1
నిశ్శబ్ద సమాధానం
సంతోషం ఎండమావిలా ఏమారుస్తుంటే,
ఆనందం అందని ద్రాక్షలా ఊరిస్తుంటే,
ఆశా–నిరాశల వలయంలో చిక్కుకుని,
నిరంతరం చక్ర భ్రమణం చేస్తూ సాగిపోతున్నాను.
కాలమనే పరుగు వెనుక కారణం తెలియక,
జీవితం ఒక భ్రమే అని తెలిసినా,
నిజం–అబద్ధం మధ్య ఊగిసలాడుతూ,
అజ్ఞానం తెర దాటి జ్ఞానం వైపు పయనిస్తున్నాను.
మనసు మాయల మధ్య మునిగితేలుతూ,
ఆత్మ శాంతి కోసం అలసిపోతూ,
ప్రతి ప్రశ్నకు జవాబు మరో ప్రశ్నగా మారుతుంటే,
నిశ్శబ్దంలోనే సమాధానం వింటున్నాను.
బంధాలన్నీ బరువులని తెలుసుకున్నా,
వదిలేయలేని వాత్సల్యం విడిచిపెట్టలేక,
మోక్షమంటే ఒంటరి యాత్ర అని గుర్తించీ,
అనుబంధాల అందంలో ముడిపడి ఉన్నాను.
పుట్టుక–చావుల మధ్య అర్థం వెతుకుతూ,
శాశ్వతం అశాశ్వతంలో దాగుందేమో అనుకుంటూ,
ఉనికి కోసం అంతరంగంతో పోరాడుతూ,
ఉండకుండానే ఉండే రహస్యాన్ని గ్రహిస్తున్నాను.
నేనెవరో, నా గమ్యమేదో తేల్చుకోలేకపోయినా,
ప్రతి అడుగు ఒక తీర్థయాత్రగా భావిస్తూ,
ఈ అనంత విశ్వంలో ఓ బిందువుగా మిగిలిపోతూ,
బిందువులన్నీ కలిసి సముద్రమవుతాయని నమ్ముకుంటున్నాను.
శూన్యం నుండి వచ్చి శూన్యంలో కలిసిపోతూ,
మధ్యలో ఈ ప్రయాణమే నా నిజమైన సంపద,
ప్రతి శ్వాసలో జీవించి, ప్రతి క్షణం అనుభవిస్తూ,
ఉనికి అనే మహా కావ్యాన్ని రాసుకుంటున్నాను..
2
అస్తిత్వ వేదన
వెలుగుకూ, చీకటికి నడుమ చిక్కుకున్న
అదృశ్యమైన, అంతులేని మాయా ముసురులు…
కన్నీటి రుచి తెలిసినవారికే తప్ప,
దాని నిజమైన లోతు,ఒక గాయం లాంటిది.
ఎవరూ అర్థం చేసుకోలేరు.
ప్రతి నిట్టూర్పులో ఒక క్రొత్త జన్మ దాగుంటుంది,
కానీ అది ఎప్పుడూ పూర్తి కాదు, ఎడతెగని బాధలా.
ప్రతి నవ్వులో ఒక పాత మరణం మరుగున పడుతుంది,
అది మళ్లీ మళ్లీ రక్తసిక్తంగా మేలుకొంటుంది.
గతం అనే గర్భంలో భవిష్యత్తు పరుచుకొని ఉంటుంది,
కానీ అది ఎప్పుడూ జన్మించదు, కేవలం గర్భస్రావమవుతుంది.
వర్తమానం అనేది కాలం నడుమ చీలిక మాత్రమే..
ఒక క్షణం, ఆ తర్వాత శూన్యం,
ఎడారి లాంటి ఒంటరితనం..
ఏది సత్యం? ఏది మిథ్య?
ఈ మూల ప్రశ్నలకు జవాబులు లేవు,
కానీ ప్రశ్నలే మనల్ని నిరంతరం చీల్చుతూ ఉంటాయి,
రక్తం కారుతూ, ఆత్మను కరిగిస్తూ..
జ్ఞాపకాల చెరగులో ఒక మరొక జీవితం మిగిలి ఉంటుంది,
కానీ అది ఎప్పుడూ పూర్తి కాదు, ఎడతెగని శూన్యతలా.
మరచిపోవడంలోనూ ఒక గొప్ప విజ్ఞానం దాగి ఉంటుంది.
అది మరణం లాంటిది, నిశ్శబ్దంగా మింగేస్తుంది.
కన్నీరు ఆరిపోయిన చోట..
ఒక నిశ్శబ్ద శాంతి మొలకెత్తుతుంది.
కానీ అది కేవలం మరణం ముసుగు,
ఎడారిలో ఒక చిన్న నీడ వలె,
త్వరలోనే కనుమరుగవుతుంది.
*








Add comment