ఒంటరిపడవ

గాయం
ఎన్ని కుట్లేసినా మానదు

వేలు పట్టి పోలు తిరిగినోడు
ఆటబొమ్మను చేసి వదిలిపోయిండు
ఈ కన్నీటిసముద్రంల
ఒంటరిపడవ బతుకైంది
ఎంతకూ ఒడ్డుకు చేరని అలల్లాగ
పైకిలేస్తూ,విరిగిపడుతున్న

పుట్టినపుడొక పేరు
పేరు బలం కుదరలేదని
పెండ్లీలో ఇంకొక పేరు
బొట్టు తుడిచేస్తూ
మెడ వెక్కిరించేటట్లు ఇప్పుడో కొత్త పేరు
ఇన్ని పేర్లు పెట్టి
ఏ పేరు లేకుండా చేసిండ్రు నాకు

ఏ కార్యంలో
మా చేతులకు పసుపు అంటొద్దు
మమ్మల్ని చూడగానే
ముస్తాబైన బాట కూడా
వెనక్కి మళ్ళి పోతుంది
ఈ బతుకు బ్రతకడం
గాజుపెంకుల మీద నడవడం
రెండూ ఒక్కటే
రాళ్ళకు పవిత్రత అంటగట్టిన ఈ దేశం
మమ్మల్ని మాత్రం
మంచాలుగానే చూస్తుంది

ఒక్క రోజు ఏడిస్తే
తీరిపోయే బాధగాదు
నేను పెట్టుకునే బొట్టుబిళ్ళల వెనుక
పేర్చుకున్న చితిమంటలు నాకే తెలుసు

పింఛను బుక్కు చేతిలో పట్టుకున్నప్పుడు
మురికికాలువలకు కూడా నోరొస్తుంది
మంచి బట్ట కట్టొద్దు
నలుగుట్ల నవ్వొద్దు
మగదిక్కు  లేని ఇల్లంటే
చీమకు కూడా చిన్న చూపే.

ఒక్కో మూలమలుపు కాడ
వేటగాడు మాటువేసి కూర్చుంటాడు
వేటగాడి బాణాల మధ్యలోంచి
అడుగుకో వలని తప్పించుకొని
భయంభయంగా పరిగెత్తుతున్న
లేడిపిల్ల బతుకు నాది

ఇదిగో ,చేయి కడిగిన నీళ్ళతడి
ఇప్పుడే తిన్న బువ్వమెతుకు సాక్షి
నా ఒక్కగానొక్క బిడ్డ కొరకే
ఈ బతుకు, ఈ పోరాటం

ఎండిన మాను లాగ పడున్నప్పడు
చెంబెడు నీళ్ళు కూడా పోయని
ఈ లోకం గురించి నాకెందుకు?

చిరిగిన కాలాన్ని
గుడ్డపేలికల్లాంటి గాయాల్ని
కుట్టుమిషిని మీద
అతుకులు లేకుండ కొత్తగ కుట్టుకుంట.

*

ఈ కవిత చదివాక…

 

తెలుగులో వైవాహిక జీవితం అందులోని బాధల గురించి వచ్చినంతగా కవిత్వం వైవాహిక జీవితాన్ని,భర్త చనిపోయిన తరువాతి జీవితాన్ని గురించి లేదనే అనాలి. సంఘసంస్కరణోద్యమ కవిత్వం వచ్చిన సందర్భంలోనే ఈ వస్తువుపై కవిత్వం ఎక్కువ. తరువాతి కాలంలో వైవాహిక జీవితం వికటించిన జీవితాలు లేవని కాదు, ఆ సంఘర్షణలు పూర్తిగా తగ్గిపోయాయని కాదు. ఈ కాలపు కవిత్వంలో జెండర్ పై జరిగినంత చర్చ ఈ విషయాలపై జరుగలేదు. ఈ కవిత ఆమార్గంలోని లోటును తీర్చింది. -“ఏ కార్యంలో/మా చేతులకు పసుపు అంటొద్దు మమ్మల్ని చూడగానే/ముస్తాబైన బాట కూడా/వెనక్కి మళ్ళి పోతుంది/- లాంటి వాక్యాలు ఇంకా గూడు కట్టుకున్న సంప్రదాయ వారసత్త్వాన్ని చూపుతాయి.

పై అంశంతో పాటు వర్తమాన స్థితి భర్త లేదా ఏ ఇతర తోడులేని స్త్రీలపై సామాజికంగా ఏర్పడ్డ స్థితులను  చిత్రించడం కనిపిస్తుంది.

ఎండిన మాను లాగ పడుండడం/చిరిగిన కాలాన్ని గుడ్డపేలికల్లాంటి గాయాల్ని/కుట్టుమిషిని మీద అతుకులు లేకుండ కొత్తగ కుట్టుకోవడం/కన్నీటిసముద్రంల ఒంటరిపడవ బతుకైంది లాంటి వాక్యాలు సృజనాత్మకబలానికి అద్దం పడతాయి.

వదిలిపోయిండు,చేసిండ్రు-లాంటి క్రియలు/మిషిని,పోలు లాంటి పదాలు ఈ కవిత్వంలోని తెలంగాణా జీవభాషను పట్టిస్తున్నాయి. తెలుగులో అనేక పరిణామలతో కూడిన స్త్రీజివితాన్ని గురించి సమగ్రంగా వచ్చిన దీర్ఘకవితల్లేవు. అలాంటి రచనకోసం ఈ కవిత ఒక ఊహనందిస్తుంది.

  • -నారాయణ శర్మ

తగుళ్ళ గోపాల్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గుడ్డ పేలిక ల్లాంటి గాయాల్ని కుట్టు మిషను మీద అతుకులు లేకుండా కొత్త గా కుట్టుకుంట

  • సంపేశారు సర్.
    అదిరింది కవిత..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు