ప్రవాసి వెతుక్కుంటూ వెళ్ళిన దారి

అందరికీ వుండే కోపాలూ, తాపాలూ, అసంతృప్తులూ, అలకలూ అన్నీ ఆయనకీ వున్నాయి. కానీ, అందరిలోనూ లేని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు “ఇదీ వేలూరి!” అనిపించేవి వున్నాయి. వాటిల్లో ఒకటి: మాట తడబడకపోవడం! ఏం చెప్పాలో అది చెప్పాల్సిందే అన్నట్టుండడం! రెండు: చదువుతూనే వుండడం! ఇప్పుడే కొత్తగా రాస్తున్న వాళ్ళ రచనల్ని కూడా చదివి, ఇష్టంగానో, కష్టంగానో మాట్లాడడం! మూడు: ఏ క్షణంలోనూ నవ్వు తోడు వీడకపోవడం!

1

“Every day is a bonus day!”

ఈమధ్య ముడిపడని లంకెలాగా సాగిన అనేక సంభాషణల్లో వేలూరి వేంకటేశ్వర రావు గారి (1938-2026) ఒక వాక్యం ఇది. ఎప్పుడూ నవ్విస్తూ, లేదా నవ్వుల కెరటాల మధ్య మాత్రమే కనిపించే వేలూరి గారి నోటి వెంట అలాంటి మాట రావడం ఆశ్చర్యమే. ఎందుకంటే, జీవితంలోని చీకటితనం అంతగా అంటని మనిషీ, మనసూ ఆయన.

వేలూరితో 1983 నుంచి పరిచయం అంటే నాకు సాహిత్యంలో ఓనమాలు తెలియని కాలం నించీ అన్న మాట. అప్పట్లో ఆంధ్రభూమి దినపత్రికకి గజ్జెల మల్లారెడ్డి గారు ఎడిటర్ గా వుండే వారు. నేనింకా ఖమ్మంలో డిగ్రీ చదువుకుంటున్న కాలం. సాహిత్య వ్యాసాల కోసం పత్రికలన్నీ  ఆబగా వెతుక్కునే రోజులు.  ఏదో రాయాలనే ఆరాటం కాకుండా సాహిత్య రంగంలో సరికొత్తగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న తపన. అలా వేలూరి వ్యాసాలూ, ఇతర రచనలు నా కంటబడ్డాయి. వేలూరి వ్యాసాలు తరచూ ఆంధ్రభూమిలో వస్తూ వుండేవి. నీళ్ళు నమలకుండా లోపల ఒక మాటా, పైకి ఒక మాటా కాకుండా నిష్పూచీగా, నిస్సంకోచంగా, నిర్భయంగా పలికే స్వరం అది. టీనేజీ చివరకి వచ్చేస్తున్న నాలో కొన్ని సంతోషాలూ, కొన్ని నిరసనలూ ఒకే వేగంతో ప్రవహించే కాలం అది. ఆ సందిగ్ధ సందర్భానికీ, పరస్పర విరుద్ధ సంవేదనల ఉరవడికీ వేలూరి రచనల స్వరం సరిగ్గా సరిపోయినట్టు వుండేది. వేలూరి సంతకం వుంటే వెంటవెంటనే చదివేసి, మిత్రులతో అది చెప్పుకునే దాకా మనసూరుకునేది కాదు.

అప్పటి నుంచీ ఇప్పటి దాకా వేలూరి స్వరం ఏమైనా మారిందా అని నన్ను నేను చాలా సార్లే ప్రశ్నించుకున్నాను. కలిసిన ప్రతిసారీ ఆయన్నీ నిలదీస్తూనే వచ్చాను. అదే- వేలూరి గారితో వుండే వెసులుబాటు! చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన్ని మీరేమైనా అడగవచ్చు. వయసులోని తేడా కనిపించకుండా ఆయన కూడా తనదైన మందహాసంతోనో, పెద్ద నవ్వుతోనో అలాగే సమాధానం చెప్పేస్తారు. నిజం చెప్పాల్సి వస్తే, ఆ వయసు వాళ్ళల్లో అలాంటి స్నేహం తక్కువే వుంటుంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మా ఇద్దరి మధ్యా వయసు తేడా ఎంత అన్న ప్రశ్న ఎప్పుడూ రాలేదు. వయసు తేడా లేకపోవచ్చు కానీ, అభిప్రాయాల తేడా ఎప్పుడూ వుండేది. అది 2002 లో మొదటిసారి ఆయన్ని చికాగో విమానాశ్రయంలో వ్యక్తిగతంగా కలిసినప్పటి నుంచీ, ఈ మధ్య అనేక సన్నివేశాల్లో జరిగిన అనేక సంభాషణల దాకా కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే వుండేది.

1983 నుంచి రచనల ద్వారా మాత్రమే తెలిసిన వేలూరిని 2002 లో మొదటిసారి కలిసినప్పుడు నాకు అమెరికా జీవితం గానీ, విమాన ప్రయాణాలు గాని బొత్తిగా తెలీదు.

2

            2002 లో చికాగో విమానాశ్రయంలో మొదటి సారి కలిసినప్పుడు అప్పటికి మేం మా ఫోటోలు కూడా సరిగా చూసుకోలేదు. నేను విమానం దిగి, గేటు బయటికి రాగానే పిచ్చి చూపులు చూస్తూ నిలబడినప్పుడు, ఒక ప్లకార్డు మీద నా పేరు కనబడింది. అది పట్టుకు నిలుచున్న పెద్దాయన కనబడ్డారు. ఆ పెద్దాయన దగ్గిరకి వెళ్ళి “ఈ పేరు నాదే!” అన్నాను. అది మా ఇద్దరి మధ్యా మొదటి వాక్యం. “అబ్బా! దొరికారండీ మొత్తానికి! ఇప్పటికీ ఇది రెండో సారి మీ కోసం ఎయిర్పోర్ట్ కి రావడం!” అంటూ ఆయన నన్ను దగ్గిరకి తీసుకొని, ముందు ఒక కాఫీ తాగించారు.

నాకు విమానాలు ఎక్కిదిగడంలో సరైన అనుభవం లేక, మాడిసన్ నుంచి నా అసలు విమానం మిస్ అయింది. ఎయిర్ లైన్స్ వాళ్ళు తరవాతి విమానం ఎక్కించి పంపించారు. వేలూరి గారికి నేను మొదటి విమానం సమయం మాత్రమే పంపించాను,  రెండో విమానం ఎప్పుడొస్తుందో, ఏమిటో తెలీక! పాపం, ఆయనే విమానం వేళలూ, వివరాలూ చూసుకొని రెండోసారి నా కోసం వచ్చారు. ఆ మరునాడు మేమిద్దరం కలిసి డిట్రాయిట్ సాహిత్య సదస్సుకి వెళ్ళాలి. అది అమెరికాలో నా మొదటి సాహిత్య సదస్సు. నేను మాడిసన్ వచ్చానని తెలియగానే డిట్రాయిట్ సాహితీ మిత్రులు నన్ను ఆహ్వానించడం, ఈలోపు వేలూరి గారు లైన్ లోకి వచ్చి, “మీరు చికాగో రాండి, మనం కలిసి వెళ్దాం” అనడం వల్లా అదే నా మొదటి చికాగో ప్రయాణం కూడా అయ్యింది. చికాగో నుంచి డిట్రాయిట్ కి వేలూరి గారు నన్ను కారులో తీసుకెళ్లాలి. అప్పటికే నాతో మాట్లాడించడం కష్టమే అని అర్థమైన శాంతి గారు “మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ వుండండి. లేకపోతే, ఆయన చిన్న గా నిద్రలోకి జారిపోతారు!” అని హెచ్చరించారు. అయినా సరే, ఆ ప్రయాణంలో నేను పెద్దగా ఏమీ మాట్లాడినట్టు గుర్తు లేదు. వేలూరి గారు మాత్రం దారిపొడవునా మాట్లాడుతూనే వున్నారు.

3

         ఆ 2002 నుంచి ఇప్పటిదాకా వేలూరితో నా సంభాషణ ఎక్కడా ఎప్పుడూ ఆగలేదు. ఆ ప్రయాణంలో ఆయనేం మాట్లాడారో సరిగా గుర్తు లేదు గాని, డిట్రాయిట్ సదస్సులో ఇద్దరమూ మాట్లాడుకున్న విషయాలూ, ఈ మధ్య అమెరికా తెలుగు రచయితల సదస్సులో నేరుగా కలిసినప్పుడు మాట్లాడుకున్నవీ, బహుశా నా చివరి సంభాషణ నెల కిందట దాకా- ప్రతీదీ గుర్తుందనే అనుకుంటున్నాను.

అందరికీ వుండే కోపాలూ, తాపాలూ, అసంతృప్తులూ, అలకలూ అన్నీ ఆయనకీ వున్నాయి. కానీ, అందరిలోనూ లేని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు “ఇదీ వేలూరి!” అనిపించేవి వున్నాయి. వాటిల్లో ఒకటి: మాట తడబడకపోవడం! ఏం చెప్పాలో అది చెప్పాల్సిందే అన్నట్టుండడం! రెండు: చదువుతూనే వుండడం! ఇప్పుడే కొత్తగా రాస్తున్న వాళ్ళ రచనల్ని కూడా చదివి, ఇష్టంగానో, కష్టంగానో మాట్లాడడం! మూడు: ఏ క్షణంలోనూ నవ్వు తోడు వీడకపోవడం!

ఈ మధ్య రాసిన కథ “వార్థక్యం”లో ఆయన చెప్పుకొచ్చిన అనేక రకాల సన్నివేశాలను ఒకసారి తలచుకుంటే, బతుకు అనేది మనిషిని ఎంతగా విసిగిస్తుందో చెప్పక చెప్పినట్టే వుంటుంది. ఆ కథాసందర్భం మాటల మధ్యలో వేలూరి గారిని బాగా బాధించిన సంగతి ఇది:

నేను అందరినీ కొంచెం నమ్ముతాను. కొందరిని కొంచెం ఎక్కువగా నమ్ముతాను; ఆ కొందరు నిజం చెప్పటల్లేదని తెలిసి కూడ, వాళ్ళు చెప్పింది నమ్మాను. ‘నీ మంచితనాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు’ అని నా శ్రేయోభిలాషులు వందలసార్లు చెప్పిన తర్వాత కూడా! I am gullible.

కథ వచ్చాక ఈ విషయం ఆయనతో ప్రస్తావించినప్పుడు – ఆయన ఒక మాట అన్నారు:

My health has deteriorated from bad to worse. I don’t go out even in Phoenix AZ. So I need not care much. When you look out for day after day why should I care?

నిజానికి అదే ఆయన బతుకు పాఠం. మోటో అంటారే, అలాంటిది. కేర్ చేయడం, చేయకపోవడం- అనే రెండీటీ మధ్యా కత్తిమీద సాము ఆయన జీవితం. వార్థక్యం- కథ ఆయన చివరి రచన కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. కచ్చితంగా రాసే తీరాలి అనుకొని రాసిన రచన అని నా నమ్మకం. ఇందులో ఆయన చెప్పుకుంటూ వచ్చిన చాలా సందర్భాలూ, సన్నివేశాలూ ఆయన అనుభవాలూ, అనుభూతులు. వాటి తీవ్రత, దాని సెగ ఆయనకి కూతవేటు దూరంలో వున్న వాళ్ళకి బాగానే తెలుసు.

1983 కి పూర్వమే ఆయన రచనలు చేసి వుంటారని నాకు అనిపిస్తోంది కానీ, నాకు తెలిసీ 1983  నుంచి ఇప్పటిదాకా వేలూరి రచనల్ని ఒక చోట దగ్గిరగా చదివితే, ఆయన కృషి చిన్నదేమీ కాదు. వృత్తిరీత్యా వేరే రంగంలో వుంటూ, తెలుగు సాహిత్యం పైన ఇంత ఏకాగ్రతతో పనిచేయడం ఒక విధంగా అసాధ్యమే! అంతకంటే ఎక్కువగా ప్రతిసందర్భంలోనూ తెలుగు సాహిత్య సమాజాల మీదా, ముఖ్యంగా డయాస్పోరా సాహిత్యమూ, ప్రవాస సమూహాల మీదా ఆయన చేస్తూ వచ్చిన పరామర్శలూ, విమర్శలూ ప్రత్యేకించి చర్చించాల్సినవే.

4

ముంగండలో కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, రెండు గేదెల పాడి, ఒక లేగదూడ, ఎంతో ప్రశాంతమయిన వాతావరణం, పైరగాలి, కాలవగట్టు, పడవల పాటలు – ఏదో పోగొట్టుకున్న బెంగ — నాస్టాల్జియా, నాస్టాల్జియా, ఇంకాస్త నాస్టాల్జియా! ఇవీ, ఇతివృత్తాలు. ఇటువంటి కథలు తెలుగునాట వాస్తవజీవితం  చిత్రించే  తెలుగు కథలు కావు. అమెరికా ఎడ్రెస్‌తో  అమెరికావాడు ఊహించి రాసినంతమాత్రాన , అమెరికా తెలుగు కథలు అసలే కాదు. నిజంచెపితే నిష్టూరం!

తెలుగు-వెలుగు, 1983-1985

ప్రవాస జీవితం అంటే ఏమిటో? ఏ విషయాలు ప్రవాసంలో భాగమవుతాయో తెలిసి రచనలు చేసిన కొద్దిమందిలో వేలూరి ఒకరు. కేవలం “ఒకరు” అనడం కంటే, అమెరికా వచ్చిన తరవాత ఇక్కడి జీవితంతో కలగలిసిపోయి, రాసిన అరుదైన రచయితగా ఆయన పేరు చెప్పుకోవాలి. చివరికి మిడిల్ ఈస్ట్ లోనో, ఆఫ్రికాలోనో  అత్యంత సంప్రదాయికమైన చరిత్రల్లోంచి, నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడి జీవితంలో లీనమైపోయి, రాస్తున్నప్పుడు మన తెలుగు వాళ్ళు మాత్రం గతంలోంచి మాత్రమే పలవరిస్తున్నారని మాటల సందర్భంలోనూ, అమెరికా తెలుగు రచయితల సదస్సులోనూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు వేలూరి.

విమర్శగా మాట్లాడడం ఒక ఎత్తు. ఆ విమర్శకు తగ్గట్టుగా రాస్తూ పోవడం మరో ఎత్తు. వేలూరి రచనల్లో నాస్టాల్జియా లేదని కాదు. వుంటుంది. కానీ, అది సమకాలీనతతో ముడిపడిన నాస్టాల్జియా. తన వేళ్ళు ఎక్కడున్నా, కాళ్ళు ఏ నేల మీద నిలబడి వున్నాయో తెలిసిన నాస్టాల్జియా. 2012లో వేలూరి గారి “ఆ నేల, ఆ నీరు, ఆ గాలి” కథలు వచ్చినప్పుడు నేను అమెరికాలోనే వున్నా, నాకు డయాస్పోరా అంటే ఏమిటో పూర్తిగా బోధపడిందని అనుకోను. నిజానికి ఆయన ఆ కథలూ వ్యాసాలూ రాస్తున్నప్పుడు వాటిలోని కొత్తదనం గమనించడమే తప్ప,  ఆయన తాజా రచన “వార్థక్యం” దాకా కూడా ఈ భావన నాకు పూర్తిగా అర్థమైందని చెప్పలేను. కానీ, తన ప్రవాస జీవితమంతా ఈ భావన వైశాల్యాన్ని చెప్పడానికే ప్రతి వాక్యం వెచ్చించిన వేలూరి దారిలో కొన్ని మైలురాళ్ళు చూసినప్పుడు ప్రతి మైలురాయీ డయాస్పోరాకీ సంబంధించిన ఒక లక్షణాన్ని వ్యాఖ్యానించినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా, వివిధ రచనల మీద ఆయన రాసిన సుదీర్ఘ సమీక్షా వ్యాసాలు, “ఈమాట” సంపాదకుడిగా వున్నప్పుడు రాసిన సంపాదకీయాలూ దీనికి మంచి ఉదాహరణ. ఒక చోట ఆయనే ఇలా అన్నారు:

