రంజాన్ బీ దు:ఖం

గొడ్లోచ్చే వేళ్ళ,కన్నతల్లి పేగుతెగిన గాయం జ్ఞాపకాలు మనసు తూర్పార పడుతుంటే గలమలో కూర్చొని శోక ముద్రలో విలపిస్తు౦టది.ఇండ్లు చేరుతున్న పశువులు బాటెంట పోతూ ఆ తల్లి వైపు జాలిగా చూస్తూ దుఃఖ భాష అర్దమై భారంగా కదిలి పోతుంటాయ్.

బిడ్డలు కనపడని దుఃఖం,ఇంటి పెద్ద మనిషి రాని దుఃఖం, తో బుట్టువులు ఎడబాసిన దుఃఖాల్లో పశువులకు కూడా తేడా తెలుస్తుందేమో! మందలోని ఏదో పశువు దుఃఖం కెరలి,పెగుకదిలి ‘అంబా ..’అని గొంతు జత కలుపుతుంటాయ్. అదే ,ఆ సానుభూతి కొరకే రంజాన్ బీ తన ,తను అనుభవించిన బాధనంతా పశువులు ఇండ్లకొచ్చే వేళ్ళ చెప్పు కుంటుంటది. తోటి మనుషులు ఆ దారెంట పొతూ ముఖాలు మాడ్చుకొని, ‘ఈ పీడ ఎప్పుడు విరగడౌద్దిరా బాబు’అని మనస్సులో అనుకుంటూ,పైకి తిట్టుకుంటూనే పోతుంటారు.

రంజాన్ బీకి ఇది ఎన్నో దుఃఖ సాయంత్రమో ?కాలమే లెక్కించాలి.చరిత్రను కాలం రికార్డు చేస్తుంది,చరిత్ర చోరులు అసలు తేదీని చెరిపేసి అబద్దపు నమోదుతో ప్రచారంలో పెడతారు.తేదీ లాగే వాస్తవాలని మరుగుపరచి తమ,తమ వాదాల్ని ప్రచారం చేస్తుంటారు.వాస్తవం,అసలు తేదీ నీడలా కాలం నాల్కపైన మబ్బుల నీడ లెక్కన దొబూచు లాడుతూనె వుంటది .ఇది చరిత్ర ,దుఃఖ చరిత్ర .

రంజాన్ బీ భర్తను ‘రజాకార్’ అని పొట్టన పెట్టుకున్నారు .ఆ దృశ్యం నిత్యం తన కండ్లల్లో పటం కట్టి నిల్చున్నది.

ఎడ్లను ముందు పెట్టుకొని, భుజాన నాగలి ఎత్తుకొని ,ముల్లు గర్రతో ఎడ్లను తోలుకుంటూ,వంటి నిండా బురుద పూసుకొని వస్తున్న ఏ రైతును చూసినా తన భర్త లెక్కనే అగుపిస్తడు రంజాన్ బీకి .ఫసలు,ఫసలు బీరపోకుండా పండీయాలని నిత్యం ఎండల్లో కాగి,వానల్లో తడిసి ,చలి నెగడు కాసి,కాసి వళ్ళు నల్ల బారింది భూమిలెక్క, అదే గ్రామ పెత్తందారులకు కంటగింపుగా మారింది.

సూర్యచంద్రుల కండ్లు కప్పి ఎప్పుడు రాజాకారై౦డో తన భర్త.ధాన్యం బండి ఇంటికి తోల్క వస్తుంటే బండ్ల బాటలోనే నేల కర్పించింన్రు దుష్మన్లు,ఊరిదొర మనుషులు పొట్టన పెట్టుకున్నరు.బండిని ఇంటికి గుంజుకోచ్చిన ఎడ్లనడిగింది ‘అయ్య ఏడ్రా’ అంటే బిక్కమొఖాలు వేసి వచ్చిన బాట వైపు మర్లి చూస్తున్నాయ్ .

నిత్యం మీ ముడ్డి పోడుసుడు ‘హాయ్ ,హాయ్’ అని అల్లిచ్చుడు , మీ పేయి అంతా బురుద గొట్టుకోనుంటే చెర్లకు తోల్కపోయి మిమ్మల్ని శుభ్రంగ కడుగుడు,మీ మెడల్లో రంగు,రంగుల గంటలు కట్టుడు,పోద్దస్తమాను బిడ్డల్లెక్క మిమ్మల్ని చూసుకొని ముర్సిపోయేటోడాయ్ ‘రజాకార్’ ఎప్పుడై౦డ్రా ?అని నిలేస్తే ఆ సూర్యచ౦ద్రులు బిక్కమోఖాలు పెట్టినట్టే రంజాన్ బీ కండ్లల్లో కండ్లు పెట్టి చూడలేక జోడెడ్లు మోరలు నేలకేసి మౌనంగుటాయ్.

‘నవాబులకు పక్కలేసిన దొరలు,భూస్వాముల తొత్తులు పట్వారీల,పోలీసు పటేళ్ళు,దొరల ప్రవేటు సైన్యాలతో, రజాకార్లు(ఖాశీంరజ్వీ సైన్యం)కలిసి గ్రామాల్లో చేసిన ఆగడాలే ఎక్కువ. బిక్కి ,బీద తురుక జనం రజాకార్లు ఎప్పుడై౦డ్రు. రజాకార్ల పేరు చెప్పి ఊల్లల్లొ దొరలు చేసిన హత్యలే ఎక్కువ.తమకి కిట్టని వాళ్ళని రజాకార్ల పేరు అంటగట్టి పేద తురుకోల్లని దొరలు హత్యలు చేయించింన్రు, అట్లనే తన భర్తను పొట్టన పెట్టుకున్నరు’ అంటది రంజాన్ బి.

అప్పటిసంది షురువై౦ది రంజాన్ బి ఏడుపు .

ఆ దుఃఖంలోనే మొగుడు చేయి నుంచి నేలన పడ్డ ముల్లుగర్రను అందుకుంది. ఎవరూ తోడులేకున్నా బిడ్డ భవిషత్తు కోసం నడుంకట్టి మగడితో పాటు కష్టపడ్డ ఎడ్లను అదిలించి చేను బాట నడిచింది. ‘మగన్ని జల్దిగనే మరిచింది’ అన్నారు, జనం ఎత్తిపోడుసుడు, లోకులు కాకులు అనుకుంది .

కాలం గిర్రున తిరిగింది,స్వతంత్రం వచ్చిందన్నారు,నిజాం నవాబు భారత్ లో కల్సిండన్నరు.అటూ,ఇటు ఎందరి మొగుళ్ళు,పిల్లలు సచ్చింన్రో …! మగడి చావును మరవకుండా ప్రతి ఏడు భర్త పేరున ఫాతెహాలు ఇప్పిస్తనే వుంది .ఆడదాని వ్యవసం ఏ మాత్రం తూగుద్ది,నీళ్ళు పారనినేల ,ఆకాశవాయి ఏం పండుద్ది. నాగలి దున్నినంత సేపు సాలు,సాలుకు పోర పోకుండా కొండ్ర దిక్కు చూసినట్టే తలెత్తి ఆకాశం వైపు మబ్బు రాకడకోసం చూసి,చూసి మేడలు వంకర పొయినయ్ తప్ప అవసరమున్నప్పుడు వర్షం వచ్చింది లేదు,భూమి నానింది లేదు.పిల్లగాడు సేతికి అంది వచ్చిండు,బడిలేన్నాడు చేనుకు తోడుగా వచ్చేవాడు ‘వద్దురా’ అన్నా చేయి సాయత చేసేవాడు.

ఒక రోజున అదాటున ‘అమ్మీ , అబ్బా ఎట్లా సచ్చిండు?’అని అడిగిండు .

‘ఇప్పుడెందుకు లేరా ఆ ముచ్చట’ అని దాటేయ పోయింది రంజాన్ బి

‘ఊరి జనం ఏదేదో చెప్పుకుంటున్నరు, నువ్వు చెప్పాల్సిందే’? అని నిలేసిండు .

ఊర్లొ దొరోడు చేసిన అన్యాయాలన్నీ ఏడ్చుకుంట అబ్బాని రజాకార్ అని దొరోని మనుషులతో ఎట్లా చంపించిండో ఎకరువు పెట్టింది .కొడుకు పళ్ళు పట,పటా కొరుకుడు వింతగా విన్నది రంజాన్ బి,వెంటనే భయమేసింది,పోరడిని దెగ్గర కూసోబెట్టుకొని లోకం పోకడ విడమర్చి చెప్పింది. డబ్బూ,రాజకీయం తోడున్న వాళ్ళను బలహీనులైన మనం ఏమీ చేయలేమంది.

అప్పుడు జరుగుతున్న ‘దున్నే వానిదే భూమి’అని నక్సలైట్ పార్టీ దొరలకు,భూస్వాములకు వ్యతిరేకంగా మొదలుపెట్టిన భూపోరాటం ఉద్యమంలో రంజాన్ బి కొడుకు కల్సి పోయుండు,ఉద్యమం ఉదృతంగా సాగింది.దొరల భూములన్నీ ప్రజలు స్వాధీనం చేసుకొని పంచుకొన్నరు.దొరలు పట్నాలకు పారిపోయిండ్రు,మిగిలిన భూములన్నీ బీళ్లుగానే మారినయ్,దొరల గడీలన్నీ చెట్లు మొల్సి,చదలు పట్టి ఆలనా పాలన లేక కూలిపోయి శిదిలాలుగా మిగిలినయ్. ఆ ఉద్యమం మీద ప్రభుత్వం తీవ్రనిర్బందకాండతో, ఎన్కౌంటర్లతో భూపొరాటాలను అణిచివేసింది.

రంజాన్ బి కొడుకు మళ్ళీ ఇంటిపట్టున చేరిండు.అష్టకష్టాలు పడి కొడుకుకు పెళ్ళి చేసింది.ఇద్దరికీ ముగ్గురైంన్రు , నీల్లులేక పంటలు సరిగా పండుతలేవ్.కూలి నాలికి పోయినా జరుగుబాటు ఐతలెదు.బతుకు తెరువు కోసం మండల కేంద్రంలో చిన్నగుడిశేలోనో, పందిరి కిందనో చిన్నపాటి ‘చాయ్’ దుకాణం పెట్టాలని అనుకున్నాడు.పెళ్ళం తోడుంటు౦దని,ఇద్దరు కలిసి పని చేసుకోవచ్చని అదేముచ్చట అమ్మ తో చెప్పిండు,ఏదో పని చేసుకొని బతుకతమంటే తల్లి కాదంటదా?’సరే బిడ్డ’ అంది. ‘చాయ్’తో మొదలెట్టి చిన్న,చిన్నంగా ఇడ్లీ ,దోసెలు,వడలు వేశేనేర్పు కూడా నేర్చుకున్నరు ఇద్దరు ఆలుమగలు.కొన్నాళ్ళకు పందిరేసిన జాగాలోనే ఆ భూమతనితొ మాట్లాడి రెండు కుంటల భూమి కొనుకున్నడు కొడుకు.అందులోనే హోటలుకు చిన్న గుడిసె,దాని వెనక ఇందిరమ్మ ఇంటి పదకం కింద కొద్ది పాటి ఇల్లు కట్టుకున్నడు. భూపోరాటం లో పని చేసినప్పటి సావాసగాళ్ళు,పార్టీ వాళ్ళు చేదోడుగా నిల్చున్నరు. హోటల్ గిరాకి పెరిగి గింది,మంచి టిఫిన్లు,టీ దొరికిద్దని పేరు పడ్డది.జనాలల్లో జాకిరన్న హోటల్,జాకిరన్న హోటల్ అని పేరుపడ్డది. హోటల్, హోటళ్ళ మధ్య పోటీ పెరిగి౦ది.జాకీర్ హోటల్లో చిన్నగ భోజనం అమ్మడం గూడా మొదలు పెట్టిండు.టిఫిన్లు, భోజనం, టీ లల్లో నాణ్యత తగ్గకుండా, మంచి రుచిని తగ్గకుండా చూస్తు౦డు జాకీర్ .నల్గురు పనోళ్ళు, తోడుగా భార్యా,తను. చేతినిండా పని,హోటల్ వ్యాపారం లాభసాటిగా నడుస్తుంది.

ఒక రోజు స్టేషన్ కు రమ్మనమని జాకీర్ కు కబురొచ్చింది.వెంటనే వెళ్ళి ఎస్.ఐ సార్ను కల్సిండు.

‘ ఏంరా,జాకీరు హోటల్లో గొడ్డు కూర వండి అమ్ముతున్నవంట’?అన్నడు ఎస్.ఐ గారు.

‘లేద్సార్, మండలంలోనే కోడి కూర తప్పా మరెకూర దొరకదు సార్,ఒక్క ఆదివారంనాడు మాత్రమే మేకల్ని కోస్తరు ఆ నాడే మటన్ దొరుకిద్ది.ఇక గొడ్లు కోసేటోళ్ళు ఎవరూ లేరుసార్’ అన్నడు వినయంగా.

‘నీ మీద కంప్లైంట్ వచ్చింది,జాగర్తగుండు. దొరికిన్నాడు నీ మక్కెలిరగ తంతాను’ అని వార్నింగ్ ఇచ్చి తోలిండు.

కొత్తగా ఏర్పడ్డ మండలం, మండలం అంటే పెద్ద ఊరేంకాదు.చుట్టుపక్కల నాల్గూర్ల ప్రజలు చిల్లర సరుకులు కొనుక్కునే సెంటర్,నాల్గు కుట్టు మిషన్లు,కూల్ డ్రింక్ షాపులు,గోలీ సోడా షాపులు,రెండో,మూడో లారీలకు,టూవీలర్స్ కు పంచర్లు వేసే షాపులు,రెండో,మూడో బట్టల షాపులు,ఇనప కొట్టు,రెండు బార్బ్ షాపులు,కొత్తగా వెలిసిన బ్యాంకులు, మండలాఫీసు, పోలీస్ స్టేషను.మొత్తం కలిపి ఐదారు వేల జనాభా.ఊర౦తా ఒకదిక్కుగా వుంటది,మైన్రోడ్డు ఆ ఊరికి బైపాస్ రోడ్డు లెక్కన వుంటది.ఆఫీసులన్నీ ఈ రోడ్డుకే దూర,దూరంగా విసిరేసినట్టు అక్కడక్కడ వుంటాయ్. ఈ రోడ్డుకే జాకీర్ హోటల్, మరికొన్ని హోటళ్ళు ఊరికి శోభానిస్తు౦టాయ్.

పగలంతా సందడి,సందడిగా వుంటది.బైపాస్ రోడ్డునే బస్ స్టాప్,బస్సుల్లో వచ్చి పోయే జనాలు,హైవే పైన తిరిగే లారీల తాకిడి ఎక్కువ.రాత్రి పూట లారీల డ్రైవర్లు,క్లీనర్లు జాకీర్ హోటల్ గిరాకి.పగలు ప్రయాణాలు చేసే ప్రయాణికులు, మండలాఫీసుకు, బ్యాంకులకు,ఠానాకు వచ్చి పోయే వారే సందడి.రాత్రి ఏడుగంటలు దాటిందంటే రోడ్డు నిర్మామానిష్యం గా వుంటుంది.

ఎస్.ఐ గారు పిల్సి చెప్పి౦దెగ్గర నుంచి జాకీర్ కి మనసు,మనసులో లేదు.అదే ఆలోచిస్తుండు,హోటల్ కు వచ్చిన తన ప్రెండ్స్ కు చెప్పిండు,పార్టీ వాళ్ళతో చెప్పుకున్నడు. ఏదోలే ‘నిన్ను బెదిరీయడానికి చెప్పుంటడు,నువ్వేం కంగారు పడమాక’ అని అందరూ దైర్నం చెప్పింన్రు .

వారం తిరక్కుండానే గుర్తుతెలియని మూక వచ్చి రాత్రి పూట నిదట్లో వున్న జాకీర్ ను,కడుపుతో వున్న పెళ్ళాన్ని,తమ దెగ్గరే పడుకునే పని వాణ్ణి కొట్టి చంపి హోటల్ ను ,ఇంటిని కాల్చి బూడిదచెసి పొతూ,పొతూ ఈ హోటల్లో గొడ్డు మాంసం వండి అమ్ముతుండు, అందుకే ఇట్లా చేసినం.’అని బోర్డు రాసి పెట్టి పోయింన్రు దుండగులు.తెల్లార్లు కాలుతున్న హోటల్ బూడిదలొ ఆలుమగల,పని వాడి దేహాలు ఇంకా కాలుతూనే ఉన్నాయి.

ఎనభై ఐదేళ్ళ ముసల్ది రంజాన్ బి, బక్కపల్చగా వుంటది,తెల్లటి దుప్పటి వంటినిండా కప్పుకోనుంటది.మగడిచ్చిన రెండెకరాల పొలం జీవితాదారం,మాదిగ పీరడు కౌలుకు చేస్తాడు,కౌలుకు వచ్చిన వడ్లే ఆదారం.తిండికి,మందూ మాకులకు అవే సంవత్సరం పొడుగూత .ఎవరిని చేయిచాచి అడగదు. రొజూ గొడ్లోచ్చేయాల్లకు తన గుడిసె ముందు కూర్చొని తన సొదనంతా చెప్పుకొని ఏడుస్తుంటది. తన బాధనంతా వినే వాళ్లులేక దయా,జాలి,కనికరం చూపే వాల్లెవరూ కనపడక,ఓదార్చె వాళ్ళుకరువై ఒక్కతే గొడ్లోచ్చే వేళ్ళ తన బాధను వెళ్ళదీస్తు౦టది. ఇండ్లకు వెళ్ళే పశువులన్నీ తల లూపుతూనొ ‘అంబా..’అని అరుస్తూనొ ,కుక్కలు స్వరం కలుపుతూనో తమ స్పందన తెలుపుతుంటయ్. పశువులన్నీ ఇండ్లు చేరిపోయాక ముసల్ది రంజాన్ బి తన గుడిసెకు తడక అడ్డం పెట్టుకొని లోనికి దూరిద్ది.మళ్ళీ రేపు గొడ్లోచ్చే వేళ్ళకు గుడిసె నుండి బైటకు వస్తది.తోడు గా ఉండాల్సిన మనిషికి బదులు జీవరాసులన్నీ ఎంతో దయగా పలకరిస్తున్నట్టు చుట్టూ మూగుతుంటాయ్.

అప్పుడప్పుడు మసీదు మౌల్వీసాబ్ వచ్చి పోతుంటడు,దయగల మనిషి .రంజాన్ బి బతికుందో, సచ్చిందేమోనని ఆరా తీస్తుంటడు.సస్తే అవతల గిరాటేద్దామని, బాధ్యత తెల్సిన మనిషి వచ్చి పోతుంటడు.

రంజాన్ బి తనలో తను మాట్లాడుకునే మాటల్లో ఈ కింది వాక్యాలు తప్పకుండా వుంటాయి. “తన భర్త ఏమీ తప్పు చేయనోడు,కొడుకు ఏ తప్పూ ఎరగనోడే ,తనకు బాగా జ్ఞాపకం తనకు తెల్సి చీమకైనా హాని తలపెట్టని జీవితం నాది.వాళ్ళలాగే నెనూ సచ్చిన్నాడు స్వర్గానికే పోతా”అని రంజాన్ బి తనలో తను గొణుకుంటూ వుంటది .

*

హనీఫ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు