నా దృష్టిలో కవిత్వమంటే వసంతం రాక మానదని చెప్పే ఒక ఆశావాదం. దాడికి ప్రతిదాడి. సృజనాత్మక ప్రతిఘటన. మనల్ని మనం మానవీకరించుకోవటానికి పనికొచ్చే కళాత్మకమైన పనిముట్టు. ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పోరాటానికి కవిగా నా వంతు సృజనశక్తిని అందించడంలో మనిషిగా కాసింత తృప్తి.
1.
A kind of protest
ప్రియమైన స్నేహితుడా..
నా స్తన్యాన్ని తీసి నీ పెదవులకందిస్తాను
నా గుండెలోని ప్రేమనంతా పాలుగా తాగు
ప్రియమైన స్నేహితుడా..
ఎవరి అనుమతి లేకుండానే
మనిద్దరం తల్లీ బిడ్డలుగా మారిపోదాం.
ఎవరి అనుమతి లేకుండానే
చన్నులనూ, పెదవులనూ తడి చేసుకుందాం.
ఇంకెవరి అనుమతి అవసరం లేకుండానే
ఊపిరి పీల్చినంత సహజంగానే
రోజూ కాసిన్ని నా పాలను తాగు.
బిడ్డకు పాలు పట్టడం నిషేధమైన భూమ్మీద
ప్రియమైన స్నేహితుడా..
కాసింత పాలు పంచుకో!
రొమ్ములోంచి
పువ్వులెలా పూస్తాయో చూపిద్దాం.
పెదాల పైన, హృదయాల పైన
పాల జల్లులు ఎలా కురుస్తాయో చూపిద్దాం.
తల్లి మేను తాకనివ్వని సైనికుల పైశాచిక
ఆనంద డోలికల్లో,
అమ్మలను చూడనివ్వని యుద్ధంలో,
నాలో అమ్మను చూడటానికి త్వరపడు.
నియంతలను ఓడించడం కోసం
ప్రియమైన స్నేహితుడా..
త్వరగా పసిబిడ్డగా మారిపో!
2.
చావడానికి సమయం లేదు
అమ్మను కోల్పోయిన పసిపిల్లకి
నేనొక అమ్మను కావాలి
రొమ్ముపాలను అక్షరాల్లో నింపాలి
ఎన్నో గాయాలను కవితల్లోకి వొంపాలి
కొన వూపిరితో చెబుతున్నాను
చావడానికి సమయం లేదు.
కూల్చబడ్డ ఇంటిలో
సగం కాలిన ఒంటరి పిల్లిని సాదుకోవాలి
పతంగులతో బాంబులను వెనక్కు నెట్టాలి
కొన వూపిరితో చెబుతున్నాను
చావడానికి ఏమాత్రం సమయం లేదు.
కన్నీళ్ళతో, సిరా చుక్కలతో
ప్రేమను దారపోయాలి
దాగుడుమూతలాడుతున్న సూర్యుణ్ణి పట్టుకొని
సూర్యోదయాన్ని ప్రకటించాలి
కోటానుకోట్ల సూర్యోదయాల రుచి చూడాలి
కొన వూపిరితో చెబుతున్నాను
చావడానికి సమయం లేదు.
ప్రియురాలిని కౌగిలించుకొని
నుదుటి మీద ముద్దు పెట్టి
ఆమె కళ్ళల్లో వెన్నెల కాంతుల్ని చూడాలి
కొన వూపిరితో చెబుతున్నాను
చావడానికి ఏమాత్రం సమయం లేదు.
*
బావున్నాయి రెండు కవితలు
బావున్నాయి కవితలు