యుక్రేనియన్ యుద్ధ కవిత : అడగాలనే అనుకుంటున్నా!

న్నా మలిహోన్ ప్రసిద్ధ ఉక్రేనియన్ కవయిత్రి. ఆరు కవితా సంపుటాలు, ఒక నవల ప్రచురించారు. ఎన్నో ఉక్రేనియన్ పత్రికల్లో ఆమె కవితలు ప్రచురితమయ్యాయి. ఎన్నో సంకలనాల్లో చోటు సంపాదించాయి. బల్గేరియన్, పోలీష్, చెక్, జార్జియన్, ఆర్మేనియన్, ఫ్రెంచ్ భాషల్లోకి అనువాదం అయ్యాయి. 2022లో ఉక్రెయిన్ మీద రష్యా దాడివల్ల ఆమె ఉక్రేయిన్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ప్యారిస్‌లో ఉంటున్నారు.

అన్నా మలిహోన్ గురించీ నాకు పెద్దగా ఏమీ తెలియదు. గత కొన్ని రోజులుగా నేను ఉన్న స్థితిని కనుక్కుంటూ, మెసెంజర్‌లో పలకరిస్తున్న అఫ్సర్ ఈ కవిత పంపారు. చదువుతూ ఉంటే విపరీతమైన బాధ చుట్టుముట్టింది. మామూలుగా కనిపిస్తూనే యుద్ధపు దుఃఖాన్ని గుండెలు పిండేలా చెప్పిన ఈ కవిత-

రెండుసార్లు చదువుకున్నాక… ఒక తెలియని స్థితిలో తెలుగులోకి రాసుకున్నాను. మళ్ళీ ఆయనకి పంపాను. ఇంగ్లీష్ ఎక్కువగా తెలియని నేను చేసిన అనువాదం బాగుందని అంటూంటే, బాధకి భాషల అంతరాలుండవని అప్పుడర్థమైంది.

*

న్నో రోజుల నుంచీ
అడగాలనే అనుకుంటున్నాను
యుద్ధానికి అవతలివైపు నువ్వెలా ఉన్నావని?

అక్కడంతా
మంచు పాలు‌గా
కరుగుతున్నంత వెచ్చగా ఉంటుందేమో

టీ షర్ట్ వేసుకున్న పసివాడు,
సంవత్సరమంతా వయోలిన్ వాయిస్తుంటాడు
ఆత్మకీ శరీరానికీ మధ్య
తారాడే తప్పిపోయిన బుల్లెట్లలా
మంచుకీ సంగీతానికీ మధ్య
వేలాడుతున్న హరివిల్లు ఎత్తుకంటే పైకి ఎగురుతుంటాయి

పావురాలు అయినా,
ఇప్పుడు మన గురించి రాయను…
పొడవైన, భారీ కవర్లలో
ఉత్తరాలకు బదులుగా పిల్లలు వచ్చే నగరాల గురించి రాస్తాను.

గడ్డకట్టిన నారింజలా
వారానికొకసారి సూర్యుడు పొడిచే చోట
పొగలోంచి పొగలు లేస్తాయి

మరణం మరణాన్ని కంటుంది
నీ హృదయాన్ని చీల్చి,
నీలోని నరకాన్ని లోకానికి చూపించు

నిజమైన ఒంటరితనమంటే ఏమిటో
నిన్ను నొప్పించటానికైనా
ఎవరూ లేని ఖాళీతనం ఎలా ఉంటుందో చూపించు.

నాకు గోడల భాష నేర్పించు—
నేను నీకు ఆ నగరాల్నీ, కోటు కొనడానికి
తన వయోలిన్ అమ్మేస్తాడని
నువ్వు అనుకున్న ఆ పసివాన్నీ…
చూపిస్తాను చాలా రోజుల నుంచే అడగాలని ఉంది:
ఎందుకు? దీనికి ముగింపెక్కడా?

వేసవి కాలం నుంచీ
నా జేబుల్లో లైటర్లని వెతుక్కుంటూండగానే
ఎంతసమయం గడిచిందో
ఈ అగ్గినంతా ఎక్కడ ఉంచుదాం?

వెచ్చదనం కంటే మంటే ఎక్కువగా ఉంది,
తలుపుల కంటే
గోడలే ఎక్కువగా ఉన్నాయి.

నాకు గోడల భాష నేర్పిస్తావా?

*

పరిచయమూ, స్వతంత్ర అనువాదమూ: నరేష్కుమార్ సూఫీ

నరేష్కుమార్ సూఫీ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆన్నా
    అద్భుతమైన కవిత.హృదయాన్ని మెలిపెట్టిన వాక్యాలు

  • ఏమిటో చాలా దిగులుగా వుంది. ఈ కవిత్వం చదవటం వెలుగే! Thank you!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు