“అనువాదం అంటే కేవలం పదాలను మరొక భాషలోకి మార్చడం కాదు. ఒక భాషలోని రచన (కవిత్వం, నవల, చిన్నకథ, నాటకం, ఆత్మకథ మొదలైనవి) సారం, భాషా సౌందర్యం, సాంస్కృతిక సూక్ష్మవివరాలు, భావోద్వేగాలు, శైలి అన్నీ అలాగే వడపోసి మరొక భాషలోకి తీసుకెళ్లడం”. అని కవిత్వం అంటే ఏమిటో తెలుస్తున్న సమయంలోనే గాలి నాసరరెడ్డి గారి సాంగత్యం వల్ల జపనీయ, చైనీయ అనువాదాలు చదవడం వల్ల, ఆ కవిత్వ సొబగు వల్ల అనువాదం అంటే ఇష్టం ఏర్పడింది.
అనువాదం మూల భాషలో చెప్పిన విషయంలో అర్థాన్ని, భావ సారాన్ని, అభివ్యక్తిని దృష్టిలో వుంచుకొని మూలానికి విధేయంగా యథాతథంగా వుండాలి. అనువాదకుడు తన సొంత పైత్యంతో మూలభాషలో వున్నదాన్ని అనువాదంలో పెంచడమూ, తగ్గించడమూ చేయకూడదు. మూల భాషలో వున్న శైలిని, అభివ్యక్తిని అనుసరించే ప్రయత్నం చేయాలి. వాక్య నిర్మాణాన్ని కూడా ఒక్కోసారి సంక్లిష్టంగా, ఒక్కోసారి సరళంగా అనువదించవచ్చు. కానీ అది అనువాదకుని ప్రజ్ఞ మీదా, విజ్ఞత మీదా ఆధారపడి వుంటుంది. యాసను, మాండలికాలను, నుడికారాన్ని అనువదించేప్పుడు సందర్భానికి తగినట్టుగా, అర్థాన్ని ఆకళింపు చేసుకొని అనువదించాలి. మనం అనువాదం చేసినప్పుడు అది అనువాదంలా అనిపించక, మన సొంతభాషలోదే అనిపించాలి. కృతకమైన పదాలు, మరీ సంక్లిష్ట పదాలు ఉపయోగించకూడదు. వచనానువాదం వేరు, కవిత్వానువాదం వేరు.
వచనం కన్నా కవిత్వ అనువాదం కత్తివాదర మీద విన్యాసం అని నా అనుభవం.
సాంకేతిక/ వైద్య/వైజ్ఞానిక/ విద్యా/కాల్పనిక సంబంధిత వచన అనువాదం కంటే కవిత్వ అనువాదం కష్టమైన, సవాలుగా ఉండే ప్రక్రియ. ఎందుకంటే కవిత్వం కేవలం అర్థం(meaning) మాత్రమే కాదు, అది భావోద్వేగం (emotion), సంగీతం (music), ఊహాచిత్రణ (imagery), లయ (rhythm), ధ్వని (sound), సాంస్కృతికంగా స్వల్ప భేదాలు (cultural nuance) లతో కూడిన ఒక సమగ్ర అనుభవం. మూల భాషలో కవి అనుసరించిన శైలి, భావోద్వగం, వ్యక్తీకరణ, కవిత్వ విలువలు అనువాదకుడు లక్ష్య భాషలో అనుసరించాలి. ఇది అన్ని వేళలా సాధ్యం కాదు. కవిత్వం అనువదించే అనువాదకుడు కవి అయితే ఆ అనువాదం బాగా వస్తుందంటారు. దువ్వూరి రామిరెడ్డి, దాశరథి, శ్రీశ్రీ చేసిన అనువాదాలు, మో, చినవీరభద్రుడు, గాలి నాసరరెడ్డి చేసిన అనువాదాలు దీనికి ఉదాహరణ. కవి హృదయం లేనివారు చేసిన కవిత్వ అనువాదం కొంత పేలవమే. ఇవన్నీ నా స్వానుభవాలే..స్వయంగా అనుభవించినవే..!
కవిత్వ అనువాదంలో కొన్ని ప్రధాన ప్రతిబంధకాలు వున్నాయి:
ఛందస్సు & లయ (Meter & Rhythm): ఇంగ్లీషు వ్యాకరణం, ఉచ్ఛారణ తెలుగులో సులభంగా సరిపోదు. తెలుగు పద్యాల్లో యతి, ప్రాస, గణాలు (త్రిపది, ఆటవెలది మొ.) ఉంటాయి. లయ కాపాడితే అర్థం మారిపోతుంది; అర్థం కాపాడితే లయ పోతుంది. చాలామంది అనువాదకులు లయను వదిలేసి సార రూపంలో చేస్తారు.
ప్రాస & ధ్వని సౌందర్యం (Rhyme & Sound patterns): Rhyme (ప్రాస), alliteration (అనుప్రాస) ఇవి ఒక భాషలో సహజంగా ఉంటాయి కానీ మరొక భాషలో అదే ధ్వనులు, అదే అర్థంతో రావడం చాలా అరుదు. శ్రీశ్రీ కవిత్వంలోని శాబ్దిక సౌందర్యం ఇతర భాషల అనువాదాలకి లొంగదు. శ్రీశ్రీయే స్వయంగా చేసుకున్న తన అనువాదాలలో కొన్ని తన కవితలలో తను కూడా తన కవిత్వంలో ఆ లయ, నడక, స్వరం, పదాలు, శాబ్దికసౌందర్యంతో, సంక్షిప్తీకరణతో, తీవ్రతతో సహా అనువదించలేకపోయాడని నిరూపితమవుతున్నది. ఇది శ్రీశ్రీ కవిత్వంలో పరవళ్ళుగా ప్రవహించే శైలి గల ప్రతి కవితకు వర్తిస్తుంది. మహాప్రస్థానం ( Long March )చూడండి, ప్రతిజ్ఞ ( Now I Vow ) చూడండి, జయభేరి ( Jaya Bheri )చూడండి, దేశ చరిత్రలు ( The March of History ) ఇలా మరికొన్ని..ఆయనకు చాలా పేరు తెచ్చిన కవితలు ‘ కవితా!ఓ కవితా!’ ( To Posey : A Rhapsody ); జగన్నాథుని రథచక్రాలు ( Chariot Wheels of Jagannatha ) ఆంగ్లీకరణ కూడా తెలుగు కవిత ప్రమాణాలు పూర్తిగా అందుకోలేకపోయిందనే చెప్పాలి.
ఆధునిక తెలుగు వచన కవిత్వం (free verse) అనువాదం కొంచెం సులభం, కానీ శాస్త్రీయ పద్యాలు (పోతన, శ్రీనాథుడు) యతి, ప్రాస, లయ, శాబ్దిక సౌందర్యంతో అనువదించడం చాలా కష్టం. ఉదాహరణగా చూస్తే – షేక్‌స్పియర్ సొనెట్ తెలుగులో అనువాదం చేస్తే rhyme + iambic pentameter కాపాడడం కష్టం. అలాగే తెలుగు శతకాలు (వేమన, సుమతి శతకం) ఇంగ్లీషులో అనువాదం చేస్తే ప్రాస, లయ పోతాయి. భావం మాత్రమే మిగులుతుంది. ఒక భాషలోని సామెతలు, జాతీయాలు, ఆచారాలు మరొక భాషకు సరిపడవు.
సాంస్కృతిక & సందర్భ సూక్ష్మతలు (Cultural nuances & context): సామెతలు, జాతీయాలు, మతపరమైన/సాంస్కృతిక చిహ్నాలు. ఇవి ఒక సంస్కృతికి, మరొక సంస్కృతికి సమానంగా వుండవు. అఫ్సర్ Fasting Hymns ఉపవాద పద్యాలుగా అనువాదం చేసేప్పుడు నాకు సూరాలు, జానమాజ్, ఇఫ్తార్, సెహ్రీ, ఫజర్, మొహర్రం, నేకీ, జుమ్మా, ఖిబ్లా, ఈద్గా వంటి ముస్లిం సంస్కృతికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కూలంకషంగా తెలుసుకున్నాకే అనువాదం చేసాను. అందువల్లే మూల కవిత్వ సారం అనువాదంలోకి దిగిందనుకుంటాను.
భావ సారం/ శబ్ద సారం (Sense vs Sound): కవిత్వం యొక్క “ఆత్మ” అంటే భావం మాత్రమే కాదు. ధ్వని, లయ, భావచిత్రణల సమ్మేళనం. Literalగా అనువాదం చేస్తే అర్థం వస్తుంది కానీ “కవిత్వం” పోతుంది . Creative adaptation (స్వేచ్ఛానుసరణ) చేస్తే అర్థం మారిపోతుంది.
అనువాదాలు ఎందుకు చేస్తారనేదానికి సమాధానం ఏమంటే మూలగ్రంధం ఏదొక రూపేణా అనువాదకునికి నచ్చిందని అర్థం. అది తన మూల భాషలో వున్నవారితో పంచుకోవాలన్న కోరిక కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా అనువాదకుడు మూలగ్రంథ కవితో కవిత్వంతో, భావంలో ఏకాత్మను పొందడం కారణం కావచ్చు. అతని మాససిక ఆలోచనలకు, అనువాదకుని ఆలోచనలకు ఏదొక సామ్యం లేదా ఇష్టం వుండవచ్చు. అందువల్లనే అనువాదకుడు అనువాదానికి పూనుకుంటాడు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏమంటే అనువాదంలో ఆత్మ పలకాలంటే అనువాదకుడి కవితాత్మ మూలకవి కవిత్వ ప్రతిభతో ఐక్యం కావడమే. అందుకే రష్యన్ కవి మయకొవస్కే ‘లెనిన్’ కావ్యాన్ని శ్రీశ్రీ అంతే ఉద్వేగంగా, అద్భుతమైన శైలిలో శక్తిమంతంగా అనువదించగలిగాడు. శ్రీశ్రీ కవితాత్మ మయకొవస్కే కవితాత్మతో పూర్తిగా ఏకీభావం పొందిన ఫలితం ఇది. గాలిబ్ గీతాలను అనువదించిన దాశరథిది కూడా ఇదే దారి. గీతాంజలిని అనువదించిన చలం నడచిన దారి కూడా ఇదే. ఉమర్ ఖయాం రుబాయిలకు కూడా అనేక అనువాదాలున్నా దువ్వూరి రామిరెడ్డి ‘పానశాల’ మాత్రం ప్రశస్తి చెందడానికి కారణం కూడా ఇదే..! చినవీరభద్రుడి Walt Whitman కావ్యానువాదం ‘ఆత్మోత్సవ గీతం’ ( Song of Myself), సోలోమన్ గీతాన్ని ‘దివ్య ప్రేమగీతం’ గా అనువదించినపుడు ఆ అనువాదం పరిమళించడానికీ కారణం ఇదే !
అయితే ఒకే కవితను వివిధ రకాలైన అనువాదకులు మూల కవిత్వాన్ని తమ తమ పద్దతులలో అనువాదం చేయడం వల్ల, వాటి ఆధారంగా అనువాదం చేసేవారి తెలుగు అనువాదం కూడా, ఆయా ఆంగ్ల లేదా ఆయా భాషల అనువాదంలోని నాణ్యతను అనుసరించే వుంటుంది. అలాగ అనువాదకుని అనువాద నైపుణ్యం మీద ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు దు ఫు కవిత్వాన్ని చాలా మంది ఇంగ్లిషులోకి అనువదించారు. Kenneth Rexroth, Burton Watson,David Young, Arthur Cooper, Stephen Owen, Vikram Seth, William Hung లాంటి వాళ్ళు అనువదించారు. వీరిలో Rexroth అనువాదం చైనీయ భాషను సరళీకరించి చేసిన అనువాదం అయితే Burton Watson, William Hung లాంటి వాళ్ళవి ప్రామాణిక అనువాదాలు. ఒక్కోసారి అనువాదకులు తృప్తి పడక ఆయా భాషల స్కాలర్స్ సహాయంతో అనువాదం చేసినవి కొల్లలు. ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్, జపనీస్ కవిత్వం మనకు మధ్యమ భాష ఇంగ్లిషుకు వచ్చి, ఆ తర్వాత తెలుగుకి వచ్చిన సందర్భాలే ఎక్కువ. దు ఫును తెలుగు చేసేప్పుడు ఎన్ని గ్రంథాలనో ఈ కారణం చేత చదవాల్సి వచ్చింది. దు ఫు ప్రశక్తి చెందిన కవిత ఏ అనువాదంలో బావుందో తరచి చూసుకోవాల్సి వచ్చింది. తస్లీమా కవితలు అనువాదం చేసినప్పుడు, జపనీయ రాజ ఆస్థాన స్త్రీల కవిత్వం అనువాదం చేసినప్పుడు మాత్రం నేను ఆ కవిత్వానుభూతిలో మునిగిపోయి, అనువాదాలు ఆలస్యంగా చేసాను.
మంచి అనువాదకుడు ముందుగా రచనలో తన అంతరంగాన్ని ఐక్యం చేసుకొని, కవిత్వాన్ని సంపూర్తిగా ఆశ్వాదించి, ఆకళింపు చేసుకొని, భాషావరోధాల్ని దాటుకొని, తన కవిత్వ తేజస్సుని కూడా అనువాదంలో రంగరించినప్పుడు మంచి అనువాదం వెలుగు చూడవచ్చు.
ఆ దారిలో నేను చదువుతున్న కవిత్వం నాలో రసాద్వాన కలిగించి, ఉద్వేగాన్ని కలిగిస్తే, ఆ రచన ఇస్తున్న భావనతో నేను ఏకీభావం పొందితే తప్ప, ఆ అనువాదాన్ని నా సహచరులతో పంచుకోవాడానికి తప్ప అనువాదానికి పూనుకోను. జపనీయ హైకు, తంక; చైనీయ కవిత్వం, పాలస్తీనా కవిత్వం, పర్షియన్ కవిత్వం, పాకిస్తాన్ కవిత్వం, రష్యన్ కవిత్వం ఏదైనా నన్ను కదిలించాకే, తెనిగించడానికి కదులుతాను.
ఈ దారిలో నేను నడవడానికి నా ముందు ఈ దారులలో నడిచి, నన్ను ప్రేరేపించిన నాసరరెడ్డి, చినవీరభద్రుడు, బొల్లోజు బాబా, దీవి సుబ్బారావు, సౌభాగ్య, ముకుంద రామారావు, ఎలనాగ, డా.గీతాంజలి, పద్మప్రియ గారల లాంటి వారికి నా కృతజ్ఞతలు. ప్రోత్సహించిన పత్రికల, అంతర్జాల పత్రికల సంపాదకులకు ధన్యవాదాలు.
నడవవలసిన దారి ఇంకా అనంతంగా వుంది. ఎక్కవలసిన శిఖరాలు దుర్భేద్యంగా వున్నాయి. ఆ పర్వత పాదాల చెంత వుండి ఆయా మహాకవుల, కవయిత్రుల పాదాలకు ప్రణమిల్లుతున్నాను.
*








Good congratulations brother
అనువాదం గురించి నీకున్న అవగాహన ఆలోచనలు బాగా వివరించారు
“అనువాదం యొక్క అసలు సారాన్ని ఎంతో లోతుగా, అనుభవంతో చెప్పిన గొప్ప వ్యాసం.” అభినందనలు అండి💐💐
మీ అనువాదానుభవాలు బాగున్నాయి. అనువాదం అంటే అదో సవాల్ మూల రచనను దృష్టిలో పెట్టుకుని అనువాదాన్ని పరిశీలంగా చదువుతారు పాఠకులు అంతా త్వరగా తృప్తి చెందరు. విమర్శకులు కలం పట్టుకుని డిసెక్షన్ చేస్తారు. అందుకే చాలా మంది అనువాదాల జోలికి పోరు. కొందరు భావానువాదం వదిలేసి వాక్యాలను మాత్రమే అనువాదం చేస్తారు. అనువాదం అత్యంత ఆవశ్యక ప్రక్రియ. ఈ రంగంలో మీరు రాణిస్తునందుకు శుభాకాంక్షలు ముందు ముందు మీరు కథలను కూడా అనువాదం చేయాలని కోరుకుంటున్నాను.
మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, అనువాద మెళకువల గురించి చాలా విషయాలు రాశారు. అందులో ఒక విషయం ఇలా రాశారు: అనువాద మూల భాషలో చెప్పిన విషయంలో అర్ధాన్ని భావసారాన్ని అభివ్యక్తిని దృష్టిలో ఉంచుకొని మూలానికి విధేయంగా యథాతథంగా ఉండాలి. అనువాదకుడు తన సొంత పైత్యంతో మూల భాషలో ఉన్న దాన్ని అనువాదంలో పెంచడమూ, తగ్గించడమూ చేయకూడదు. మూల భాషలో ఉన్న శైలీని, అభి వ్యక్తిని అనుసరించే ప్రయత్నం చేయాలి. అనే విషయం అందరికీ అవసరమే. ప్రస్తుతం అనువాదం చేస్తున్న వారికి, ఔత్సాహికులకు అవసరమే ధన్యవాదాలు సార్ మీకు
adbtamyna anuvada vyasamu.Goud ki abinandanalu
చాలా విషయాలు విశేషాలు చెప్పారు. వినయం సంయమనం మీలోని ప్రత్యేక లక్షణాలు. యువ రచయితలకు మీ రచనలు చేరాలని ఆకాంక్ష. మంచి రచన ప్రచురించిన సారంగ సంపాదకులకు ధన్యవాదాలు
మంచి వ్యాసం. అనువాదం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే వ్యాసం.
శ్రీనివాస్ గౌడ్ గారి వ్యాసాలు , అనువాదాలు, కవితలు కథలు ఇవి తీసుకున్నా అందులోని వాక్యాలకు ఒక ఆగని ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహ వేగం పాఠకులను మరీమరీ చదివేలా చేస్తాయి. ఇపుడు ఇది కూడా అలాగే ఉంది. అనువాదం ప్రాణం పెట్టిచేస్తాడు. ఏ సాహిత్యాన్నైనా మనస్పూర్తిగా హృదయలలోకి అంతర్లీనంగా స్వాగతిస్తారు. అనువాదం గురించి చాలా చక్కగా మంచి సమాచారంతో వివరించారు.అందుకే అంత గొప్ప సాహిత్యం రాయగలుగుతున్నారు. హృదయ పూర్వక ధన్యవాదాలు రచయిత శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి.
అనువాదం అసలుకు మించి పాఠకుడిని హత్తుకునేలా రాయగలగడం మీ ప్రత్యేకత.
మక్కికి మక్కి దించేస్తే పెద్దగా ఆకట్టుకోదు. మీ అనువాదాలు అసలు కవి భావాన్ని చక్కగా హత్తుకునేలా చెబుతాయి. అభినందనలు శ్రీ..