ఫ్యామిలీ సీరియల్స్ మొదలైంది రేడియోలోనే!

రోజున నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు విజయవాడ లో ఉన్నారు. మా డైరెక్టర్ అనంత పద్మనాభరావు గారు వారి దగ్గర సమయం తీసుకున్నారు. అక్కినేని ఆకాశవాణి కి వస్తున్నారన్న సమాచారం క్వార్టర్స్ లో ఉన్న వారందరికీ తెలియ పరిచారు 

ఆ సంవత్సరం ఆకాశవాణి వార్షిక పురస్కారాలు, మెరిట్ సర్టిఫికెట్ పొందినవారికి కబురు పంపించారు.మొదటి అంతస్తులో ఉన్న మీటింగ్ హాల్ లో పన్నెండు గంటల సమయానికి అందరం చేరుకున్నాం.

ఆ సంవత్సరం ముంజులూరి కృష్ణ కుమారి గారు రూపొందించిన “సందిగ్ధం” రూపకానికి మెరిట్ సర్టిఫికెట్ పొందారు వారు.వారి ప్రొడక్షన్ టీం లో ఉండటంతో ఒక సర్టిఫికెట్ నేను కూడా పొందాను.తరవాత వారు కొన్ని రేడియో జ్ఞాపకాలు మాతో పంచుకున్నారు..కట్ చేస్తే 2008 లో నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో పనిచేస్తున్నాను.. అప్పుడు తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా వారిని ఆహ్వనించాం..సముద్రాల, మల్లాది, ఘంటసాల జ్ఞాపకాలు ఎన్ని చెప్పారో.. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అలా అప్పటికప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయగలగటం పద్మనాభరావుగారికే సాధ్యం…

జి.కె.కులకర్ణి గారు స్టేషన్ డెరైక్టర్ గా ఉన్నప్పుడు వారికో ఆలోచన వచ్చింది..ఆ ఆలోచన పర్యవసానమే ఐదు నిముషాల కార్యక్రమం “ప్రభాతలహరి”… వారానికి మూడు రోజులు ఉండేది ఆ కార్యక్రమం..అందులో వ్యక్తిత్వ వికాసం మొదలు మెరుగైన మానవసంబంధాల వరకు ఏదైనా చెప్పమన్నారు.. కానీ దానికి స్క్రిప్ట్ రాసి ఆయన అనుమతి తీసుకోవాలి.. అప్పుడు డా.పి.ఎస్.గోపాలకృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేవారు.(అనంతర కాలంలో వారు హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ గా వ్యవహరించారు). వారికి స్క్రిప్ట్ రాసి చూపించే వాడిని.వారు గుడ్, వెరీ గుడ్, ఎక్సెలెంట్ అని గ్రేడింగ్ ఇచ్చే వారు.అక్కడినుంచి అది స్టేషన్ డైరెక్టర్ కు అప్రూవల్ కి వెళ్ళేది.ఏ స్క్రిప్ట్ అయినా సినాప్సిస్ ఇంగ్లీష్ లో రాసి రీడర్స్ రిపోర్ట్ (RR) అటాచ్ చేయాలి. దాని ఆధారంగా స్టేషన్ డెరైక్టర్ నిర్ణయం తీసుకునే వారు..డా.గోపాలకృష్ణ నాకోసం ఆయన దగ్గరున్న పాత రీడర్స్ డైజస్ట్ లు నాకిస్తుండేవారు..అవి నాకెంతో ఉపయోగపడుతుండేవి.ఆ కార్యక్రమానికి మా సీనియర్ కొలీగ్ మంత్రవాది మహేశ్వర్, సీనియర్ అనౌన్సర్ రామం గారు వాయిస్ ఇస్తూ ఉండేవారు.మిత్రడు కలగ కృష్ణ మోహన్ చక్కటి సిగ్నేచర్ ట్యూన్ సమకుర్చాడు.మంచి ప్రశంసలు పొందింది ఆ కార్యక్రమం..

దృశ్య మాధ్యమాల్లో సీరియల్స్ రాకముందే రేడియో లో ఫ్యామిలీ సీరియల్స్ ఉండేవి..వాటిలో కొన్ని గుర్తు చేస్తాను.. కులకర్ణి గారు స్టేషన్ డెరైక్టర్ గా ఉన్నప్పుడే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఇరుగు పొరుగు అనే ఫ్యామిలీ సీరియల్ రాసేవారు.

పాండురంగ,పేరి కామేశ్వరరావు గారు, ఎమ్ వాసుదేవ మూర్తిగారు,పద్మజా నిర్మల గారు పాత్రధారులు..ప్రతి మంగళవారం రాత్రి 9గం.15ని.లకు ప్రసారమవుతుండేది.ఒక చిన్న సిగ్నేచర్ ట్యూన్ ఉండేది.అందరూ మంగళవారం రాత్రి ఏడుగంటలకు చకచకా ఒక రిహార్సల్ అవగానే చదివేస్తుండేవారు.డ్యూటీలు ఆ విధంగా అడ్జస్ట్ చేస్తుండేవారు 

ఇది జరిగింది 91-92 సంవత్సరాల మధ్య..

అలాగే ఒకసారి పాండురంగ (వారి అసలు పేరు ప్రహరాజు పాండురంగారావు.. వారు విజయవాడలో నాటకరంగంలో చాలా చురుకుగా ఉండేవారు. ప్రోగ్రాం ఆఫీసర్)..ఒక సీరియల్ ఉదయం ప్రసారాల కోసం ప్రొడ్యూస్ చేశారు.దానికి కోట శ్రీనివాసరావు వాయిస్ ఓవర్ ఇచ్చారు.. స్క్రిప్ట్ ఎవరు రాశారో గుర్తులేదు..కోట శ్రీనివాసరావు గారిది చాలా షార్ప్ టంగ్..ఆయన వేసిన పంచ్ లు మామూలుగా లేవు.

పాండురంగ మేం యంగ్ స్టర్స్ కావటంతో మామీద విసుక్కోవడం కూడా గమ్మత్తుగా చేసేవారు.ఎవరండీ మీకు ఉద్యోగమిచ్చింది అనేవారు.. మీరైతే ఇచ్చేవారు కాదు సర్ అని మా కౌంటర్ ఉండేది..

ఇదే “పాండురంగ” దర్పణం అనే శీర్షికతో యాత్రా స్థలాలు, దర్శనీయ స్థలాల పైన మా అందరిచేత పావుగంట రూపకాలు చేయించారు.ఆయనో షెడ్యూల్ తయారు చేసి సర్క్యులేట్ చేసేవారు.నేను చేయను అనే అవకాశం లేదు.. అలా నేను చాలా కార్యక్రమాలు చేశాను.. అందులో “కొండపల్లి దర్గా” ఒకటి.అవన్నీ ఇప్పుడు తీపి గుర్తులు..పనిలేదా “పాండురంగ”ను కలువంటూ మా కృష్ణ మోహన్ హాస్యాలాడుతుండేవాడు..

దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో మంత్రవాది మహేశ్వర్ గారి చేత “సుబ్బారావు -స్వీట్ హోం” అనే సీరియల్ చేయించారు.ఆయన, విజయకుమారి గారు, రామం గారు అందులో పాత్రలు పోషించేవారు.. చాలా పాపులర్ అయింది ఆ కార్యక్రమం..పద్మజా నిర్మల గారు “విను చిన్నారి” అనే ప్రోగ్రాం చేసేవారు.అనంతరం విజయకుమారి గారు దాన్ని కొనసాగించారు..మా మిత్రుడు బేతా సూర్యప్రకాష్ “అప్పలకొండ” అనే స్టాక్ కేరక్టర్ చేసేవాడు.అనతికాలంలోనే అందరి మన్ననలు పొందింది..మా సీనియర్ కొలీగ్ నాగసూరి వేణుగోపాల్ నాచేత “సోపానం” అనే కార్యక్రమం చేయించేవారు.నేనే ప్రెజెంట్ చేస్తుండేవాడిని.ఎక్కువగా కెరీర్ ఆపర్చునిటీస్ చెబుతుండేవాడిని..

ఇలా ఆకాశవాణి విజయవాడ కేంద్రం విస్తృతంగా, వైవిధ్యంగా కార్యక్రమాలు చేస్తుండేది..ఆ రోజుల్లో ఆహూతుల సమక్షంలో కార్యక్రమాలు చాలా రెగ్యలర్ గా జరుగుతుండేవి.ఒక్క మ్యూజిక్ మాత్రమే కాదు, డ్రామా,జానపద సంగీతం, వినియోగదారులు, సాహిత్యం వంటి అనేక విభాగాల్లో ఈ కార్యక్రమాలు ఉండేవి.వీటిని invited audience OB ప్రోగ్రామ్స్ అనేవారు.OB అంటే outside broadcast అని అర్థం.ఆ విధంగా రేడియో స్టేషన్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండేది.ఈ OB కార్యక్రమాలు ఒక్క విజయవాడ నగరానికే పరిమితం కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా నిర్వహిస్తుండేవారు.

ఈ “ఓబి” ప్రోగ్రామ్స్ ఎక్కువగా కులకర్ణి గారు స్టేషన్ డెరైక్టర్ గా ఉన్న సమయంలో జరిగిన జ్ఞాపకం..ఈ ఓబి కార్యక్రమాల వలన ప్రధానంగా కొత్త శ్రోతలు పరిచయమవుతుండేవారు.. వారు కార్యక్రమాల గురించి ఏమనుకుంటున్నారో నేరుగా తెలుసుకునే అవకాశం ఉండేది.

ఆకాశవాణిలో ప్రోగ్రాం స్టాఫ్ కు ఒక అసోసియేషన్ ఉండేది.అందులో స్టేషన్ డైరెక్టర్ నుంచి డ్యూటీ ఆఫీసర్ వరకు సభ్యులే..మేం చేరిన కొత్తలో అంటే 88 ప్రాంతంలో ఒక మీటింగ్ జరిగితే అందులో స్టేషన్ డైరెక్టర్ చెప్పే నాలుగు మాటలు వినటంతో సరిపోయేది.. అదే ప్రధానంగా ఉండేది 

1995లో ఆ పరిస్థితి లో మార్పొచ్చింది.. దానికి కారణం ఏమిటంటే… వచ్చే సంచికల్లో!

*

 

"రేడియో" రాంబాబు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • త్రవ్వి పోస్తున్నావ్. జ్ఞాపకాల కలబోత. పాతతరం అందరూ గుర్తుకు వస్తున్నారు. ఈ తరానికి స్పూర్తి, ప్రేరణ ఉత్తేజం కలిగించే విషయం కూడా.రామ్ బాబు రియల్లీ సింప్లీ superb

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు