చాంద్ కవితలు రెండు

నా జీవితంతో పాటూ చుట్టూ ఉన్న జీవితాలను పుస్తకాలుగా చదివే అలవాటు లోనుండి పుట్టిందే నా కవిత్వం

1.

 నిరీక్షణ 

ఎప్పటికైనా కరుగకపోతాయా అని
కొందరు రాళ్లను దాచుకుంటారు
కాగితపు పడవను ప్రేమించి
వాగుల వెంబడి కొట్టుకుపోతారు
రాత్రి గడిచినా మనసు మేల్కొలేదని
గడవని రాత్రి కావాలంటే ఎలా
***
ఇసుకంటిన పాదాలు,
ముసుగేసుకున్న మనసు
కెరటాలను తిరిగొస్తాయి కనుకే నమ్ముతాయి
దాటిపోయిన నీళ్లు దాహం తీర్చలేవు
సెలయేరు పారుతున్నపుడే
జీవితానికి సరిపడా నింపుకోవాలి
దేహాన్ని, దారాన్ని ఒడిసి పట్టుకొని
మనసును గాలిపటంలా ఎగురేయడమే
ప్రేమించడం అనుకుంటే ఎలా?
***
ఒక గొప్ప నిరీక్షణ అమ్మ లాంటిది
పొందుతానని నమ్మింది కనుకే జన్మనిస్తాది.

2.

CONDITIONAL LOVE

ఒక గీత కావాలి
అచ్చం తీరంలాంటిది
కెరటాలు, కౌగిలింతలు, ముద్దులు
అప్పుడప్పుడూ వచ్చి పోవాలి తడిపి పోవాలి
ఉప్పునీటితో నీవు, ఇసుక కుప్పలతో నేను
రెండు ప్రపంచాలు కట్టుకుందాం
నీలోతు నన్ను చూడనివ్వకు
నన్ను మొత్తం నిన్ను ముంచనివ్వను
***
దీపం ఆరిపోతుందనే భయంతో
చేతులతో, పరదాలతో మూసేస్తారు
వెన్నెల, వెలుగు ప్రసరించకుండానే
ఈ రాత్రి, ఏకాంతం, కోరిక  అన్నీ గడిచిపోతాయి
ముద్దాడుకునే దేహాల నడుమ
అనాధ మనసులను చేరదీసేదెవ్వరు?
కాస్త దూరం మంచిదే
ఒకరి కోసం ఇంకొకరు సిలువ మోయనవసరంలేదు
ఒకరి బదులు ఇంకొకరు బ్రతకనవసరమూ లేదు
***
ఆకాశం కూడా గొడుగులా
నీకొకటి నాకొకటి ఉంటే బాగున్ను
చెరో పంజరంలో ఎవరికి వారు
స్వేచ్ఛగా ఊసల మధ్యన ఎగిరేవాళ్ళం
రెండు పాదాల నడుమ కొంత దూరమే కావొచ్చు
కలవాలంటే మాత్రం
అడుగులో అడుగేసేంత ఓపికెక్కడిది
*

కవి మాట:

ఈ రెండు కవితలు రెండు మానసిక భావనలు. నా జీవితంతో పాటూ చుట్టూ ఉన్న జీవితాలను పుస్తకాలుగా చదివే అలవాటు లోనుండి పుట్టిందే నా కవిత్వం
నిరీక్షణ: చాలా వరకు అవసరం లేని చోట ఎక్కువ ఓపిక ఆశ కలిగి ఉంటాము, నిరీక్షించి పొందుకునే విషయాల్లో అసహనముతో మధ్యలో ఆపేస్తాము.  దేనికి నిరీక్షించాలో మనల్ని మనం సరిగా వివేచించు కోవాలి అన్నదే ఈ కవిత.
Conditional love:ఎన్నో జంటల మధ్య ఉన్న privacy అని పేరుతో  దాన్ని సరిగ్గా నిర్వచించుకోలేక పెంచుకునే దూరం ఈ కవిత, సరిహద్దులు గీసుకొని కాపురం చేస్తూ ఉంటారు.  కలిసి ఉండటంలో ఉండే చిన్న చిన్న ఆనందాలు జ్ఞాపకాలు కోల్పోతారు. అదే నన్ను ప్రేరేపించిన అంశం.
Avatar

చాంద్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఒక గొప్ప నిరీక్షణ అమ్మ లాంటిది
  పొందుతానని నమ్మింది కనుకే జన్మనిస్తాది.
  అందుకే చాంద్ కవితలు ఇంత బావుంటాయి 🙂

 • ”ముద్దాడుకొనే దేహాల నడుమ,
  అనాధ మనసులను చేరదీసేదెవ్వరు ?!”

  మనోనేత్రాలకు మాత్రమే గోచరమయ్యే అత్యంత నిఘూఢమైన, హృదయవిదారకమైన సత్యమది…
  ఎంతటి ‘దేహపు కలిలో’ కొట్టకుపోతున్నారో ఈకాలపు Conditional lovers అనేది తెలియచేయటానికి ఇంతకంటే లోతైన వివరణ/పద చిత్రణ వుండదు..
  కవిగారికి శుభాకాంక్షలు, మీ కవిత్వం మరెన్నో ‘రవి కానని’ చోట్లను కానగలదని నమ్మకంతో చెప్పగలను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు