికి నచ్చజెప్పడం సుకన్యకి పెద్ద కష్టం కాలేదు. పిల్లల్ని కనిపెంచడం పైకి కనిపించినంత కష్టం కాదనీ, ప్రసవం అంటేనే ఆడదానికి పునర్జన్మ అనీ, పిల్లల బుద్ధులు సవ్యంగా లేకపోతే ప్రతిరోజూ నరకమే అనీ ఇలా రకరకాల డైలాగులు రాసుకోని గంట ఉపన్యాసానికి సిద్ధపడి కూర్చుంది సుకన్య.

మొదటి ఐదు నిముషాలు అవగానే “మీకు ఏది మంచిదనిపిస్తే అలా చేయండి వదినా” అని చెప్పి, బట్టలు నుసిమే పనుందంటూ అక్కణ్నించీ వెళ్లిపోయింది జయలక్ష్మి.

****

ఉన్నంతలో పెళ్లి ఘనంగానే అయిందనిపించాడు కాంతారావు. అతని మంచితనం సుకన్యకి అర్థమైంది. ఆడబడచు మరీ వదిలించుకు తీరాల్సిన మనిషేం కాదనీ, ముందు ముందు కూడా ఆమెతో ఏదో ఒక లాభం ఉండి తీరుతుందని ఆమె గ్రహించింది. ఎక్కువ ఆలశ్యం చేయకుండా అప్పగింతల ఘట్టం రాగానే మొదటి పాచిక విసిరింది. తన పిల్లలిద్దరూ జయలక్ష్మినే తల్లిగా భావిస్తారనీ, ఆమెని వదిలి క్షణమైనా బతకలేరనీ చెపుతూ కంటతడి పెట్టింది. “నాలుగు వీధుల అవతలేగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చు. ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లుండొచ్చు” అని ఓదార్చాడు కాంతారావు. భార్యని చూసి మురిసిపోవాలో భయపడాలో అర్థం కాలేదు రాంబాబుకి.

జయలక్ష్మి భర్తతో కలిసి ఆటో ఎక్కబోతుండగా, ఏదో ముఖ్యమైన పనున్నట్టు లోపలికి పిలిచి సుద్దులు చెప్పింది సుకన్య.

“చూడ్డానికి నీ మొగుడు మంచివాడిలాగే ఉన్నాడు. కానీ తొందరపడి అతన్ని గుడ్డిగా నమ్మబాకు. నువ్వు ఏ పని చేసినా, ఏం మాట్లాడినా మొదటి భార్యతో పోలికతెచ్చి నిన్ను తక్కువ చేసే ప్రమాదం ఉంది. ఈ మగబుద్ధే అంత. అతనితో కలిసి పడకెక్కడానికి నువ్వు తొందర పడుతున్నట్టు అతను అనుకోకూడదు. నువ్వు పెద్దగా ఆసక్తి లేనట్టు కనిపిస్తే అతనే నీ కాళ్ల దగ్గరికొస్తాడు. అప్పటివరకూ ఓపిక పట్టు. ఇంకో మాట. ఆ పిల్లోడి పేరేంటి అంజి.. అదే ఆంజనేయులు కదూ. వాడూ పసిగుడ్డేం కాదు. నాలుగేళ్లు పోతే పెళ్లీడుకొస్తాడు. వాడితో జాగ్రత్త. కోరికలు బుసలు కొట్టే వయసు. వాడు నీతో చనువుగా ఉండడం చూస్తే మీ ఆయన నిన్ను తన్ని తరిమేస్తాడు. వాళ్లిద్దరికీ వేళకింత తిండి పెట్టడమే నీ వంతు. అంతగా కాలక్షేపం కావాలనుకుంటే కాకితో కబురుపెట్టు. నా పిల్లలొకటీ నీ పిల్లలొకటీ కాదుగా. నువ్వు వాళ్లని సాంతానికే ఉంచేసుకున్నా మీ అన్నయ్య, నేను బాధపడం. ఏదో మాకు కాలం కలిసిరాక నీకు రెండో పెళ్లి వాణ్ని తేవాల్సివచ్చింది. లేకపోతేనా నిన్నొక సినిమా హీరోకిచ్చి చేయాలని కలలు కనేవాడు మా ఆయన..”

సుకన్యం ఏం మాట్లాడుతుందో జయలక్ష్మికి అర్థం కాలేదు. “అలాగే వదినా” అని తలూపి, బయటొకొచ్చి ఆటో ఎక్కింది. తుండు గుడ్డలో మొహం దాచుకున్నాడు రాంబాబు. పమిటచెంగు నోట్లో కుక్కుకుంది సుకన్య. ఎంతైనా పేగుబంధం ఎక్కడికి పోద్ది అని నిట్టూర్చారు చుట్టపక్కాలు. జయలక్ష్మి కళ్లు కనీసం చెమర్చను కూడా లేదని ఒకళ్లిద్దరు గుసగుసలాడుకున్నారు.

****

కాంతారావు భార్యని బాగానే చూసుకున్నాడని చెప్పుకోవచ్చు. అతనికి పెద్దగా ఎవరితోనూ మాట్లాడే అలవాటు లేదు. జయలక్ష్మిని కూడా అవసరమైనప్పుడే పలకరించేవాడు. దేనికీ వంకలు పెట్టేవాడు కాదు. ఇంటికి తన భార్యే యజమానురాలు అయినట్లు ప్రవర్తించేవాడు. ఈ కొత్త హోదా జయలక్ష్మికి కలలాగా అనిపించింది. పుట్టింట్లో గానుగెద్దులా బండచాకిరీ చేసిన మీదట, అసలిక్కడ ఏ పనీ లేకుండా ఖాళీగా భర్త మీద పడి తింటున్నట్టు చిన్నతనంగా అనిపించేది. రుద్దిందే రుద్దుతూ, కడిగిందే కడుగుతూ ఇల్లంతా శుభ్రంగా ఉంచేది. కాంతారావుకీ, అంజికీ ఇష్టమైనవేంటో తెలుసుకొని అవే వండడానికి ప్రయత్నించేది. కాంతారావు ఆ విషయం గమనించినట్టు కనిపించేవాడు కాదు గానీ, ఇష్టమైన వంటకాలు చూడగానే అంజిగాడి కళ్లలో మెరుపు మాత్రం దాగేది కాదు.

అంజిగాడు కూడా చాలా విషయాల్లో తండ్రి మాదిరే. వాడింట్లో ఉన్న సంగతే తెలిసేది కాదు. మిగతా పిల్లల్లాగా ఆడుకోవాలనీ, ఎవరింటికైనా పోయి టీవీ చూడాలనీ అనుకునేవాడు కాదు. వాడిని చూస్తే చాలా ముచ్చటగా ఉండేది జయలక్ష్మికి. మరీ ముద్దొచ్చినప్పుడు కూడా “అంజిగాడి లాంటి తమ్ముడుంటే బావుండేది” అనుకునేది తప్ప, అలాంటి కొడుకు లేడే అనే ఆలోచన మాత్రం చేసేది కాదు.

ఆడబడుచుకి గంతకి తగ్గ బొంతని చూసి వదిలించుకుంటే చాలనుకున్న సుకన్య జయలక్ష్మి భోగం చూసి చాలా బాధపడింది. రాంబాబు లాంటి దరిద్రుడు కాకుండా కాంతారావు లాంటి వాడు దొరికుంటే రెండో పెళ్లేం ఖర్మ, మూడో పెళ్లయినా చేసుకోవచ్చు అని తనలో తాను వాపోయేది. ఎప్పుడు సందు దొరికినా తన పిల్లలిద్దర్నీ జయలక్ష్మి మీదకి తోలడంలో సుకన్యకి కాస్త ఓదార్పు దొరికేది. “మీ అత్త దగ్గరే తిని, అక్కడే పడుకోండి” అని చెప్పి మరీ పంపేది పిల్లల్ని. తను ఈ మాత్రం సుఖంగా బతుకుతుందంటే అన్నావదినలే కారణం అని నిజాయితీగా నమ్మే జయలక్ష్మి ఆ పిల్లలిద్దర్నీ చేతనైనంగా గారాబం చేసేది.

ఆ పిల్లలిద్దరూ కోతులకి ఎక్కువ. రాక్షసులకి తక్కువ. ఉన్నచోట ఉండకుండా ఇల్లు పీకి పందిరేసేవాళ్లు. దబ్బనంతో గోడల మీద గీతలు గీయడం, తినడానికి ఏం పెట్టినా ఇల్లంతా చల్లడం, అల్మరాల్లో వస్తువులన్నీ చిందరవందర చేయడం ఇదే పని వాళ్లకి. ఆ అల్లరి చూసి కాంతారావు ఎక్కడ చికాకు పడతాడో అని భయపడుతూ గడపడం జయలక్ష్మికి పెద్ద సమస్యగా మారింది. ఇది చాలదన్నట్టు, ఒకరోజు ఆ పిల్లపిశాచాలు అంజిగాడి పుస్తకాలన్నీ కుప్పగా పోసి ఫుట్ బాల్ ఆడడం మొదలెట్టాయి. ఆ దృశ్యం కంటబడగానే జయలక్ష్మి రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోయి, చెరోదెబ్బా వేసింది.

జయలక్ష్మి తన పిల్లల్ని కొట్టిందని తెలియగానే సుకన్య శివాలెత్తిపోయింది. అపర కాళికలా ఇంటిమీదకొచ్చి నానా యాగీ చేసింది. చెప్పులా పడుండే మొగుడు దొరికేసరికి కళ్లు నెత్తికెక్కాయని తిట్టిపోసింది. నడమంత్రపు సిరి ఎన్నాళ్లో నిలవదని శపించింది. వదినని బతిమలాడి శాంతపరిచడానికి ప్రయత్నం చేయలేదు జయలక్ష్మి. అది చూసి ఇంకా రెచ్చిపోయింది సుకన్య. పిల్లల్ని కనని గొడ్రాలుకి పిల్లల విలువేం తెలుస్తుందిలే అంది. మళ్లీ జన్మలో పిల్లల్ని ఈ గడప తొక్కనివ్వను అని శపథం చేసింది. అయినా మారు పలకలేదు జయలక్ష్మి. నోరు నొప్పెట్టేదాకా అరిచి, పిల్లలిద్దర్నీ బరబరా ఈడ్చుకుంటూ పోయింది సుకన్య.

వదిన వెళ్లిపోయాక జయలక్ష్మి ఆలోచనలో పడింది. మొత్తం గుర్తు చేసుకున్నాక కూడా జరిగిందానికి తాను పెద్దగా బాధ పడట్లేదని ఆమెకి అర్థమైంది. అంజిగాడిని అపురూపంగా చూసుకోవడం లోనే తనకి ఆనందం ఉందనీ,  కాంతారావు మీద తనకున్న కృత‌జ్ఞ‌త‌ చూపించడానికి దానిని ఒక మార్గంగా తాను ఎంచుకుందని ఆమెకి స్ఫురించింది. మనసులో ఏ మూలో మొదట్నించీ మెదులుతున్నదే అయినా, కొత్తగా ఈ ఆవిష్కరణ చేయడం జయలక్ష్మి జీవితంలో పెద్ద మార్పుకి కారణం అయ్యింది. అదివరకు ఆమెలో ఉన్న ఉదాశీనత మాయమైపోయింది. తన జీవితానికి ఒక పరమార్థం ఉందనీ, అది అంజిగాడు ప్రయోజకుడిగా మారడంలో సహకరించడమే అనీ ఒక నిర్ణయానికొచ్చింది.

****

చూస్తుండగానే కాలం శరవేగంతో పరుగులు తీసింది. అంజిగాడు డిగ్రీ ఫైనలియర్ కి వచ్చాడు. జిల్లాలో వాణ్ని కొట్టినోడే లేడు చదువులో. ఆడబడుచు ఎందుకు దిగి రాదో చూద్దామని బెట్టు చేసిన సుకన్యకి నిరాశే మిగిలింది. “జరిగిందేదో జరిగిపోయింది, అన్నీ మర్చిపోదాం” అని అన్నగారు రాయబారానికొచ్చినా కనీసం కన్నెత్తి చూడలేదు జయలక్ష్మి. ఈ అవమానంతో కుదేలైన సుకన్య పెంటకుప్ప లాంటి తన నోటికి పని చెప్పింది. అంజిగాడికీ, జయలక్ష్మికీ అక్రమ సంబంధం ఉందనీ, ఆ సంగతి కాంతారావుకి తెలిసి రోజూ తాగొచ్చి, భార్యని చావచితగ్గొడతన్నాడనీ ప్రచారం చేయడం మొదలెట్టింది. ఆ విషయం జయలక్ష్మి చెవిన కూడా పడింది. తనతో చెప్పినవాళ్ల దగ్గరైనా అవుననో కాదనో ఆమె ఖండించిన పాపాన పోలేదు. నెలకీ రెణ్నెల్లకో అయినా అమ్మలక్కలతో ఐదూ పదీ నిముషాలు గడిపే అలవాటుని కూడా మాన్చుకుంది. ప‌క్క ఊళ్లో ఉండే వృద్ధాశ్ర‌మానికి మాత్రం అప్పుడ‌ప్పుడూ పోయొస్తా ఉండేది. అమ్మా నాన్నా బ‌తికుంటే వాళ్ల‌లో ఎవ‌రిలా ఉండేవాళ్లో అని ఇంటికి తిరిగొచ్చాక కూడా ఆలోచిస్తా ఉండడం జయలక్ష్మికి ఇష్టమైన వ్యాపకం.

ఒకరోజు సాయంత్రం చీకటి పడుతుండగా, ఎవరో గానీ తలుపు కొట్టారు. వంటింట్లో నుండీ వచ్చి చూసేలోగా ఆపకుండా దబదబా బాదుతూనే ఉన్నారు. అంజిగాడికి చివరి పరీక్షలు జరిగే సమయం దగ్గర పడింది. పుస్తకాలు పక్కన పెట్టి లేవబోతున్న వాడిని వారించి, తలుపు తీసింది జయలక్ష్మి. కాంతారావు తోలే బస్సులో ఉండే క్లీనర్ కుర్రాడు.

“బాబాయి.. బాబాయి..” వగరుస్తున్నాడు వాడు.  తర్వాత మాట పూర్తి చేయాల్సిన అవసరం లేకపోయింది. కాంతారావు ఈ లోకం వదిలిపెట్టి వెళ్లిపోయాడని అర్థమైంది జయలక్ష్మికి. ఎవడో తాగి లారీ నడుపుతూ రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశాడట. శవాన్ని బయటకి తీయడం కూడా కష్టమైపోయింది. అంజిగాడి ఏడుపు ఆపడం ఎవరి తరం కాకపోయింది. మనసు రాయి చేసుకొని అన్ని కార్యక్రమాలూ దగ్గరుండి జరిపించింది జయలక్ష్మి. కాస్త ఆలస్యంగా అయినా తన శాపం ఫలించినందుకు సుకన్య సంతోషించింది. పుట్టింటికి ద్రోహం చేసిన ఏ ఆడదానికైనా ఇదే గతి పట్టుద్దని సూత్రీకరించింది. మొగుడు పోయినప్పుడు కూడా జయలక్ష్మి కళ్లు తడి కాకపోవడం ఆసక్తికరమైన వార్తగా వారంరోజుల పాటు ఊళ్లో చక్కర్లు కొట్టింది.

“ఇప్పుడు ఆ ఒక్క అడ్డం కూడా లేదుగా. ఎంచక్కా రంకుమొగుడితో కలిసి ఏ అమెరికానో చెక్కేయొచ్చు” అని సుకన్య తన గురించి అవాకులు చెవాకులు పేలుతున్న సంగతి జయలక్ష్మికి తెలిసింది. ఆ తర్వాత నాలుగు రోజులకి  అంజిగాడిని కూర్చోబెట్టి చెప్పింది.

“మీ నాన్న దేవుడు. నిన్నూ నన్నూ పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. నువ్వు గొప్పవాడివి కావాలని కలలు కనేవాడు. మనిద్దరం సంతోషంగా ఉంటేనే ఆయన ఆత్మకి శాంతి. పెద్ద చదువులు చదవడానికి నువ్వు అమెరికా పోవాలి. ఖర్చు గురించి ఆలోచించొద్దు. ఈ ఇల్లు అమ్మేస్తే నాలుగు లక్షల వరకూ రావొచ్చు. నీకొచ్చిన మార్కులు చూసి మిగతా డబ్బులు అప్పుగా ఇస్తానన్నాడు బ్యాంకు మేనేజరు. అక్కడ సీటు రావడానికి ఏమేం చేయాలో నాకు తెలియదు. నా మాట కాదంటే మీ నాన్న మీద ఒట్టు” అని తేల్చిచెప్పింది.

జయలక్ష్మికి పిచ్చి పట్టిందేమో అని అనుమానం వచ్చింది అంజిగాడికి. ఆ రోజుకి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. రెండ్రోజులయ్యాక వాడికి తెలిసొచ్చింది జయలక్ష్మి మతిస్థిమితం లేకుండా మాట్లాడ్డం లేదని. ఇల్లు అమ్మేసి మరీ అమెరికా పోవాల్సిన అవసరం ఏమొచ్చిందో వాడికి అర్థం కాలేదు. తాను బాగా చదువుకోవాలని తండ్రి ఆశించిన మాట నిజమేలే కానీ, వేరే దేశాలకి వెళ్లాలని అనుకున్నట్టు వాడికి గుర్తు లేదు. అదే మాట అడుగుదాం అనుకున్నాడు. కానీ జయలక్ష్మి మొహంలో ఎప్పుడూ లేని కాఠిన్యం చూడడం వాడికి కొత్తగా ఉంది.

ఆరు నెలలు గడిచాయి. అంజిగాడికి వీసా వచ్చింది. అది తెలిసి ఎక్కడెక్కడివాళ్లో ఇంటికొచ్చి అభినందించారు. కాంతారావు మంచితనమే అంజిగాడికి శ్రీరామరక్ష అనీ, జయలక్ష్మి లాంటి ఆడది ఇంటికొక్కళ్లుంటే దేశం వందేళ్లు ముందుకు పోద్దనీ ఏదేదో అన్నారు. అంజిగాడు వెళ్లాల్సిన రోజు వచ్చేసింది. సర్దుకోవాల్సిన సామాన్ల గురించి తప్ప వేరే విషయాలేమీ వాళ్ల మధ్య చర్చకి రాలేదు. ఇంత లగేజీ ఉంటే విమానం ఎక్కనివ్వరని అంజిగాడు మొత్తుకుంటున్నా వినకుండా నాలుగు సూట్ కేసులు సర్దింది జయలక్ష్మి. పట్నం వరకూ వెళ్లి, వాడిని హైదరాబాద్ బస్సెక్కించి వెనక్కొచ్చేసింది. పెట్టేబేడా సర్దుకొని ఇల్లు ఖాళీ చేసి, ముందుగానే చేసుకున్న ఏర్పాటు ప్రకారం వృద్ధాశ్ర‌మానికి వెళ్లిపోయింది. అక్కడ జీతం ఏమీ ఇవ్వరు. పని చేసినందుకు ప్రతిఫలంగా తిండి పెట్టి, ఉండడానికి ఒక చిన్న గది మాత్రం ఇస్తారు.

పదోరోజు సాయంత్రం ఆయా వచ్చి చెప్పింది ల్యాండ్ లైనుకి ఎవరో ఫోన్ చేశారని. అంజిగాడే అయ్యుండాలి అనుకుంటూ వెళ్లింది. వాడే.

“హలో” అవతలినుండీ వినిపిస్తున్న అంజిగాడి గొంతు కొత్తగా ధ్వనించింది.

“హలో” అన్నానేమో అనుకుంది. తన గొంతు తనకే వినబడడం లేదు. అంత దూరంలో ఉన్న వాడికెలా వినబడుతుంది.

“అమ్మా..” పిలిచాడు అంజిగాడు. జయలక్ష్మికి కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి.

“నిన్నింత మిస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదమ్మా. చాలా బెంగగా ఉంది. నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. నేను చదువు మానేసి వెనక్కి రావడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. నా కోర్సు అయిపోయి, ఉద్యోగం దొరగ్గానే నువ్వూ ఇక్కడికి వచ్చేయాలి. లేకపోతే నా మీద ఒట్టు..” అలవాటు లేని మాటలు పలుకుతున్న సిగ్గో, ఆలశ్యంగా చెపుతున్నానన్న అపరాధ భావనో కానీ.. ఒక్కో పదమూ పేర్చుకుంటున్నట్టు నెమ్మదిగా అంటున్నాడు.

ఏం సమాధానం చెప్పిందో కూడా గుర్తు లేదు జయలక్ష్మికి. ఒంట్లో సత్తువంగా ఎవరో లాగేసుకున్నట్టు తడబడే అడుగులతో తన రూమ్ కి వెళ్లింది. మంచం మీద కూలబడి ఏడవడం మొదలెట్టింది. ఎన్ని గంటలు గడిచాయో. పొగిలి పొగిలి ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపుకి గొంతునుండీ పొట్టవరకూ ఒకటే నొప్పి. పక్కకి ఒత్తిగిల్లడానికి కూడా లేకుండా పచ్చిబాలింత పడే నొప్పి. కొత్తగా ఈ లోకంలోకొచ్చిన లేత ప్రాణాన్ని చూస్తూ సన్నగా నవ్వుతుంటే ఓపలేని ఆనందంతో వచ్చే నొప్పి.

*

శ్రీధర్ బొల్లేపల్లి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పై కధ అంతా పెద్దగా కొత్తగా అనిపించలేదు. నీ అల్ట్రా modern శైలికి భిన్నంగా సాగింది. ఆఖరి పేరా లో అంజిగాడి ఫోను, అమ్మా అనడం తాను ఏడవడం ఆకట్టుకుంది. ఫీల్ ఉంది ఆ పేరాలో . నీ నుంచి ఇది కొత్త narration. బాగుంది బాబూ.

  • కథ చాలా బావుంది. లోకం పోకడలు, తీయని మాటల మేక వన్నె పులుల వంటి మనుషుల మనస్తత్వాలకు అద్దం పట్టింది ఈ కథ. జయలక్ష్మి పాత్ర చిత్రణ మరింత బావుంది. కథ ముగింపు paragraph is simply superb. It added more strength and flavour to the story.

  • చాలా గొప్ప గా రాశారు. అమ్మా అని కన్ప పిల్లలే కాదు , ఎవరు పిలిచినా కదిలి పోతారు ఆడవాళ్లు. జయలక్ష్మి పాత్ర చాలా బాగుంది

  • ‘పిల్లలిని కనిపెంచడం పైకి కనిపించినంత కష్టం కాదనీ,’ ఈ వాక్యం వేరే లాగా ఉండాలి అనిపించింది.

    ‘పిల్లలని కని పెంచడం పైకి కనిపించినంత సులువు కాదనీ,’

    చాలా రోజుల తరువాత మంచి కధ చదివాను. రచయిత నోల్లెపల్లి శ్రీధర్ గారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు. వారు అనుమతి ఇస్తే తమిళంలో ఈ కధను అనువాదం చేయాలని అనుకుంటున్నాను.
    వారి కాంటాక్ట్ వివరాలు తెలియ జేయగలరు.

  • కథను ఎలా ముగిస్తారో అని మొదటి పేరా చదవగానే చాలా బెంగ కలిగింది. నిజం చెప్పాలంటే కొత్త కథలు చదివి చాలా కాలం అయింది.. బహుశా వాటి లోని లోపాలను చూసి మనోవ్యధ పొందటం ఎందుకనే భయం వల్ల కాబోలు.
    కాని ఈ కథ చదివే దాకా నన్ను వదలలేదు.
    ఇదే కదా లోకం తీరు… సుకన్య లాంటి వాళ్ళు లోకంలో అడుగడుగునా ఉంటారు. రాంబాబు లాంటోళ్లకి కూడా కొదవేమీ ఉండదు. కాంతారావు లాంటి వారు అరుదుగానే అయినా కనిపిస్తారు మనకు. దోషం పట్టిన ఈ కాలంలో అంజి గాడి లాంటి కుర్రవాడు చెడు దారిలో పడకుండా తీర్చిదిద్ది, కన్నబిడ్డలా కాపాడ గలిగే ఇరవై ఏళ్ల సవతి తల్లి, జీవితం లో ఏ సంతోషాన్ని పొందనిది అయిన జయలక్ష్మి లాంటి తల్లి ఉండటం ఎంత గొప్ప అదృష్టం…

    ఇలాంటి తల్లుల సృష్టి కదా ఈ విషమ సమాజానికి కవులు పట్టించే విరుగుడు మందు.
    చివరి పేరా ముగింపు చదువుతున్నప్పుడు అప్రయత్నంగా నా కళ్లు చెమర్చడం కథలోని ఆర్ద్రత కు సూచిక కాదా..

    ఇదంతా భావోద్వేగాలను అదుపు చేసుకోలేని, చాపల్యబుద్ధితో రాయడానికి చేసిన నా వెర్రి ప్రయత్నం. దోషాలేవైనా ఉంటే క్షంతవ్యుణ్ణి.

  • No words to say.ఈకథ ఎన్ని వందలమంది చదివినా ప్రతి ఒక్కరికీ వేర్వేరు జీవన పాఠాలు నేర్పిస్తుంది.ఈ కథ గొప్పతనం ఏంటంటే కథలో ఎమోషన్ కంటిన్యూ అవుతూ పాఠాలు నేర్పించటం. Hatsoff to writer sridhar

  • చాలా బాగుంది కధ. కధనం కూడా అంతే బాగుంది. థాంక్యూ ..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు