పీఠాలను ప్రశ్నించిన కుసుమా భిక్కుని

బుద్ధుడు స్త్రీలకు కర్మ జ్ఞానాధికారాలను పురుషులతోపాటు సమానంగా గుర్తించి వారికి భిక్కు సంఘంలో ప్రవేశం కల్పించాడు. భిక్కు సంప్రదాయంలోని సభ్యులకు 227 నియమాలతో భిక్కు వినయను,  భిక్కునీ సంఘంలోని  స్త్రీ సభ్యులకు 311 నియమాలతో భిక్కునీ వినయని రూపొందించాడు. సన్యాసిగా మారే పురుషుడు తనకంటే పెద్దలైన పురుష భిక్షువుల యెదుట దీక్ష తీసుకుంటే స్త్రీలు మొదట భిక్కునీ సంఘంలో పెద్దల యెదుట దీక్ష తీసుకున్న తర్వాత పురుష పెద్దలనుండి నుండికూడా దీక్ష తీసుకోవాల్సి వుంటుంది.

భిక్కులలో పెద్దవారు భిక్కునీ సంఘానికి  రెండు వారాలకు ఒకసారి వెళ్లి వారికి బోధిస్తారు. బౌద్ధ సంఘంలో ముఖ్య ఆచారమైన ‘వర్షావాసం’ అనే మూడు నెలల కాలంలో భిక్కునీలు భిక్కులు నివసించే ప్రదేశానికి దగ్గరలో అదే జిల్లాలో వుండాలి. యెంత పెద్ద వయస్కురాలైనప్పటికీ భిక్కుని తనకంటే వయసులో చిన్నవాడైన భిక్కు ఎదురైనప్పుడు అతనికి నమస్కరించాలి. భిక్కులను భిక్కునీలు ఎట్టిపరిస్థితుల్లోనూ పరుషమైన పదాలతో నిందించరాదు. ఈవిధంగా బౌద్ధ సన్యాసినులైన స్త్రీలపై పురుషులకు కొంతమేర నియంత్రణ వుండే విధంగా వేరు వేరు నియమాలను, సంప్రదాయాలను ఏర్పాటుచేశాడు బుద్ధుడు. బౌద్ధ సన్యాసినులైన భిక్కునీలను కొన్ని ఆసియా దేశాలలో ‘దశ శీల’ అని, ‘దశ శీల మాత’ అని శ్రీలంకలో, ‘తిలమతి’(శీలమతి)అని బర్మాలో, ‘మేచి’ అని ధాయిలాండ్ లో, ‘సు..కో..ని’  అని వియత్నాం లో  పిలుస్తారు.

బుద్ధుడు మొదట తన సంఘంలో స్త్రీ ప్రవేశం పైన సుముఖంగా లేడని బౌద్ధ సంఘాన్ని స్థాపించిన తర్వాత బుద్ధుడి తల్లి గౌతమీ ప్రజాపతి, ప్రియ శిష్యుడు ఆనందుల విజ్ఞప్తి మేరకు ఐదు సంవత్సరాల తర్వాత బౌద్ధ సంఘంలో స్త్రీలు కూడా ప్రవేశించి అర్హంతులు కావచ్చని తీర్మానించినట్టు బౌద్ధ సంఘ నిర్మాణ చరిత్ర చెబుతుంది. బౌద్ధ భిక్కునీ సంఘంలో అన్నివర్గాల స్త్రీలు చేరి వారి కుల మతాలకు, వర్గాలకు భిన్నమైన గుర్తింపునూ, గౌరవాన్నీ పొందారు. తర్వాత అశోకుడి కుమార్తె(క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం) ‘సంఘమిత్ర’ శ్రీలంకకు భిక్కునీ సంప్రదాయాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.

ఆమె చేరిక భిక్కునీ సంఘానికి కొంతమేరకు శక్తిని, గౌరవాన్నీ యిచ్చింది. తర్వాత క్రమంగా ఆరవ శతాబ్దంలో సిల్క్ రూట్ ద్వారా శ్రీలంకకు చెందిన భిక్కునీలు కష్టతరమైన సముద్రయానం చేసి చైనా దేశంలో ప్రవేశించి అక్కడ భిక్కునీ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. చైనా నుంచి మహాయాన బౌద్ధ శాఖను అనుసరించే జపాన్, కొరియా, తైవాన్, వియత్నాం వంటి మహాయాన దేశాలలో భిక్కునీ సంప్రదాయం వ్యాప్తి చెందింది. దీనివెనుక శ్రీలంకకు చెందిన భిక్కునీల పాత్ర వుంది. వారు బుద్ధుని తల్లి, మొదటి బౌద్ధ  భిక్కునీ అయిన గౌతమీ ప్రజాపతి వారసులమని భావిస్తే మిగిలిన వారు శ్రీలంక దేశపు భిక్కునీలకు వారసులమని భావించడం విశేషం.

బుద్ధుడి తర్వాత భిక్కుని సంప్రదాయం సుమారు 1500 సంవత్సరాల పాటు నిరంతరాయంగా కొనసాగింది. అయితే రాను రాను బౌద్ధ సంఘం కూడా సమాజంలో వుండే పురుషాధిపత్యం అనే జాడ్యానికి లోనుకావడం వల్ల స్త్రీలు గతంలో వలే భిక్కునీలుగా దీక్ష తీసుకోవడానికి అవరోధాలు ఏర్పడ్డాయి. నిజానికి శ్రీలంక వంటి బౌద్ధ దేశాలలో బ్రిటీష్, డచ్, పోర్చుగీసు వలస పాలన వల్ల పురుషుల భిక్కు సంప్రయానికి అంతరాయం ఏర్పడింది. వలస పాలన వలన చిన్నాభిన్నం అయిన దేశాలలో పురుషులకే బౌద్ధ సంప్రదాయం ప్రకారం భిక్షువుగా దీక్ష యిచ్చే పరిస్థితి లేదు. వారు పరిస్థితులకు ఎదురీది డచ్ వారి వోడలలో రహస్యంగా సముద్రమార్గంగుండా ప్రయాణించి బర్మా, ధాయిలాండ్, కంబోడియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లి అక్కడి భిక్కు సంఘాల సహకారంతో శ్రీలంకలో సుమారు రెండువందల సంవత్సరాల క్రితం భిక్కు సంఘాన్ని పునరుద్దరించుకోగలిగారు.

ఈసందర్భంగా భిక్కునీ సంప్రదాయాన్ని పునరిద్ధరించాలని బౌద్ధ సంఘంగానీ, బౌద్ధ దేశమని అధికారికంగా ప్రకటించుకున్న ప్రభుత్వాలుగానీ భావించలేదు. అయినప్పటికీ అక్కడ స్త్రీలకు బౌద్ధ సన్యాసినులైన భిక్కునీలుగా మారాలనే కోరిక చావలేదు. వారు తమకంటే పెద్దవారైన భిక్కునీల ద్వారా దీక్ష తీసుకుంటూనే వున్నారు. అయితే వారి బౌద్ధ దీక్షను ప్రభుత్వాలుగానీ, భిక్కు సంఘం గానీ గుర్తించి గౌరవించిన పాపానపోలేదు. వినయ సూత్రాల ప్రకారం వారు పురుష భిక్కు సంఘం ద్వారా అత్యున్నతమైన దీక్ష తీసుకున్నప్పుడే వారికి అధికారికంగా బౌద్ధ భిక్కునీలుగా గుర్తింపు లభిస్తుంది. అందుకు పురుష భిక్కు సంఘం నుంచి అంగీకారం లేదు.

శ్రీలంకలో పుట్టి పెరిగిన బౌద్ధురాలు డా. కుసుమ దేవేంద్ర అమెరికాలో మాలిక్యులర్ బయాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి అక్కడే ఒక కాలేజీలో సైన్స్, ఇంగ్లిష్ బోధించింది. కొంతకాలం వైవాహిక జీవితంలో పిల్లలను కని పెంచింది. ఒక కొడుకు, కూతురు పెరిగి పెద్దవాళ్ళయ్యాక అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె సంసార జీవితాన్నివదిలి బౌద్ధంవైపు మళ్ళింది. భిక్కుని కుసుమ తన గురువు అయిన ‘అయ్యా ఖేమ’(1923-97) స్ఫూర్తితో బౌద్ధ దేశాలలో ప్రాచీన భిక్కుని సంప్రదాయాన్ని తిరిగి నెలకొల్పాలని యెంతో శ్రమించింది. తన దేశంలోని బౌద్ధ సన్యాసినులైన ‘దశశీల మాతల’ స్తితిగతులపై లోతుగా అధ్యయనం చేసింది. ఇండియా, కొరియా, తైవాన్ వంటి దేశాలలో పర్యటించి భావసారూప్యం గల బౌద్ధ గురువుల అండదండలు సమకూర్చుకుంది. ఆమెకు ప్రపంచ బుద్ధిస్ట్ కౌన్సిల్ సెక్రెటరీ,  భారతదేశంలో మహాబోధి సొసైటీ ప్రెసిడెంటు అయిన డా. విపులాచార ధేర వంటి పెద్దల సహకారం లభించింది. అందుకు కారణం ఆమెకు బుద్ధుని సిద్ధాంతంలో ముఖ్యంగా వినయ పీటకంపై వున్న లోతైన అవగాహన, పట్టు అనుకోవచ్చు.

కుసుమ దక్షిణ కొరియాలో ఎంతో శ్రమించి భిక్కునిగా ట్రైనింగ్ తీసుకుంది. పురుష ప్రధానంగా మారిన బౌద్ధ సంఘం నుంచి యెంతో వ్యతిరేకత ఎదురైనప్పటికీ తన జ్ఞానంతో, పోరాట పటిమతో సుమారు వెయ్యేళ్ళ తర్వాత తన స్వదేశం శ్రీలంకలో ధేరవాద భిక్కుని సంప్రదాయాన్ని పునరుద్దరించి ఇరవయ్యో శతాబ్దంలో తానే మొదటి ఆధునిక భిక్కునిగా బుద్ధుడు తన మొదటి బోధను ప్రారంభించిన సార్నాద్ లో వేలాదిమంది మధ్య చరిత్రాత్మకమైన దీక్ష 1996లో తీసుకుంది. ఆమెతో పాటు మరో పదిమంది భిక్కునీలు కూడా దీక్ష తీసుకున్నారు. అయితే వారికి తమ స్వదేశంలో ఎదురైన వ్యతిరేకత భారత దేశంలో ఎదురుకాలేదు. శ్రీలంక భిక్కు సంఘ పెద్దలు వెయ్యేళ్ళ తర్వాత  భిక్కునీ సంప్రదాయంలోకి వచ్చిన స్త్రీలను వెంటనే తమ దేశానికి రావద్దని, వారు రెండు సంవత్సరాలపాటు భారతదేశంలోనే వుండాలని సూచించగా వారు మహాబోధి సొసైటీ అధ్యక్షుడైన డా. విపులాచార ధేర సహకారంతో శ్రీలంకలో మహాబోధి సొసైటీని స్థాపించి దానిద్వారా భారత దేశంలో బౌద్ధ ధర్మ పునరుద్ధరణకు కృషిచేసిన అనాగారిక ధర్మపాల నివసించిన విహారంలో బసచేశారు. అప్పటికే వందేళ్ళు పూర్తి చేసుకున్న ఆవిహారం శిధిలావస్థలో వుంది. విపులాచార యెంతో ధనం వెచ్చించి పాడుబడిన విహారాన్ని బాగు చేయించి శ్రీలంక భిక్కునీల వసతికి అనుకూలంగా మలిచాడు.

కుసుమ దృక్పధం, పనితీరులో గొప్ప పోరాట స్ఫూర్తి , శాస్త్రీయ ధృక్పధంతోపాటు అవసరమైనప్పుడు మంచి సంయమనం పాటిస్తూ నాయకత్వ లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఆమెకున్న ప్రత్యేకతల దృష్ట్యా మహాబోధి అధ్యక్షుడు విపులాచార ఆమెని భిక్కునీ సంఘాన్ని ముందుకు నడిపించమని, ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలిగే  శక్తి తనకున్నాయని ఆమె వెన్ను తట్టి ప్రోత్సహించాడు. ఆమె పట్ల విపులాచార వ్యక్తపరిచిన నమ్మకాన్ని కుసుమ నిలబెట్టుకుంది. ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక బౌద్ధ దమ్మ సభలు, సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు. 1991 లో ‘రంజని’ అనే మిత్రురాలితో కలిసి ‘శాఖ్యాధిత’ పేరున అంతర్జాతీయ సదస్సును పెద్దయెత్తున ఏర్పాటు చేసింది. బౌద్ధ దేశాలలో ప్రభుత్వాలు కూడా భిక్కులకు యిచ్చే గుర్తింపు, ప్రాధాన్యత స్త్రీలకు ఇవ్వకపోవడం శోచనీయమని కుసుమ తరచూ తన ప్రసంగాలలో ఆరోపించేది.

పితృస్వామిక బ్రాహ్మణీయ పోకడలు బుద్ధుడినాటి బౌద్ధ సంఘంలో లేవని తర్వాత వారే అరువు తెచ్చుకున్నారని ఆమె ఆరోపణ. తన గురువైన అయ్యా ఖేమ పేరున ఉత్తర శ్రీలంకలో అంతర్జాతీయ బౌద్ధ ఆరామాన్ని నిర్మించి ఎప్పటినుంచో భిక్కునీలుగా మారాలని ఆశతో యెదురు చూస్తున్న స్త్రీలను సంఘంలో సభ్యులుగా చేర్చుకుంది. బౌద్ధ సిద్ధాంతం, వినయ నియమాలలో తర్ఫీదు పొంది గత యిరవై అయిదేళ్ళలో సుమారు మూడు వందలమంది స్త్రీలు భిక్కునీ సంప్రదాయంలో చేరారు. బౌద్ధంలో ఒకటి శ్రీలంక భిక్కునీల స్తితిగతుల మీద, మరొకటి ‘వినయ పిటకం’ మీద లోతైన పరిశోధన చేసింది భిక్కునీ కుసుమ. అనేక దేశాలలో బౌద్ధం మీద జరిగే సదస్సులకు శ్రీలంక తరపు ప్రతినిధిగా హాజరై అనేక ప్రసంగాలు చేసింది, అనేకమందితో మేధో పరమైన చర్చల్లో పాల్గొంది. అనేక పరిశోధనాత్మక రచనలు చేసి రెండు డాక్టరేట్ డిగ్రీలు పొందిన కుసుమ బౌద్ధాన్ని ఏ పురుష బౌద్ధ పండితుడికీ తీసిపోని విధంగా అధ్యయనం చేసింది.

నిజానికి బుద్ధుడు తన సంఘమనే బల్లకు భిక్కులు, భిక్కునీలు, ఉపాసకులు, ఉపాసికలు నాలుగు పాదాలుగా వుండాలని సూచించాడు. అయితే బుద్ధుని అనంతరం క్రమంగా భిక్కునీ పాదం కుంటుపడి బౌద్ధ సంఘం అవిటిదైపోయింది. యిప్పటికి కూడా చాలా దేశాలలో భిక్కునీ సంప్రదాయం లేదు. కొన్ని దేశాలలో నామమాత్రంగానే వుంది, వారిని మగ భిక్కుల మాదిరి ఎవరూ గుర్తించి గౌరవించరు. ఉదాహరణకు  బర్మా లో బౌద్ధ సన్యాసినులను ఎవరూ గుర్తించరు, వారిని ‘భిక్కుని’ అని పిలవడాన్ని అక్కడి భిక్కు సంఘం అంగీకరించదు. వారు ఎవరికీ చెందని వారుగా, అనాధలుగా, బిచ్చగత్తెలుగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ధాయిలాండ్ లోకూడా యిదే స్థితి. బౌద్ధ దేవాలయాలలో ఆస్త్రీలు పనివారిగా గొడ్డు చాకిరీ చేస్తూ ఎటువంటి గుర్తింపు లేకుండా వున్నారు. థాయిలాండ్ వంటి దేశాలలో వారు పురుషులతో తమకూ సమానమైన గుర్తింపు కావాలని అక్కడి బౌద్ధ సంఘంతో, ప్రభుత్వంతో పోరాడుతున్నారు. మరొకపక్క తమ విద్యార్హతలు పెంచుకోవడానికి శ్రమిస్తున్నారు.

చదువు ద్వారా తమకు లభించే గౌరవం వారిని భిక్కు సంఘాన్ని పరోక్షంగా ఎదుర్కోవడానికి తోడ్పడుతుందని వారి నమ్మకం. నిజానికి డా. కుసుమ చేసింది కూడా అదే! రాజ్యాంగం ప్రకారం ప్రకారం బౌద్ధ ధమ్మాన్ని పరిరక్షించే బాధ్యతలో వున్న దేశాధినేతలకు కూడా వారి వెతలు వినిపించకపోవడం విడ్డూరం. ఆయా దేశాలకు గతంలో రాజులుగా పాలించినవారిలో బౌద్ధ బిక్షువులు కూడా వున్నారు. ఈవిషయంలో మహాయాన దేశాలు ధేరవాద దేశాలకంటే కొంతమేరకు మెరుగుగా వున్నట్టు తెలుస్తుంది. ఉదాహరణకు వియాత్నాం లో పురుష భిక్కు సంఘం వారు భిక్కునీ సంఘాన్ని ఆమోదించినట్టు తెలుస్తుంది. భిక్కునీలు బౌద్ధ సన్యాసినులుగా బైట సమాజంలో వుండే పురుషాధిపత్యం, కుటుంబంలో లింగ వివక్ష వంటి సమస్యల నుంచి బైట పడినప్పటికీ సంఘం లోపల మాత్రం లింగ వివక్షకు గురౌతూనే వుండడం గమనార్హం. క్రైస్తవ సన్యాసినుల విషయంలో కూడా ఈ ధోరణి ఉంటుందని  పరిశీలకులు భావిస్తారు. సంప్రదాయ పితృస్వామిక లక్షణం అన్ని మతాలకు వుంటుందనడానికి ఆయా మతాల సన్యాసినుల స్థితిగతులే సాక్ష్యం.

శ్రీలంక బౌద్ధ సంఘంలో స్త్రీ ప్రాతినిధ్యాన్ని పునరుద్దరించడం కోసం చేసిన కృషి ఫలితంగా సైన్స్ ప్రొఫెసర్ అయిన  డా. కుసుమ దేవేంద్ర బౌద్ధ పండితురాలిగా, ఉద్యమకారిణిగా గుర్తింపు పొందింది. పీఠాధిపతుల పురుష స్వామ్యాన్ని ఎదిరించడంలో ఒక ఆధ్యాత్మిక విప్లవానికి నాందీ పలికిన ఆధునిక భిక్కుని డా. కుసుమ అనేకమంది బౌద్ధ ఉద్యమకారులకు ఆదర్శం. ఆమె ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీన(2021) తన తొంభై రెండో యేట నిర్వాణం పొందారు. భిక్కుని సంప్రదాయాన్ని పునరుద్ధరించడంలో ప్రాణాలకు తెగించి అధికార పీఠాలను, రాజ్యాన్ని డీకొన్న కుసుమ సాహసం, నిబద్ధత స్ఫూర్తి దాయకం. భిక్కుని. డా. కుసుమ దేవేంద్రకు జోహార్లు…

*

చల్లపల్లి స్వరూప రాణి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు