డైలాగ్‌కి తగిలించే తోకలు

బలమైన సంభాషణ ఆ సందర్భపు భావోద్వేగాన్ని మౌనం, లయ, పరోక్ష సూచన, సందర్భం ద్వారా సహజంగా అందించాలి.

త రెండు భాగాలుగా మనం సంభాషణల గురించి మాట్లాడుకుంటున్నాము. 25వ వ్యాసంలో సంభాషణ కథకి చేస్తున్న మేలుని గుర్తించడం, మేలు చేసేలా రాయడం గురించి చెప్పాను. గత పక్షం ఒక కథని (వీలైతే ఈ వ్యాసం చదివే ముందు ఒకసారి మళ్లీ చదవండి) ఉదాహరణగా తీసుకుని నాలుగు విషయాలు చెప్పాను – ప్రతి పాత్ర తెగ మాట్లాడే వాగుడు కాయల సిండ్రోమ్ గురించి,  అన్ని పాత్రలకి రచయితే తన గొంతుని ఇవ్వడం గురించి, మరీ చెక్కినట్లు ఉండే వాక్యాల గురించి, అంతరార్థం లేని వాక్యాల గురించి చెప్పాను.  ఈ భాగంలో మరో విషయం చెప్పి, సంభాషణల గురించి రాస్తున్న భాగాన్ని ముగిస్తాను.

మీరు ఏదో ఒక నవలో, కథో చదువుతున్నారు. అందులో ఒక డైలాగ్ చదువుతారు. ఆ డైలాగ్ ఏ పాత్ర మాట్లాడిందో మీకు అర్థమైపోతుంది. ఎలా? పాఠకులకి ఏ డైలాగ్ ఎవరు చెప్పారో అర్థమయ్యేలా రచయిత చేసే పనేంటి?

డైలాగులకి తోక తగిలించడం.

ఇదే ఈ పక్షం వ్యాసానికి టాపిక్.

మీరు నాటకాలు చదివే వుంటారు. అందులో స్టేజ్ మీద ఉండే నాలుగు పాత్రలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు సన్నివేశం ఉంటే, ఎవరు ఏ డైలాగ్ చెప్పాలో అర్థమయ్యేలా ముందు పాత్ర పేరు ఆ తరువాత డైలాగ్ రాస్తారు. ఇదిగో ఇలా –

నాగేశ్వరరావు: నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా లేదా? చెప్పు!

శ్రీదేవి: అయ్యో! అంత మాట అనకండి. ప్రేమించాను కాబట్టే నా సర్వస్వం మీకు సమర్పించాను.

నాగేశ్వరరావు: నాన్‌సెన్స్. నేను నమ్మను.

శ్రీదేవి: అయ్యో. అలా అనే బదులు నాకు ఇంత విషం ఇవ్వండి. మీకు పుణ్యముంటుంది.

ఇలా రాయడం వల్ల ఏ డైలాగ్ నాగేశ్వరరావు చెప్తున్నాడో, ఏ డైలాగ్ శ్రీదేవి చెప్తోందో చదువుతున్న వాళ్లకి సులభంగా అర్థమౌతుంది. అలా అర్థమయ్యేలా రాయకపోతే ఏ డైలాగ్ ఎవరు చెప్పాలో తెలియక నాటకం అభాసుపాలౌతుంది. అందువల్ల ఈ విధానం నాటకాలలో (సినిమా స్క్రిప్ట్‌లో కూడా) వాడతారు. కానీ దాన్ని తీసుకొచ్చి కథల్లో, నవలల్లో చొప్పించడం కొంతమంది చేస్తుంటారు. కథలలో నవలల్లో ఇలాగే పాత్ర పేరు, దానికెదురుగా వాళ్లు చెప్పిన డైలాగ్ రాసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది పెద్ద రచయితలు కూడా చేశారు. కానీ అది సరైన పద్ధతి కాదు. అది నాటకానికి మాత్రమే నప్పే విధానం. దాన్ని తెచ్చి కథల్లో, నవల్లో చొప్పించడం రచయిత బద్దకాన్ని, అనాసక్తతని, కొండకచో చేతకానితనాన్ని చూపిస్తుందే తప్ప అది సహజంగ ఉండదు. ప్రయోగంలా అనిపించదు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

మరి ఏ డైలాగ్ ఎవరు చెప్తున్నారో పాఠకులకి తెలిసేలా ఎలా చెయ్యాలి?

ఐదు రకాలుగా చెయ్యచ్చు. మొదటిది –

  1. పాత్రపేరుని డైలాగ్‌కి తోకలా తగిలించడం

>> “వెళ్దామా” అన్నది దీప.

“సరే పద” అన్నాడు మహేష్.

అప్పటిదాకా వాళ్లిద్దరినే గమనిస్తున్న బెలూన్స్ అమ్మే కుర్రాడు వాళ్ల ముందుకు వచ్చాడు.

“తీసుకోండి సార్. ప్లీజ్” అన్నాడా పిల్లాడు.<<

ఇలా – అన్నది దీప, అన్నాడు మహేష్, అన్నాడా పిల్లాడు – అంటూ ప్రతి డైలాగు చివర ఒక తోక తగిలించడం. దీన్నే డైలాగ్ ట్యాగింగ్ అంటారు. ఇలా పేరు రాసే విధానం ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా సూటిగా ఎవరు మాట్లాడుతున్నాడో చెప్పేస్తుంది. ఇందాక చెప్పిన నాటకం స్క్రిప్ట్‌లో డైలాగ్ ముందు పేరు ఉన్నట్లు ఇక్కడ చివర్లో పేరు ఉంటుంది. అంతే. కానీ ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటి? ప్రతి డైలాగ్‌కి ఇలా ఒక తోక తగిలించుకుంటూ వెళ్తే ఆ రచన చదవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నడక నెమ్మదిస్తుంది. అవన్నీ ఒకెత్తైతే, కేవలం ఎవరు మాట్లాడుతున్నారో తెలియడం కోసం తప్ప, ఈ తోకల వల్లే వచ్చే వేరే ఏ ప్రయోజనం లేదు.

దానివల్ల ప్రయోజనం కలగటం ఏమిటి? మీరు రచన చేస్తున్న కాగితం, వర్డ్ డాకుమెంట్ ఒక రియల్ ఎస్టేట్ భూమి అనుకోండి. దాన్ని వీలైనంత వరకు కొనుక్కున్న వాళ్లకి ఉపయోగపడేలా చెయ్యాలి తప్ప ఆ మూల కొంచం, ఈ మూల కొంచం ఖాళీ వదిలేద్దాం. ఇక్కడ ఎందుకు ఉందో తెలియని ఒక గది కట్టేద్దాం అంటే ఏమౌతుంది? అనవసరంగా వాడిన పదాలు కూడా అలాంటివే – కోట్లు ఖరీదు చేసే స్థలంలో, ఎందుకు పనికొస్తుందో తెలియని గదుల్లాంటివి. అయితే ఈ విధానం అసలు వాడకూడదు అని కాదు. కథ మంచి రసపట్టులో ఉన్నప్పుడు, వేగంగా నడిపించాలని అనుకున్నప్పుడు (ఉదా: థ్రిల్లర్ నవల క్లైమాక్స్) ఇలాంటి సింపుల్ ట్యాగింగ్ బాగా పనిచేస్తుంది.

కాస్త మెరుగైన రెండో విధానం –

  1. క్రియావిశేషణాన్ని జోడించడం

అంటే ఏమిటి? ఒక పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఆ పాత్ర చేస్తున్న పనిని వర్ణించడం. ఉదాహరణలు చూడండి –

>>”రారా! ఇప్పుడేనా రావటం” అన్నాడు చలమయ్య న్యూస్‌పేపర్ పక్కన పెడుతూ.

“నేను వెళ్తున్నాను” అంటూ సూట్‌కేస్‌ని బలంగా లాగిందామె.

“సారీ.. ఇంకెప్పుడూ చెయ్యను” గుండె మీద చెయ్యి వేసుకుని రొప్పుతూ అన్నాడు సలీం.<<

ఈ రకంగా రాయడం వల్ల కలిగే ఉపయోగమేమిటి? ఈ డైలాగ్ కేవలం సంభాషణగానే మిగిలిపోకుండా సన్నివేశంలో భాగమౌతుంది. పై ఉదాహరణలో న్యూస్ పేపర్, సూట్‌కేస్ వంటివి కథలో భాగం అవుతున్నాయి. సలీం పెడుతున్న గస మనకి వినపడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారో చెప్పడంతోబాటు సన్నివేశాన్ని ఇంకొంచెం సజీవంగా చూపించేందుకు ఈ రకం రచన ఉపయోగపడుతుంది. నడక నెమ్మదించకుండా, సహజంగా అనిపించేలా కథని నడిపేందుకు ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది.

  1. భావోద్వేగం వర్ణించడం

మూడో రకం రకం రచనలలో ‘డైలాగ్ ట్యాగింగ్’ చేసినప్పుడు ఆ పాత్ర ఆ డైలాగ్ మాట్లాడిన విధానాన్ని, ముఖ్యంగా ఏ భావోద్వేగ స్థితిలో ఆ డైలాగ్ చెప్పారో దాన్ని వర్ణిస్తారు. కొన్ని ఉదాహరణలు చూడండి –

>> అన్నాడతను సాలోచనగా, ప్రశాంతంగా బదులిచ్చాడు, అంటూ సానుభూతి ప్రకటించాడు, గంభీరంగా పలికాడు, ఆ మాటను సమర్థిస్తూ అన్నాడు.<<

ప్రతి డైలాగు చివర కేవలం “అన్నాడు, అన్నది” అని రాయకుండా ఇలా రాయడం కొంత మెరుగైన పద్ధతి కథలో ఉన్న భావోద్వేగం  (emotion)తో ఈ డైలాగ్ మమేమకమౌతుంది. చదువుతున్నప్పుడే పాఠకులు డైలాగ్‌ని ఏ టోన్‌లో చదవాలో చెప్తూ పాఠకులని కథలో లీనం చేస్తుంది. ఈ విధానంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కింద ఇచ్చిన ఉదాహరణ చూడండి –

>> ఇంట్లోకి వస్తూనే ఆఫీస్ బ్యాగ్ సోఫా మీదకు విసిరేసి, ఏదో అర్జెంట్ పని ఉన్నట్లు నేరుగా కొడుకు దగ్గరకు వెళ్లాడు మోహన్. దగ్గరకి వస్తూనే ఆ పిల్లాడి చెంప పగిలేలా కొట్టాడు. కొడుకు దెబ్బ తట్టుకుని, తేరుకుని ఏదో చెప్పబోయాడు.

“నోర్ముయ్. నోరెత్తావంటే చంపి పారేస్తాను” అన్నాడు మోహన్. <<

పై సన్నివేశంలో మోహన్ చెప్పిన డైలాగ్ చివర “కోపంగా అన్నాడతను” అని కానీ “మండిపడ్డాడు” అని కానీ, “గట్టిగా అరిచాడు” అని కానీ రాయాల్సిన అవసరం ఉండా? మీకు నేను చెప్పకపోయినా మోహన్ కోపంగా అరుస్తున్నాడని మీకు తెలిసిపోయింది కదా? డైలాగ్‌లోనే ఎమోషన్ ఉంటే మళ్లీ ఆ ఎమోషన్‌ని వాచ్యంగా చెప్పడం అవసరమా?

తరచుగా ఎమోషన్‌ని ట్యాగ్‌ చేస్తూ వెళ్తే పాఠకులు ఏమనుకుంటారు? ఏ వాక్యాన్ని ఏ భావోద్వేగంతో చదవాలో, అర్థం చేసుకోవాలో, అనుభూతి చెందాలో రచయిత దగ్గరుండి పాఠకులకి చెప్తున్నట్లు అనిపిస్తుంది. సందర్భం, పదాల ఎంపిక ద్వారా ఆ భావం సహజంగా వ్యక్తమవ్వాలి కానీ, ప్రతి భావోద్వేగాన్ని రచయిత స్వయంగా నియంత్రిస్తున్నట్లు ఉండకూడదు కదా! అలా చేస్తూ వెళ్తే క్రమంగా ఇది పాఠకులకి విసుగు తెప్పిస్తుంది. ఎందుకు? వాళ్లు కథలో లీనమవ్వడానికి బదులు ఎవరో తమను నడిపిస్తున్నట్లు భావిస్తారు. రచయితలు పదే పదే భావాలను వ్యక్తపరిచే ట్యాగ్‌లు, క్రియావిశేషణాల వెయ్యడం మొదలుపెడితే పాఠకుల దృష్టి సంభాషణ నుంచి పక్కకి మళ్లి, ఆ రచన యాంత్రికం అనిపించే ప్రమాదం ఉంది.

  1. భావోద్వేగాన్ని వ్యక్తం చేసే శరీరభాష

మూడు విధానాలు చెప్పాను కదా, ఇక నాలుగులో రకం చెప్తాను వినండి. ఇందులో పాత్ర డైలాగులో ఉండే భావోద్వేగాన్ని వర్ణించే క్రియావిశేషణానికి బదులు శరీరభాష (body language)ని వాడతారు. మాటల మధ్యలో వచ్చే చిన్న విరామాలు/మౌనం, సంజ్ఞలు/సైగలు, శరీర కదలిక మొదలైనవన్నీ ఆ పాత్ర స్వభావాన్ని, ఆ పాత్ర ఉన్న భావోద్వేగ స్థితిని వ్యక్తీకరిస్తాయి. ఉదాహరణలు చూడండి –

>>”ఎంతైనా ఆ అమ్మాయంటే నీకు స్పెషల్ కదా” అన్నాడు విజయ్ కన్ను గీటుతూ.

“ఆరు కోట్లా?” అంటూ నోరు తెరిచి అలాగే నేల మీద కూలబడిపోయాడు సాంబయ్య.

“ఏమైనా సరే. ఈ రోజు తేల్చేస్తాను” రాబర్ట్ అంటుంటే అతని పిడికిళ్లు అప్రయత్నంగా బిగుసుకున్నాయి.<<

ఇంతకు ముందు రెండో రకం అని నేను చెప్పిన క్రియావిశేషణాలకి దీనికి తేడా ఏమిటి?

>>”రారా! ఇప్పుడేనా రావటం” అన్నాడు చలమయ్య న్యూస్‌పేపర్ పక్కన పెడుతూ

దీంట్లో చలమయ్య న్యూస్‌పేపర్ పక్కన పెట్టడానికీ కథకి, ఆ పాత్ర భావోద్వేగ స్థితికి ఎలాంటి సంబంధం లేదు. అది కేవలం ఒక చర్య. అంతే.

>>”ఆరు కోట్లా?” అంటూ నోరు తెరిచి అలాగే నేల మీద కూలబడిపోయాడు సాంబయ్య

దీంట్లో సాంబయ్య నోరు తెరిచి కూలబడిపోవటానికి అతని భావోద్వేగ స్థితికి సంబంధం ఉంది. అది పాఠకులకి వాచ్యంగా చెప్పకుండా అర్థమయ్యేలా చేస్తోంది.

క్రియావిశేషణాలు కథ జరుగుతున్నప్పుడు పాత్రలు చేస్తున్న పనిని మాత్రమే చూపిస్తే, నాలుగో రకంలో చెప్పిన విధానం పాత్ర చేస్తున్న పనిని, భావోద్వేగ స్థితిని, డైలాగ్ చెప్పిన సందర్భాన్ని, కొన్నిసార్లు పాత్ర స్వభావాన్ని కూడా వ్యక్తపరుస్తుంది.

కాకపోతే క్రియవిశేషణాలలాగే ఎక్కువగా వాడితే పాఠకులకు రచయిత మరీ చొచ్చుకుని వచ్చి, ఇప్పుడు నవ్వు, ఇప్పుడు ఏడువు అని చెప్పినట్లు అనిపించి విసుగు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఇప్పటిదాకా మనం చెప్పుకున్న నాలుగు రకాల ట్యాగింగులు ఒకసారి గమనిద్దాం –

>> 1. అన్నాడు దేవేంద్ర.

  1. అన్నాడు దేవేంద్ర ముందుకు నడుస్తూ.
  2. అన్నాడు దేవేంద్ర కోపంగా.
  3. అలా అంటుంటే దేవేంద్ర కళ్లు నిప్పుల్లా ఎరుపెక్కాయి.<<

వీటిల్లో ఏది వాడాలి? ఏది వాడితే మంచిది?

ఈ నాలుగు కాకుండా మరొకటి కూడా ఉంది – ఏదీ వాడకపోవటం. అది కూడా కలిపితే మొత్తం ఐదు. ఈ ఐదింటిలో వేటిని వాడాలి?

ఈ ఐదింటినీ వాడాలి. ఎక్కడ ఏది అవసరమో అక్కడ అది వాడాలి. ఏది ఎంత అవసరమో అంతే వాడాలి.

మరి ఏది ఎంత వాడాలో ఎలా తెలిస్తుంది?

పైన చెప్పిన నాలుగు రకాలను పరిశీలించండి.

“అన్నాడు దేవేంద్ర” – డైలాగ్ ఎవరు చెప్పారో పాఠకులకి కన్‌ఫ్యూజన్ లేకుండా చెప్తోంది.

“అన్నాడు దేవేంద్ర ముందుకు నడుస్తూ” – ఎవరు డైలాగ్ చెప్తున్నారో చెప్తూ కథని, సన్నివేశాన్ని ముందుకు నడుపుతోంది లేదా సన్నివేశాన్ని సహజంగా / సజీవంగా మారుస్తోంది

“అన్నాడు దేవేంద్ర కోపంగా” – ఎవరు డైలాగ్ చెప్తున్నారో చెప్తూ ఆ పాత్ర భావోద్వేగాన్ని చూపిస్తోంది. ఆ సన్నివేశాన్ని ఏ భావోద్వేగం చదవాలో పాఠకులకి చెప్తోంది.

“అని దేవేంద్ర అంటుంటే అతని కళ్లు నిప్పుల్లా ఎరుపెక్కాయి.” – ఎవరు డైలాగ్ చెప్తున్నారో చెప్తూనే పాత్ర భావోద్వేగాన్ని, సన్నివేశం తాలూకు భావోద్వేగాన్ని వాచ్యంగా ఇవ్వకుండా సూచనప్రాయంగా పాఠకులకు అందిస్తోంది.

నాలుగు వాక్యాలూ నాలుగు రకాలుగా ఉపయోగపడుతున్నాయి. మీరు రాస్తున్న కథలో, ఒక సన్నివేశంలో, సంభాషణ రాస్తున్నప్పుడు పైన చెప్పిన వాటిల్లో ఏది సాధించాలనుకుంటున్నారో చూసుకోండి. దానిని బట్టి మీకు అవసరమయ్యే డైలాగ్ ట్యాగ్ ఉపయోగించండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి – అతిగా ట్యాగ్‌లు వాడటం రచయితకు తాను రాసిన సంభాషణపై నమ్మకం లేకపోవడాన్ని కూడా సూచిస్తుంది. బలమైన సంభాషణ ఆ సందర్భపు భావోద్వేగాన్ని మౌనం, లయ, పరోక్ష సూచన, సందర్భం ద్వారా సహజంగా అందించాలి. ట్యాగ్‌లను తగ్గించడం ద్వారా కూడా దీన్ని సాధించవచ్చు. చాలాసార్లు, అసలు ఎటువంటి ట్యాగ్ లేకపోయినా సంభాషణ అద్భుతంగా సాగుతుంది. అదే నేను చెప్పిన ఐదో విధానం. ఇది చదవండి –

>> వృద్ధాశ్రమంలోకి అడుగుపెట్టగానే ఒక రకమైన వాసన అతనిని చుట్టుముట్టింది. అప్పటిదాకా అక్కడికి వెళ్లటానికి ఉన్న అయిష్టత స్థానంలో అసహ్యం వచ్చి చేరింది. నేరుగా అతని తండ్రి ఉండే గదిలోకి నడిచాడు.

ఎనభై ఐదేళ్ల ముసలాయన కొడుకు రావటం చూసి అతి కష్టం మీద మంచం మీదే లేచి కూర్చున్నాడు.

“రమ్మని కబురు చేశారంట” ఇనప కుర్చీని కర్రున శబ్దం చేస్తూ లాగి, దాని మీద కూర్చుంటూ అడిగాడతను.

“వచ్చావా? బాగున్నావా? కోడలు, పిల్లల్లు…”

“నాకంత టైం లేదండీ. ఆఫీస్‌కి వెళ్తూ ఇక్కడ ఆగాను. ప్లీజ్. త్వరగా చెప్పండి”

సమాధానం చెప్పబోతుంటే గొంతుకు ఏదో అడ్డంపడ్డట్లు అనిపించి ఆగిపోయాడాయన. వణుకుతున్న చేతుల్తో స్టీల్ గ్లాస్ అందుకుని, అందులో నీళ్లు పోసుకుని, నెమ్మదిగా తాగాడు. ఈ లోపు రెందు సార్లు “ప్చ్” అంటూ వాచీ వైపు చూసుకుంటున్న కొడుకుని చూసి, సూటిగా విషయం మాట్లాడటం మంచిదని అనుకున్నాడు. గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు.

“అదే.. ఇంటి విషయం. అమ్మేయాలని నిర్ణయించుకున్నావు. అమ్మేసెయ్. నేనేమీ అడ్డం చెప్పను,” అక్కడదాకా చెప్పగానే ఆ ఇంటితో ఉన్న జ్ఞాపకాలు ఆయన్ని చుట్టుముట్టాయి. ఇంటి ముందు ఉండే “దేవీ నిలయం” అనే రాతి పలక కళ్ల ముందు కనపడింది. “కానీ, ఉన్నది ఒక్క ఆడపిల్ల. దానికి కూడా ఏదైనా…”

“ఈ విషయం మీకు కొన్ని వందలసార్లు చెప్పాను. పదివేలు, పట్టు చీర. అంతే” లేచి నిలబడి జేబులో చేతులుపెట్టుకున్నాడతను.

“పాపంరా, దానికి ఇద్దరు ఆడపిల్లలు. అప్పులు. కష్టాలలో ఉంది” కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆయనకి.

“దానికి ఆడపిల్లలు పుట్టడానికి, దాని మొగుడు అప్పు చెయ్యడానికి నేనెందుకు నష్టపోవాలండీ? అయినా అవన్నీ మీకెందుకు? మేమేం చూసుకుంటాం. మీరు ఈ గొడవలన్నీ లేకుండా హాయిగా ఉంటారనే కదండీ ఇక్కడ చేర్చాం. కృష్ణా రామా అనుకుంటూ ఉండక ఎందుకండీ ఇవన్నీ?” అతను ఏదో ప్రశ్న అడిగినట్లు అడిగాడు కానీ సమాధానం గురించి పట్టింపు లేనట్లు గుమ్మం వైపు కదిలాడు. “వస్తానండీ. మీరు ఊరికూరికే పిలవకండి. నాకు కుదిరినప్పుడు నేనే వస్తాను” అంటూ గదిలో నుంచి బయటకి అడుగుపెట్టాడు.<<

ఈ కథలో ఎక్కడా పాత్రల పేర్లు లేవు. వాళ్ల వివరాలు, సంబంధ బాంధవ్యాల వివరాలు ఏవీ వాచ్యంగా లేవు. రకరకాల ట్యాగ్‌లు వాడాను. ప్రత్యేకమైన గొంతు (అండీ, అండీ అని మాట్లాడటం) ఇచ్చాను. వీటన్నింటివల్ల, చదివే పాఠకులకి చాలా తక్కువ కన్‌ఫ్యూజన్ ఉంటుంది.

నేను ఈ మధ్య ఒక యువరచయిత రాసిన నవల చదవటం మొదలుపెట్టాను. ఆ పుస్తకం అంతా సంభాషణలు ఇలా ఉన్నాయి –

>> వద్దంటే నన్ను ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చారు. నా వల్ల కావటంలేదు అందు దీప. మైథిలి నమ్మలేనట్టు చూసింది. అలా అంటే ఎలా? చేరాక కోర్సైతే పూర్తి చెయ్యాలి కదా అంది సుజన నవ్వుతూ. చెయ్యాలని నాకు కూడా తెలుసు కానీ చదవలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆమె. అయ్యో ఎందుకే ఏడుస్తావు అని దగ్గరకు వచ్చి కూర్చోని కన్నీళ్లు తుడిచింది మైథిలి. ఇంకెంతలే రెందు సంవత్సరాలేగా. ఎలాగొలా అవ్వగొట్టేస్తే చాలు తనకి తానే చెప్పుకున్నట్లు జనాంతికంగా చెప్పింది దీప.

ట్యగులు వాడటం వాడకపోవటం పక్కనపెట్టండి. పేరగ్రాఫులు విడగొట్టడం తెలియదు. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాదు. పైన ఇచ్చిన వాక్యాలలో రెండు చోట్ల నేను మోసపోయాను. రెండోసారి ఎక్కడ మోసపోయానో చెప్తాను –

“ఎలాగోలా అవ్వగొట్టేస్తే…” అనే డైలాగ్ ఎవరో స్నేహితురాలు చెప్తోందని అనుకున్నాను. కానీ అది దీప (ప్రధానపాత్ర) డైలాగ్ అని అర్థమవ్వగానే నాకు “ఇది చీటింగ్” అని అరవాలనిపించింది. అంతే, పుస్తకం మూసి పక్కనపెట్టాను. బహుశా మళ్లీ తెరవకపోవచ్చు. (ఆ నవలలో ఉన్న వాక్యాలని అనుసరిస్తూ వేరే వాక్యాలు రాశాను. పుస్తకం పేరు, వివరాలు చెప్పడం ఇష్టంలేక.)

ఇలా జరగకుండా ఉండాలంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే –

బలమైన సంభాషణ అంటే కేవలం మాటల మార్పిడి కాదు. అది గొంతు (Voice), ఉత్కంఠ (Tension), మౌనం (Silence), వ్యక్తిత్వం (Personality), పరిసరాలు (Environment), అంతర్లీనార్థం (Subtext), లయ (Rhythm) — వీటన్నింటినీ వ్యక్తపరిచేందుకు వాడే సాధనం. ఇలాంటివి అన్నీ కలిసిన సంభషణ వల్ల పాఠకులకి “ఈ పాత్రలు సజీవంగా ఉన్నాయి” అని అనిపిస్తుంది. అదే కదా మనకి కావల్సింది?

(మళ్లీ కలిసినప్పుడు ముగింపు)

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు