వెళ్ళిపో చిట్టి పావురమా!

చెరో గడియారపు ముళ్ళై కాలాన్ని నిర్లిప్తంగా కోసుకుతిందాం. ఏమంటావ్?

కిటికీ ఖాళీ లోంచి ఎప్పుడూ లోపలికి ఎగిరి వచ్చేయడానికే ప్రయత్నిస్తుంటావు. నేను ఎన్ని సార్లు బైటికి తోలేసినా మళ్లీ మళ్లీ కిటికీ అద్దానికి కొట్టుకునే నీ రెక్కల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. లోపలికి వచ్చి ఏం చేద్దామని? అంత విశాలమైన ప్రపంచంలో దొరకనిది ఇక్కడేం దొరుకుతుంది? నిఖార్సైన వేదన కావాలంటే చెప్పు నీకు కూడా ఒక గ్లాసు లో పోస్తా. నా వరకూ, నువ్వు నా రూమ్ కి బయటే ఉన్నావు కాబట్టి నువ్వూ ప్రపంచంలో భాగానివే. ఔటర్ వే.

పావురాల మీద నాకు ద్వేషం ఏమీ లేదు. Personal గా తీసుకోకు, నీకే కాదు లోపలికి ఎవరికీ ప్రవేశం లేదు. ఎందుకో మీరు పాకులాడేవి నాకు నచ్చవు. కొండల్నీ మంచునీ చూసి నేను కళ్ళు విప్పార్చను. నాకు శిధిలమైపోయిన పాత ఇళ్ళంటే ఇష్టం. పిచ్చి మొక్కలు, పాదులు, తుప్పలు, ముళ్ళు పగిలిపోయిన గాజు సీసాలతో నిండిపోయిన గదులు, బీటలు తీసేసి అక్కడక్కడా పెచ్చులూడిపోయిన గోడలు, అద్దాలు పగిలిపోయిన కిటికీలోంచి తీక్షణంగా వచ్చే మధ్యాన్నపుటెండ నన్నూ శాంతపరుస్తాయి. అక్కడ నుంచొని సిగరెట్ వెలిగిస్తే కలిగే సాంత్వన నాకు నయాగరా రద్దీ లో దొరకదు. తాజ్ మహల్ తళతళలు బోరింగ్. ఎప్పుడో విరిగి ఎక్కడో రాలిపోయిన నా హృదయపు ప్రతిబింబం ఆ బూజులో దాక్కున్న విరిగిపోయిన అద్దంలో కనబడుతుందేమో నాకు మరి. చూసావా హృదయం అంటూ ఏదేదో చెప్పేస్తున్నాను. అంతా సుత్తి. బోర్ కొట్టి అలా dramtize చేశా కాసేపు.

అందమైన వాటిపై మీ obsession ఏమిటో కూడా నాకు అర్ధం కాదు. కుక్క పిల్ల దగ్గరనుండి ఫోన్ cover వరకూ ప్రతీదీ అందంగానే ఉండి చావాలి మీకు. చావండి. ఆ షాపింగ్ మాల్స్ లో ఒక స్టోర్ నుండి ఇంకో స్టోర్ కి పరుగెత్తీ పరుగెత్తీ మీలోంచి మీరు బైటికి చెమటలా మొత్తం కారిపోయి, కనబడే ప్రతి వెలుగు జిలుగుల హోర్డింగులోని రంగులన్నీ ఒంట్లో నింపేసుకొని, బుర్ర లేని సెలెబ్రిటీల్ని ఆరాధించండి. మీ మాసిపోయే చర్మాన్ని చూసుకొని పాటలు, కవితలు రాసేసుకోండి. మనీ, పవర్, సెక్స్ అంటూ చిల్లర వాటి వెంట పడి చిల్లర బతుకు బతకండి. నా గదిలో గోడకు సున్నం కూడా వేయలేదు నేను. ఇక్కడికి ఎండ కూడా నా మురికి కిటికీ అద్దంలోంచి వాడకట్టబడి వచ్చి నా పాదాల్ని తాకుతుంది.

అందుకే చెబుతున్నా లోపలికొచ్చే ప్రయత్నాలు మానుకో. ఇక్కడ నిజం ఎప్పుడూ దిగంబరంగానే తిరుగుతుంది. దాని శరీరం ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా. రోజూ దానితో సిగ్గు లేకుండా వ్యభిచారిస్తాను కాబట్టి నాకు తెలుసు. నేనింకా పర్లేదు ఏ విస్కీనో తాగుతున్నప్పుడు నువ్వొస్తే మత్తులోనైనా నీ తల నిమురుతానేమో, ఆమెకు ఆ కనికరం కూడా ఉండదు. ఆ కాటు పడ్డాక కళ్ళు మూసుకొని ఏదైనా నచ్చింది ఊహించుకోమంటే big bang కి పిదప ఉన్న నిర్జీవ నిశ్చలత్వాన్ని మెదడు మొత్తం నింపుకుంటావు. సృష్టి మొదలుపెట్టినందుకు దేవుణ్ణి మౌనంగా ఈసడించుకుంటావు. Nothingness పై మోజు పడ్డాక Scarlett Johannson బట్టలిప్పినా పక్కకి తప్పుకోమంటావు.

వెళ్ళిపో చిట్టి పావురమా. ఇక్కడినుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. ప్రపంచపు అలికిడి, అలజడి ఉన్న చోటికి ఎగిరిపో. ధగ ధగ వెలిగిపోయే నగరపు కాంతుల్లో గాయపు మచ్చలు కూడా మెరుస్తాయి. కంటికి కనబడ్డ రంగులన్నీ గుచ్చేసుకుని రామచిలకవైపో. లేదు, పల్చబడుతున్న సాయంత్రపు ఎండలోని melancholy ని కాఫీ లో కలుపుకు తాగుతానంటే చెప్పు, తలుపు తీస్తా. పచ్చటి లేత ఆకుల్లోని జీవితపు రసం వరం కాదు, అది విశ్వం తలపెట్టిన sadistic endeavor అని ఎందుకన్నానో వినాలనుంటే చెప్పు తలుపు తీస్తా. Arthur Schopenhauer తత్వాన్ని కాగితంపై లేతగా కాల్చి Bela Tarr సినిమాలోకి నంజుకు తింటానంటే చెప్పు, తలుపు తీస్తా.

కానీ వెళ్ళేటప్పుడు వీడుకోలుండవు మరి. ఉన్నంతసేపు నవ్వులు, ముచ్చట్లు కూడా ఏం ఉండవు. సముద్రపు ఒడ్డున కూర్చొని ఇసుకను చేతుల్లోకి తీసుకుంటే అది జారిపోతూ చేతికి చేసే సన్నని రాపిడి ఉంటుంది చూసావా, ఫర్నిచర్ ఏమీ లేని బోసి గదిలో ఒకే ఒక చెక్క కుర్చీ మీద కూర్చొని చేయటానికి ఏ పనీ పెట్టుకోక అలా సూన్యం లోకి చూస్తూ కూర్చుంటే, కాలం కూడా వేళ్ళ లోంచి ఇసుకలా జారిపోవటం గమనించవచ్చు. నా చెక్క కుర్చీకి ఒక చెయ్యి విరిగిపోయింది. ఆ రెండో చేతి మీద నువ్వు కూర్చో. కాలానికున్న indifference కి మూగ సాక్ష్యాలుగా కాసేపు గడుపుదాం. చెరో గడియారపు ముళ్ళై కాలాన్ని నిర్లిప్తంగా కోసుకుతిందాం. ఏమంటావ్?

*

 

స్వరూప్ తోటాడ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు