మా చిన్న నాటి మా అమ్మమ్మ

మా ఇద్దరికీ ఇప్పటికీ తేలని ఒక విషయం ఉంది.  అమ్మమ్మ మా ఇద్దరిలో ఎవర్ని ఎక్కువ ప్రేమిస్తుంది అనేది. 

హ తెలిసిన తరువాత అమ్మమ్మ తొలి జ్ఞాపకం ఢిల్లీలోని ‘మోటీ ఆంటీ’ ఇంట్లో.  అది చిన్న అద్దిల్లు.  చీకటి గదులు. అమ్మమ్మ కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీలో హాస్టల్ మాట్రిన్ గా పని చేస్తున్న రోజులవి.  చిన్నీ(అనురాధ), నేనూ ఐదారేళ్ళ బుడతలం.  గులాబి రంగు కుంకుమ బొట్టు, పొందికగా కట్టిన సాదాసీదా నేత చీరలో అమ్మమ్మ రూపు బాగా గుర్తు. ఒళ్లో కూర్చుంటే వెచ్చగా, మెత్తగా ఉండేది.  ఉన్న చీరలు నాలుగో ఐదో అయినా వాటిలో అమ్మమ్మ ఎంత అందంగా, హుందాగా  ఉండేదో.  తన చిన్న ట్రంకుపెట్లో ఒద్దికగా  సర్దుకున్న చీరల మడతల మధ్య మొగలి రేకలు కూడా పెట్టేది.  ఓహ్.. ఆ చీరల్ని కట్టుకోగానే గదిలో మొగలిరేకల పరిమళం గుబాళిoచేది.

సెలవల్లో అమ్మమ్మ వచ్చిందంటే పండగే పండగ.  జుట్టు నెరిసిన మా నేస్తం.  అస్మదీయురాలు.  మమ్మల్ని చూడగానే ఆమె మొహం వికసించిపోయేది.  ఎక్కడ లేని చిలిపితనం వచ్చేసేది.  మాతో పాటు అమ్మమ్మ గంతులు చిందులు వేస్తుంటే మాకు సరదాగానూ ఉండేది,  ఆశ్చర్యంగానూ ఉండేది.  మమ్మల్ని కవ్విస్తూ, మా నుండి బోలెడు మాటలు చెప్పించుకుoటూ, మధ్య మధ్యలో ‘చచ్చినాడ’ అని ముద్దు ముద్దుగా తిడుతూ మాతో పాటు తను కూడా చంటిపిల్లయి కేరింతలు కొట్టేది.

వచ్చేటప్పుడు ఏవేవో చిరుతిళ్ళు తెచ్చేది.  బెజవాడ ఇంట్లోని మా నారింజ చెట్టు నుండి కాయలు కోయించి రసం తీసి పట్టుకుని వచ్చేది.  కొబ్బరి కాయలు కోయించి కొన్ని పంచదార పాకం బిళ్ళలు, కొన్ని బెల్లం పాకపు ఉండలు చుట్టి తెచ్చి కొసరి కొసరి పెట్టేది. ఒకసారి బెజవాడ నుండి ఆ విధంగా కష్టపడి సున్నుండలు మోసుకుని వస్తే మేము మా వీధిలో ఉన్న స్నేహితులకు ‘హమారే ఘర్ మే ఇతనే ఇతనే బడే బడే లడ్డు హై’ అని చెప్పి పంచి పారేసామని అమ్మమ్మ గుర్తు చేస్తుంటుంది.  ఈ విషయం కొన్ని వందల సార్లు చెప్పి ఉంటుంది.  చెప్పినప్పుడల్లా అవి మేము తినలేదనే నిస్పృహ తొంగి చూస్తూనే ఉంటుంది.  మా అమ్మమ్మ, నాయనమ్మలు పంపే పిండి వంటల బుట్ట కోసం ఆబగా చూసే రోజులవి.  చిరుతిళ్ళ విషయoలో అంతటి పెద్ద మనసు మేము ఎంచేత ప్రదర్శించామా అనేది ఎంత బుర్ర గోక్కున్నా ఇప్పటికీ అంతు చిక్కదు.

సెలవల్లో అమ్మానాన్న మా ఇద్దర్ని ఎవర్నైనా తోడిచ్చి బెజవాడ పంపేవారు.  మేము ఆ విధంగా వెళ్ళినప్పుడు తను ఒక్కొక్కసారి ఉండేది కాదు. కాకినాడ నుండి తను బెజవాడ వచ్చేసరికి అంజమ్మమ్మ హైరానా పడిపోయేది.  ఆ పసి వయసులో కూడా మాకు ఒకటి అర్ధమయ్యేది.  పాలెంలో మా నాయనమ్మ ఇంటిలో ఉన్నంత సౌఖ్యంగా ఇక్కడ ఉండేది కాదని.  ఇల్లంతా అద్దెకిచ్చి అంజమ్మమ్మ ఒక చిన్న గదిలో ఉండేది.  ఒక సారైతే ఇల్లంతా అద్దెకిచ్చి మా సందులోనున్న కరివేపాకు చెట్టు కింద ఒక చిన్న పాక వేసుకుని అందులో ఉంది.  చిన్నపిల్లలం కదా అదీ ఒక అడ్వెంచర్ లానే ఉండేది. ఎప్పుడో ఒకసారి అనుభవించే లేమి లేదా అసౌకర్యం అడ్వెంచరస్ గానే ఉంటుంది మరి.  కాకినాడ నుండి అమ్మమ్మ వచ్చిందంటే మాత్రం ఆ అసౌకర్యం ఏదీ జ్ఞాపకం ఉండేది కాదు.  పాలెం వెళ్లకపోయినా పర్వాలేదు అనిపించేది. మామిడి చెట్టుకు ఉయ్యాల కట్టించే వారు అమ్మమ్మ, అంజమ్మమ్మ.   కాకినాడ నుండి ఒక కారియర్, కూరగాయల రాములు ఇచ్చిన స్టీల్ డబ్బాల నిండా ఏదొకటి పిండివంటలు తీసుకుని వచ్చేది.  వాసన పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని సువర్ణ రేఖలతో ఆవకాయ పచ్చడి పట్టుకుని వచ్చేది.

ఇక వచ్చీ రాగానే హుషారుగా మా ఆలనా పాలనా కార్యక్రమాల్లో దిగిపోయేది.  వెల్లుల్లి కారం వేసిన బెండకాయ కూర, నెయ్యి వేసి వేడి వేడి అన్నం పెట్టేది.  తను పట్టే ఆవకాయ ఎంత ఎర్రగా ఉన్నా మంట అనిపించదు.  అది ఎలా సాధ్యమో ఇప్పటికీ అంతు చిక్కలేదు మాకు. తన చేతి ముద్దలు ఆ నాటికీ ఈనాటికీ ఇంటిల్లిపాదీ తింటూనే ఉన్నాం. బోలెడు కబుర్లు చెబుతూ ‘చచ్చినాడా, ఇది ఆఖరి ముద్ద’ అని మాయచేసి ముద్దలు పెట్టే అమ్మమ్మ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. కుండెడు సాంబారు ఒక రోజులో అవ్వగొట్టే వాళ్ళం.  ఎవరు తిన్నారు, ఎవరు తినలేదనేది ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉండేది.  తినే వరకూ ఊరుకునేది కాదు. మా ఇంటి ‘ఫుడ్ ఆడిటర్’ మా అమ్మమ్మ.

మా నాన్న డాక్టర్ రమేష్ బాబు చనిపోయిన తరువాత తన ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టి ఢిల్లీలో మమ్మల్ని అంటిపెట్టుకుని ఉండిపోయింది.  అప్పటి వరకూ రెండు జీతాల మీద నడిచే సంసారం ఒక్క అమ్మ జీతంతోనే నడపాలి.  మా ఇంటి ఓనర్ ఖురానా అంకుల్ ఎంత మంచాయన అంటే ‘బెహన్జీ , అద్దె తగ్గించమంటారా’ అని అడిగారు. అమ్మ పూర్తిగా కుప్పకూలిపోయిన రోజులు అవి.  అమ్మమ్మ ఉన్నన్నాళ్ళు ఏ కొదవా లేకుండా ఇల్లు చక్కదిద్దిoది.  ‘మా ఇద్దరి జీతం వచ్చినా అరకొరగానే సరిపోయేది.  ఇప్పుడు ఒక్క జీతం మీద కూడా ఇంత కమ్మగా తినగల్గుతున్నాం అమ్మా’ అని అమ్మ అన్న మాటలు ఇప్పటికీ గుర్తే.

మేము ఉండే లజపత్ నగర్ కాలనీ నిండా కొయ్యతోటకూర కలుపు మొక్కలా పెరిగుండేది.  ఢిల్లీ వాసులకు కొయ్యతోటకూర మహిమ తెలీదు.  అమ్మమ్మ మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్లి కాలనీలోని ఆకులు ఏరుకుని వచ్చి శుభ్రo చేసి వేయించి పెట్టేది.  ఆ తోటకూర వేపుడు తలచుకుంటే ఇప్పటికీ నోరూరుతుంది.  ‘అయ్యో ఇదేమి ఖర్మoడి! రమేష్ గారు పోయిన తరువాత వీళ్ళకి ఇలా వీధులెంట పడి ఆకులూ అలములు ఏరుకునే పరిస్థితి దాపురించిoదని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు’ అని మా పద్మ ఆంటీ మొత్తుకునేవారు.  అయినా అమ్మమ్మ తన వానర సైన్యంతో కలిసి ‘ఆపరేషన్ తోటకూర ప్లకింగ్ ’ చేపట్టేది.  అప్పుడప్పుడు అమ్మ కూడా కలిసేది.  ఆ ప్రమీలా రాజ్యానికి అంతే లేదు.

మేము బెజవాడ నవోదయా కాలనీలో ఝాన్సీ మామ్మ (నవోదయ రామమోహన్ రావు గారి సహచరి) సంరక్షణలోకి వెళ్ళేవరకూ ఢిల్లీకి వచ్చినప్పుడల్లా అమ్మమ్మ మాకు బట్టలు తెచ్చేది.  ‘మా అమ్మమ్మ జరీ లంగా తెచ్చింది’ అంటూ మేము రెండు చేతులతో లంగా పట్టుకుని అటూ ఇటూ ఊపుతూ అందరికీ చూపించే వాళ్ళం.  మా వేషధారణ గురించి అమ్మ తరువాత పట్టించుకున్నది అమ్మమ్మే.  జరీ లంగాలు, పిండి వంటలు తెచ్చి, పక్కలో పడుకోబెట్టుకుని ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కబర్లు చెప్పే అమ్మమ్మ రాక కోసం ఎదురు చూసే వాళ్ళం.  అందరి అమ్మమ్మలు అంతే అయి ఉండొచ్చు.  ఎవరి అమ్మమ్మలు వారికి ముద్దు.  మాకు మా అమ్మమ్మ ముద్దు.

మా ఇద్దరికీ ఇప్పటికీ తేలని ఒక విషయం ఉంది.  అమ్మమ్మ మా ఇద్దరిలో ఎవర్ని ఎక్కువ ప్రేమిస్తుంది అనేది.  మాకు యాభై ఏళ్ళు నిండినా ఈ విషయం అంతు చిక్కలేదు. నూరవ పుట్టినరోజు నాడైనా అమ్మమ్మ బైట పెడుతుందేమో చూద్దాం.  ఇక మా అమ్మ, మావయ్యల మీద తనకున్న మమకారం గురించి చెప్పనవసరం లేదు.  అమ్మా మావయ్యలపై కొందరు అవాకులూ చవాకులూ పేలితే నూరవ సంవత్సరం దగ్గరపడిన తర్వాత కూడా దావా వేయడానికి వెనకాడలేదు. ఇక మా పిల్లల విషయానికి వస్తే, మాకు అన్నీ వలిచి పెట్టినట్లు వాళ్ళకీ పెట్టింది. ఇప్పటికీ మాకు వండిపెడుతూ శరీరంలోనున్న కండని, సమస్త శక్తిని మాకోసం కరిగిస్తోంది.

మా నాన్న పోవడం మాకు జీవితంలో తగిలిన మొదటి దెబ్బ.  అమ్మమ్మకి తగిలిన అనేక దెబ్బల్లో అది ఒక పెద్దదెబ్బ.  మా జీవితాలు ఒక్క సారి చెల్లాచెదురు అయిపోయాయి.  ఆ చెదిరిన జీవితంలో నుండి ఒకర్ని ఒకరం పోల్చుకోవడం, ఓదార్చుకోవడం తెలియలేదు.  కలల్లో, మెలకువలో కూడా చేదు అనుభవాలు తప్ప తీపి జ్ఞాపకాలు గుర్తుకు రాని అమ్మమ్మకు నూరవ వసంతం సందర్భంగానైనా కొన్ని మంచి జ్ఞాపకాలను మూటకట్టి ఇవ్వాలని మా కోరిక.  అందుకే తను ఇష్ట పడే, తనంటే ఇష్టపడే వారిని ఒక దగ్గర చేర్చాలని ఈ  ప్రయత్నం.  నిండైన జీవితం గడిపి మాకు అప్పటికీ ఇప్పటికీ అండగా నిలిచిన అమ్మమ్మకి బోలెడన్ని ముద్దులతో….

                                                                                                                (కె సుధ, చిన్న మనవరాలు)

     

 

కె. సుధ(చుక్కు)

2 comments

Leave a Reply to Devarakonda Subrahmanyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజమే మరచిపోలేని జ్ఞాపకాలు. మీరు అమర్ కొలను లో ఉండేటప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లలోనూ, ఆంధ్ర కూల్ ఏర్పాట్ల విషయాలకోసమూ తరచు మీ ఇంటికి రావడం , మీ ఇంట్లో మీ అమ్మ గారినే కాకా , బాపు గారిని , ఇంకా చాల మందిని కలిసే అవకాశం కలిగింది. నాకు ఢిల్లీ జీవితం లో కలిగిన మంచి స్నేహితుల్లో, రమేష్ బాబు, కరుణ ఒకరు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు