‘రోటి పచ్చడి వరవర రావు కవిత్వంలా ఉంది’

వర్తమాన సామాజిక సందర్భాన్ని చూస్తుంటే మనసు కలత చెందుతోంది. సాహిత్యం పట్ల ఆదరణ క్రమంగా తగ్గుతోంది. ఒక పూర్తి తరం పుస్తకానికి, పఠనానికి దూరం కావడం ఆందోళన కలిగించే విషయం.

జీవితం ఒక నిరంతర ప్రయాణం అయితే, సాహిత్యం ఆ ప్రయాణంలో నాకు దొరికిన గొప్ప ఊరట, మార్గదర్శి. వెనక్కి తిరిగి చూసుకుంటే అక్షరమే నన్ను నడిపించింది, అక్షరమే నన్ను నిలబెట్టింది.మా ఊరు ఓజిలి రాచపాలెం. నెల్లూరు జిల్లా. పల్లె కావడం తో బాల్యం లో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయ్. దూరదర్శన్ కాలం. చదువులో ఎప్పుడూ ముందే. తెలుగులో పీజీ చేసాను. కొద్ది రోజుల్లో పి.హెచ్ డి పూర్తి అవుతుంది. ఇంటర్మీడియట్ వరకు రెగ్యులర్ విద్య. మిగతా అంతా దూర విద్య. మా నాన్న వీధిభాగవతం ఆడేవారు. నాకు బాగా తెలిసే నాటికి వాటి ప్రభావం తగ్గింది. ఎప్పుడైన తాగి వచ్చినప్పుడు కొన్ని దరువులు పాడేవారు. ఆ ప్రభావం నా మీద ఉంది. సామాజిక చింతనే నా రచనలకు నేపధ్యం గా చెబుతాను.

ఒకప్పుడు విద్యార్థులను అడిగేవాడిని… స్నేహం గురించి రాయండి, సముద్రం గురించి కవిత్వం అల్లండి అని. అలా చూస్తూ ఉండగానే పదిమంది పిల్లలు అద్భుతంగా రాయడం మొదలుపెట్టారు. ఆ ఉత్సాహమే నన్ను ‘నీటిపూలవాన’, ‘గోరువంకల గానం’ వంటి సంకలనాలను తీసుకువచ్చేలా చేసింది. నేటికీ నా కళ్ళ ముందే గోపి, , వెంకటరమణ, లక్ష్మీనారాయణ వంటి విద్యార్థులు కలం పట్టి సమాజం గురించి ఆలోచిస్తుంటే ముచ్చటేస్తుంది. ముఖ్యంగా గోపి కవితలతో త్వరలోనే ఒక పుస్తకం తీసుకురావాలన్నది నా సంకల్పం.

తరాలు మారుతున్నా, అక్షరం పట్ల అనురాగం మారలేదని వీరిని చూస్తుంటే అనిపిస్తుంది.ఉపాధ్యాయ శిక్షణ కోసం అనంతపురం జిల్లా బుక్కపట్నం వెళ్లడం జీవితంలో మంచి మలుపు. ఆ పక్కనే ఉన్న కొత్తచెరువు జూనియర్ కళాశాల లో అధ్యాపకులు గా ఉన్న డాక్టర్. రాధేయ గారి పరిచయం సాహిత్యం వైపు తీసుకు వెళ్ళింది. ఆయన మాకు వందలాది కవితా సంపుటాలు ఇచ్చి చదివించారు. అట్లా ఏది కవిత్వం కాదో తెలుసుకున్నాము. నాతో పాటు నా మిత్రులు సునీల్, సిద్ధార్థ లు కూడా ఉన్నారు. ఉమ్మడిశెట్టి అవార్డు సభల్లో మేము పాల్గొనే వాళ్ళము. తర్వాత మేము ఆయన పేరు మీద ఓ కవితా పురస్కారం కూడా నడుపుతున్నాము. అలా సాహిత్యం వైపు మళ్లాను.

సీసాకాలుష్యం అని మద్యపానం మీద రాసిన కవిత విశాలాక్షి పత్రికలో వచ్చింది. ఆ పత్రికలో యండమూరి గారి నవల కూడా వస్తుంది. ఆ పత్రిక వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధి. ఆ పత్రిక సంపాదకులు ఈతకోట సుబ్బారావు గారు ఒక రోజు ఫోన్ చేసి, “పత్రిక వార్షికోత్సవానికి మీరు తప్పకుండా రావాలి. మీరు ఆశ్చర్యపోయే సంఘటన మీకు దొరుకుతుంది” అన్నారు. నెల్లూరు టౌన్ హాల్లో సభ. యండమూరి అతిధిగా రావడం తో సభ నిండిపోయింది. ఆయన ప్రసంగం ప్రారంభం లోనే విశాలాక్షి పత్రికలో పోయిన నెల నేను ఒక కవిత చదివాను. ఆ కవిత సీసాకాలుష్యం, కవి సుంకర గోపాల్ అని ప్రకటించి వారికి నేను గోల్డ్ మెడల్ బహుకరిస్తున్నా, వేదిక మీదకు స్వాగతం అని ప్రకటించారు. ఇది నేను మర్చిపోలేని సంఘటన.

 

తర్వాత ఆంధ్రజ్యోతి వివిధ లో వచ్చిన ‘కురుస్తున్న దుఃఖం’, ‘ఖాళీ అయిన ఇల్లు’, ’24 గంటలు’ కవితలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రముఖ విమర్శకులు జి. లక్ష్మీ నరసయ్య గారు కవిసంగమం లో నా కవితల పై సమగ్ర వ్యాసం రాశారు. ఇది కూడా నేను ఊహించని సంఘటన చూసిన ,చూస్తున్న జీవితం నుండే నేను తీసుకుంటాను. మా నాన్న జీవిత చివరి దశలో మంచం లో పడినప్పుడు ఆయన పడిన వేదన చూసి” పరాయితనం” అనే కవిత రాశాను. అది సారంగ లో వచ్చింది. ‘ఏమి జన్మ తండ్రి ఏమి జన్మ ఆత్మ ఇమడ లేని పరాయితనం’ అని ముగుస్తుంది. అలాగే మా ఆవిడ “రోటి పచ్చడి” ఒక రోజు చేస్తుండగా ఆ నేపధ్యం నుండి కవిత రాశాను. ‘రోటి పచ్చడి వర వర రావు కవిత్వం లా ఉంది’ అని ముగించాను. ఆ మధ్య దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ను తీసుకుని “పక్షులసభ” అనే కవిత రాశాను. ప్రజాశక్తి లో వచ్చింది. ఇలా వస్తు వైవిధ్యాన్ని నా కవితల్లో గమనించవచ్చు.

నా సాహిత్య దృక్పథం ఎప్పుడూ సామాజిక స్పృహ, మానవీయ విలువల చుట్టూనే తిరుగుతుంది. అక్షరం అనేది కేవలం కాగితం మీద సిరా చిందించడం కాదు, అది అట్టడుగు వర్గాల జీవన పోరాటాలకు ఒక గొంతుక కావాలి. ఆధునిక యాంత్రిక జీవనంలో మనిషి తన మూలాలను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని కోల్పోతున్నాడు. ఆ మూలాలను వెతుక్కోవడమే నా కవిత్వ లక్ష్యం. అందుకే నా రచనల్లో ‘మా నాయిన పాట’ (2021) ఒక కీలక ఘట్టం. అందులో ఖాళీ అయిన ఇల్లు, కురుస్తున్న దుఃఖం, 24 గంటలు, మా నాయన పాట ఇలాంటి అనేక కవితలు చాలామందిని ఆకర్షించాయి. మా నాయన పాటలోని అనేక కవితలకు స్ఫూర్తిగా అనేకమంది కవితలు రాశారు.

దీనికి తోడు ‘నీటి కుండ లాంటి మనిషి’, ‘రేయిరుతువు’, ‘నిద్రావరణం’ వంటి రచనల ద్వారా సామాజిక అన్యాయాలను ఎండగట్టడానికి, మనిషిని మనిషిగా ప్రేమించే మానవతావాదాన్ని ప్రబోధించడానికి ప్రయత్నించాను. కవిత్వం అనేది అణగారిన వర్గాల ఆయుధం అని నేను బలంగా నమ్ముతాను.చూసిన ,చూస్తున్న జీవితం నుండే నేను తీసుకుంటాను.

అయితే, వర్తమాన సామాజిక సందర్భాన్ని చూస్తుంటే మనసు కలత చెందుతోంది. సాహిత్యం పట్ల ఆదరణ క్రమంగా తగ్గుతోంది. ఒక పూర్తి తరం పుస్తకానికి, పఠనానికి దూరం కావడం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వాలు కేవలం ఆదాయ మార్గాల మీద ఉన్న శ్రద్ధను అక్షరం మీద చూపడం లేదు. ఉచిత పథకాలను ఎరగా వేసి ప్రజలను, ముఖ్యంగా యువతను సోమరులుగా మారుస్తున్న తీరు విచారకరం. సమాజంలో అశాంతి పెరుగుతోంది; దళితులపై, స్త్రీలపై దాడులు ఆగడం లేదు. వ్యవస్థలన్నీ వ్యాపారవేత్తలకు అనుకూలంగా మారుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండకూడదు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత మనందరిపై ఉంది.

నా సాహిత్య ప్రస్థానంలో ‘మా నాయిన పాట’ కు వచ్చిన ప్రశంసలు, అవార్డులు నా బాధ్యతను మరింత పెంచాయి. సాహిత్యాన్ని నిరంతరం అధ్యయనం చేయడం వల్లే ఒక తరం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే సిలబస్ నిర్ణయించే అవకాశం నాకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ డిగ్రీ సిలబస్ కమిటీ చైర్మన్‌గా విద్యార్థులకు ఉపయోగపడేలా వినూత్న రీతిలో పాఠ్యాంశాలను రూపొందించాను. అనేకమంది అధ్యాపకులు చాలాకాలం తర్వాత తరగతి గదుల్లోకి పాఠాలు చెప్పడానికి చాలా ఉత్సాహంతో వెళ్తున్నాం డిగ్రీ విద్యార్థులు కూడా చాలా ఆసక్తిగా వింటున్నారు అనే మాట ఉన్నప్పుడు నేను నా పాత్రను సమర్థవంతంగా పోషించాలని అర్థం అవుతుంది.

అలాగే పదవ తరగతి పాఠ్యపుస్తక ఎడిటర్‌గా, 2026 జూన్ నుండి 1 నుండి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో జరుగుతున్న మార్పులు చేర్పులకు ఎడిటర్ గా వ్యవహరించడం నా జీవితంలో మర్చిపోలేని ఘట్టాలు. అక్షరం పాఠశాల గడప దాటి ప్రతి బిడ్డ మెదడులోకి వెళ్లాలన్నదే నా తపన. నేను నడిచి వచ్చిన ఈ దారిలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి; యువతలో ఆలోచనా దృక్పథాన్ని రేకెత్తించి, వారిని సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే నా ముందున్న లక్ష్యం. ఈ అక్షర యాత్ర ఇలాగే కొనసాగుతుంది.

త్వరలోనే నా రెండవ కవితా సంపుటి నీటి కుండలాంటిమనిషి వస్తోంది. ఇందులో పాఠకుల మన్ననలు పొందిన అనేక కవితలు ఉన్నాయి. మొదటి పుస్తకం ప్రభావం ఈ కవితల మీద అసలు దాదాపు ఉండదు. కవిత రాస్తున్నప్పుడు కనీసం ఒక్క కొత్త ఊహ, సృజనాత్మకతతో కూడిన పదబంధం లేకుండా నేను కవిత రాయడానికి దాదాపు ప్రయత్నం చేయను.

నేను పత్రికల్లో అనేక వ్యాసాలులు రాస్తూ ఉన్నాను. ఆ వ్యాసాలు కూడా మంచి స్థాయిలో ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు. అలాగే కవి సంఘంలో కవిత్వకాంతి పేరు మీద శీర్షికలో రాస్తున్నాను. గత మూడు సంవత్సరాలుగా నేను దాదాపు 100 సభలు వరకు మాట్లాడి ఉంటాను. పాఠకులు డాక్టర్ సుంకరగోపాల్ మంచి వక్తనే ముద్ర కూడా వేశారు.

నేను ఒక సమావేశంలో మాట్లాడినట్టు మరో సమావేశంలో మాట్లాడతానేమో అని నన్ను పరీక్షించడానికి కూడా సభలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న కవిగా మొదలైన ప్రయాణం ఇవాళ విమర్శకుడిగా, వ్యాసకర్తగా వక్తగా, కవిత్వ ప్రచారకుడిగా, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సిలబస్ కమిటీల్లో ముఖ్య సభ్యునిగా ఉంటున్నాను. అనేకమంది పెద్దల ఆశీర్వాదాలు, పాఠకుల ఆదరణ నన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి. కళాశాల విద్యార్థులకు కవిత్వాన్ని ప్రచారం చేయాలని ఉద్దేశంతో నెలకి ఒక్కో కళాశాలనే శ్రీరామ్, డ్యానితో కలిపి తిరుగుతూ ఉన్నాను.

నేను నడిచి వచ్చిన దారి నడుస్తున్న దారి చాలా సంతృప్తికరంగా ఉందని నమ్ముతున్నాను.

*

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు