ఇదిగో నేనెప్పుడైనా గుర్తొస్తానా,
కనీసం రుతువులు మారినప్పుడో
ఎండాకాలం బాగా ఉక్కపోసినపుడో
చలికి వేళ్ళన్ని బిగుసుకు పోయినపుడో
వర్షంలో బాగా తడిసినపుడో
బోజనం చేస్తూ పొలమారినప్పుడో
ఎపుడైనా నీకు జ్ఞాపకమొస్తానా,
ఆకలేస్తే తినడం
ఎంత సహజమో
నిన్ను ప్రేమించడం తప్ప
మరొకటి తెలీని ఆ కాలం
మళ్ళీ నా జీవితంలోకి
ఎప్పటికీ రాదని తెలుసు.
ముప్పై వసంతకాలాలు గడిచిపోయాక
నువ్వు,నేనూ
కలిసి పెరిగిన ఊరూ, ఆ తోటలు,
ఆ పచ్చిక బీళ్లు ఆ చిట్టడవి
అన్నీ రూపుమారి పోయుంటాయి మనలాగే.
మనం ఇప్పుడు
ఒకరికొకరం ఎదురుపడినా
బహుశా గుర్తుపట్టగలమో లేదో
కాని ఒకటైతే చెప్పగలను.
నేను నిద్రలో కలవరించినపుడో
నేను వెచ్చని కాఫీ తాగుతున్నపుడో
నేను ప్రభాత కిరణాలను ఆస్వాదిస్తుపుడో
అపర్ణాహవేళలో ఒక అతిథిలా
నడి వేసవిలో తొలకరిలాగా
నువ్వు గుర్తొస్తూనే ఉంటావు.
అదిగో అప్పుడే
మంటలు వెదజల్లే వేసవి కూడా
వసంతకాలం అవుతుంది.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
nice
Thank you sir
అమలిన ప్రేమ
Thank you ma’am