1
ఎక్కడ మొదలెట్టాలీ అన్న ప్రశ్న నిలదీస్తోంది నన్ను-
కచ్చితంగా సాయిబాబా జైలు లోంచి బయటికి ప్రపంచంలోకి అడుగు పెట్టిన రోజున చదవడం పూర్తిచేశాను ఆయన అనువాదంలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వ అనువాదాలు. చాలా యాదృచ్ఛికంగా జరిగింది ఇది. ఫైజ్ కి నివాళిగా మరో ప్రసిద్ధ కవి ఆఘా షహీద్ అలీ రాసిన కవితతో సాయిబాబా అనువాద సంపుటి ముగిసింది. ఆ కవిత చదివి, ఆ అశాంతిని నిలవరించుకోవడం కష్టంగా అనిపించి, కాసేపలా బయటి గాలి పీల్చుకుందామని గదిలోంచి బయటపడ్డాను.
మార్చి 9, శనివారం పొద్దున- మాడిసన్ చలిలో గదిలోనే వుండిపోవాలి నిజానికి! బయట ఎండగా కనిపించినా, అది మోసపు మెరుపే అని తెలుసు.
కానీ, ఫైజ్ ని చదివిన ఉద్వేగం గదిలో వుండనివ్వలేదు. బయటికి అడుగు పెట్టానో లేదో సాయిబాబా విడుదల వార్త నా మొబైల్ ఫోన్లో-
నిద్రపోయే సమయాలో, చదువుకుంటూ రాసుకుంటూ వుండే వేళలో మినహాయిస్తే, వొక గదిలో ఎన్ని గంటలు స్థిమితంగా వుండగలం?! మరీ ఎక్కువసేపు వుంటే వూపిరాడడం కష్టమే అవుతుంది. అందుకే, బయటి గాలి కోసం శరీరమూ మనసూ మెదడూ వొక్కసారిగా ముప్పేట దాడి చేస్తాయి. అలాంటిది- సాయిబాబా పదేళ్లుగా అనుభవిస్తున్న నరకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?! అసలు ఆ నరకం వెనక కుట్రని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిత్యం విద్యార్ధుల మధ్యా, ఉద్యమ జీవుల మధ్యా విరామమెరుగక పనిచేసే ఆచరణవాదికి ఈ జైలు గది ఎలాంటి ప్రపంచం?!
సాయిబాబా అనువాదాలు చదువుతూ ఫైజ్ గురించి ఆలోచిస్తూనే వున్నా. నిజానికి వాళ్ళిద్దరి జైలు జీవితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా. 1951- 55 మధ్య అప్పటి పాకిస్తానీ ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర కేసులో ఫైజ్ జైల్లో వుండాల్సి వచ్చింది. రావల్పిండి కుట్ర కేసుగా ఇది ప్రసిద్ధం. ఫైజ్ లాహోర్ జైలు నుంచి భార్యకి రాసిన ఉత్తరాలు ఈ మధ్యనే అచ్చయ్యాయి. వొక వుత్తరంలో ఆయన అంటారు:
From early morning till late evening one hears nothing but tales of horror and even though one ties shut one’s mind and one’s ears tight against them there is no escape from the horror or tragedy that surrounds one from every side. To be alone and ponder over it all is an unbearable pain and one has conceived a horror of being alone with one’s thoughts. It is difficult to see a path or a light in the gloom but one has to maintain one’s reason and one’s courage and I shall certainly maintain.
అదే స్థితిలో నేను సాయిబాబా గారిని వూహించుకుంటే, కాసేపటి వూహ కూడా అశాంతితో వుడికిపోతుంది. ఆ వుత్తరంలో ఫైజ్ చెప్తున్నాడు – చుట్టూరా అన్ని వైపులా విషాదాలే, అహింసే వినిపిస్తున్నప్పుడు ఆ స్థితిలో మనసుని కుదుటపరచుకోవడం ఎంత కష్టమో! అయినా సరే- one has to maintain one’s reason and one’s courage and I shall certainly maintain- అని వొక వాక్యంలో అంటున్నంత తేలిక కాదు. ఫైజ్ అయినా, వరవర రావు అయినా, సాయిబాబా అయినా అలాంటి మనఃస్థితిని ఎలా దాటుకొచ్చారా అన్నది ఇవాళ మనం నేర్చుకోవాల్సిన జీవన పాఠం. జైలు గదులు వాళ్ళ ప్రపంచాన్ని ఏమాత్రం ఇరుకు చెయ్యలేదనీ, అవి మరింత విశాలమై, కొత్త రెక్కల్ని కట్టుకున్నాయని తెలిసినప్పుడు వాళ్ళని బంధించిన ప్రభుత్వాల మీద జాలేస్తుంది.
ఇందాక ఫైజ్ వుత్తరాల్లోని reason/ courage/ maintenance అనే మూడు పదాలు అవి కేవలం పదాలు కాదనీ, వాటి మూలాలు అలాంటి వ్యక్తిత్వాల మూలనదులని తెలిసి, జీవితం కొత్త రెపరెపలతో జెండా ఎగరేసినట్టే అనిపిస్తుంది.
2
సాయిబాబా గారి ఫైజ్ అనువాదాల్లోకి వెళ్ళే ముందు అసలు మన కాలంలో, మన భాషలో ఆ కవి ప్రాసంగికత ఏమిటన్న ప్రశ్న సహజమే! గత నలభయ్యేళ్లుగా తెలుగు సాహిత్యంలో ఫైజ్ ప్రస్తావనలూ, విశ్లేషణలూ గుర్తుకు తెచ్చుకుంటే ఫైజ్ మనకు పరదేశీ కాదనీ, పరభాషీయుడు కూడా కాదని ఇట్టే తెలిసిపోతుంది.
నా మటుకు నాకు వ్యకిగతంగా ఫైజ్ ఎంతో దగ్గిరగా అనిపిస్తాడు. ఈ దగ్గిరతనం నా మాతృభాష వల్ల కాదు, నా సొంత అస్తిత్వం వల్ల అసలే కాదు. నా రాజకీయాల వల్ల అని నిక్కచ్చిగా చెప్తాను. ఫైజ్ అంటే కేవలం కొన్ని భావనల సమ్మేళనమే కాదు. ఫైజ్ భాషా, ప్రతీకలు, పదచిత్రాలు వాటి వెనక వుండే అనుభవాలు మనలో రగిలించే కార్చిచ్చు. ఇది నేను వేణు అనువాదంలో చూశాను, జలజం సత్యనారాయణ గారి అనువాదాల్లో విన్నాను. ఇప్పుడు సాయిబాబా గారి అనువాదంలో వాటి సాంద్రత ఆయనదే అయిన అనుభవ గాఢత వల్ల యింకో మెట్టు పైకి వెళ్ళడం చూస్తూ వింటున్నా.
1984 లో ఫైజ్ కన్ను మూసినప్పుడు ఆంధ్రజ్యోతిలో ఆయనకు నా నివాళి కవిత వెలువడింది. ఆ కవిత ఇలా సాగుతుంది:
అస్తిత్వం రాల్చుకుంటున్న నక్షత్రాల
దీన నేత్రాలలో సన్నగా కదులుతున్న విషాదాన్నీ
రాత్రి శవ పేటిక చుట్టూ ముసురుకున్న నిట్టూర్పులనూ
ఏకాంతం తీరం మీద ఒంటరిగా ఆడుకునే
షెహనాయ్ అనాథ స్వరాన్నీ
దిక్కుల బాహువుల్లోంచి అమాంతం
సూర్యుణ్ణి లాక్కుపోయే
కర్కశ హస్తాలపై నెత్తుటి మరకలనీ
మాసిన చెక్కిళ్లపై కన్నీటి చారికలనీ
విశాలకాశాల ఊహల్లో తేలిపోయే కలల శారికలనీ
పదాల్లో బంధించిన నువ్వు
క్షణక్షణం కనిపిస్తావ్
చిగురాకుల కదలికల్లో
చిరునీటి బిందువుల మెరుపుల్లో-
ప్రతీక్షణం పలకరిస్తావ్
పక్షుల రెక్కల చప్పుళ్ళల్లో
అగ్నిశిఖల స్పర్శల్లో!
అదే సందర్భంలో ఫైజ్ కవిత “స్వాతంత్రం” పేరుతో అనువాదం కూడా చేశాను. ఇవి రెండూ మొదట 1985 లో మొదటి కవిత్వ సంపుటి “ రక్త స్పర్శ”లో వెలువడ్డాయి. ఇదే కవితని 2019 లో మళ్ళీ అనువదించారు. అది ఫైజ్ ప్రసిద్ధమైన కవిత కాబట్టి మరికొన్ని అనువాదాలు కూడా వచ్చే వుంటాయి. అదే కవితకి యింకో అనువాదం సాయిబాబా గారి ఈ సంపుటిలో చదువుతాం. సాయిబాబా గారి అనువాదాల్లో ఇది నాకు బాగా నచ్చింది. చాలా సరళంగా వుంటూనే మూలంలోని సాంద్రతా, భావోద్వేగం పట్టు తప్పకుండా సాధించారు ఆయన.
ఆ చల్లని ఉదయ పవన వీచిక
ఎటు నించి వీచింది ఎటు మటుమాయమయ్యింది?
దారి పక్కన ఉన్న దీపానికి దాని జాడే తెలియలేదు
భారమైన రాత్రి బరువు ఇంకా దిగిపోలేదు
గుండెలు తాకే కన్నుల నింపే ఆ విముక్తి ఘడియలు ఇంకా రాలేదు
రండి పోదాం పదండి ముందుకు
ఆ గమ్యం ఇంకా రాలేదు.
అనువాదం అంటే కేవలం literal translation కాదు. కవితని భిన్నంగా వ్యాఖ్యానించే మరో అవకాశం. ఈ మూడు అనువాదాలూ మనకు అదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తాయి. ఇతర రెండు అనువాదాలని నేను ఇక్కడ వివరంగా ప్రస్తావించడం లేదు. ఎందుకంటే, ఇక్కడ నా వుద్దేశం సాయిబాబా గారి అనువాదాలని పరిచయం చెయ్యడం మాత్రమే కనుక! ఫైజ్ అస్తమయం వెంటనే ఆత్మీయమైన నివాళి రాసిన వేణు 2006 దాకా ఏదో వొక సందర్భంలో ఫైజ్ ని ప్రస్తావిస్తూనే వున్నాడు. 2019 లో జలజం సత్యనారాయణ గారి “ఫైజ్ కవిత్వం” అంతకుముందే వాహెద్ రాసిన “సోషలిష్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్” పుస్తకాలు మరిన్ని వివరాలతో, అనువాదాలతో వెలువడ్డాయి. తెలుగు సాహిత్య లోకంతో ఫైజ్ అనుబంధానికి ఇవన్నీ ప్రతీకలు. ఇదే సంప్రదాయానికి అందమైన కొనసాగింపు- ఇప్పుడు సాయిబాబా గారి అనువాదం.
3
అక్కడక్కడా ఇతరులు చేసిన అనువాదాలకు భిన్నంగా, సాయిబాబా గారి అనువాద సంపుటిలో మొదటి నుంచీ చివర దాకా ఫైజ్ తాత్విక ప్రయాణం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, కవిత్వ అనువాదాన్ని కేవలం కవిత్వానికి పరిమితం చేయకుండా, ఫైజ్ ఎక్కడ మొదలయ్యాడూ ఎటు వెళ్లాడూ ఎక్కడిదాకా వెళ్లాడూ అన్న మూడు ప్రశ్నలకు సమాధానం వెతుక్కునే ప్రయత్నం ఇది. అందుకే, సాయిబాబా సంపుటి 1943 కి ముందు నించీ మొదలవుతుంది. ఈ విధంగా ఫైజ్ ప్రసిద్ధ కవితలు ఎంత ముఖ్యమో, ఇతర కవితలకు కూడా అంతే సమన్యాయం దక్కింది. గత నాలుగు దశాబ్దాల పైబడి ఫైజ్ ని ఆరాధిస్తున్న మాలాంటి వాళ్ళకి ఇది నిజంగా కొత్త చూపు. ఆ క్రమంలో కనీసం అయిదారు దశల్లో ఫైజ్ ని చూసే అవకాశం మనకి దొరుకుతుంది. వొక పరిశోధకుడి నిష్టతో ఆయన ఫైజ్ లోని పరిణామ దశల్ని చూపించారు. మొదటి దశ నుంచి చివరి దశకి చేరుకునే సారికి ఫైజ్ లో వచ్చిన మార్పు, కొత్త ఆలోచనల చేర్పు విస్మయాన్ని కలిగిస్తుంది. వొకే వొక్క జీవిత కాలంలో యింతటి వైవిధ్యం ఎలా సాధ్యపడిందన్న ఆశ్చర్యంతో పాటు- కవిత్వాన్ని కేవలం తపనగా మాత్రమే కాకుండా, తాత్విక వెలుగులో చూడాలనుకునే తరానికి ఈ అనువాద సంపుటి నిజంగా పాఠ్య పుస్తకమే! ఇక్కడ సాయిబాబాలోని అధ్యాపకుడి తాత్వికత కూడా కనిపిస్తుంది.
సాధారణంగా కవిత్వం చదివే పాఠకులు వొక క్రమపద్ధతిలో ఏమీ చదవరు. సమగ్ర కవిత్వం కళ్ల ముందే వున్నా, మనసుకే తెలిసిన వొక ఎంపిక ఏదో వుంటుంది. మహాకవి హఫీజ్ అందుకే దీన్ని ఖురాన్ పఠనంతో పోల్చాడు వొక సందర్భంలో- అంటే ఖురాన్ వరస క్రమంలో వొకసారి చదవడం అయిపోయాక, రోజు వారీ పఠనం సాధారణంగా అలా వుండకపోవచ్చు. తన మనః స్థితిని బట్టి అధ్యాయాల ఎంపిక వుంటుంది. హఫీజ్ దృష్టిలో కవిత్వం కూడా అంతే! కానీ, వొకేసారి చదివే అవకాశం కనీసం వొక్కసారి దొరికిపుచ్చుకుంటారు పాఠకులు. ఇప్పటిదాకా ఫైజ్ కవిత్వాన్ని అట్లా చదివే అవకాశం నా మటుకు నాకు దక్కలేదు. ఆ వెలితిని పూరిస్తున్నారు సాయిబాబా ఇప్పుడు.
బహుశా, ఇన్నేళ్ల ఫైజ్ సాహచర్యంలో ఇప్పుడే మొదటిసారి నేను ఆయన్ని ఆయన తొలి కవితల నుంచి చదవడం మొదలుపెట్టాను. ఇట్లా చదువుతున్నప్పుడు నాకు యింకో ఫైజ్ కనిపిస్తున్నాడు. ఇంతకుముందు ఫైజ్ లో నేను అనేక కోణాలు చూసేవాణ్ణి. ఇప్పుడు చదువుతూ వుంటే, ఆయనలోని రాజకీయ తీవ్రత జెండాలా పూరా విచ్చుకొని ఎగురుతోంది, తన భావకవిత్వ ఆకాశం తెరమరుగైపోయి-
సాయిబాబా ఇదెలా సాధించారన్న చర్చలోకి యిప్పుడు వెళ్ళడం లేదు. చదవడం మొదలుపెడితే నాలానే, పాఠకులకూ ఆ విషయం స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి, అందులోకి వెళ్ళి, మీ పఠనానుభవంలో వుండే తీవ్రతని చోరీ చేయడం నాకిష్టం లేదు. వొక్క మాటలో చెప్పాలంటే, నా అనుభవం మీ అనుభవం కాకపోవచ్చు.
4
అయిదేళ్ళ కిందట సాయిబాబా గారి కవిత్వ సంపుటి “నేను చావుని నిరాకరిస్తున్నాను” వెలువడినప్పుడు మిత్రుడు పాణి వొక మాట రాశారు: “సాయిబాబా తన మూడ్స్ లో దేన్నీ సెన్సార్ చేసుకోలేదు….మనఃస్థితిపైన తార్కికమైన ఎరుక” ఆయనకి వుందని-
ఆ కవిత్వ సంపుటిలో సాయిబాబా వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాల్సిన అనేక సంగతులున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఆయన సూటిదనం, రాజీపడని రాజకీయ దృక్కోణం, వాక్యాల్ని కవిత్వం కోసం తుంచడం కాకుండా- నిజంగా నెత్తుటి సిరాలో ముంచి రాయడం. ఈ చివరి వాక్యం మళ్ళీ ఫైజ్ భాషే!
విషాదమేమిటంటే
నేను చనిపోయేలా ఏం చేయాలో
వాళ్ళకి తెలియడం లేదు
ఎందుకంటే
నాకు మొలకెత్తే గడ్డి సవ్వదులు
చాలా ఇష్టం (2017)
అనే వాక్యం మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు నాకు ఉర్దూ ఫారసీ కవిత్వాల్లోని తీవ్రతా, గాఢతా రెండూ కలిసిపోయి వుద్వేగంగా అనిపించింది.
సాయిబాబా ఫైజ్ తో ఎప్పుడు ప్రేమలో పడ్డారో నాకు తెలీదు. అది మొదటి ఉర్దూ ప్రేమ అవునో కాదో కూడా తెలీదు. కానీ, మొదటి ప్రేమలో వుండే సాంద్రత మనకి సాయిబాబా మూల కవిత్వంలోనూ బలంగా కనిపిస్తుంది. వొక మాట నాకు బాగా నచ్చింది. “సానుభూతి కాదు, సంఘీభావాన్ని నమ్ముతాను,” అన్నారాయన. స్థానిక, జాతీయ భౌగోళిక స్థల కాలాల్లో నిలబడిన వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలీదు కానీ, దూరంగా వున్న నాలాంటి వాడికి దగ్గిరయ్యే ప్రతి విదేశీ స్వరమూ నాదే అనిపిస్తుంది. అందుకే, ఫైజ్ లాగానే ఆఫ్రికా వైపు చూస్తాను. లాటిన్ అమెరికా వైపూ చూస్తాను. అమెరికాలో నిరసనస్వరాల ఆచూకీ కనుక్కొని మరీ అటు పరిగెత్తుతాను. నాలాగానే సాయిబాబా కూడా అనేక విధాలుగా ప్రవాసి.
ఫైజ్ గురించి రాస్తూ Yevgeny Yevtushenko అనే వొక రష్యన్ కవి మరచిపోలేని మాట వొకటి చెప్పాడు. “విరామం అనేది ఫైజ్ జీవితంలో వొక ఫుట్ నోట్ మాత్రమే” అని-
కచ్చితంగా అదే మాట యిప్పుడు నేను సాయిబాబా గురించి కూడా అంటాను. విరామం లేని జీవితం ఆయనది. కోరుకున్నా సరే, కాసింత విరామమివ్వని కుట్రలన్నీ చూసిన జీవితం ఆయనది. అయినా సరే, జీవితాన్ని ప్రేమించకుండా వుండలేని వ్యక్తిత్వం సాయిబాబా. ఆయనే అన్నట్టు-
నాకు నేనే ఒక
సృజనాత్మక పనిని
కల్పించుకుంటాను.
కానీ, జీవితమే సృజనాత్మకం. సృజన అనేది కేవలం సాహిత్య భావన కాదు. అది జీవన భావన. ఆ భావనకి నిండు నిర్వచనమే సాయిబాబా! ఈ అనువాద కానుక ఫుట్ నోట్ కాదు, ఆయన జీవితంలోని విడదీయలేని భాగమే!
- మార్చి 13, 2024









Nice review
Great one
ధన్యజీవులు