అమెరికాలో  చాలాకాలంనుంచీ “ స్థిరపడ్డ” అమెరికా తెలుగు వాళ్ళు – అంటే ఇక్కడే బడికెళ్ళి, ఉద్యోగంకోసం నానాయాతనాపడి నలభై గంటల పని జీవితంతో అలవాటు పడినవాళ్ళల్లో కథలు రాసే వాళ్ళు—కొద్దిమందీ– తమతమ నిజానుభవాలు,  అక్షరరూపంలో పెట్టటం మానుకున్నట్టుగా కనిపిస్తూన్నది. బహుశా అందుకు కారణం:   వాటి ప్రచురణకి ఆంధ్రాలో అవకాశం సున్న; అమెరికాలో  అరసున్న.

రాసింది ఫలానా చోట అచ్చవుతుందన్న ఎదురుచూపు రచయితలకు తప్పనిసరి. బహుశా, ఆ లక్ష్యం దృష్టిలో పెట్టుకునే ఎవరైనా రాస్తారు. కానీ, వేలూరి గారు అటు తెలుగు రాష్ట్రాల పత్రికల్లోనూ, ఇటు అమెరికా పత్రికల్లోనూ రాసిన రచనల్లో ఇలాంటి ధోరణి కనిపించదు. తను రాయాలనుకున్నది రాయడం ఆయన పద్ధతి. 1983 ఆంధ్ర భూమిలో అచ్చయిన రచనల నుంచీ నిన్నమొన్నటి రచనల దాకా ఆయన పట్టువదలని డయాస్పోరా వాది. అంత నిక్కచ్చిగా వుండడం, ఆ అడుగుల్లో నడవడం-  వెబ్ పత్రికలు బాగా విస్తరించిన ఈ కాలంలో కూడా ఇంకొకరికి సాధ్యపడడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా చూసినా వేలూరి దారి ఆయనదే అయిన దారి! అది నిలిచే వుంటుంది హమేషా!

*

అఫ్సర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి సాహిత్య వ్యక్తిత్వాన్ని పరిచయం చేశారు సార్. వేలూరి వారి రచనలు దొరకబుచ్చుకుని చదవడానికి ప్రయత్నం చేయాలి.

  • Great tribute.
    మాటలో నిక్కచ్చితనం ఆయన సొంతం. ‘బహుళ’ సాహిత్య విమర్శ సిద్ధాంతాలు ప్రమేయాలు పరికరాలు పుస్తకం కోసం డయాస్పోరా మీద వేలూరి నుంచి వ్యాసం రాబట్టుకొనే క్రమంలో సంపాదకుడిగా ఆయనతో చేసిన అనేక సంభాషణలో నేను చాలా నేర్చుకున్నాను. హైదరాబాద్ వేమూరి సత్యం గారి ఇంటి మిద్దె మీద’కావ్యదహన’ ఆవిష్కరణ సందర్భం మరపురానిది. శాన్ ఫ్రాన్సిస్కో లో సాయి గొర్తి బ్రహ్మానందం నిర్వాహణలో అమెరికా తెలుగు రచయితల సమావేశం జరిగినప్పుడు అఫ్సర్ కల్పన వేలూరి ముఖతః అమెరికా ఇండియా రచయితల మధ్య ఉండాల్సిన సాంస్కృతిక బాంధవ్యం గురించి వినడం మంచి అనుభవం. ఆయన్ని కలిసింది మొత్తం మూడు సందర్భాలే గానీ ప్రతి సందర్భం బలమైన జ్ఞాపకాలు మిగిల్చింది.
    అమెరికాలో తెలుగు డయాస్పోరా గురించి మాట్లాడే వాళ్ళకి వేలూరి వేంకటేశ్వర రావు రచనలు గొప్ప రిఫరెన్స్ గా ఉపయోగపడతాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు