ఆ పెద్దాయన వదిలేట్టు లేడు. అక్కడికీ ఒకటి రెండు సార్లు తొంగిచూశాను, తెలిసేట్టు. ఊహూ, ఏ మాత్రం ఖాతరు లేదు. పైగా కోపంగా చూశాడు. గంట దాటింది, ఇంకా వదలడే? అబ్బ, ఎంత నెమ్మదో?
నిన్నా మొన్నా దొరకలేదు, ఇవాళ ఎట్లాగైనా దొరికించుకోవాలని తలుపులు తెరవకముందే వెళ్లి కూర్చున్నాను. పిల్లలెవరూ లేరులే, నేనొక్కడినే కదా, అని ధైర్యంగా ఉన్నాను. పెద్దవాళ్లు దుర్మార్గులు, పిల్లల్ని తోసేసి మరీ ముందు దూరిపోతారు. నేనూహించని విధంగా ఆ బట్టతలాయన, పెద్దపెద్ద అడుగులు వేసుకుంటూ, నా కంటె ముందు వెళ్లి దాన్ని అందుకున్నాడు. అప్పటి నా నిరాశను ఏమని చెప్పేది! పైగా, ఇంతసేపు ఈ ఎదురుచూపు ఒకటి, అది కాక, ఇంకోళ్లు కొట్టుకుపోకుండా కాపలా మరొకటి!
‘చందమామ’ దొరకడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా, శాఖా గ్రంథాలయాల్లో. కొడంగల్ లాంటి ‘మారుమూల’, ‘వెనుకబాటు’ ఊళ్లో కూడా అంతే. కొత్త సంచిక వచ్చింతరువాత నాలుగైదు రోజుల పాటు దానికి యమ డిమాండు ఉంటుంది. చందమామ కోసం ఎదురుచూడడం, అది చేతిలోకి వచ్చాక ఆత్రంగా అందులో మునిగిపోవడం. మాయాద్వీపాలూ బేతాళకథలూ భారతకథలూ పిల్లపిశాచాలూ నసీరుద్దీన్‌లతో షికార్లు చేశాక, కలలకు బోలెడు ఇంధనం దొరికినట్టు ఉండేది! అరపేజీ కథ కూడా అద్భుతంగా ఉండేది. కథలు చెప్పి పడుకోబెట్టే అమ్మమ్మలు నాన్నమ్మలూ, వాళ్లతో పాటు చందమామా- చిన్నప్పటి మరోప్రపంచాలు. పచ్చివాస్తవికతలోకి పసితనాలు జారిపోతున్నప్పుడు, నొప్పి తెలియకుండా లోకం చేసే అందమైన లాలింపు, చందమామ!
ఎదురుచూస్తున్నప్పుడు, ఆ శ్రమ తెలియకుండా మనసు మళ్లించుకోవాలి. ఏ కుర్చీలో కూర్చోకుండా చేతిలో ఏ పత్రికా లేకుండా లైబ్రరీలో తచ్చాడడం బాగుండదు. జనం ఎక్కువున్నప్పుడు అసలు బాగుండదు. చందమామ కోసం కాచుకు కూర్చున్నప్పుడు, ఆలోగా అవీ ఇవీ చదవాల్సిందే. బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి వరుసలో ఉంటాయి. కొత్తవి వచ్చినప్పుడు వాటి కోసం కూడా డిమాండ్ బాగానే ఉంటుంది. కానీ, ఏ మాటకు ఆ మాటే, చందమామే ఫస్టు. ఒక్కో సంచికా, ఆ నెల అయ్యే లోగా నాలుగైదుసార్లు చదివేవాడిని. దొరికిన సంచిక ఎప్పటిదైనా మళ్లీ మళ్లీ చదివేవాడిని. తక్కిన వాటికి ఆ రిపీట్ రీడర్ షిప్ ఉండేది కాదు. ఆ తరువాత కాలంలో వచ్చిన ‘బాలజ్యోతి’ బాగానే ఉండేది. కానీ, పిల్లల పత్రికల్లో ఆధునిక జీవిత కథలు కానీ, వైజ్ఞానిక శీర్షికలు కానీ నాకు నచ్చేవి కావు. ఏదో ఒక అచారిత్రక చరిత్రలోకి, అద్భుత పౌరాణిక సన్నివేశాలలోకి, కాల్పనిక కాలంలోకి మోసుకువెళ్లాలి , వాటిలోని అక్షరాలు!
పదేళ్ల వయసు కూడా లేనప్పుడు, ఏలూరులోని పిల్లల లైబ్రరీతో నాకు పరిచయం కలిగింది. బహుశా, అదే నా మొదటి లైబ్రరీ అనుకుంటాను. అందులో పై అంతస్థు కూడా ఉండేదని గుర్తు. మంత్రగత్తెలు, సిండ్రెల్లాలూ, చిక్కుడుతీగ మీద స్వర్గానికి ఎగబాకిన అద్భుతాలు, ఒంటికన్ను రాక్షసులూ, అలీబీబాలూ సింద్‌బాద్‌లూ అన్నీ అక్కడే నాకు సచిత్రంగా పరిచయం. అక్కడి రేక్స్ నిండా ఉండే పుస్తకాలను చూసి నిధినిక్షేపాలతో పోల్చుకునేవాడిని కాబోలు. ఏవైనా లెక్కలేనన్ని ఉండడం ఒక బాల్యపు ఆనందాలలో, ఊహలలో ఒకటి. అది గాక, ఏలూరులోనే జిల్లా లైబ్రరీకి వెళ్లి పిల్లల సెక్షన్‌లో కూర్చునేవాడిని. ఎంత బాగుండేవి ఆ చిన్నచిన్న కుర్చీలు, ఆ బొమ్మల పుస్తకాలు? పిల్లలకు ఆశపెట్టినంత అందంగా ఎందుకు ఉండకపోయింది, ఈ ప్రపంచం?
ఊళ్లు మారినా, లైబ్రరీ మాత్రం కొత్తదనం లేని కొనసాగింపుగా ఉండేది. అప్పర్ ప్రైమరీ నుంచి పిల్లల పత్రికలతో పాటు పెద్దవాళ్లవి కూడా తిరగేసేవాడిని. అటువంటివాటిలో ఆంధ్రపత్రిక వీక్లీ కి డిమాండ్ ఎక్కువుండేది. తరువాత జ్యోతి వీక్లీ. ఇదంతా డెభ్బైల సంగతి. పన్నెండు పదమూడేళ్ల పిల్లవాడి సంగతి. అప్పటికీ భూమి, స్వాతి వీక్లీలు రాలేదు. జ్యోతి, యువ, స్వాతి మంత్లీలు లైబ్రరీలన్నిటికి వచ్చేవి. బాపినీడు ‘విజయ’ ఇంకా మొదలు కాలేదు. తీరికైన సమయం ఉంటే, ఇంకే అభిమానపత్రికా లేకపోతే, ఈ లావుపాటి మంత్లీలు, ఒక పూటంతా ఎడతెగకుండా ఎంగేజ్ చేసేవి.
లైబ్రరీలు, రీడింగ్ రూమ్‌లు ఒక ప్రత్యేక అమరికతో ఉంటాయి. వాటి జాగ్రఫీ వేరు. ప్రవేశించగానే ఉండే టేబుళ్లలో మొదటగా, ముఖ్యంగా కనిపించేదాని మీద దినపత్రికలు ఉంటాయి. దాని వెనుకనో పక్కనో ఉండే టేబుల్ మీద పీరియాడికల్స్ ఉంటాయి. కొంచెం వెనుకతట్టుగా ఉండే సీట్ల దగ్గర, చిన్న చిన్న పత్రికలు, మేగజైన్లు ఉంటాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లైబ్రరీలు పొద్దునా, సాయంత్రమూ తెరచి ఉంటాయి. దినపత్రికల టేబుల్ దగ్గర పొద్దుటి పూట ఎక్కువ రద్దీ ఉండేది. తిరగేస్తున్నప్పుడు వినిపించే పెళపెళలు లైబ్రరీలో ఒక నేపథ్యసంగీతం. ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు ఉండే వేళల్లో మేగజైన్లకు అంత గిరాకీ ఉండదు. పిల్లలకు పొద్దున ఎక్కడ కుదురుతుంది? అప్పుడప్పుడే బాల్యం నుంచి ఎడమవుతున్న ఎర్లీ టీన్స్‌కు , పెద్దల మేగజైన్లు దొరకడం కష్టంగా ఉండేది.
ఆ నెల చందమామా చదివేసీ, బాలమిత్రా బొమ్మరిల్లూ లాగించేసి, వీక్లీలు కూడా తిరగేసి ( వారపత్రికల కథలు చదివేవాడిని కాదు, కార్టూన్లు, సినిమాబొమ్మలూ.. అంతే) ఇంకేం చేయాలో తెలియనప్పుడు, అడుగూబొడుగూ పత్రికలను అందుకునేవాడిని. యువజన, ప్రగతి అనే కమ్యూనిస్టు పత్రికలు లైబ్రరీలకు వచ్చేవి. జగతి అనే పత్రిక అన్ని వూళ్లలోనూ లైబ్రరీలలో కనిపించేది. అందులోని విషయం ఆ వయసులో కొంత ఇష్టంగాను, కొంత విసుగుగాను ఉండేది. దాని నడిపిన వారి గురించి, ఆ పత్రిక గురించి తరువాత కాలంలో కలిగిన జ్ఞానోదయం వేరు. అప్పట్లో మాత్రం దాన్నీ, ‘విజ్‌డమ్’ అనే మరో పత్రిక వచ్చేది- దాన్నీ ఒకేరకంగా చూసేవాడిని. చదవకుండా మాత్రం వదిలేవాడిని కాదు. ఒక్కోసారి అన్నీ అయిపోయాక, ‘యోజన’ పత్రిక కూడా, చదివేవాడినంటే ఇప్పుడు నాకే ఆశ్చర్యం కలుగుతుంది!
లైబ్రరీ ఒక అలవాటు అయినతరువాత, అక్కడ పుస్తకసీమల్లో భౌతికంగా సంచరించడమే ముఖ్యమనిపిస్తుంది, ఏమి చదువుతున్నామని కాక!
ఇంగ్లీషు పత్రికలతో నాకు అట్లాగే పరిచయం అయింది. అటువంటి సమయాల్లోనే దక్కన్ క్రానికల్ పత్రికను నేను ‘చూడడం’ అలవాటు చేసుకున్నాను. ఘంటసాల చనిపోయినవార్త అందులో చిన్న బాక్స్ అయిటమ్ మాత్రమే వేశారని నాకు చాలా బాధ కలిగింది. స్కూలుకు సెలవివ్వలేదని కూడా. తెలుగు డెయిలీలు కూడా చదివేవాడిని కానీ, పెద్ద జ్ఞాపకాలు లేవు. బాబూరావ్ పటేల్ అనే ఆయన నడిపిన ‘మదర్ ఇండియా’ అనే పత్రికా, కరంజియా నడిపిన ‘బ్లిట్జ్’ పత్రికా, దానితో పోటీ పడిన ‘కరెంట్’ పత్రికా నాకు చిన్నతనంలోనే పరిచయం అయ్యాయి. బొమ్మలు చూసేవాడినో, ఏవైనా చదివేవాడినో నాకు గుర్తు లేదు.
పిల్లల లైబ్రరీలయినా, పెద్దలవయినా, రీడింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చుని చదువుకోవడం వేరు. ఇంటికి తీసుకువెళ్లగలిగే వెసులుబాటుతో పుస్తకాలను వెదుక్కోవడం వేరు. అప్పుడు ‘డీప్’ లైబ్రరీలోకి ప్రవేశం లభిస్తుంది. ఇల్లు లైబ్రరీకి ఎక్స్‌టెన్షన్ అవుతుంది. లైబ్రరీల గర్భగుడులలో సన్నటి వరుస పుస్తకవీధుల్లో నడుస్తుంటే, దీపశిఖల్లాగ మన ముఖాలు వెలిగిపోతాయి! పుస్తకాల పరిమళాల తారతమ్యం అప్పుడప్పుడే అర్థమవుతూ ఉంటుంది. తన మీద నుంచి అక్షరాలను తడుపుకుంటూ వెళ్లిన కాలాన్ని కాగితం గుప్పుమంటూ ఉంటుంది. అచ్చులారని పుస్తకం ఏదో మందువాసన కొడుతుంటుంది. రంగురాళ్ల మధ్య ఒక వజ్రం తళుక్కుమంటుంది. మళ్లీ దొరకదేమో అనుకుని, ఆత్రంగా, చూసి రాసేసుకునే పుస్తకాలుంటాయి. . మనం చదివేవరకూ మరెవరికీ దొరకకూడదని పుస్తకాన్ని మరొక సబ్జక్టు అరల వరుసలో దాచిపెట్టిన సందర్భాలుంటాయి. ఒక్కోసారి, ఒక మారుమూల బ్రాంచి లైబ్రరీలో తలదాచుకున్న ఆణిముత్యాలు కొన్ని మనకు పట్టుబడతాయి. సెంట్రల్ లైబ్రరీలో కనిపించిన పాతపుస్తకపు పెళుసు కాగితం మీద మనకు ఇష్టమైన రచయిత సంతకం ఉంటుంది.
ఇక, యూనివర్సిటీల లైబ్రరీలు గంభీరంగా, చిమ్మచీకటి కీకారణ్యంలాగా దట్టంగా ఉంటాయి. గుబురుగడ్డాల భావిమేధావులు, నిలువుజీతంతోనే పుస్తకాలను పూర్తి చేస్తారు. ఒక చదువరికి కావలసిన పుస్తకం అనేక నిరీక్షణల వెనుక దాక్కుని ఉంటుంది. పరామర్శ విభాగంలో, ఒంటరిగా సత్యం బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. తర్కమో హేతువో ఫిలాసఫీయో నచ్చక, ఒకడు పుస్తకాలు తగులబెట్టి, లైబ్రరీకి ధూపం వేస్తాడు. గ్రంథసాంగులు కొందరు జ్ఞానాన్ని హోర్డింగు చేస్తుంటారు. మరికొందరు, పుస్తకాల గుప్తధనాన్ని ప్రజలపరం చేద్దామని ఆబిడ్స్ కు తరలిస్తారు.
గౌతమీ గ్రంథాలయాలూ భాషానిలయాలూ మానవమేధల, ప్రయత్నాల చెరగని చిహ్నల వలె అనిపిస్తాయి. మానవస్పర్శ కోసం ఎదురుచూస్తున్న శిలాజాల వలె, ఏ రాళ్ల సందునో చిక్కుబడి ఎగిసే జలధార వలె అక్కడి అక్షరాలు మనల్ని పలకరిస్తాయి.
పిదపకాలమనీ, సమాజం చెడిపోయిందనీ చెప్పను, పిల్లలూ పెద్దలూ తమ ఉత్సుకతలను తీర్చుకునే పద్ధతులు, మరో ప్రపంచాల భావనలు కొత్త సాధనాలను ఆశ్రయించుకుని ఉండవచ్చును. కానీ, ఊహలకు రెక్కలు తొడిగి, మంచిచెడుల లోకంలో నెగ్గుకురాగల ఆశలనిచ్చే చందమామలు మాత్రం ఇప్పుడు లేవు. మిగిలి ఉన్న లైబ్రరీలు మాత్రం మునుపటిలా లేనే లేవు. ఎక్కడా అలనాటి ఆనవాళ్లే లేవు. ‘పనికి మాలినవని’ అనుకుంటున్న పుస్తకాలన్నీ అటకలెక్కితే, ఇప్పుడు అరలన్నీ జనరల్ నాలెజ్‌తో కిక్కిరిసిపోయాయి. ఉద్యోగపరీక్షలకు చదువుకోవడానికి కాసింత ఏకాంత స్థలం లేని యువకులు లైబ్రరీల నీడలో తమ అదృష్టాన్నివెదుక్కుంటున్నారు. మేగజైన్లు పిల్లలవి, పెద్దలవి, మార్కెట్లోనే లేవు, లైబ్రరీలకు ఖర్చు తప్పింది. పుస్తకాలు అడిగేవారే లేరు.
ఈ మధ్య అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ని చూసి, ఆ సమృద్ధికి, వైభవానికి నిస్పృహతో కూడిన వైరాగ్యం తప్ప మరేమీ కలగలేదు. పోనీలెండి, లోకంలో ఇంకా చాలా చోట్ల, గ్రంథాలయాలు నిలబడే ఉన్నాయి. అనేక రూపాల్లో పుస్తకం వెలుగుతూనే ఉంది. ఎవరో ఒకరు రాబోయే పుస్తకానికి, రేపటి అక్షరానికి నిరీక్షిస్తున్నారు. అన్నిటికి మించి ఒక కుతూహలం, ఒక శోధన, ఒక ఆనందం అక్షరాల చుట్టూ ఇంకా మిగిలి ఉన్నాయి. మన దగ్గరే అబద్ధాన్ని అధికారభాషగా ప్రకటించి, ప్రశ్నను ప్రవాసం పంపించారు. సరస్వతిని పూజిస్తూ, అక్షరాన్ని ద్వేషిస్తున్నారు. ఆ రకంగా, జ్ఞానసమాజాన్ని నిర్మించే పనిలో తలమునకలై ఉంటున్నారు.
దశాబ్దాల చందమామ కథల సంపుటాలను గుండుగుత్తగా డిజిటల్ రూపంలో రెండువందల యాభైరూపాయలకు అందిస్తున్నారని ప్రకటన చూసి, బాధ వేసింది. నా చిన్నప్పటి అనేక చందమామల వెన్నెల మసకబారినట్టు అనిపించింది. ఇంత అవలీలగా దొరికే ఆనందానికి ఏమి గౌరవం ఉంటుందని బాధ కలిగింది. అందుబాటులోకి వస్తాయి నిజమే, కానీ అందుకునే మనసుందా? ఆ తహతహ ఉందా?
*
Add comment