1
అనేకానేక
కపటాల మధ్య నిలబడ్డాను
ముందు కపటమే, వెనకా కపటమే
కుడి ఎడమల కూడా కపటమే
దిక్కుల రహదారుల గుండా
కపటమే పరుగులు తీస్తుంది
2
చూస్తూ చూస్తూ ఉండగానే
ఒక పిడికిలి సడలి పోతోంది
పదిమందిలో కలిసి పాడే..
ఒక రాగం వొలికి పోతుంది
ఒక నినాదం చెదిరిపోతుంది
చూస్తూ చూస్తూ
మౌనంలో కలిసిపోతున్నా .
3
అప్పటికి మౌనాన్ని బుజ్జగిస్తూనే ఉన్నా,
‘అంత త్వరగా నా దగ్గరికి’ రాకని కొంతసేపు తరువాత
మౌనం, చీకటి, అభద్రతా భావం ఉమ్మడిగా నాపై సర్జికల్ స్ట్రైక్ చేశాయి
నన్ను చుట్టుముట్టేశాయి
ఐ కాంట్ బ్రీత్ ….
4
ఎగిరి నడిచే రోజులు పోయి
సాగిలపడే రోజులను చూస్తూ
నాలో మౌనం, మౌనంలో నేను
అప్పటికీ కొంతసేపు మొండికేశాను
కానీ
మౌనం చెదిరిపోయేలా లేదు
నేను మౌన, కపట వలయంలో
తచ్చాడుతూ ఉన్నప్పుడు…
5
దూరానా
“మహారాజుల ఉద్యమ
నినాదాలు వినిపిస్తున్నాయి ..
‘స్వధర్మము’ నా చెంపపై ముద్దిచ్చింది
6
జాంబవంతుడి
చిటికెన వేలుపట్టుకొని
జంబూద్వీప గణ రాజ్యంలోకి
పోతూనే ఉన్నా.
అక్కడ నేనెక్కాల్సిన సింహాసనమును
అంబేడ్కర్ నాకై సిద్ధం చేసి ఉన్నాడు.
అప్పుడు
మౌనాన్ని,కపటాన్నిఎగిరి తన్నేశాను.
*
కపటాన్ని ఎగిరి తన్నేసాను