పాతికేళ్ళ తరవాత కొత్త అనుభవమే!

పుస్తకానికి పేరేం పెట్టాలో అర్థం కాలేదు. ఏదైనా ఒక పేరునే పెడదామంటే, ఆ కథకి ఎక్కువ వెయిట్ ఇచ్చినట్టువుతుందని ఓ మిత్రుడన్న మాటలు – ఆలోచనలో పడేశాయి. ‘1, మరో 13’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టి కొనసాగించాను.

[ఇటీవల తన రెండవ కథాసంపుటి ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ వెలువరించిన సందర్భంగా, తన కథల గురించి, తన పుస్తకం నేపథ్యం గురించి ముచ్చటిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

మస్కారం

నేను కథలు వ్రాయడం మొదలుపెట్టి పాతిక సంవత్సరాలవుతోంది. నా మొదటి కథ ‘రూపాయల పుస్తకం’ ఆంధ్రభూమి ఆగస్టు 2001 మాసపత్రికలో ప్రచురితమైంది. అంటే అంతకుముందు కథలు వ్రాయలేదని కాదు, పెద్దల కోసం రాయలేదు. బాలజ్యోతిలోనూ, ఇతర దిన/వారపత్రికలలోనూ పిల్లల పేజీలలో 12 కథలు వ్రాశాను. 1999లో తొలి అనువాదం, పిల్లల కోసం ఇంగ్లీషు నవల ‘పినోకియో’ని అనువదించాను (అది దాదాపు 11 ఏళ్ళ తరువాత పుస్తకంగా ప్రచురితమైంది).

మొదటి నాలుగైదు కథల తరువాత, అనువాద కథలవైపు మళ్ళాను. అనువాద కథలకి చక్కని గుర్తింపు రావడంతో, వాటినే కొనసాగించాను. ఈ క్రమంలో సొంత కథలు బాగా తగ్గించాను. సంవత్సరానికి ఒకటి.. ఒక్కోసారీ అదీ లేదు. నా సొంత కథలు మూడు, రెండు అనువాద కథలు మొదటిసారిగా అక్టోబర్ 2004లో ‘4 x 5’ అనే కథా సంకలనంలో వచ్చాయి. నలుగురు మిత్రులం ఒక్కొక్కరు 5 కథలు చొప్పున సహకారపద్ధతిలో పుస్తకం వేశాం. ఆ తరువాత 2006లో నా అనువాద కథల సంకలనం ‘మనీ ప్లాంట్’ ప్రచురించాను. నా సొంత కథలతో 2014లో ‘దేవుడికి సాయం’ అనే ఈబుక్ తెచ్చాను. తరువాత, అనువాద కథలతోనే రెండు ఈబుక్స్ తెచ్చాను. 2014లో యాత్ర రచన అనువాదం ‘ప్రయాణానికే జీవితం’ ప్రింట్ బుక్ వెలువడింది. 2016 నవంబరులో ‘నాన్నా!! తొందరగా వచ్చేయ్’ అనే పేరుతో 15 కథలో మరో అనువాద సంకలనం ప్రింట్ బుక్ తెచ్చాను. ఈ రెండు పుస్తకాలు బాగా అమ్ముడుపోవడంతో, నా తొలి కథాసంపుటి ‘దేవుడికి సాయం’ను 2018లో ప్రింట్ చేశాను. ఈ పుస్తకంలో 2005- 2012 మధ్యలో ప్రచురితమైన 16 కథలున్నాయి. పుస్తకంలో కథాక్రమం ప్రచురితమైన తేదీ వారీగా కాకుండా, ఎంపిక చేసిన పాఠక మిత్రులకు నచ్చిన క్రమంలో అమర్చాను. 2019 నవంబరులో మరో అనువాద కథల సంకలనం ‘ఏడు గంటల వార్తలు’ ముద్రించాను. ఆ తరువాత.. దాదాపు ఆరేళ్ళ పాటు పుస్తకాలు ప్రచురించలేదు.

*

గత నవంబర్ నెలలో మరో పుస్తకం తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. అంతలోనే, ఆఁ ఎందుకు డబ్బు దండగ, ఆ డబ్బు ఉంటే, ఇంట్లో ఖర్చులకో, పిల్లల అవసరాలకో పనికొస్తుంది కదా అని మరో ఆలోచన! ఇక్కడ మరో  ముఖ్యమైన ఇబ్బంది కూడా ఉంది. పుస్తకం 500 కాపీలో వెయ్యి కాపీలో వేస్తే, అమ్ముడుపోక, చెల్లుబాటు కాక, ఇంట్లో అట్టపెట్టెల్లో మగ్గిపోతాయి.

కానీ అంతకు ముందు కొన్ని రోజుల క్రితం ఓ సాహితీమిత్రుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి – ఆరేళ్ళుగా పుస్తకం తేలేదని గుర్తు చేస్తూ, ప్రింట్ బుక్ తేవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన సంగతి స్ఫురించింది. అప్పుడు ఆయనే చెప్పిన డిజిటల్ ప్రింటింగ్ సంగతి గుర్తొచ్చింది. రఫ్‍గా పేజీల సంఖ్య లెక్కవేసి, డిజిటల్ ప్రింటింగ్‌లో పరిమిత సంఖ్యలో కాపీలు వేయిస్తే ఎంతవుతుందో కనుక్కున్నాను. పరవాలేదు, అఫర్డ్ చేయచ్చు అని నిర్ణయించుకున్నాకా, మా శ్రీమతి అనుమతి తీసుకుని – ప్రాసెస్ మొదలుపెట్టాను.

మొదటి నాలుగు కథలూ చేత్తో రాసినవి, వాటి సాఫ్ట్ కాపీలు లేవు. మిగతా కథలు శ్రీలిపిలో చేసినవి, బరాహాలో చేసినవి ఉన్నాయి. సో, సాఫ్ట్ కాపీలు లేని కథలని పత్రికల నుంచి స్కాన్ చేసుకుని భద్రపరిచిన ఇమేజ్ రూపం నుంచి text extract చేసి, తప్పులు దిద్దాను. కనీసం 80% యాక్యురసీ వచ్చింది. మిగతాది మళ్ళీ టైప్ చేసుకున్నాను. శ్రీలిపి ఫాంట్ లో ఉన్నవాటిని యూనికోడ్‌లోకి మార్చాను.

పుస్తకాన్ని ఏ పద్ధతిలో సిద్ధం చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు – తనకి ఫైల్ పేజ్‍మేకర్ లోనే కావాలని ప్రింటర్ చెప్పడంతో, యూనికోడ్ పిడిఎఫ్ వద్దనుకున్నాను.

అన్ని కథలనీ అనూ ఫాంట్స్ లోకి మార్చి పేజ్‍మేకర్‌లో ⅛ డెమీ సైజులో లేఅవుట్ చేసి, పుస్తకానికి ఆకృతి కల్పించాను. ఈ పుస్తకంలో ‘4 x 5’ సంకలనంలో వేసిన నా మొదటి మూడు సొంత కథలనూ చేర్చాను. అంటే 2001 నుంచి 2025 వరకు వివిధ పత్రికలలో, ఇతర సంకలనాలలో ప్రచురితమైన కథలు. ‘దేవుడికి సాయం’ పుస్తకంలోని 16 కథలను మినహాయించగా మిగిలిన కథల్లోంచి 14 కథలను ఎంచుకున్నాను. వాటిని పత్రికలలో ప్రచురితమైన తేదీల క్రమంలోనే అమర్చాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే.. వాటిని చదివితే.. గత 25 ఏళ్ళుగా సమాజంలో వచ్చిన మార్పులు, రచయితగా నాలో వచ్చిన మార్పులను పాఠకులు గమనించగల్గుతారని అనిపించింది. ఫస్ట్ వెర్షన్ సిద్ధమయింది.

*

పుస్తకానికి పేరేం పెట్టాలో అర్థం కాలేదు. ఏదైనా ఒక పేరునే పెడదామంటే, ఆ కథకి ఎక్కువ వెయిట్ ఇచ్చినట్టువుతుందని ఓ మిత్రుడన్న మాటలు – ఆలోచనలో పడేశాయి. ‘1, మరో 13’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టి కొనసాగించాను.

ఫస్ట్ రౌండ్ ప్రూపులు దిద్ది, ముందుమాటల కోసం పాణ్యం దత్తశర్మగారికి, అవధానుల మణిబాబు గారికి పంపాను. ఈలోపు ‘1, మరో 13’ టైటిల్ గురించి ఆప్తులతో ప్రస్తావిస్తే, అదేదో డబ్బింగ్ సినిమా టైటిల్‍గా ఉందని పుస్తకానికి ఉండదగ్గది కాదని తేల్చారు. ఆ పేరు అనుకోడంలో నాకు మరో ఆలోచన ఉంది. 1, మరో 13 అనే వాటితో కవర్ పేజీ సులువుగా తయారవుతుంది, నా పని తేలికవుతుందని అనుకున్నాను. కానీ ఆ టైటిల్ వద్దనుకున్నాకా, ఇక తప్పక, ఒక కథ పేరునే ఎంచుకుని దానికి తగిన బొమ్మ గీసి, కవర్ పేజీ డిజైన్ చేయడానికి ఓ ఆర్టిస్ట్‌ని అడిగితే, ఆయన పుస్తకం ప్రింటింగ్‌కి ఎంత అవుతుందో, దాదాపు అంతే ఎమౌంట్ అడిగాడు.

ఇలా కాదనుకుని మళ్ళీ ఆలోచించాను. పోనీ పత్రికలలో ఆర్టిస్ట్ వేసిన బొమ్మలని వాడుకుందామా అనుకుంటే, కొన్నిటికి బొమ్మ రెండు పేజీలకు అటు ఇటూ వచ్చింది. కొన్నిటికి చాలా చిన్న సైజులో ఉంది. పైగా ఆ బొమ్మలని వాడుకోవాలంటే, అనుమతి అవసరం. ఈ లోపు పుస్తకానికి శీర్షికగా ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ కథ పేరే ఫైనల్ అయింది. ఆ కథకి దివంగత కరుణాకర్ గారు గీసిన బొమ్మని ఆధారం చేసుకుని, ఎ.ఐ. ద్వారా కవర్ పేజీ ఇమేజ్ డిజైన్ చేయాలని అనుకున్నాను. తగిన ప్రాంప్ట్స్ ఇచ్చి చాట్‍జిపిటి ద్వారా, గూగుల్ జెమిని ద్వారా నాలుగైదు వెర్షన్స్ ట్రై చేశాను. బ్యాక్‌గ్రౌండ్ బావుంటే, మనుషులు తెలుగువాళ్ళలా అనిపించకపోవడం, మనుషులు బాగా వస్తే, బ్యాక్‌గ్రౌండ్‌లో తేడా రావడం జరిగింది. ఎట్టకేలకు ఒక డిజైన్‌ ఓకే చేశాను.

*

ఈలోపు ముందుమాటలు సిద్ధమయ్యాయి. వెనుక అట్ట మీద బ్లర్బ్ వ్రాయడానికి శీలా సుభద్రాదేవి గారిని సంప్రదించాను. ఇతరత్రా తీరిక లేకుండా ఉన్నానని, సమయం కేటాయించలేకపోవచ్చని చెప్పారు. 14 కథలేనని, చదివి నచ్చితేనే వ్రాయండని చెప్పాకా, పంపమన్నారు. నచ్చితే తప్పక వ్రాస్తానన్నారు. వారికి పిడిఎఫ్ పంపాను.

ఇక ప్రచురణకర్త దాసరి చంద్రయ్యగారితో సంప్రదింపులు! కవర్ కోసం నేను డిజైన్ చేసిన బొమ్మ ఆయనకు పంపగా, నమూనా ముఖచిత్రం తయారు చేసిచ్చారు. చిన్న చిన్న మార్పులతో, కవర్ పేజీ విషయంలో అంగీకారానికి వచ్చాము. సుభద్రాదేవి గారు బ్లర్బ్ మేటర్ వ్రాసి పంపడంతో, కవర్ పేజీ ఫైనల్ చేసేశాము. కాకపోతే, పుస్తకం సిద్ధమై, కాపీలు నా చేతికి వచ్చేదాకా, కవర్ గురించి గానీ, పుస్తకం తెస్తున్న విషయం కానీ సోషల్ మీడియాలో షేర్ చెయ్యలేదు. ఈ గ్యాప్‌లో, రెండవ దఫా ప్రూఫ్ రీడింగ్ కూడా పూర్తి చేశాను.

*

టెక్స్ట్ ఫైల్స్ ఓకే అనుకున్నాకా, చంద్రయ్యగారికి పంపాను. ఆయన ఇన్నర్ పేజీలో వారి సంస్థ లోగో పెట్టి, పిడిఎఫ్ చేసి, గుంటూరులోని ప్రింటింగ్ ప్రెస్‌కి పంపేశారు. సుమారు పది రోజుల్లో అందంగా ముద్రితమైన ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ కథాసంపుటి ప్రతులు పార్సెల్ సర్వీస్ ద్వారా హైదరాబాద్ చేరాయి.

ఆ మర్నాడు దత్తశర్మగారికి, మణిబాబుగారికి, సుభద్రాదేవి గారికి కొన్ని కాపీలు పంపాను. తరువాత మా మేనమామలు, అక్క, నా శ్రీమతి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో, ఇన్‍ఫార్మల్‌గా మా అమ్మ చేత, పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకున్నాను. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో కవర్ పేజీ పెట్టి, త్వరలో విక్రయానికి అందుబాటులోకి వస్తుందని రాశాను.

అనుకున్న ప్రకారం నవోదయ బుక్ హౌస్ వారికి పుస్తకాలు అందజేసి, ఫిజికల్‍గా, ఆన్‌లైన్ లోను అందుబాటులో ఉంచేలా చేశాను. కొందరు మిత్రులు నేరుగా నాకు గూగుల్ పే/ఫోన్ పే చేసి పుస్తకం తెప్పించుకున్నారు. మొదటి సమీక్షలు/అభిప్రాయాలు వెల్లడయ్యాయి. త్వరలో పుస్తకాన్ని గూగుల్ బుక్స్‌లో డిజిటల్ ఫామ్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాను. అది సిద్ధమైతే, డిజిటర్ వెర్షన్ అందుబాటులోకి వస్తుంది.

ఈ పుస్తకంపై ఇంచుమించుగా పనిచేసిన మూడు నెలల కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది. ఫలవంతమైందనే అనిపిస్తోంది.

ఇక పాఠకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాను. ఇదీ ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ కథాసంపుటి ప్రచురణ నేపథ్యం!!

కొల్లూరి సోమ శంకర్

PS:

ఇండియాలోని వారు ఏ ప్రాంతం నుంచైనా ఈ పుస్తకాన్ని ఆన్‍లైన్‌లో ఆర్డర్ చెయ్యచ్చు:

Aahlaadapuram Aaro Veedhi

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ. డిగ్రీతో గ్రాడ్యుయేషన్‌. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్‍పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథల సంకలనం అచ్చు వేయాలంటే ఇన్ని తంటాలు ఉంటాయా సోమ శంకర్ గారూ. అయినా మీ సంకలనం వివరాలతోపాటు మీ సంపూర్ణ రచనా ప్రయాణం చాలా బాగా కథనం చేశారు. ఎన్నోఏళ్ల కష్టాన్ని ఇలా ఒకే దగ్గర సంకలనంగా చూసుకోడం… ఎంత ఆనందమో రచయితకు 😊

  • ఈ వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. వివిధకారణాల వలన నాకు చాలా ఉపయుక్తమైన సమాచారం ఇందులో ఉంది. వ్యాసకర్త గారికి వీలైతే వారితో స్వయంగా నేను మాట్లాడి తెలుసుకొన వలసిన విషయాలు చాలానే ఉన్నాయి పత్రిక వారు ఈవ్యాసకర్తగారితో నాకు పరిచయం కలిగించవలసిందని కోరుతున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు