గుర్తింపు చేదా? అవార్డు విషమా?

ఇవాళ అనేక సమూహాలతో పాటు రచయితల శిబిరంలోనూ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. పుస్తకము కాదు, పుస్తకాలు వేస్తున్నారు.  తొలి రచనకు తొలి పుస్తకానికి అట్టే ఎడం ఉండడం లేదు. ఆవిష్కరణ సభలు, వాటి వేదికలు మారుతున్నాయి. అప్పట్లో సభలో ఎవరైనా టీనీళ్లు పోయిస్తే ‘పర్లేదోయ్, మర్యాదలకు తక్కువ చేయవు’ అన్నట్టు చూసేది. ఇవాళ స్నాక్స్ ధర్మరాజులు పెరిగారు.

1

తెలుగు సాహితీ ప్రపంచంలో అవార్డుల చుట్టూ పేరుకుపోయిన హిప్పోక్రసీని చూసినపుడు ప్రహసనం అనే కళారూపం గుర్తుకు వస్తుంది. ఊబి గురొస్తుంది. ఈ వాదవివాదాలతో అంతగా పరిచయం లేని వారు అదాటున ఇక్కడ జరిగే చర్చలను చూస్తే ఆశ్చర్యంతో గుమ్మడిలా గుండె పట్టుకోవడం ఖాయం. అంత extreme  వాదనలు, అంత తలతిరుగుడు ఆచరణా కనిపిస్తుంటాయి. ప్రభుత్వ పురస్కారాలకు వ్యతిరేకంగా బాకులు, చాకులు , సమురాయ్ కరవాలాలు నూరుతున్న శబ్దం ఎటు చూసినా వినిపిస్తా ఉంటది. అందులోనే కొన్ని కత్తులు ఢిల్లీ, హైదరాబాద్ సర్కారీ కారిడార్ల్లో నట్లు కొడుతూ కనిపిస్తాయి. అవార్డులను, ప్రభుత్వ వేదికలను గాండ్రించి ఖాండ్రించిన వారే నాలుకలు జాపుకుని పరిగెత్తడం కనిపిస్తుంది.

సర్కారీ అవకాశాలు అందుబాటులో ఉండడం- లేకపోవడం అనేదానిమీద మన సానుకూలత- వ్యతిరేకత ఆధారపడే పరిస్థితి పొడుచుకుని వస్తా ఉంది. తనకు రానంత వరకూ ప్రతి దాన్ని నట్టుకు నట్టు బోల్టుకి బోల్టు చీల్చి చెండాడిన మనిషి సడన్ గా సైలెంటయిపోవచ్చు. కాసేపట్లో అవకాశం దొరగ్గానే అమ్మదొంగా అనిపించొచ్చు. ఆ కష్టాలు పగవాడికికూడా వద్దు. దూరంగా ఉన్నంత సేపూ అంత వెలపరమూ, అందుతుందేమో అని అనుమానం రాగానే అంత సలపరమూ రెండూ భరించలేని హింసలే.

ఈ కష్టం ఈ నాటిది కాదు. చైతన్యం కంటే సింబాలిజం ముఖ్యం అయిపోయిన, ఆలోచన కంటే ‘మీ శాసనం పాటిస్తున్నాం ప్రభువా’ అనే విధేయత  ముఖ్యమైపోయిన రాజకీయాల ప్రభావం ఉన్నది. సర్కారీ పురస్కారాలు అందుకుంటే పాలకులతో మిలాఖత్ అయినట్టే అన్నంత దూరం తీసికెళ్లడంలో సమస్య ఉన్నది. అనవసరమైనటువంటి ఆచరణ సాధ్యం కానటువంటి సింబాలిజమ్ మొదటికే మోసం తెస్తుంది. సర్కారీ పురస్కారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయువారు బలంగా ఉన్నారనిపించినన్ని రోజులూ అవార్డు వ్యవహారం బెల్టు చాటు చిరుబొజ్జ మాదిరి కంట్రోల్ట్ ఎక్స్ప్రెషన్ గా ఉండి వారి స్వరం బలహీనపడగానే తొమ్మిదినెలల గర్భిణీ లాగా మారింది. ప్రతివాళ్లు పలకరించి కుశలప్రశ్నలు వేసేలాగా మారింది. పూదండలో మంగళసూత్రం దాచుకున్న పురోగామి వేదిక పెళ్లిళ్ల లాంటి విషాదాలు చాలానే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా దీని గురించి ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అనేకమున్నవి. అవన్నీ సరే, ఇంతకీ అవార్డులు మంచివా, చెడ్డవా! తీసుకోదగినవా, దగనివా! అందులో విషపూరితమైనవి, చేదైనవి, చిరుచేదైనవి, తీయనైనవి అనే విభజన ఎవరు చేసితిరి, వాటి కొలబద్దలేమి?  ఫలానా అవార్డు తీసుకుంటే సర్కారీ బంట్లు తీసుకోకపోతే ధిక్కారపతాకములు అనే ద్వంద్వం సమంజసమైనదేనా! గుర్తింపు చేదా, అవార్డు విషమా!

పశ్చిమదేశాల్లో మన దగ్గర లాగా థూ యాక్ అనే extreme వాదనలు వినిపించవు. బహుశా మన దగ్గర ఉన్నంత అసహ్యకరమైన పైరవీల తాకిడి కూడా లేదనే అనిపిస్తుంది.  అవార్డులను ప్రతిభకు కొలమానాలుగా గుర్తించే స్థితి ఉన్నది. అవార్డులు వారి ప్రొఫెషనల్ జీవితాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ అవార్డులను పక్కనబెట్టినా ఇతరత్రా రంగాల్లో ఉండే అవార్డులకు కూడా తగిన గౌరవం మన నేలమీద లేకపోవడానికి కారణమేమిటి? భావజాల పరమైన కారణాల బలమెంత? అసలైన కారణాలేమి? అవార్డుల ఎంపికలో నిర్దుష్టమైన ప్రమాణాలు లేకపోవడమా! పెట్టుకున్న ప్రమాణాలను సైతం పాటించకపోవడమా! ఇంకా ఏమైనా ఉన్నాయా!

అటో ఇటో నిజంగా తేల్చేసుకున్న వారితో ఇబ్బంది లేదు. ఒకరు నన్ను గుర్తించేందెటహె అనుకుంటే బోడిగుండంత సుఖం. పైగా రచయిత తనను తాను వ్యవస్థగా మార్చుకోకూడదు అని సార్త్ర్‌పక్కన చిన్నదో పెద్దదో పీట వేసుకోవచ్చు. ఆ స్కూల్‌కు గౌరవం ఉంటుంది. ఏ అవార్డు నన్నేమీ మార్చలేదు, ఎవరిచ్చినా తీసుకుంటా, నేనేం చెప్పాలో అదే చెప్తా, అలాగే ఉంటా అని బాహాటంగా ఉంటే అది కూడా ఎండాకాలం మధ్యాహ్నం కాశీ తువ్వాలు నడుంమీదేసుకున్నంత సుఖం. సరమాగో స్కూల్ అని కూడా తలెగరేసుకోవచ్చు. అనువాదాలు అరుదై భాషా ప్రపంచం బావిగా మారిన చోట నిజంగానే అనేకానేక అంశాలు ఉపయోగపడొచ్చు. మన రచన అనేకభాషల్లోకి తర్జుమా కావడం అనేక రాష్ర్టాల్లో మన వాణి వినిపించే అవకాశం రావడం లాంటివి బోలెడన్ని ఉండొచ్చు. అవి చిన్న ప్రోత్సాహలేమీ కాదు. ఏదైనా సూత్రబద్ధ వైఖరి స్పష్టంగా ఉన్నపుడు కథ వేరు. సమస్య హిపోక్రసీతో. ఫలానాది పర్వాలేదు గానీ ఫలానాది మాత్రం ఇబ్బంది, ఫలానా టైంలో తీసుకున్నా పర్లేదు కానీ ఫలానా టైంలో తిరస్కరించకపోతే ఇబ్బంది అనుకునే స్కేళ్లు సంక్లిష్టమైనవి. సాహితీ రంగంలో వాటిని చూడడమెట్లా. వాటి చుట్టూ సాగే ఆటలో నియమాలు ఏమిటి? ఆ నియమాలు నిర్దేశించేది ఎవరు, వ్యక్తులుగా ఎవరికి వారా, లేక సంస్థలా, లేక డైలెక్టికల్ పద్ధతిలో రెండూనా! అసలు నిర్దేశించాల్సింది మనం నమ్మే విలువలా, లేక బయటి ఒత్తిడా! రెండోదే అయితే ఉండే ఇబ్బందులేమిటి?

కొన్ని విషయాలు నిజంగానే నమ్ముతూ దానితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయినపుడు గుర్తింపు బ్యాక్ సీట్ లోకి వెళ్లిపోతుంది. ఆ భావజాలమో విలువలో అవేవో నడిపిస్తాయి. తన శక్తిని సమయాన్ని సమూహం కోసం వినియోగంచడం ప్రధానంగా ఉంటుంది. నాకేంటి అనేది ముందుకు తోసుకురాదు. తెలుగు నేలమీద మనం రచయితలుగా పిలుచుకుంటున్న సమూహం అంతా దాదాపు పురోగామి సమూహమే. ఏదో ఒక వామపక్ష ఛాయకు, ఏదో ఒక బాధిత సమూహపు ఛాయకు దగ్గరకు ఉండే రాసే వారే ఎక్కువ. అయితే ఆయా భావజాలాలతో విలువలతో ఎమోషనల్ ఎటాచ్ మెంట్ ప్రధానంగా ఉన్నన్నిరోజులు గుర్తింపు తపన అంత వికృత రూపం తీసుకోలేదు. కానీ ఆయా భావజాల ప్రవాహాలు ఎపుడైతే పలుచన బడ్డాయో అపుడే పరిస్థితి మారిపోయింది. సామూహిక వివక్షను తమ గుర్తింపుకు అనుకూలంగా క్యాష్ చేసుకోవాలనుకుంటారు. రెంటెడ్ క్లాస్ లాగా చేసిన పనికి రాసిన రాతకు గుర్తింపును చక్రవడ్డీతో సహా కోరుకుంటారు. మనకు ఒక వేదికమీదకు పిలుపో ఒక అవార్డో రానప్పుడల్లా సమూహాన్ని అడ్డం పెట్టుకుని ఫలానా సమూహానికి అన్యాయం జరిగింది అని గగ్గోలు పెట్టే వ్యవహారంగా మార్చుకుంటారు. నాకు రాలేదు అనకుండా మాకు రాలేదు అంటారు. ఫలానా బాధిత సమూహానికి అన్యాయం జరిగింది అంటారు. తనకు పురస్కారం వస్తే ధర్మం నాలుగు కాళ్లతో నడుస్తున్నట్టు! లేకపోతే కుంటుతున్నట్టు. ఏవో కొన్ని సందర్భాల్లో అందులో న్యాయం కూడా ఉండొచ్చును గానీ ఎక్కువ సందర్భాల్లో అది వాళ్ల వ్యక్తిగత గుర్తింపు గొడవగానే కనిపిస్తుంది.

గుర్తింపు ప్రమాణాల గురించి అవార్డుల గురించి శాస్ర్తీయ విశ్లేషణ చేయాలంటే కొన్ని పరికరాలు కావాలి. డేటా కావాలి. నిర్వచనం(నిర్వచనాలు), కొలబద్దలు, దాన్ని ప్రభావితం చేసే విభిన్న అంశాలు(వేరియబుల్స్), విభిన్న వింటేజ్ పాయింట్స్, అందులో నువ్వు నించున్న చోటేదో నిర్ధరించి శాస్ర్తీయంగా అదే నిజమైన వింటేజ్ పాయింట్ అని చెప్పగలిగే విశ్లేషణ చట్రం లాంటివేవో కావాలి. అంతదూరం వెళ్లబోవడం లేదు. నో బోరింగ్ టాకింగ్. తెలుగువారము తెలుగులోనే మాట్లాడుకుందాం.

2

అవార్డు అనగా నేమి? ఏదైనా పనికి గుర్తింపుగా ఇచ్చే నగదు లేదా బహుమతి. గుర్తింపు కోరుకోవడం దానికదిగా నేరమేమీ కాదు. రచయితలంతా ఏదో ఒకరకమైన గుర్తింపును కోరుకునేవారే. పైగా మన దేశంలో రచయితలకు తమ రచనలమీద ఆదాయం లభించడం అరుదు. రచనలమీదే బతికేయవచ్చు అనే భరోసా సంపాదించినవాళ్లు అరుదాతి అరుదు. కాబట్టి రచనవైపు డ్రైవ్ చేసేది ఏమిటి? ఏదో ఒక విశ్వాసం, ఏదో చెప్పాలన్న తపన(వ్యక్తీకరణేచ్ఛ), గుర్తింపు. మనుషులను బట్టి, వాళ్లున్న స్థానాన్ని బట్టి వాళ్లున్న కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వాళ్ల వయస్సులను బట్టి వీటి శాతాలు మారుతూ ఉంటాయి. ఈ పద్ధతులు కాలప్రవాహంలో మారుతూ వస్తున్నవి.

ఇరవై-పాతికేళ్ల క్రితం అయితే పుస్తకం వేసుకోవడం అనేది పెద్ద పండుగ లాంటిది. అప్పట్లో ఓ మోస్తరు పుస్తకానికి 20 వేలు ఖర్చు అయ్యేది-పుస్తకానికీ, ఆవిష్కరణ సభకీ. అప్పుడున్న ఆర్థిక స్థితిగతుల్లో రచయిత మళ్లీ పెళ్లి చేసుకున్నట్టే. నిజార్థంలో పెళ్లి దాని పూర్వోత్తరాల్లో ఎంత సంబరమో ఇదియునూ అంతే! ఏక గ్రంథకర్తలే మెజారిటీ. పుస్తకం వేసుకోవడం సాహితీజీవనానికి సార్థకత లాగా భావించేవారు చాలామందే కనిపించేవారు. అంత కష్టమైనపుడు సభ ఎందుకు అనబోదురేమో, అది క్రూయాలిటీ ఆన్ హ్యూమానిటీ. చాలా సందర్భాల్లో సభ కోసమే పుస్తకమేమో అన్నట్టుండేది. సభలో నలుగురు నాలుగు మంచి మాటలు మాట్లాడితే ఇన్నాళ్లూ రాస్తూ వచ్చినందుకు సార్థకత దక్కింది అని పొంగిపోయి ఆ పొంగును మొకంలో కనిపించకుండా ఉంచుకోవడానికి నానా తిప్పలూ పడి నాలుగైదు రోజుల పాటు దాని గురించే నలుగురి దగ్గర చర్చ వచ్చేలా ఏదో రకంగా చేస్తూ అదొక రకమైన అనిర్వచనానందం. చాలా దూరం ఎండలో నడిచాక వేప చెట్టు కింద కూచుని సేదతీరినట్టే. రచయితగా నాలుగు నోళ్లలో నాని వయసూ కలమూ ముదిరితే తప్ప పుస్తకం వేసుకోవడం సాధ్యపడేది కాదు. ఇవాళ అనేక సమూహాలతో పాటు రచయితల శిబిరంలోనూ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. పుస్తకము కాదు, పుస్తకాలు వేస్తున్నారు.  తొలి రచనకు తొలి పుస్తకానికి అట్టే ఎడం ఉండడం లేదు. ఆవిష్కరణ సభలు, వాటి వేదికలు మారుతున్నాయి.

అప్పట్లో సభలో ఎవరైనా టీనీళ్లు పోయిస్తే ‘పర్లేదోయ్, మర్యాదలకు తక్కువ చేయవు’ అన్నట్టు చూసేది. ఇవాళ స్నాక్స్ ధర్మరాజులు పెరిగారు. భోజనాల భోజరాజులు సైతం ఉన్నారు. ఉపన్యాసాలతో పాటు నల్లులను ఒకేసారి భరించే రోజులు తగ్గిపోతూ వేదికలు మెల్లగా ఎసి హాళ్లకు మారుతున్నాయి. మంచి మార్పే. రచయితలు ప్రధానంగా ధిక్కార స్వరాలని అట్లా ఏదో వినిపిస్తూ ఉంటుంది తరచుగా. మిగిలిన ధిక్కారాల సంగతేమో కానీ మార్కెట్ సూత్రాన్ని మాత్రం ఎప్పుడో ధిక్కరించేశారు. చాలా సందర్భాల్లో మనం వేసే పుస్తకాలకు మార్కెట్ డిమాండ్‌కు సంబంధం లేదు. చేతి చమురు వదిలించుకునే కదా పుస్తకాలు వేసుకునేది. పాఠకులు ఎంతో కొంత పెరిగారు, ముఖ్యంగా కథలకు పెరిగారు అని తెలుస్తోంది కానీ పుస్తకాల సంఖ్య పెరిగినంత వేగంగా పెరగడంలేదని తెలుస్తున్నది. ప్రచురితమవుతున్న పుస్తకాల్లో కనీసం సగం బాక్సుల్లోనే అనేదైతే తెలుస్తోంది. (ఏడాదికి ఎన్ని పుస్తకాలు అచ్చవుతున్నాయి, ఎన్ని అమ్ముడవుతున్నాయి అనే నిర్దుష్టమైన డేటా దొరకడం లేదు. విశాలాంధ్ర-నవ చేతన, ప్రజాశక్తి-నవ తెలంగాణ, ఎమెస్కో వంటి ప్రచురణ సంస్థల వద్ద డేటా సేకరించి క్రోడీకరించి ఎవరైనా పరిశోధన జరిపితే చాలా ఉపయోగం.) సమాజహితం కోసం సొంతసొమ్మును అలా విసిరిపారేసే త్యాగానికి ఆశించే ప్రతిఫలం కేవలం గుర్తింపు మాత్రమే. గుర్తింపు తప్పెలా అవుతుంది?

అప్పట్లో వేయి కాపీలు వేస్తున్నారంటే ఎగాదిగా చూసేది , ఏమిరా ఇతగాడి ధైర్యంబు అన్నట్టు. ఎంత స్పీడ్‌గా ఫ్రెండ్స్‌కి పంచినా కాపీలు అయిపోయేవి కావు. ఇవాళ వెయ్యే బేసిక్. పాఠకులు ఎంత పెరిగారన్నది పక్కనబెడితే రచయితలైతే ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు. కవుల కర్మాగారాలొచ్చి కరువు లేకుండా చేశాయి. పంచడం సులువు. ఆవిష్కరణ రోజే వంద పంచేసి(సుబ్బారావు మీ వైపే కదా ఉంటాడు, అతనికి ఇవ్వవా అనే కేటగిరీలో కొందరికి రెండూ మూడూ పంచినచో) ఇంకో వంద వారంలో డోర్ డెలివరీ చేసి ఇంకా ఎవరైనా ఇంటికొస్తే ఇవ్వాలిగా అని ఉదారత్వపు ముందుచూపుతో ఇంట్లో రెండొందలు పెట్టుకుని ఆరొందలు అనేక షాపుల్లో పెట్టి , వారంలోనే తొలి ముద్రణ అయిపోయాయి_రెండో ముద్రణకు వెడుతున్నా అనగలిగిన వెసులుబాటు-డబ్బులు ఇవాళ చాలామంది రచయితలకు ఉన్నాయి. టీచర్ల జీతాలు భారీగా పెరిగాయి కాబట్టి ముద్రణలో విజృంభణ మనం ఇక ముందు చూడొచ్చు. వాళ్లను కూడా గవర్నమెంట్ పిండుతోంది గానీ ఎంత పిండినా ఇతరత్రా ఉద్యోగాలతో పోలిస్తే ఇప్పటికీ కూసింత తీరుబడి కలిగిన సమూహం టీచర్లే. కాబట్లి మరికొన్నేళ్లు రచయితలు, ఉద్యమవర్గాల్లో వాళ్లదే సింహభాగం.

పంచిన వాళ్లలో పదో వంతైనా పంచదార లాంటి మాట చెపితే అదో తృప్తి. కొందరు మర్యాదస్తులుంటారు. మొన్న మనకు పుస్తకం పంచిన ఏ కవి ఎదురుపడి గల్లా పట్టుకుని గౌరవంగా అడిగే అవకాశం ఉందో గుర్తించి రెండు వాక్యాలు ముక్కుకు తగిలించుకుని సభకు హాజరుకావడం బాధ్యతగా భావిస్తారు. ఒక్కోసారి ఎంతమంది పాఠక రచయితలను కలిస్తే అంతగా వారు మన పుస్తకం చదువలేదని, మనం కష్టపడి చేతిలో పడేట్టు చేసినా ఫలితం లేకపోయిందని జ్ఞానం విచ్చుకుంటుంది. జ్ఞానదంతం నొప్పిలానే ఇదీనూ. దీనికి తోడు రచయిత పంపించినప్పటికీ పుస్తకం చదువలేకపాయాయని ప్రధాన అతిధి మన వేదిక మీద చిదానందంగా చెప్పి ఆ తర్వాత గంట పాటు ఉపన్యాసమిస్తాడు చూడూ, అది మాత్రం జ్ఞానదంతానికి కాలిముల్లు యాడ్ అయినట్టు. వర్షంలో తిప్పలు పడి ఆటోలో ఇంటికొచ్చి మరీ పుస్తకమిస్తే ఇక్కడికొచ్చి ఇట్లా ఫోజులు కొడతావా..అని రచయిత తనకు చేతనైనా బూతుభాషను జోడించి పండ్లు పటపటలాడిస్తూ ఉంటాడా…అదే సమయంలో ప్రధాన అతిథుల వారు తాను పలికిన అమృత వచనాలకు ప్రతిస్పందన కోసం రచయిత వైపు చూస్తా ఉంటాడు- చిదానందంగా. పండ్లు పటపట కొరుకుతున్న రచయిత దాన్ని చల్లని ఇకిలింపుగా వేదికమీద చూపాలి. సభా మర్యాద కదా! థర్డ్ డిగ్రీని మించిన టార్చర్ ఇది. అందరూ అలాగే ఉంటారని కాదు గానీ ఆ కొంతమందికైనా ఇంత అడాసిటీ ఎక్కడనుంచి వస్తున్నది! తెలుగు సాహిత్యంపై కొంతకాలంపాటు ఆధిపత్యం చెలాయించిన భావజాలంలో విమర్శకులది పెద్దనోరు కావడం వల్లనో ఏమో తెలీదు కానీ సృజనశీలురపై విమర్శకులనబడే వాళ్ల పెద్దరికం ఇంకా కొనసాగుతున్నది. దాని వల్ల సృజనమీద విశ్లేషణ ఆధిపత్యం కనిపిస్తుంది. బహుశా గతంలో అటువంటి వారి గుర్తింపును రచయితలు కోరుకోవడం వల్ల కొనసాగుతున్న అవశేషం కావచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే రచన ప్రైమరీ, విమర్శ సెకండరీ. సృజనదే మౌలిక పాత్ర అని గుర్తించి తీరాలి.

కానీ మాస్టారూ, ఈ గుర్తింపు అనేది ఉంది చూశారూ, అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలో భూతం కథ లాంటిది. దానికి నిరంతరం ఆజ్యం పోస్తూనే ఉండాలి. అది ఇన్ ఫినిటీ. వచ్చే కొద్దీ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. పైగా అప్పట్లో రాత మొదలెట్టిన ఆరేడేళ్ల తర్వాత ఎవరైనా పెద్దమనిషి ఎక్కడో ఎవరితోనే ఫలానా కుర్రాడు/కుర్రది ఫర్లేదోయ్ అనంటే అది కుడుము కిందే లెక్క. అవి కరువు రోజులు. అన్నింటికి కరువే. పొగిడేనోళ్లకి కూడా. నలుగురైదారేడుగురు పెద్దమనిషి ముద్రాంకితులైన వారెక్కడో ఉందురు. అందులోనూ మనం నమ్మే దాన్ని బట్టి, మనం రాసే పద్ధతిని బట్టి పెద్దమనుషులుంటారు. వారి కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఏళ్లూ పూళ్లూ ఎదురుచూడాల. ఎపుడో వారి చూపు పడాల. పడిందా, అదిక ముత్యపు చినుకే. ఆ ఫ్యూడల్ తతంగం ఇవాళ విచ్చలవిడిగా ప్రజాస్వామ్యీకరణ పొందింది –సోషల్ మీడియా పుణ్యమాని.

ఇవాళ ‘పర్లేదు- ప్రామిసింగ్’ అని గానీ, ‘బాగుంది-కానీ’ అని గాని ఎవరైనా అంటేనా! ‘‘సిగపాయ దీసి తందునా’’ రాసినోన్ని అన్నంత ఆవేశం రావడం గ్యారంటీ. ‘అప్పటికే 129 మంది అద్భుతం అని మృదువుగా ఆశీర్వదించి ఉన్నారు ఎఫ్బీలో. అన్నా నువ్వు కేక, అక్కా నువ్వు పొలికేక అని 93 మంది మంద్రస్వరంతో ఇన్బాక్స్ చేసి ఉన్నారు. ఎట్లా వస్తాయి ఇలాంటి ఆలోచనలు- పదాలు, అనితరసాధ్యమూ మరియూ సూపరున్నూ అని 76 మంది వాట్సాప్లో సున్నితంగా ప్రశంసించి ఉన్నారు. పెద్ద పుడింగి వచ్చి ఇపుడు ప్రామిసింగ్ అంట. బొత్తిగా మర్యాద లేకుండా అడివి మనిషి లాగున్నాడే వీడు. కానీలు అర్థాణాలు ఏడున్నాయిపుడు?  చూద్దాం, వాడూ ఎప్పుడో ఒకసారి పుస్తకం వేసుకోకపోతాడా, చూడకపోతామా, బానే ఉంది- కానీ అనే ఎక్స్ప్రెషణ్ఇచ్చే గుండె కోత ఎలా ఉంటుందో అనుభవించకపోతాడా! వాడి పుస్తకావిష్కరణ రోజు వర్షం రాకపోతుందా, కెమెరా కరప్ట్ అయి ఫొటోలన్నీ డిలీట్ కాకపోతాయా! పరిశుద్దాత్మతో ఇస్తున్న శాపం ఫలించకపోతుందా ! అఫ్ కోర్స్, మనమే అడిగామనుకో. ఏదో తెలిసిన ముఖం, నాలుగు మంచి మాటలు చెపుతాడని కదా అడుగుతాం. (మంచీ చెడ్డా అనేది పాతకాలపు పనికిమాలిన మాట) లేకపోతే ఎందుకడుగుతాం వీడి బోడి సలహా…తరహాలో మనసు మూలుగుట సోషల్ మీడియా యుగధర్మం. సోషల్  మీడియాలో సామాజిక చైతన్యమపారమనంతమమేయమచిత్యం. పిత్రుస్వామ్యపు పొడ గిట్టకపోవడమొక్కటే కాదు, సమాజంలో స్ర్తీలే అధిక్యంలో ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది- మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నంత సేపూ. పురుషుల కంటే స్ర్తీలకు ఆదరణ మీదుమిక్కిలి. వారు గతం కంటే భవిష్యత్తు ఎక్కువగా ఉన్నవారైతే మరి చెప్పనక్కర్లేదు. ప్రోత్సాహమిక కుములోనింబస్ మేఘమే.

3

మనము ఇన్‌స్టంట్ కాలజీవులం. ఇన్‌స్టంట్ కాలం ఇన్‌స్టంట్ గుర్తింపునే కోరుకుంటుంది. గుర్తింపుకు ఘాటు డిమాండూ పెరిగినవి. ఎంత గుర్తింపు వస్తే రచయితకు తృప్తి కలుగుతుంది అనేది చెప్పడం మానవసాధ్యమైన విషయంబు కాదు. గుర్తింపు గుల దీర్ఘరతి లాంటిది. ఎంతకీ భావప్రాప్తి కలుగదు. మిగిలేది మంటే.

ఇదంతా నాణేనికి ఒకవైపే. చుట్టూ రోత అనిపించే రీతిలో గుర్తింపు గుల ప్లేగులాగా వ్యాపించబట్టి అలా అనిపిస్తుంది కానీ రచన వల్ల వచ్చే కీర్తిని మాత్రమే కాకుండా రచనను సీరియెస్గా తీసుకున్నవారు లేకుండా పోలేదు. విమర్శిస్తే చెవి ఒగ్గి వినేవారూ, ప్రశంసిస్తే చిరునవ్వుతో సరిపెట్టేవారూ లేకుండా పోలేదు. గుర్తింపు దానికది తప్పేమీ కాదు. ఏ గుర్తింపు లేకపోతే ఫలానా విషయం బాగుందనో బాలేదనో ఫలానా ఫలానా చోట్ల అలా కాకుండా ఇలా ఉంటే ఇంకా బాగుండేదనో ఏదో ఒకటి ఎవరూ ఎప్పుడూ అనకపోతే రాయడానికి ఉత్సాహమెక్కడినుంచి వస్తుంది? స్పందన లేకపోతే ఎవరి కోసం రాస్తున్నట్టు? రాత ఎలా మెరుగుపడుతుంది? చుట్టుపక్కల ప్రపంచం తన ప్రపంచంగా ఎపుడు మారుతుంది !   కాకపోతే దాని రూపురేఖా లావణ్యాలు ఏంటనేదే ప్రశ్న. జీవితంలో చాలా విషయాల్లాగే ఇక్కడా బ్యాలెన్స్ ముఖ్యం. దానికదిగా వచ్చే గుర్తింపు ఆభరణం. నువ్వు ఆరాటంతో తెచ్చుకునేది గుదిబండ. ఒక్కసారి తెచ్చుకుందామని దిగావా, ఇక దానిచుట్టూ గానుగెద్దులాగా తిరగడమే. మనం ఏదైనా చదివినపుడు మనకు కలిగిన భావాలను రచయితలతో పంచుకోవడం పాఠకులు చేయగలిగిన మంచిపని. ఎవరైనా పాఠకులు మన రచనలను చదివి ఏదైనా ఒక మాట చెపితే కలిగే ఫీలింగ్ నిజమైనది. అవసరమైనది. ఎవరైనా ఏ మోటివ్ లేకుండా నిజంగా నమ్మి మనతో పంచుకునే అభిప్రాయం రచయితకు బలమిస్తుంది. మనం చేయో కాలో, ఎట్సెట్రానో ఊపగానే ఆలమలం అనుకుంటా వచ్చేసే పరాభ్రమ్మ పరమేశ్వర కోరస్ బృందాన్నొకదాన్ని వెంటేసుకుని ఆ మత్తులో జోగుతూ అదే ప్రపంచం అనుకుంటేనే ఇబ్బంది. ఎవరైనా ఎక్కడైనా మన రచన గురించి నాలుగు మాటలు రాస్తే బాగుండుననే కోరిక కూడా ఇబ్బందేమీ కాదు. మనమే మన పరాభ్రమ్మ బ్యాచిలో ఒకరికి రీవ్యూకిచ్చి ఇదిగో మావోడు రీవ్యూ రాస్తాడు వేస్కోవా(కొన్ని సందర్భాల్లో ఫలానా వాడికే ఇవ్వాలి అని వినపూర్వకాదేశం ) అని పత్రికల్లోని సాహిత్య పేజీ ఇన్ చార్జిలకు చెప్తామే అది కష్టం. తప్పో ఒప్పో ఏదైనా నమ్మే మాట్లాడతారు అనే నమ్మకమున్న వారెవరైనా స్పందించి ఒక మాట మాట్లాడితే బాగుండుననుకోవడం, వారికి మన రచన చేరలేదంటే పంపించి చదివి చెప్పమనడం లాంటి వాటితో ఇబ్బందేమీ లేదు. సూపర్ లేటివ్స్ మాత్రమే అలవాటైన వారి చల్లని చూపు కోసం వసుదేవుడి వేషాలు వేయడం ఇబ్బంది.

గుర్తింపు వ్యవహారంలోఅవార్డులది కీలకపాత్ర. అవార్డు సభ ఖర్చు మనం పెట్టుకోనక్కర్లేదు. టీనీళ్లు సమోసాలు మనం ఇవ్వనక్కర్లేదు. పైగా నిర్వాహకులు కూసింత మంచీ మర్యాదా ఉన్నోళ్లయితే ఎవరయితే మనల్ని చక్కగా పొగుడుతారో తెలుసుకుని మరీ పిలుస్తారు. పైగా ఇపుడు అవార్డుల సంఖ్య పెరిగింది. డబ్బులు పెరిగాయి కాబట్టి ఆయా జిల్లాల్లో పారే సెలయేర్లు- నదుల పేర్లమీద, ఏడాదికి పదివేలు ఖర్చుపెట్టి పత్రికల జిల్లా పేజీల్లో డబుల్ కాలమ్ ఫొటో చూసుకునే వెసులుబాటు ఉన్నవారి వల్ల అవార్డుల సంఖ్య పెరిగింది. సర్కారీ అవార్డుల కేటగిరీలు కూడా పెరిగినట్టు అనిపిస్తోంది. వాటికుండే గ్లామరూ ప్రయోజనాలు వేరనుకోండి. అవార్డుల్లో కొన్నే ఎందుకు వివాదాస్పదమవుతున్నాయి, ఆ కొన్నింటికే డిమాండ్ ఎందుకు అధికంగా ఉంటున్నది, పైరవీలు అధికంగా సాగుతున్నవి, ఈ హిప్పోక్రసీ వెనుక పనిచేస్తున్న అంశాలేమిటి అనేది వచ్చేకోటాలో చర్చించుకుందాం.

 

 

జీ.ఎస్. రామ్మోహన్

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “మిగిలిన ధిక్కారాల సంగతేమో కానీ మార్కెట్ సూత్రాన్ని మాత్రం ఎప్పుడో ధిక్కరించేశారు. చాలా సందర్భాల్లో మనం వేసే పుస్తకాలకు మార్కెట్ డిమాండ్కు సంబంధం లేదు. చేతి చమురు వదిలించుకునే కదా పుస్తకాలు వేసుకునేది. పాఠకులు ఎంతో కొంత పెరిగారు, ముఖ్యంగా కథలకు పెరిగారు అని తెలుస్తోంది కానీ పుస్తకాల సంఖ్య పెరిగినంత వేగంగా పెరగడంలేదని తెలుస్తున్నది. ప్రచురితమవుతున్న పుస్తకాల్లో కనీసం సగం బాక్సుల్లోనే అనేదైతే తెలుస్తోంది”

    ఈ విశ్వసనీయ వర్గాల భోగట్టా ఎందుకు మధ్యలో? నిజమేగా…

    అన్నట్టు దీన్నే తెలుగు పబ్లిషర్స్ యొక్క Appropriation of Capital అందురా? అనరా?

  • కళ్ళు తెరిపించేశారు బాబోయ్..
    అద్భుతం.. అక్షరక్షరమూ నిజం.

  • నిజాలనెన్నో నిండైన వాక్యాల గుండా నిర్మొహమాటంగా నడిపించారు…ధన్యవాదాలు

  • రామ్మోహన్ గారూ, మీ వ్యాసం … ముంజేతి కంకణాన్ని అద్దంలో మరోమారు చూపించినట్టుంది. ఈ విషయాలు సాహిత్య ప్రపంచంలో తెలియని వారెవరైనా ఉన్నారునుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. నాలుగు కథలో ,కవితలో రాసిన యువరచయితలు/కవులు తాము ఏ చెట్టు నీడచేరితే తను కు తొందరగాస్వాంతన చేకూరుతుందో చూసుకుంటున్నారు.
    వటవృక్షాలు అనుకుననవి సైతం కొత్త పక్షులను తమచెంతకు ఎలా ఆకర్షించాలో అని తపన పడుతూ దుర్భినీ వేసి మరీ వెతుకుతున్నాయి.గురువర్యా! అంటే శిష్యరత్నమా అనుకుంటూ పరస్పర ప్రయోజన కరస్పర్శలతో కాలాన్ని వేడెక్కి స్తున్న సందర్భాలు కళ్లముందు కదలాడుతునేవున్నాయి.
    గతకాలపు విప్లవ ప్రవచనకారులు సైతం ఈ చలిని తట్టుకోలేక సన్మానాల శాలువాలకింద ముడుచుకొని వెచ్చదనాన్ని పొందుతున్న స్థితి ఇది.
    అయినా వాళ్లను తప్పు పట్టనక్కరలేదనుకుంటాను.
    పెట్టుబడిదారీ సమాజంలో ఫ్యూడల్ సమాజపు కొలమానాలు చెల్లివుగదా.నేటి సమాజపు నీతి ఇది . అది ఏరంగమైనా దండుకున్నోళ్లకు దెండుకున్నంత ..కనుక అది కొనసాగుతునే వుంటుంది

  • రామ్మోహన్ గారికి కృతజ్ఇతలు. మంచి అంశాన్ని చర్చలోకి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా నా అభిప్రాయాన్ని పంచుకోవాలని అనుకునే ఈ ప్రయత్నం.

    ఆశలకీ , ఆడిపోసుకోవడానికి కారణం వ్యవస్థలోనే ఉందని అనుకుంటాను. ఆ వ్యవస్థకి వారు అతీతలమని ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు గాని, సమూహం దృష్ట్యా చూసినప్పుడు వారు సన్న, చిన్న కారు రైతుల్లానే కనిపిస్తారు. ‘నేను’ అనే ఆస్తి పర లక్షణాన్ని… భూమి తనకి ఉంటేనే ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఏ విధంగా అయితే ఈ వ్యవస్థ పదేపదే ప్రచారం చేస్తుందో…అవార్డు అనేది కూడా రచయతకి అటువంటి లక్షణాన్నే అందిస్తుంది. ఆ లక్షణానికి ప్రత్యామ్నాయమని అని అనుకునేవాళ్లు(దేశీయంగా) కూడా మరో కొసన అదే లక్షణాన్ని ఎత్తిపట్టుకుంటున్న పరిస్థితి. రెండుదారులూ ఒకే మార్గాన్ని నిర్ధేశిస్తున్నప్పుడు చిన్న ఉత్పత్తిదారుడు సహజంగానే అధిక గుర్తింపు అనే గొడుగు కిందకే చేరుతాడు. అందుకోసం అనేక పాట్లు పడతాడు. మిగులును ఖర్చు చేస్తాడు. ఆ మిగులు లేకపోతే అప్పులు చేస్తాడు. ఆ పరపతి లేకపోతే ఏదొక సంస్థ కిందకు చేరి రుణం పొందుతాడు. కడకు అత్యధిక శాతం మట్టినే తింటాడు. ఇది ఈ వ్యవస్థ సృష్టించే ఓ మాయావలయం. ఈ వలయం చుట్టూనే గుమిగూడేవాళ్లని కాకుండా, గుమిగూడేటట్లు చేసే వాళ్ల పట్ల లెనిన్ గ్రామీణ పేదలు అనే గ్రంథంలో అద్భుతమైన ఉపదేశం చేశారు. సందర్భోచితమని అనుకుని ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ” ఓ పెద్ద రైతు తన వద్ద 50 రూబుళ్లు విలువ చేసే ఆవు ఒకటి ఉంది. దానిని లాటరీ పద్దతిలో ఒక రూబుకే ఇవ్వాలని అనుకున్నాడు. అది ప్రకటించాడు. ఒక్కో రూబు చొప్పున లాటరీని అమ్మజూపాడు. ఆ విధంగా ఒక్క రూబుతోనే 50 రూబులు విలువ చేసే ఆవుని దక్కించుకునే అవకాశం అందరికీ కలిగింది. ఆ దుర్బుద్ది వలన కుండపోతలా రూబుళ్లు అతని ఒడిలో వచ్చి పడతాయి. వంద రూబుళ్లు వచ్చినంత వరకూ వేచి చూసిన తరువాత లాటరీ వేస్తాడు. ఆ లాటరీలో ఒక రైతు దక్కించుకుంటాడు. మిగిలిన వారికీ ఏమీ దొరకదు. ఆ విధంగా చూసినప్పుడు.ప్రజకి ఆవు చవకగా దొరికినట్లు ఎంత మాత్రమూ కాదు. మీది మిక్కిలి ఆవు విలువకంటే రెండింతలు డబ్బును ప్రజలు ఇచ్చుకున్నారు. కాబట్టి తన మిగిలిన 99 మంది తమ డబ్బును నష్టపోవడం మూలంగా ఇద్దరు మనుషులే(అంటే అమ్మేవాడూ, దక్కించుకున్నవాడూ) యే కష్టమూ పడకుండా లాభం పొందడం చేతనూ అది ప్రజకి ‍యెంతో ప్రియమైన బేరమయ్యింది. ఈ విధంగా లాటరీలు ప్రజలకి లాభాన్ని కలుగుజేస్తాయని చెప్పేవారు ప్రజలను కేవలం మోసపుచ్చుతున్నారు.సరిగ్గా ఈ విధంగానే అన్నింటిలోనూ ఉంటుంది. గడుసైన ఏ మధ్య తరగతి రైతో డబ్బు సంపాదిస్తాడు. మిగిలిన వాళ్లు ఎప్పటిలానే వీపు ఎత్తకుండా శ్రమించి, ఆ పేదరికం నుంచి బయటపడలేక అంతకంతకూ దరిద్రంలో దిగబడిపోతారు” సరిగ్గా ఇదే సూత్రం, ఇదే పరిణామం కథలను, కవిత్వాలను ఉత్పత్తి చేసే రచయతలకీ వర్తిస్తుందని అనుకోవచ్చునుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యవస్థ ఇచ్చే అవార్డు మూడు రకాలుగా రచయత మీద ప్రభావం చూపుతుంది. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ప్రశంసా పూర్వక మర్యాదులు ఒక పక్క, రాజకీయ దృక్పదం లేకుండా చేయడం మరో పక్కా, ప్రింటింగ్ ఇండస్ట్రీ కోసం తనని తాను వనరుగా మార్చుకోవడం ఇంకోపక్క ఉన్నాయని మనం గుర్తించాలని అనుకుంటాను. ఆ ఎరుక కలగనంతకాలమూ ఈ ప్రయాణం, ఈ అగచాట్లూ, ఈ వ్యవహారాలూ కొనసాగుతూనే ఉంటాయి. ప్రత్యామ్నాయ పక్షమని చెప్పుకున్న వాళ్లూ ఆ సంస్థల పరిధిలో పై పంథానే అనుసరిస్తున్న పరిస్థితి. ఈ రెండు శిబిరాలూ ఒకే పద్దతిని వేర్వరు గొంతులతో అమలుచేసినప్పుడు ఈ చిన్న ఉత్పత్తిదారుడు తన ఏ దిశగా ఆలోచన చేయాలో తెలియక గందరగోళపడే పరిస్థితి. ఆ గందరగోళంలోంచే వారికి కొంత మేర శీతలగాలి తగిలే ప్రాంతం కిందకు చేరి ఉపశమనం పొందడం అత్యంత సహజం. ఆ గాలి కోసం తననితాను అన్ని విధాలా ఖర్చు చేసుకోవడమూ తథ్యం. ఏ ప్రయత్నమైనా సామూహిక స్వభావం సంతరించుకోనంత కాలమూ ఈ అపసవ్య ధోరణులు కొనసాగడమూ అంతే సత్యం.

  • “దానికదిగా వచ్చేది ఆభరణం , తెచ్చుకునేది గుదిబండ “- ఎంతమంది గొప్పవాళ్ళు ఈ గుదిబండలు మోసారో తలచుకుంటే ప్రాణం ఉసూరు మంటుంది !!

  • “సమస్య హిపోక్రసీతో. ఫలానాది పర్వాలేదు గానీ ఫలానాది మాత్రం ఇబ్బంది, ఫలానా టైంలో తీసుకున్నా పర్లేదు కానీ ఫలానా టైంలో తిరస్కరించకపోతే ఇబ్బంది అనుకునే స్కేళ్లు సంక్లిష్టమైనవి.” …. ఇదే తెలుగు సాహిత్యంలో సమస్య … ఈ మధ్య ఇంకో కొత్త స్కూలు మొదలైంది … ‘ తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కే సి ఆర్ కొనేసినట్టు లెక్క …. కేంద్ర సాహిత్య ఆకాడెమీ అయితే ప్రతిభకు దొరికిన గుర్తింపు’ …. ఈ స్కూలు పంచేంద్రియాలకు కేంద్ర సాహిత్య అకాడెమీ స్వతంత్రంగా వ్యవహరించే సంస్థ ! ‘ విప్లవ కవి’ , ‘ ప్రజాకవి’ అనే మాటలకున్న బరువుని ఇట్లాంటి స్కూలు వాళ్ళే తేలిక చేశారు !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు