‘ఒక కవిత తన ఆవిర్భావ క్షణంలోనే తనకవసరమైన సందర్భాన్ని, స్థలాన్ని, నిర్మాణాన్ని తానే సృష్టించుకుంటుంది’ అని విశ్లేషించిన సాహితీ విమర్శకుడు, అనువాదకుడు, కవి, కథా రచయిత, నవలా రచయిత వాడపల్లి విజయ భాస్కర రామారావు(వివిబి రామారావు) గురించి ఎంత మందికి తెలుసు?
ఆదివారం ఫిబ్రవరి 1 రాత్రి 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ-యుపి సరిహద్దుల్లోని నోయిడాలో కాలుష్యం దట్టంగా చుట్టుకున్న, చలి దేహంలోకి చొచ్చుకుపోతున్న వేళ ఊపిరి తీసుకోవడానికి అవస్థ పడుతూ కాలం చాలించిన కర్మయోగి వివిబి రామారావు బహుముఖ ప్రజ్ఞాశాలిత్వం గురించి ఎవరు చరిత్ర పుటల్లో నమోదు చేశారు?!
ఆయన ఆధునికుడా, సంప్రదాయవాదా అన్న చర్చతో ఎవరికీ నిమిత్తం ఉండనవసరం లేదు. కథలూ, నవలలూ, కవితలూ రాస్తూనే నచ్చిన రచనలన్నీ అనువాదం చేస్తూ అడిగిన వారికందరికీ అనువాదం చేసి పెడుతూ తనకంటూ గుర్తింపు రావాలని ఏ మాత్రం తహతహపడని నిరాడంబరుడు. పిల్లలూ, మనుమలతోనే సాహచర్యం చేస్తూ వారే నగరానికి వెళితే అక్కడికి వెళ్తూ, ఏ ఇంట్లో ఉండమంటే అక్కడే ఉంటూ సర్దుకుపోతూ అక్కడి నుంచే ప్రపంచ, దేశీయ సాహిత్యాన్ని అవపోశన పట్టిన, నిరంతరం రచిస్తూ కాలం గడిపిన పండితుడు. 1992లో నేను దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత నాకు పరిచయమై, నన్ను ప్రేమగా పలకరించి, హత్తుకున్న మహానుభావులైన తెలుగు వారిలో ఆయన ఒకరు.
ఆంద్రా యూనివర్సిటీలో అర్థశాస్త్రం, ఇంగ్లీషులో రెండు బిఏ డిగ్రీలు పొందిన తర్వాత బనారస్ లోని హిందూ యూనివర్సిటీలో ఇంగ్లీషులో ఎంఏ చేశారు. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో పిహెచ్ డి పొందిన తర్వాత విజయనగరం మహారాజా కాలేజీ విజయనగరంలో 1957 నుంచీ 1995 వరకూ పనిచేశారు. ఫ్రెంచ్ లో డిప్లొమా చేశారు. హైదరాబాద్ లో సిఐఎల్ లోనూ పనిచేశారు. ఆయన గ్రాహమ్ గ్రీన్ పై పిహెచ్ డి చేశారు. పలు యూనివర్సిటీలకు ఆయన సేవలందించారు. వివిబి రామారావు ఎంత పాతకాలం వ్యక్తి? అనుకోవడానికి వీల్లేదు. 1938లో జన్మించి, గురజాడ అప్పారావు బోధించిన కాలేజీలోనే ఆంగ్ల పాఠాలు చెప్పిన రామారావు ఈ దేశంలో జరిగిన అనేక కీలక సామాజిక,సాంస్కృతిక, రాజకీయ ఘట్టాలను చూసిన రామారావు జీవితంలో చాలాకాలం నిత్యయవ్వనుడుగానే ఉండేవారు.
వివిబి రామారావు ఎన్ని పుస్తకాలు, వ్యాసాలు రాశారంటే, ఎన్ని అనువాదాలు చేశారంటే, ఎన్ని వందల వ్యాసాలు రాశారంటే చెప్పలేం. నిరంతరం ఆయన రచిస్తూనే, అనువదిస్తూనే ఉండేవారు. ప్రాచీన సాహిత్యాన్ని ఎంత అభిమానించేవారో, ఆధునిక సాహిత్యాన్నీ అంతే అభిమానించేవారు. ఆయనది ఒక రంగం అంటే చెప్పడం కష్టం. ఆధ్యాతికతలో మునిగితేలుతూనే ఆధునికతను ఆస్వాదించేవారు. కర్ణాటక, హిందుస్తానీసంగీతాన్ని ఏక కాలంలో వింటూ ఆనందించేవారు.
ఆయన అనువదించని ఆధునిక కవి లేరు. ‘వాయిసెస్ ఆన్ ద వింగ్, మోర్ వాయిసెస్ ఆఫ్ ది వింగ్, వైవిడ్ అండ్ వైబ్రంట్’ పేరిట శివారెడ్డి, దేవీప్రియ, అఫ్సర్, విమల, జయప్రభ, యాకూబ్ లాంటి అనేకమంది ఆధునిక కవుల కవితల్ని అనువదించి స్వయంగా ముద్రించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి, కొడవటి గంటి కుటుంబరావు చదువు లను ఇంగ్లీషులో అనువదించిందీ వివిబి రామారావే. కేంద్ర సాహిత్య అకాడమీకి ఉన్నవ మోనోగ్రాఫ్ నూ ఆయన రాసిపెట్టారు. ఆనంద గజపతి రాజు ఆత్మకథను రచించారు.
కవితల్నే కాదు, రీజినల్ లాంగ్వేజ్ ఫిక్షన్ పేరిట తెలుగు కథల గురించీ లోకానికి తెలిపారు. ‘ఇన్ సైట్స్ ఇంటూ లిటరలీ ట్రాన్స్ లేషన్’ పేరిట సాహితీ అనువాద ప్రక్రియ గురించి వివరించారు. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, మలయాళీ, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ, ఉర్దూ, తెలుగు భాషల్లో వచ్చిన 14 ప్రముఖ నవలలను అనువదించారు. అన్ని నవలలూ సమాజంలో దోపిడీని, మానవ సంబంధాలను, గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాలను వివరించేవే. సమకాలీన భారతీయ ఆంగ్ల కథానికలు పేరిట ఇంగ్లీషు కథల్ని తెలుగులో అనువదించారు. మధ్యయుగాల భారతీయసాహిత్యం పై సాహిత్య అకాడమీకోసం ఇంగ్లీషులో పుస్తకం రాశారు.’ఇన్ దేర్ వాయిస్’ పేరిట పెంగ్విన్ వెలువర్చిన సీరీస్ కూడా ఆయన రచించారు. కురుక్షేత్రం, గోత్రనీయం పేరిట అయ్యప్ప ఫణిక్కర్ ప్రసిద్ద కవితల్ని అనువదించారు. లల్లేశ్వరి వాక్కులు, భగత్సింగ్ ఎంపిక చేసిన ప్రసంగాలు, లేఖలు కూడా ఆయన తెలుగువారికి పరిచయం చేశారు. మురళీధర్ గౌడ్ కవితలు, సివి కృష్ణారావు దీర్ఘకవితలనూ అనువదించారు.
అదే సమయంలో తిరుమల తిరుపతి దేవ స్థానం కోసం గరుడ పురాణం లాంటి పురాణ గ్రంథాల్నీ, సౌందర్య లహరి, శివానందలహరి, విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో సుందరాకాండ,దేవీ భాగవతం, దుర్గాశప్తసతి, గురుగీత తదితర గ్రంథాల్నీ అనువదించి పెట్టారు.
డాక్టర్ కథలు, కథల కొలువు, కథల కదంబం, ఇంగువ పేరిట కథలు రచించిన వివిబి బ్రిటిష్ కౌన్సిల్ నిర్వహించిన కథలపోటీలో ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ఇంగ్లీషులో కూడా కథల్ని రాశారు. తపస్వి, స్పర్శ రేఖలు, నీటి కెరటాలు, మగువ మనసులు, గాలిపడగలు, నీటి బుడగలు తదితర నవలలనూ ఆయన రచించారు సీయింగ్ గాడ్ అండ్ అదర్ పోయెమ్స్, టు అవర్ గ్రాండ్ చిల్డ్రన్ పేరిట ఆయన కవితలు వెలువడ్డాయి.
వివిబి రామారావు కవితలు చాలా గాఢంగా, తాత్వికంగా కనిపించినప్పటికీ ఒక్కో సారి సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూసి మండిపడేవారు కూడా.
ఏది వెలుపలో అదే లోపల
నీవు ప్రేమించే వ్యక్తిలో శిశువు ముఖాన్ని చూడు
లోపలికి మాత్రమే చూడు..
అన్న వివిబి రామారావు ప్రపంచం ఏ స్థితికి వచ్చిందో అని అడగకు
నీవు ఏ స్థితికి వచ్చావో గ్రహించు అని చెబుతారు.
ఇజం–స్త్రీవాదం మధ్య ఒక నీడ విరాజిల్లుతుంది.
ఆమెదే ఆ రాజ్యం
కాలం గాయాలను మాన్చదు
అవి ముదురుతాయి మాత్రమే
అన్నీ వ్యర్థమని కాదు వేదన వాస్తవం-
అని రాసిన వివిబి–
పన్ను చెల్లించే ప్రజలను దోచే
ధనిక పాలకుల అనుచరులను పోషించు
పాకేవారు, జారేవారు, ఎక్కేవారు
కంచెలను దాటి, కంచెల కిందుగా
సభలలోకి, కమిటీలలోకి
అలా నెమ్మదిగా చొచ్చుకుపోతారు
అని సమాజంలో వెంపర్లాడేవారిని అవహేళన చేస్తారు.
రోజుకు ఎన్నోసార్లు
నేను దేవుణ్ణి చూస్తాను
రంగురంగుల వస్త్రధారణలో, హాయిగా నవ్వుతూ
భుజాలపై సంచులు, చేతుల్లో నీటి సీసాలు, టిఫిన్ బాక్సులను మోస్తూ
వెలుగుతున్న ఉదయ ముఖాలతో, అడుగుల్లో వసంత ధ్వనులతో రోడ్డును దాటుతూ,
ఆనందంగా కిలకిలలాడే బాతుల్లా, అమాయకంగా–
అని ఆయన స్కూలు పిల్లల గురించి రాశారు.
కాళ్లకింద చప్పుడుచేసే ఆకులు, చల్లని గాలి, అలాగే ఎలుక లేదా ముంగిస జాగ్రత్తగా దూకుతూ పాకుతూ కదలే క్షణిక దృశ్యాలు, పనిమనిషి కలలు, మురికివాడల జీవితాలు, రిక్షాలాగేవాళ్లు, పిల్లలకోసం తాపత్రయపడే తల్లి, ఎవరూ పట్టించుకోని బిచ్చగాళ్లు, రోడ్డుపై నాలుక చాపుతూ పడుకున్న కుక్క ఆయన కవితా వస్తువులు.
భిక్షగాడు నిరాశ్రయ సంచారి
తనని సంపూర్ణంగా అర్పించేవారే ఆయన అర్ధభాగం
శివుడు, ఆయన శక్తి వారినెవరూ వేరు చేయలేరు
అన్న కవిత దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని, ఎవ్వరూ దుఃఖించకూడదని యువతకు సూచిస్తాడు. ఆకాశాన్ని తాకేలా ఎగరడానికి ఆమె పిల్లలకు రెక్కలు ఇచ్చింది అని తల్లి గురించి రాస్తాడు. ఒక నిర్దిష్ట వస్తువును గమనించి, దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ అద్భుతమైన కల్పనతో ఆ వస్తువుతో ఆడుకుంటాడు. ప్రతీకాత్మక పదబంధాలు సృష్టిస్తాడు. అదే వివిబి ప్రత్యేకత.
ఫర్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్ పేరిట ఆయన తన మనుమరాళ్లకే కాదు, ప్రపంచంలోని ఆడపిల్లల గురించీ రాశారు.
నీ చేతిపై గడియారం ఉన్నదని చాలదు
సమయానికి ఉన్న విలువను గ్రహించాలి
దేవుణ్ని ప్రేమించడం, దేవుడికి భయపడడం మాత్రమే సరిపోదు,
తోటి వారికీ సాయం చేయాలి.. అని హితవు చెబుతాడు.
చంపబడటానికి కన్నా మరణించడమే మేలు
శిక్షించబడటానికి కన్నా హత్యకు గురికావడమే మేలు
విస్ఫోటనంలో నశించటానికి కన్నా వీరమరణమే మేలు
శపించబడి, సగం కాలిపోయి మిగలడానికన్నా…
అని రచించిన వివిబి కాల ప్రయాణంలో అవిస్మరణీయమైన వ్యక్తి.
*








మంచి మంచి పరిచయం
ధన్యవాదాలు
రామారావు గారి గురించి,వారి రచనలగురించి బాగా వివరించారు.మీకు కృతజ్ఞతలు
____డా. కె ఎల్వీ ప్రసాద్
హైద్రాబాద్.19
ధన్యవాదాలు ప్రసాద్ గారూ..
మాస్టారు గురించి అద్భుతమైన వ్యాసం రాసిన కృష్ణా రావు గారికి ధన్యవాదాలు. డాక్టర్ రామారావు గారు మాకు ఇంగ్లీష్ మాస్టారు .మంచి జర్నలిస్టు. ఎన్నో వేల రచనలు చేసిన మాస్టారు ఒక విస్మృత రచయిత.
ధన్యవాదాలు బాపూజీ గారూ.
ఆగ్రజ సమానుడు రామారావు కి శ్రద్ధాంజలి
వి వి బి రామారావు గారు లేరన్న విషయం సారంగ ద్వారా తెలిసి చింతిస్తున్నాం. కృష్ణుడు గారి వ్యాసం ఎన్నో విషయాలని చెప్పింది. మేము దిల్లీలో నాలుగు దశాబ్దాలు ఉన్నప్పుడు రామారావు గారు బాగా పరిచయం. నా మొదటి కథల సంపుటిని (లియో సా) ని సమీక్ష చేసి ఇంగ్లీషులో ప్రచురించారు. అలాగే అడిగిన వెంటనే నా కథ “చిప్ప” ని ఇంగ్లీషులోకి అనువదించి ఇచ్చారు. ఈ కథ “Broken Bowl” పేరుతో The Pioneer (Sunday Magazine) జూన్ 17, 2001నాడు లోవచ్చింది. ఈ విధంగా ఎందరికో తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి వేగంగా అనువదించి వాటి వ్యాప్తికి తోడ్పడ్డారు. సరదాగా మాట్లాడుతూ ఎక్కడున్నా దూరంనుండే కనబడే మనిషి – ఎత్తైన మనిషి! సాహిత్యంలోనూ ఎంతో ఎత్తుకి ఎదిగిన తోటి మిత్రుడు ఇక లేడంటే మనసంతా భారంగా ఉంది. వారికి మా శ్రద్దాంజలి.
ధన్యవాదాలు సంపత్ గారూ. ఆయన లాంటి వ్యక్తిని చూడడం ఇక అసాధ్యమేమో…