మానవత్వానికి మహా గొప్ప గెలుపు!

తన బాల్య మిత్రుడి శవాన్ని మిగిలి ఉన్న 400 కిలోమీటర్ల దూరాన్ని దాటించి, ఊరిలో వారి తల్లిదండ్రులకు అప్పజెప్పి మానవత్వానికి కులం, మతం లేవని నిరూపించాడు సాయబ్.

21 మే 2025 , ఫ్రాన్స్ లోని టెంపుల్ ఆఫ్ వరల్డ్ సినిమా గా పిలవబడే కేన్స్ నగరం లోని ‘డెబ్యూస్’ థియేటర్.

సినిమా ప్రదర్శన పూర్తి అయ్యింది .

చాలా మంది ప్రేక్షకులు కన్నీరు ఆపుకోలేక పోతున్నారు.

ఆ కన్నీళ్లను వారి వారి కరస్పర్శ ద్వారా స్పృశించిన  వారిలో నిర్మాత “కరణ్ జోహార్” , దర్శకుడు “నీరజ ఘయాన్” , నటీ నటులు  “జాహ్నవి కపూర్” ఇషాన్ ఖాట్టర్,  విశాల్ జేత్వ” లు వున్నారు.

అది కేన్స్ అంతర్జాతీయ సినిమాఉత్సవంలో Un Certain Regard విభాగంలో ప్రదర్శింప  బడుతున్న భారతీయ సినిమా ‘హోమ్ బౌండ్’ ( ఇంటి ముఖం ) .

వెయ్యి మంది ప్రేక్షకులు ,బ్రిటన్, ఫ్రాన్స్, క్రోషియా, అర్జెంటీనా, ఇటలీకి చెందిన 5 గురు  జ్యూరీ బృందం  ఒక్కసారిగా లేచి , 9 నిమిషాల స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.

ఇలాంటి అరుదైన గౌరవం వేళ్ళమీద లెక్క పెట్టగలిగిన  భారతీయ సినిమాలకు మాత్రమే దక్కింది. ఈ తరహా అరుదైన పురస్కారం 80 ఏళ్ల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్ర లో 1990 నుండి మొదలయ్యింది.

ఆ  సినిమా దర్శకుడు  నీరజ్ ఘయాన్. పదేళ్ల క్రితం 2015 లో నీరజ్ తీసిన మొదటి సినిమా “మసాన్”  కూడా ఇలాంటి గౌరవాన్నే దక్కించుకుంది. 5 నిమిషాల స్టాండింగ్ ఓవియేషన్ తో పాటు రెండు కేన్స్ అవార్డులు కూడా గెలుచుకుంది. ఆ సినిమాకి వచ్చిన కరతాళ ధ్వనుల చప్పుడు నీరజ్ ఘయాన్ కు కొన్నేళ్ళ తర్వాత మరో సినిమా కు ఊపిరి నిచ్చింది. 2020 జూలై 31 వ తేదీన న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురించ బడిన కాశ్మీర్  జర్నలిస్ట్ బషారత్ పీర్ వ్యాసం “A Friendship, A Pandemic and a Death beside the Highway ” లోని యదార్ధ సంఘటనలు అతన్ని కదిలించాయి.

24 మార్చి 2020 లో దేశంలో లాక్ డౌన్ ప్రకటించబడింది. రైళ్లు , బస్సులు రద్దు చేయబడ్డాయి. ఫ్యాక్టరీలు , షాపులు , హోటళ్లు మూత బడ్డాయి. ఒక్క సారిగా చాలామంది బతుకుల్లో  వెలుతురు అదృశ్యమై పోయి చిమ్మ చీకటి కమ్ముకుంది. ఈ దేశపు సామాన్య మానవుడి జీవితం ఎన్నడూ లేనంత భయాందోళనల్లో చిక్కుకు పోయింది.

పుట్టిన గద్దను వదిలి,వేల మైళ్ళు దాటి పొట్ట చేత పట్టుకు వెళ్ళి , రెక్కాడితే కానీ డొక్కాడని కోట్లమంది వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. వూపిరి వుంటే సొంత ఊరు చేరుకుని కలో గంజో కాచుకు బతకడం , లేదంటే కోవిడ్ మహమ్మారి కి బలి అయ్యి ,సొంత వాళ్ళ మధ్యలో  చివరి వూపిరి వదలడం , ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుందనే ఆశ తో కాలినడకన , సైకిళ్ళు, ట్రాక్టర్లు, లారీలు,ట్రక్కులు ఏది దొరికితే అది పట్టుకుని లక్షల మంది సొంతూరి బాట పట్టారు. భారతదేశపు జాతీయ రహదారులన్నీ అసహాయుల ఆశల ప్రస్థానం తో నిండిపోయాయి.

నెత్తిన ట్రంకుపెట్టె  , చంకలో అడుగులురాని బిడ్డ , వేలు పట్టుకుని పాదాలు పచ్చి పండ్లు అయిన నడక నేర్చిన మరో బిడ్డ. దూరం చేరుకోలేనంత , ఆశ ఆకాశమంత . ఈ దేశపు ఘన సంపదలు , పురోగతి గ్రాపులు , ఆర్థిక ప్రగతి లెక్కలు ఎక్కడో దాక్కున్నాయి. ఎక్కడ చూసినా మరణం అంచున నిలబడి భయ విహ్వల ముఖచిత్రాలతో బ్రతుకు అందలాన్ని  ఎక్కడానికి భారంగా చేస్తున్న పోరాటాలే !

నేనొక సున్నా,  అయినా నడుస్తూనే ఉన్నా!

అక్కడ నా జాతి ఓడల బరువు మోయడం

ఎరగని కెరటంలా ఆకాశం మీదకు దూకుతోంది.

నేను ఒక విశాల హరిత శాద్వవలాన్నయి పడుకుంటాను.

నా దేశపు పిల్లలు బాల శీతల వాయువులతో

ఆడుతూ పాడుతూ విహరించడానికి పోదాం రా,

అక్కడ నా దేశపు రస్తాలు చైత్రమాసం పూచిన

పువ్వుల్లోకి పరుగులిడుతున్నాయి.”

(గుంటూరు శేషేంద్ర శర్మ- నా దేశం నా ప్రజలు )

జాతి చరిత్రలో అత్యంత విషాద ఘట్టంలో, ముగిసిపోయిన లెక్క లేనన్ని బక్క ప్రాణుల బతుకు గాథల్లో ఒకటి “అమృత్ కుమార్” కథ. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని  “దేవరి” గ్రామానికి చెందిన అమృత్ కుమార్ దినసరి కూలికి చేరి పనిచేసే వలస కార్మికుడు.ఆ దళిత యువకుడు కడుపు నింపుకోను పని వెతుక్కుంటూ తన నేస్తం మొహమ్మద్ సాయుబ్ తో కలిసి సొంతూరికి 1400 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం లోని సూరత్ లో ఒక పవర్లూం ఫ్యాక్టరీ లో రోజుకి  ఆరు వందల కాంట్రాక్ట్ కూలీగా కుదిరి బతుకీడుస్తున్న తరుణంలో కరొన మహమ్మారి అతని జీవితంలో నిప్పులు పోసింది. లాక్ డౌన్ కరొనా కన్నా కర్కశంగా బడుగు జీవుల బతుకులపై  కరాళనృత్యం చేసింది .

లాక్ డౌన్ ప్రకటించాక దేశంలో అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అందులో పని చేసే కార్మికుల బతుకులు వీధినబడ్డాయి. 50 రోజులు సూరత్ లో గడిపాక చేతిలో ఉన్న పైసలు అయిపోయాయి. కుమార్ అతని స్నేహితుడు సాయుబ్ మే 14 అర్ధరాత్రి , 24 కిలోమీటర్లు నడిచి హైవే లో నాలుగు వేల రూపాయల కిరాయికి ఒక ట్రక్కు ఎక్కి సొంతూరు బయలు దేరారు. 900 కిలోమీటర్లు ప్రయాణించి మధ్య ప్రదేశ్ లోని “కోలారస్” అనే ఊరు చేరే సరికి అమృత్ కుమార్ కి వడదెబ్బ కారణంగా డీహైడ్రేషన్ అయ్యి వాంతులు అవడం మొదలయ్యాయి. కిక్కిరిసిన ట్రక్ లో మిగతా ప్రయాణీకులు కుమార్ కి కోవిడ్ అంటుకుంటుందన్న భయంతో అతన్ని దింపివేశారు. అతని స్నేహితుడు సాయుబ్ అతనితో పాటు దిగి పోయాడు. నీరసంతో , తీవ్రమైన అనారోగ్యంతో , ఏ విధమైన సాయంలేని అతన్ని వదిలి తనప్రాణాలు దక్కించుకుందాం అని సాయబ్  ట్రక్ లో కొనసాగలేదు.

ఈ అంశమే నీరజ్ కు ప్రేరణ కలిగించింది . కులం కానీ , మతం కానీ , రక్త సంబంధం లేని మనిషి కోసం మరో మనిషి మృత్యువు కు వెరవకుండా నిజమైన మనిషి లా నిలబడటం మానవత్వానికి మహా గొప్ప గెలుపు.

మే 16 న 24 ఏళ్ల అమృత్ కుమార్ సరైన  వైద్య సదుపాయం లేక చనిపోయాడు. ఈ దేశంలో ఏ ఆధారం లేని తల్లిదండ్రులకి తమ రెక్కల కష్టంతో చేదోడుగా ఉండాలని కలలు కన్న ఎందరో యువకుల కలలు ఇలాగే కోవిడ్ మహమ్మారి సృష్టించిన లాక్ డౌన్ ఉపద్రవానికి కాలిపోయాయి.

తన బాల్య మిత్రుడి శవాన్ని మిగిలి ఉన్న 400 కిలోమీటర్ల దూరాన్ని దాటించి, ఊరిలో వారి తల్లిదండ్రులకు అప్పజెప్పి మానవత్వానికి కులం, మతం లేవని నిరూపించాడు సాయబ్.

నీరజ్ ఘయాన్ సినిమాలో చంద్రన్ పాత్ర లో తన బాల్య జీవితానికి సారూప్యత ఉందంటాడు. మహారాష్ట్ర లోని ఒక మరాఠి దళిత కుటుంబంలో పుట్టి , హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయ లో స్కూల్ చదువు, చైతన్య భారతి కాలేజీ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, స్కూల్లో, కాలేజీ లో , ఆఫీస్ లో తన అస్తిత్వాన్ని ఎదుటి వారికి తెలియనీకుండా నక్కి నక్కి దాక్కొని బ్రతికిన నీరజ్ కి వివక్షత ఎంత దుర్భరమైనదో అనుభవ పూర్వకంగా తెలుసు. రెమ్యునరేషన్, స్టార్ డమ్, సక్సెస్ రేట్ , డిమాండ్ ను బట్టి మాత్రమే విలువలు నిర్ణయించ బడే సినిమా ఇండస్ట్రీ లో అతనే కాదు ఏ వెనుకబడిన కులాలకు చెందిన సినిమా ఆశవహుడైనా  అయినా  తన మూలాల్ని  మూలన పెట్టవలసిందే .

ప్రముఖ సినీస్టార్ శ్రీదేవి కూతురు “ జాహ్నవి కపూర్” ఇషాన్ ఖాట్టర్,  విశాల్ జేత్వ అద్బుతంగా నటించిన ఈ సినిమా ను బాలీవుడ్ ప్రముఖుడు “ కరణ్ జోహార్ “ నిర్మించడం , హాలీవుడ్ లెజండరీ దర్శకుడు   మార్టిన్ స్కోరసేసే ఎగ్జిక్యూటివ్ నిర్మాత గా వ్యవహరించడం మరో ప్రత్యేకత .టొరంటో  అంతర్జాతీయ సినిమా ఉత్సవంలో కూడా స్టాండింగ్ ఓవియేషన్ తో బాటు సెకండ్ ఇంటర్నేషనల్ పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకుంది . 98 వ ఆస్కార్ అకాడమీ పోటీలలో ‘ఉత్తమ అంతర్జాతీయ కధాచిత్రం’ కేటగిరీలో భారతదేశం తరపున ప్రదర్శించారు.

“Let Every Thing happened to you , beauty and terror just keep going .No feeling is final “- Rainer Mariya Rilke ( Austro German Poet )

శ్రీ నివాస్

1 comment

Leave a Reply to Hanumantharao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తన మూలాల్ని మూలన పెడితేనే కరణ్ జోహార్ అవకాశం ఇచ్చాడా? లేక ప్రతిభ చూసి ఇచ్చాడా?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు