ఆదరాబాదరా కల

ప్రతి రోజూ ఓ కల

ఇరానీ కేఫ్ లో సెగలు గక్కే

రేపటి మాటల మధ్య గిరికీలు కొట్టి

చాయ్ లో మునిగే

ఉస్మానియా బిస్కట్ మాదిరే

ఉసూరుమంటుంది చివరికి

 

సిటీ బస్సులో మూకుమ్మడి చెమట కంపులో

ఒంటి కాలిపై తపస్సు చేసే ఓ కల

సిగ్నల్ దగ్గర దర్జాగా ఆగిన

బెంజ్ కారులోకి దూరబోయి

దారి తప్పి టైర్ కింద నలిగిపోతుంది

 

సినిమా హోర్డింగులు చూస్తూ

పిచ్చి రాతలు రాసుకునే మేధావి కల

కాలుతున్న సిగరెట్ తో పాటే

చేతిని చురుక్కుమనిపించి

నేల కరుచుకుంటుంది

 

జూనియర్ ఆర్టిస్టు వేషానికే

స్టార్ హీరో కొడుకైనట్లు

కాలరెగరేసే ఆదరాబాదరా కల

ఆనక కృష్ణానగర్ వీధుల్లో

ఒక్క చాన్సంటూ దేబిరిస్తుంది

 

పసి కళ్ళల్లో పుట్టిన పసిడి కల

ర్యాంకుల మురుగులో ఊపిరాడక

డాక్టరుగానో, ఇంజనీరుగానో

నిస్సహాయంగా తేలుతుంది

 

అక్షరాలు దిద్దాలని ఆశపడే

అమాయకపు కల

గోనె సంచిలోకి విసిరేయబడిన

చిత్తు కాగితంలా నలిగిపోతుంది

 

ఆకాశమంతా నాదే అని

గర్జించిన శివంగి కల

అంట్ల అంటుతో పాటే

వంటింటి సింకు నుంచి

పాతాళానికి చేరిపోతుంది

 

ఆశాన్నంటే టవర్లు, ఫ్లై ఓవర్లపై

పరిగెత్తిన సగటు ఓటరు కల

తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడి

దిక్కులేని చావు చస్తుంది

 

పంట పొలాల్లో పుట్టిన మట్టి వాసనంటి కల

పిడికెడు గింజలుగా ఎదిగే సత్తువ లేక

పొలం గట్లపై చెట్లకు ఉరేసుకుంటుంది

 

సమ సమాజమనే

వెలిసిన గుడ్డలేసుకున్న వెర్రి కల

కులమతాలు పులిమే నెత్తురుకు జడిసి

ఎప్పట్లానే దిక్కుల్లోకి కళ్ళు తేలేస్తుంది

 

పిరికిదో.. పిడికిలో..

కల కలే!

కట్టెతో పాటే

స్మశానానికి చేరే కలలే అన్నీ

చరిత్రలో పేజీలు సంపాదించుకునేవి ఏవో కొన్ని

అవి చాలు కదా

కలల కళ్ళల్లో మరిన్ని కలలు మొలిపించడానికి!

*

శాంతి ఇషాన్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు