మెడకువడ్డ పాము

రేవతమ్మ పేరుకే ఇక్కడ ఉంది కానీ తన మనసు ఏడేడు లోకాలు తిరిగొస్తుంది. కొండలు లేకుండా ఇన్ని రోజులు బతికింది. ఇక మీదట బతకడం తనకు పెద్ద విషయం గాదు. సంసారాన్ని ఈది ఈది అలిసిపోయి ఉంది. కొండలును తీసుకొని పోవాలా? వద్దా?

డిలోకి అడుగుపెట్టిన్నో లేదో పిల్లలంతా చుట్టూ గుమికూడిండ్రు.

సార్..మన బళ్ళోకి ఎవరో పిచ్చోడొచ్చిండు. మాకు మస్తు భయమయ్యిందిఅని పిల్లలంతా ఊరించి ఊరించి కత చెప్పినట్టు చెప్పవట్టిండ్రు. ఎక్కడున్నడో అని చూస్తే ఐదో తరగతి వరండా బయటనే పండుకొని ఉండు.

మీరేం భయపడకండి’ అని పిల్లలకి చెప్పి పిల్లలందరినీ క్లాసుల్లోకి పంపిన. నేను, ఇద్దరు ముగ్గురు పెద్దపిల్లలు కలిసి ఐదో తరగతి దిక్కు నడిచినం.

తానం చేసి ఎన్ని రోజులాయెనో! ఈగలు ముసురుతున్నయి. తువ్వాలతోటి ఎంత అల్లిచ్చినా పోతలేవు. కాళ్ళకు బండెడు మురికి. పెద్ద జాంగా మీద లుంగి కట్టుకొని ఉండు. గడ్డం మొత్తం తెల్లని వెంట్రుకలతో ఉంది కానీ, అంత పెద్ద వయస్సేం కాదు. యాభై ఏండ్ల కంటే తక్కువనే ఉంటయి.

లేవడానికి కాళ్ళల్ల పట్టున్నట్టు లేదు. చేతులొక్కటే పని చేస్తున్నయి. కాళ్ళ మీద వాలిన ఈగలను తువ్వాలతోటి అల్లిస్తున్నడు. పక్కనే సొట్టలు పడిన ఒక గుంతగిన్నె ఉంది. కాల్చిన బీడీలు ఒక దిక్కు, ఐదారు గీసిన అగ్గిపుల్లలు ఒక దిక్కు ఉన్నయి. రెండు నిమిషాలు ఏం చేయాలో తెల్వక అట్లనే నిలబడ్డ. 

ఇప్పుడేం సావడు సార్! పొదన చేసేటోళ్ళు ఉంటే మంచిగ బతుకుతడు” అని అనుకుంట బడిలో వంట వండే సత్తెయ్య వంట రూంలోకి పోతుంటే కొంచెం లేపమన్నట్టు ఆ మనిషి సైగ చేసిండు. కండ్లు గుంతలకు పోయినయి. పెదాలు ఎండుకపోయినయి. నోటి నుంచి మాట రావడం కూడా కష్టంగా ఉంది. గొంతు బాయిలకు పూడుకపోయినట్టు ఉంది.

నేను, సత్తయ్య చెరొక రెట్ట వట్టి గోడకు ఆనిచ్చినం. అప్పుడే మా పెద్ద సార్ కూడా వచ్చిండు. గేటుకాడ ఉన్నప్పుడే ఈ విషయం గురించి ఎవరో చెప్పినట్టున్నరు.

ఏం సత్తయ్యా! ఏదో పెద్ద కతనే పెట్టుకున్నవు” అని నవ్వుకుంటనే అడిగిండు.

ఏం చేద్దాం సార్? గవర్నమెంటు బడంటే అందరికీ సత్రమయ్యింది. ఎవడో పడేసి పోయిండు అని చెప్పిండు.

పెద్దసార్ వైపు చూస్తూ తిననీక ఏదైనా తీసుకరమ్మన్నట్లు సైగ చేసి రెండు చేతులూ జోడించిండు. జాంగలకెళ్ళి పది రూపాయలు తీయనీకపోయిండు. ‘నేను తెప్పిస్తలే’ అని పెద్దసార్ పిల్లలకు ఇరవై రూపాయల నోటిచ్చి బిస్కెట్లు తెమ్మని పంపించిండు. మేము రాకముందు పిల్లలకు పది రూపాయలిచ్చి బిస్కెట్లు తెమ్మన్నడంట. వాళ్ళు భయపడి దగ్గరికి పోలే. అటు దిక్కు ఆడుకోనీక పోవద్దని పిల్లలకు చెబితే పిల్లలెవరూ అటుదిక్కు పోలే.

పిల్లల్ని క్లాసుల కూర్చోబెట్టి పద్యాలు చెబుతున్న గానీ మనసంతా ఆయన చుట్టే. పిల్లలకు హోంవర్కు ఇచ్చి బయట నిలబడిన. టైము పది కావొస్తున్నది. కూలోళ్ళంతా సద్దులు తీసుకొనిపోతూ చూసొద్దాం దారే..అనుకుంట అందరూ బడి దిక్కు మళ్ళిండ్రు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నరు.

ఓయమ్మో వీడా? వొయస్సులో ఉన్నప్పుడు ఏం ఆట ఆడేది. ఇపుడు చూడు ఈ గతి పట్టింది.‘ 

ఇంక సిగ్గు లేక ఈ ఊరికొచ్చినాడు.

వీనికి లంజల సోకు. ఎవతి కనబడితే దానితోటి నాలుగు రోజులు తిరిగేది. ఇప్పుడు ఏ లంజ వచ్చి చేస్తదయ్య?‘ 

మంగలి రాములు అల్లుడు కాదానే!’ 

వీన్ని చూసి ఆయమ్మ అంటే పాపమే తగులుతది సార్!’ 

నెత్తి మీద సద్దుల మూటలతో ఎక్కడ నిల్చున్నవాళ్ళు అక్కడే రాళ్ళలాగా నిలవడి మాట్లాడుకుంటున్నరు. కొందరు దూరంగా ఓ రాయి చూసుకొని దాని మీద కూలవడ్డరు. చూసిపోవడానికి వచ్చినోళ్ళు తలా ఒక మాట అని వెళ్ళిపోతున్నరు. దబ్బున పాణమన్న పోవాలె గానీ ఈ బతుకు ఎవరికీ రావొద్దనిపక్కన ఉమ్మించుకుంట పోతున్నరు. చెబితే వినకపోతే చెడంగ చూడాలని అనుకుంటపోతున్నరు.

పోయి పోయి బడిల తెచ్చి ఏసిండ్రు. పిల్లలు భయపడరా? తీసి గ్రామ పంచాయతీ దగ్గర ఏయమని’ హెడ్‌మాస్టర్ సార్ అక్కడికి వచ్చిన వాళ్ళతో కోపంగా అన్నడు. ఎంతమంది పిల్లలు బడికి వచ్చిండ్రో, ఎన్ని గుడ్లు తీసుకొని రావాలో అడగనీక సత్యయ్య భార్య అంజమ్మ కూడా అక్కడికి వచ్చింది. కొంగు ముక్కుకు అడ్డం పెట్టుకొని దూరంగా నిలవడ్డది.

ఈయనకు పెండ్లాం, పిల్లలు లేరా?” అని అంజమ్మను అడిగిన. అంజమ్మ నెమ్మది మనిషి. లోకం మీద సంగతులన్నీ ఆమెకు బాగా ఎరుక. 

ఎందుకు లేరు సారూ? సక్కదనాల పెండ్లం ఉంది. ఇద్దరాడ పిల్లలుండ్రు. ఒకదాన్ని ఉంచుకుండు. అది వీణ్ని ఇడిసి ఎక్కడ పోయిందో! వీడు సస్తే ఏడుపు కూడ రాదు. గాజు, బొట్టు పోతదని ఏడ్వవలసిందే కాని వీడు సస్తే ఏడ్వవలసిన ఖరారే లేదు. అక్కడనే సావక మల్ల ఇక్కడొచ్చినావయ్య” అని గట్టిగ వినబడేటట్టుగానే మాట్లాడింది.

మరి వాళ్ళనొచ్చి తీసుకపొమ్మనక పోయిండ్రా?” అని అంజమ్మతో అన్న. 

వానికి ముండబోయడం కూడా దండుగే సార్. ఈ గుంజగాడు దానికి ఏం చేసిండు? పేరుకు పిల్లల గన్నడు. సన్న సన్న పిల్లలున్నపుడు వొదిలేస్తే తల్లిగారింటికి వొచ్చి బతుకుతుంది. అన్నలు మంచోళ్ళు కాబట్టి దానికి ఒక గూడు కట్టిస్తే అండ్లనే బతుకుతుంది. కన్నమ్మ కూలి చేసింది. ఒక్క రోజు ఇంటి కాడ ఉండకుండ చారణ కంటే, రూపాయ కంటే కూలి పోయి పెద్ద బిడ్డ పెండ్లి చేసింది. దాన్ని అన్న దాంట్ల న్యాయమే లేదు సార్!”  

అంజమ్మ జరిగిన కథంతా చెప్పుకొచ్చింది. 

అమ్మో! కత పెద్దగనే ఉంది. ఈయన మంచి ఆటగాడే అయితే” అని నవ్వించుకుంట ఆయన దగ్గరకు పోయి ఒక్కొక్కటి అడుగుతున్నడు పెద్దసార్. 

ఏం పేరయ్యా?” 

కొండలు

ఏ ఊరు?” 

ఆర్కపల్లి

మరి ఈ ఊళ్ళె ఎందుకున్నవు?”

ఇది మా అత్తగారూరు.” 

కాళ్ళు నడువరాకుంట ఉంది గదా! ఎవరు దెచ్చి ఏసిండ్రు?” 

ఒక షాపులో పనిచేసేది. మా సేటును ఈడ ఏసిపొమ్మంటే ఏసిపోయిండు.” 

బళ్ళో చస్తే బడికి ఏమన్న పేరొస్తదని పెద్దసారు గ్రామపంచాయతిలో పనిచేసే బురాన్‌ను పిలిపించిండు. ఎవరి మనిషో గానీ వచ్చి తీసుకపోమ్మని చెప్పు అన్నడు.

మంగలి రాములు అల్లుడు సార్. వీళ్ళ భార్య పేరు రేవతమ్మఅని వివరాలన్నీ చెప్పుకుంట వచ్చిండు బురాన్.  రేవతమ్మ ఫోన్ నంబర్ కనుక్కొని రేవతమ్మకు ఫోన్ చేసిండు బురాన్.

ఇపుడు ఊళ్ళో లేదంట, పట్నం పోయిందంట. రేపొచ్చిందాక ఈడనే ఉంచమన్నది సార్. పిల్లలకు వొండిన అన్నమే ఈయనకు గిన్నెల పెట్టుండ్రి. ఇదొక్క రోజు ఈడనే ఉండనీ సార్ అనుకుంట బురాన్ వెళ్ళిపోయిండు.

వాసన. ఎక్కడ వొయినా అదే వాసన. మధ్యానం పూట అన్నం తింటుంటే రెండు ముద్దలు తినగానే నోట్ల పెట్టబుద్దిగాలే. ఆ రోజంతా అదే వాసన వెంటాడింది. ఈ ఒక్క రోజు ఇంత బువ్వ పెట్టి నీళ్ళు పోయమని సత్తయ్యకు  చెప్పి బడి నుంచి వెళ్ళిపోయినం.

**

రెండో రోజు ‘ఆయన పెండ్లం వొచ్చి తీసుకపోవచ్చు‘  అనుకుంట బడి ముంగట బండి దిగిన. గేటు కాడికి గుప్పున వాసనొస్తుంది. దగ్గరకు పోయి చూస్తే బట్టల్లనే ఉచ్చపోసుకుండు. గిన్నె నిండా పెట్టిన బువ్వ అట్లనే ఉంది. ఒక చెయ్యి కూడా పని చేస్తలేదు. వేమన చెప్పినట్టు, పంట చేనును విడిచి పరిగె ఏరుకునే పిచ్చోడిలాగ కనబడుతున్నడు.

ఏం రేవతమ్మా! రేపు వస్త అంటివి. బడిల పిల్లలు భయపడుతుండ్రు. ఎప్పుడొచ్చి తీసుకపోతవు?” ఫోన్లో లౌడ్‌స్పీకర్ పెట్టి అందరితోపాటు కొండలుకు వినబడేటట్లు మాట్లాడుతుండు పెద్దసార్.

వాన్ని చేసుకొని ఏం సుఖపడలే. ఏ బంగ్లాలు కట్టుకోలే. ఎట్ల రావాలి సార్ మీరే చెప్పుండ్రి? వాని ఇచ్చా…రచ్చా. నా కండ్ల ముందటే తిరిగిండు. ఏ లంజది వచ్చి చేస్తదో చేయమని అడుగుండ్రి సార్!”

అవన్నీ మీరు పంచాయితీల చూసుకోవాలే. మీరు రాకపోతే పోలీసుస్టేషన్‌కు ఫోన్ చేసి ఎస్ఐ సార్‌కు చెప్తా. 

చేసుకొని బతికేదాన్ని. గొడ్డలి కామ తీసుకొని కొడితే వాతలు పడ్డయి. అవన్నఎట్ల మర్చిపోత? సస్తే సావని సార్. సస్తే ముండబోస్త. ఇరవై ఏండ్లు దేశం మీద తిరిగి ఇప్పుడు సేవ కీర్తి చేయమంటే నేనెట్ల చేస్త సార్? మా పిల్లలకు నాయిన ముఖం ఎట్లుంటదో తెల్వదు. తొట్టెల్ల ఉన్నప్పుడు పోయిండు. మల్ల ఇరవై ఏండ్లకు వచ్చిండు. ఐదేండ్లు సంసారం చేస్తే ఏడమ్మ తెర్లు చేసిండు నా బతుకు. ఎవతన్న ఊకుంటదా? మీరు సదువుకున్నోళ్ళే కదా! మీరే చెప్పుండ్రి? బంగారమసొంటి భూమిని, ఇంటిని అమ్ముకుండు. ఐదెకురాల తరిపొలం ఉంటే అక్కకు అమ్ముకుండు. నేను రాను సారు. వాళ్ళ అక్కను తీసుకపొమ్మను. వాని జీతమంత వాళ్ళ అక్కనే తిన్నది. నెంబరు పంపిస్త. ఫోన్ చేసి మాట్లాడుండ్రి. నెంబరు నేనిచ్చినని చెప్పకుండ్రి. 

రేవతమ్మ ఫోన్ల మాట్లాడుకుంట ఏడ్చింది. ఇన్ని రోజులు మొగడి మీద ఉన్న కోపమంత ఒక్కసారిగా వెల్లగక్కినట్టు మాట్లాడింది. 

కత ఎట్ల అడ్డం తిరుగుతదో అనుకుంట బ్యాగు బైకు మీద పెట్టుకొని బడి గేటు దగ్గరేసినం. మధ్యన మధ్యన వచ్చి చూసిపొమ్మని సత్తయ్యకు, బురాన్‌కు చెప్పినం. 

**

పొద్దుగాల బడికి రాంగనే ఇదే మాకు పాఠమైతుంది. కత రోజో కొత్త మలుపులు తిరుగుతున్నది. కొండలు దిక్కు చూస్తే ఓసారి బాధైతుంది. ఓసారి అంతులేని కోపం వస్తుంది. నిన్నటికంటే ఈ రోజు మరీ చేతగాకుండా పడి ఉన్నడు. బతుకుతాడన్న ఆశ తన కండ్లల్ల కనబడుతలేదు. మంచి తెలివివంతుడేనంట, అంతోఇంతో చదువుకున్నోడేనంట. ఏం లాభం? కుండెడు పాలు ఇరిగిపోవడానికి ఒక విషం చుక్క చాలదా

వాళ్ళ అక్కనన్న వచ్చి తీసుకపోతదేమోనని సార్ ఫోన్ కలిపిండు. రెండు సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. మూడోసారికి ఎత్తింది. 

హాల్లో ఎవరమ్మా? నీలమ్మనేనా మాట్లాడేది?”

అవును. మీరెవరయ్య? 

నేను భైరాపురం హెడ్‌మాస్టర్ సార్‌ను మాట్లాడుతున్నానమ్మా… 

హా..చెప్పండి సారూ!”

కొండలు మీ తమ్ముడే కదా! చావుకు దగ్గరైండు. ఈ బడిలో ఏసిపోయిండ్రు. వచ్చి తీసుకొనిపోండమ్మా!” 

అప్పటివరకు నెమ్మదిగా మాట్లాడిన నీలమ్మ ఒక్కసారిగా తుఫాన్ చెలరేగినట్లు మారింది. ఇంతముందుకు మాట్లాడినామె ఈమేనా అన్నంత ఆశ్చర్యం మాకు.

నేనెందుకొచ్చి తోల్కపోత సార్? అందరిలాగా నేనూ ఆడబిడ్డనే. అందరిని ఇచ్చినట్టు నన్ను ఓ ఇంటికిస్తే పోయిందాన్ని. మాకేమన్న తులాలు తులాలు పెట్టిండా? నా బిడ్డల పెండ్లిలు అయితే పని చేసినోడా? నాకు ఫోన్ చేయకుండ్రి సార్. సస్తే సావనీ. వాని పేరు మీద ఇంక ఎకరం పొలం ఉంది. వాడు చస్తే వాని పెండ్లానికి కాదా? ఎపుడున్న ఇంటికొస్తే తమ్ముడు కదా అని బుక్కెడు బువ్వ పెట్టొచ్చు. గుద్ద కాన్నుంచి కడుగమంటే ఎవరొచ్చి చేస్తారు? నాకు నా మొగడు, పిల్లలు, ఇల్లు సంసారం లేదా?” అన్నది. 

మీ తమ్ముని జీతం అంతా నువ్వే తిన్నవంట కదమ్మా, చెల్క కూడ పేర చేయించుకున్నవంట గదా! మీ తమ్ముడే చెబుతుండు” అన్నడు పెద్దసారు.

మా అమ్మనాయిన సచ్చిపోయినంక తల్లిగారిల్లు అంటే తెల్వదు నాకు సార్. ఎకరానికి పది లక్షలిచ్చి కొన్న. మా అక్కనే అని పది రూపాయలు తక్కువ తీసుకుండా? ఉత్తగనే చేసిండా నాకు?మల్ల నాకు ఫోన్ చేస్తే మర్యాద దక్కదన్నట్లు మాట్లాడింది నీలమ్మ. 

ఆ మాటలకు అందరం తెల్లముఖం వేసినం. ‘ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోవాలి వీడు’ అనుకుంట అంజమ్మ కూరగాయలు తేవడానికి బయటకు పోయింది. 

ఈ పంచాయితి మాతో తెగేది కానట్టుంది అనుకోని ఎస్ఐ సార్‌కు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పిండు పెద్దసారు. కొండలు వాళ్ళ భార్య నెంబర్, అక్క నెంబర్ తీసుకుండు. వాళ్ళతో మాట్లాడుత అని చెప్పి, ఇదొక్క రోజు బడిలనే ఉండమని చెప్పిండు.

**

మూడో రోజు తొమ్మిది గాకముందుకే బడి నిండా ఊరి జనం. ఎస్ఐ సార్‌తోపాటు ఐదారుమంది కానిస్టేబుళ్లు వచ్చిండ్రు. నిండా మునిగినంక సలిలేదన్నట్లు ఎండపొలుపుకు మొండిగా కూర్చొని ఉంది రేవతమ్మ.

రేవతమ్మ మాటను ఈ లోకం ఎప్పుడూ పట్టించుకోలేదు. పెండ్లైన కొత్తలో మొగడు చెడుతిరుగుడు తిరుగుతుండని చెబితే నీ కడుపున పండో, కాయో కాస్తే వాడే మారుతడని నచ్చజెప్పింది. ఎక్కడన్న తిరగనీ, పెండ్లాం అని ఇంటికొస్తే చాలనికాపురం చేయించింది. బిడ్డ పుట్టినంక మారుతాడని అనుకుంది. కనడానికి రేవతమ్మ తల్లిగారింటికి వస్తే రోడ్ల మీద పోయేదాన్ని తెచ్చుకోని ఇంట్ల పెట్టుకున్నడు కొండలు. తలకాయలు పగలగొట్టుకునేంత గొడవే అయ్యింది. మళ్ళీ నచ్చజెప్పిండ్రు. కొడుకు పుడితే మనసు మారుతదని అనుకున్నరు. పుట్టుక, చావు మన చేతులుంటవా? రెండోసారి మళ్ళీ బిడ్డ పుట్టింది. బిడ్డలు పుడితే భయమన్న ఉంటదని అనుకున్నరు. రోజురోజుకు తిరుగుడు ఎక్కువైంది గానీ ఏం మారలే! ఎవరి బుద్ధి వాళ్ళకు కావాలి కానీ ఒకరు చెబితే వచ్చేది ఎన్ని రోజులుంటది? ఎట్ల పోయె పక్షిని అట్ల పోనియ్యాలని అనుకోని తల్లిగారింటికి వచ్చి తన బతుకును తాను చూసుకుంది రేవతమ్మ.

నోట్లె నాలుక లేని రేవతమ్మను నోరు చేసి ఎట్లా బతకాలో కాలమే నేర్పించింది. తాకిన ప్రతి దెబ్బ లోపలి సున్నితత్వాన్ని తీసేస్తుంది. గాయం తనకు కొత్తది కాదు కానీ మానిన గాయాన్ని మల్లా పెద్దది చేస్తున్నట్టు వచ్చిపడ్డడు. ఇన్ని రోజులు కొండలు ఉన్నా లేని సమానమే. ఏం నిర్ణయం తీసుకోవాలో తెల్వక మౌనంగా కూర్చొని ఉంది. 

మెడకు పడ్డ పాము కరవక మానదు. ఎట్లనో అట్ల ఇంటికి తీసుకపో బిడ్డా అని నచ్చచెప్పిండ్రు ఊరోళ్ళంత.  ఎకరం పొలం ఉంది గదనే, ఆయింత ఎందుకు పోనిస్తవు?రేవతమ్మ తల్లి బిడ్డను సాటుంగ తీసుకొనిపోయి చెప్పింది.  

ఎందయ్యా లెస్స ఆలోచిస్తుండ్రు? ఇన్ని రోజులు ఆమె బాధపడ్డది చాలు. తీసుకొని పోయి ఏ అనాథశ్రమంలోనో  పడెయ్యక ఇంకా ఆమె మెడకు తగిలేస్తుండ్రు ఏంది? ఇట్లాంటోళ్ళు దిక్కులేని చావే చావాలి. వీన్ని చూసైనా నలుగురు బుద్ది తెచ్చుకుంటరు. వయసు మీద ఉన్నప్పుడేమో కండ్లు కనిపించలేదు. అడ్డమైన తిరుగుడు  తిరిగిండు. ఇప్పుడొచ్చి ఆ గద్దను చేయమంటే ఎట్ల చేస్తది? ఆమె మనిషి కాదా?” కానిస్టేబుల్ దగ్గర నిలబడి సత్తయ్య కట్టె చెలిగినట్లు మాట్లాడిండు. నిజమే! సత్తయ్య అన్నదాంట్ల న్యాయం ఉంది. పాతివ్రత్య కథలు చెప్పి చెప్పి, వాటినే సినిమాలుగా  చూపించి ఆడవాళ్ళను రాజీ పడేటట్లు చేసిండ్రు. ఈ నీతి సూత్రాలన్ని ఆడవాళ్ళ మెడలోనే ఎందుకు? ఇంత సానుభూతి చూపిస్తున్నాము కానీ కొండలు చేసిన పనే రేవతమ్మ చేస్తే ఇంట్లకు రానిచ్చేటోడా? ఈ మానవత్వం అప్పుడు ఎక్కడ దాసుకునేదో!

రేవతమ్మ పేరుకే ఇక్కడ ఉంది కానీ తన మనసు ఏడేడు లోకాలు తిరిగొస్తుంది. కొండలు లేకుండా ఇన్ని రోజులు బతికింది. ఇక మీదట బతకడం తనకు పెద్ద విషయం గాదు. సంసారాన్ని ఈది ఈది అలిసిపోయి ఉంది. కొండలును తీసుకొని పోవాలా? వద్దా?

ఎకరం పొలం గురించి తనకెప్పుడూ ఆలోచన లేదు. కొండలు మంచిగున్నప్పుడే ఇంట్లకు నయాపైసా ఇచ్చినోడు కాదు. ఇప్పుడు లేచి ఉరికి సంపాదిస్తాడని లేదు. 

‘ఎంత కష్టమొచ్చే బిడ్డా’ అని కన్నీరు గార్చే ఈ లోకమే ఒకవేళ కొండలు సచ్చిపోతే తిట్టకుండ ఉంటారా? ఇప్పుడు నా దిక్కు మాట్లాడిన లోకమే, రేపు రేపు మాట మార్చదని నమ్మకమేంది? రోడ్డు మీద ప్రాణం పోతుంటే చూడలేక ఓ కుక్కను చేరదీస్తం. కట్టు కడుతం. వీడు కూడా అంతే అని మనసులో అనుకుంది. తీసుకపోతా అని ఎస్ఐ సార్‌కు చెప్పింది. 

బామ్మర్దులు వచ్చి బట్టలు మార్చిండ్రు. గిన్నె, మాసిన బట్టలు, బీడీల కట్టలు తీసి దూరంగ కంపచెట్లల్ల పడేసి వొచ్చిండ్రు. అటొక్కరు, ఇటొక్కరు పట్టుకొని ఆటోలో కూర్చోబెట్టిండ్రు. 

పొయ్యి మీద ఉడుకు నీళ్ళు కాయడానికి రేవతమ్మ ముందు నడుచుకుంట పోయింది. వెనుకంగ భరించలేని వాసన వస్తనే ఉంది.

*

తొందరపడి ఏదీ రాసేయడం నాకు అలవాటు లేదు!

  • హాయ్ గోపాల్! మీ గురించి చెప్పండి.

మాది ఉమ్మడి మహబూబ్‌నగర్(ప్రస్తుతం రంగారెడ్డి) జిల్లా మాడుగల మండలం కలకొండ. ఇంటర్ తర్వాత హైదరాబాదులో డీఎడ్ చేసి 2012లో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచరుగా ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం నాగర్‌కర్నూలు జిల్లా చారగొండ మండలం గోకారంలో పని చేస్తున్నాను. 

  • రచనా వ్యాసంగంపై ఆసక్తి ఎలా కలిగింది?

మా ఇంట్లో పలకాబలపం పట్టిన మొదటితరం పిల్లలం నేను, మా చెల్లెలు. నేను పదో తరగతిలో ఉన్నప్పుడు పద్యాలు రాసేవాణ్ని. ఇంటర్మీడియేట్‌లో ప్రాస కవిత్వం రాసేవాణ్ని. మల్కాజ్‌గిరిలో డీఎడ్ చదువుతున్న సమయంలో ‘అస్తిత్వ పుష్పాలు’ అనే పేరుతో నారాయణశర్మ గారు రాసిన పుస్తకావిష్కరణ సభకు వెళ్లాను. ఆ నానీల ప్రేరణతో వెతుక్కొని మరీ నానీల పుస్తకాలు చదివి కొన్ని నానీలు రాశాను. ఆ తర్వాత కవి ఎన్.గోపి గారిని కలిసి ఆ నానీలు చూపించాను. ‘ఇంట్లో దొంగలు పడ్డారు..నా పేదరికాన్ని దోచుకుపోతే బాగుండు’ అనే నానీ ఆయనకు చాలా నచ్చింది. నానీల రచనలో ఆయన కొన్ని సూచనలు చేశారు. నేను రాసిన నానీలతో 2016లో ‘తీరొక్క పువ్వు’ పేరిట నానీల పుస్తకం ప్రచురించాను. 

  • ‘దండకడియం’ దాకా సాగిన మీ కవితాప్రయాణం..?

2016 డిసెంబర్‌లో నాకు కవిసంగమం పరిచయమైంది. ఆ సమయంలో కవి యాకూబ్ గారికి నా నానీలు చూపించాను. ‘నువ్వు వచన కవిత్వం రాయాలి’ అని ఆయన నన్ను ప్రోత్సహించారు. అలా కొన్ని కవితలు రాశాను. అందులో ‘నాన్న గొడ్డలి’ అనే కవిత నాకు పేరు తెచ్చింది. కవిసంగమం ద్వారానే ఎంతోమంది కవిమిత్రులను కలుసుకున్నాను. నేను రాసిన వాటిలో 55 కవితలతో 2019లో ‘దండకడియం’ కవిత్వ సంపుటి వెలువరించాను. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. 

  • కథలు రాయడం ఎప్పుడు మొదలుపెట్టారు?

నా చుట్టూ జరిగే కొన్ని అంశాలను కవితలుగా కంటే కథలుగా రాస్తే బాగుంటుందని అనిపించింది. మా ఊరిలో ఉండే ఒక చాకలి మహిళ జీవితం ఆధారంగా ‘ఏ పండు తీపి’ అనే కథ రాశాను. అది 2020 నవంబరులో సారంగలోనే ప్రచురితమైంది. ఇప్పటికి ఏడు కథలు రాశాను. కథలు రాస్తున్న క్రమంలో సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్‌గార్ల సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ కథా సంకలనాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కథలు రాయమని సంగిశెట్టి శ్రీనివాస్ చాలా ప్రోత్సహించారు. గొంగడి, బొడుసు, పగిడి సంకలనాలలో నేను రాసిన కథలు రావడం ధైర్యాన్నిచ్చింది. 

  • కవిత్వం..కథ..రెండిట్లో ఏది రాయడం మీకు ఎక్కువ తృప్తినిస్తుంది?

తొందరపడి ఏదీ రాసేయడం నాకు అలవాటు లేదు. ఏదైనా నిదానించి రాయడం నా అలవాటు. కథ కంటే కవిత్వం రాయడాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. రాసేటప్పుడు ఏదైనా సందేహం వచ్చినా, చర్చించాలని అనిపించినా నాగిళ్ల రమేశ్, మెట్టా నాగేశ్వరరావు, పల్లిపట్టు నాగరాజు లాంటి కవులతో మాట్లాడతాను. నా కవిత్వం వారికి వినిపిస్తాను. కథల విషయంలోనూ వారి సలహాలు తీసుకుంటాను. 

  • ఇంకా ఏమేం రాయాలని అనుకుంటున్నారు?

త్వరలో నా కవితలతో ‘పూతబట్టిన అడివి’ పేరుతో మరో కవిత సంపుటి వెలువరించబోతున్నాను. మరిన్ని కథలు రాయాలని ఉంది. తెలియనిది తెలుసు అనుకొని రాయడం ఎందుకు అనేది నా ఆలోచన. అందుకే నా కథల్లో ఎక్కువగా నేను చూసిన జీవితమే ఉంటుంది.

*

తగుళ్ళ గోపాల్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మాండలికంలోని జీవం కథకు వెన్నుగా నిలిచింది. ఇక ఈ పేద జీవితాల కథలని బావుంది అని అలవోకగా ఎలా చెప్పగలం? ఆ ఎకరం పొలం కూడా లేకపోతే ఆ వాసన భరించే కర్మ ఉండేది కాదనిపించింది. కథనం చాలా బాగా తీసుకొచ్చావు గోపాల్. నీ మిగతా కథలు కూడా చదవాలి.

    • చాలా చాలా సంతోషంగా ఉంది అక్కా. థ్యాంక్యూ సో మచ్ అక్కా

  • జీవితాన్ని కథగా మలిచే నిపునత చాసోకి
    తేలిసినట్టు, కాలువమల్లయ్య కి తెలిసినట్టు
    తమ్ముడు గోపాల్ కి బాగా తెలుసు.
    శుభాకాంక్షలు💐💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు