కాలం, స్థలం:  అమ్మ

అమ్మ మాటల్లో దొర్లే సామెతలు పలుకుబళ్ళు అపురూపం. ఎంత చరిత్ర, సమాజం, జీవితం ఉంటుందో, జీవించడానికి పనికివచ్చే అనుభవజ్ఞానం ఎంత ఉంటుందో వాటిల్లో.

 సులోచనారాణి చనిపోయిందని మా అమ్మకు చెప్పాను. ‘అయ్యో’ అన్నది వెంటనే.

“వేంసూరులో ఉన్నప్పుడు మీ నాన్న నవలలు కొనడం మొదలుపెట్టాడు. యద్దనపూడి సులోచనా రాణి, కౌసల్యాదేవి, రంగనాయకమ్మ పుస్తకాలు తెచ్చేవాడు. నాకేమో అక్షరాలు పట్టి పట్టి నెమ్మదిగా చదవడం మాత్రమే వచ్చేది. యద్దనపూడి నవలల వల్ల, వేగంగా చదవడం అలవాటయింది.”

తన జ్ఞాపకాల నుంచి నాటి నవలలు చేసిన మేలును అమ్మ గుర్తు తెచ్చుకుంది.

ఇక్కడ ఇట్లా రాశాను కానీ, మా అమ్మ మాట్లాడుతుంటే ఆ తెలుగే వేరు. తను మాట్లాడింది మాట్లాడినట్టు రాసే శక్తి నాకు లేదు.  మా ఇంట్లో పొల్లు పోని తెలంగాణ మాట అంటే తనదే. ‘దగ్గర కాదు దాపు కాదు, బండి కట్టుకుని సిద్దిపేట, కరీంనగరం దాక వెళ్లేది సంచారం.  చిత్తలూరు నుంచి వెళ్లినమంటే , మళ్లి  ఏ ఆరునెలలకో వచ్చేది, బడికి పోయిందెక్కడ, చదివిందెక్కడ’ – అని మా అమ్మ ఇప్పటికీ తను చదువుకోనందుకు బాధపడుతూనే ఉంటుంది.

తను రెండు, మూడు తరగతులు మించి చదువుకోలేదు. అది కూడా వాళ్ల ఊరు చిత్తలూరులో చాతాని పంతులు బడిలో చదువుకుంది.  ఆ చదువుకు కూడా బడికి వరుసగా వెళ్లింది లేదు. వాళ్ల నాన్న, అంటే మా తాతగారు వైష్ణవ మత ప్రచారకులు, శిష్య సంచారం చేస్తుండేవారు. కుటుంబం కుటుంబం సంచార జీవితం గడుపుతుంటే, చిన్నపిల్లలను, అందులోనూ ఆడపిల్లలను ఎక్కడ ఉంచి చదివిస్తారు?

యద్దనపూడి మా అమ్మకు కూడా కనెక్ట్‌ అయినందుకు, ఆశ్చర్యపోయాను. పండితుడైన భర్త, విద్యాధికులుగా చెప్పదగ్గ పిల్లలు ఉన్నా అమ్మకు నాలుగు అక్షరాలు ఇవ్వలేకపోయాం. చదువు అలవాటు చేసినందుకే కాదు, తన చిన్న ప్రపంచంలో నుంచి బయటకు తొంగిచూడడానికి ఆమెకు ఒక చిన్నకిటికీని తెరిచినందుకు నాటి నవలా రచయిత్రులంటే ఇప్పుడు కృతజ్ఞత కలుగుతోంది.

పదకొండేళ్లకు పెళ్లి అయ్యేదాకా ఉనికినిచ్చిన పుట్టినిల్లు, భర్త ఉద్యోగరీత్యా తిరిగిన ఊళ్లు, అక్కచెల్లెల్లు తమ్ముళ్ల కుటుంబాలు – ఇవి తప్ప మా అమ్మ ప్రపంచంలో పెద్ద విశేషాలు లేవు. మా అందరి విజయాలు తప్ప తనకంటూ వేరే గెలుపులేమీ లేవు. ఏమంత సంక్లిష్టత లేని సాదాసీదా కుటుంబ, బంధు సంబంధాల ఉద్రిక్తతలు, గాఢతలు, విషాదాలు మాత్రమే దట్టించిన ఆమె భావప్రపంచం మాకు వెలిగా అనిపిస్తుంది. వాచకమే కాదు, దాని వ్యాకరణం కూడా మరో భాషే.

బడి చదువులు లేవనే కాని,  రాతలో చదువులో పరిమితులున్నాయే గాని, అమ్మ తెలియని మనిషి కాదు.  తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదో వినికిడి మీద గుర్తు పెట్టుకున్నదో కాని సందర్భానుసారం పద్యాలు చెబుతుంది.  ఇంట్లో  అందరూ ఒకమాట మీద  ఉండకపోతే,  ‘తండ్రి మధ్వాచార్యుడు, తనయుడారాధ్యుడు, తల్లి రామానుజ మతస్తురాలు…’ అని వెక్కిరిస్తుంది.  ఒకసారి ఏదో చిన్న కష్టం వచ్చినప్పుడు, పలకరించడం పలకరించడమే ‘ఒకచో నేలను బవ్వళించు, నొకచో  నొప్పారు పూసెజ్జ పై, నొకచో  శాకములారగించు..’ అని భర్తృహరితో ఓదార్చింది. చదువుకున్న పిల్లలతో మాట్లాడేటప్పుడు పద్యాలు అయితే సరితూగుతాయని అనుకుంటుందేమో కాని, నాకయితే, అమ్మ మాటల్లో దొర్లే సామెతలు పలుకుబళ్ళు అపురూపం. ఎంత చరిత్ర, సమాజం, జీవితం ఉంటుందో, జీవించడానికి పనికివచ్చే అనుభవజ్ఞానం ఎంత ఉంటుందో వాటిల్లో. ప్రపంచ జ్ఞానం లేని పుస్తకజ్ఞానం ఎందుకురా దండగ – అంటుంది  మా మీద కోపం వచ్చినప్పుడల్లా.

నవలలు తనను పఠనంలోకి తీసుకెళ్లగలిగాయని అమ్మ చెబుతున్నది 1960 దశకం మధ్య సంవత్సరాల గురించి. అమ్మకు సంవత్సరాలు తెలియవు. ముఖ్యమైన ప్రతి సంఘటననూ పరిణామాన్నీ, అసంఖ్యాకులైన నిరక్షరాస్య గ్రామీణుల వలెనే, ఆమె కొన్ని కొండగుర్తులతో కలిపి  గుర్తు పెట్టుకుంటుంది. తను  పుట్టినరోజు కూడా తనకు తెలియదు. నాటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలోని వేంసూరు గ్రామంలో 1960లలో గడిపిన ఎనిమిదేళ్ల జీవితం బహుశా, తనను తాను సాధారణ మధ్యతరగతి గృహిణిగా మలచుకోవడానికి చేసిన కొన్ని ప్రయత్నాల కాలం కావచ్చును. ఆర్థికంగా కుటుంబస్థాయి కొద్దికొద్దిగా మెరుగుపడుతూ వస్తున్నా, సాంస్కృతికంగా ఆమె ప్రయత్నాలు వేంసూరుతోనో, ఆ తరువాత కొద్దికాలం గడిపిన బందరు, ఏలూరులతోనో ముగిసిపోయాయి. నేల మీద గూర్చుని స్తంభానికి ఆనుకోనో,  మంచం మీద పడుకోనో అమ్మ పుస్తకం చదువుతున్న దృశ్యం నేను కల్పించుకోవడమే తప్ప, బుద్ధి తెలిసిన తరువాతి జ్ఞాపకాల్లో ఆ ఫోటో లేదు.

    1930 దశకం చివరలో పుట్టిన, ఒక తెలంగాణ అర్థ – అక్షరాస్య మహిళకు గుర్తుండి తీరవలసినవి సాయుధపోరాటం, రజాకార్ల కల్లోలం, పోలీసు యాక్షన్‌.  ఆ కాలాన్ని మా అమ్మ ‘గలాట’ అని ప్రస్తావిస్తుంది. అప్పటికామెకు పదకొండేళ్లు. ఆ యేడే ఆమె పెళ్లయింది. మా నాన్నకు అప్పుడు పద్ధెనిమిదేళ్లు. అంత చిన్నతనంలో పెళ్లి చేయడానికి కారణం అప్పటి సంక్షోభ పరిస్థితులే. సంచార జీవితంలో గడిపే కుటుంబం పెళ్లీడు ఆడపిల్లలకు ఆ సమయంలో భద్రత ఇవ్వలేదని, పెళ్లి చేసి పంపేస్తే బాధ్యత తీరుతుందని అనుకుని ఉంటారు. మునగాల పరగణాకి వెళ్లి ఆశ్రయం పొందిన చోటే, పెళ్లిమాటలు కూడా జరిగాయట. తన సంసార జీవితం మీద కోపం వచ్చినప్పుడల్లా అమ్మ ‘గలాట’ను తిడుతుంది. 1948-50 మధ్యకాలంలో మా బంధుగణానికి సంబంధించిన అనేక ఉదంతాలను అమ్మ ‘గలాట రోజుల్లో’ అని గుర్తించి చెబుతుంది.

అమ్మ అత్తవారింటికి వెళ్లేసరికి “గలాటా” సద్దుమణిగింది కాని, దానికి సంబంధించిన వాతావరణం పచ్చిగానే ఉండేది. మా నాన్న వాళ్ల అన్నయ్యల్లో ఒకరు కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు. పోరాట సమయంలో దాడులూ దాక్కోవడాలూ అజ్ఞాతాలూ ఆ ఇంటిలోనూ ఉన్నాయి.  అక్కడా ఇక్కడా కొందరు ఆర్యసామాజికులూ ఉండేవారు. వాళ్లగురించి గాని వీళ్ళగురించి కాని మా అమ్మకు పెద్దగా తెలియకపోవడమో తెలిసిన ఎటువంటి అభిప్రాయం లేకపోవడమూ ఉండేది. చదువుకునే రోజుల్లో నేను ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే, ‘ఆర్య సమాజంలోనో కమ్యూనిస్ట్ ల్లోనో  కలిసినావురా, ఇంటికి రావడంలేదు..’ అనేది. ఆర్యసమాజం అన్నది ఒక యాక్టివ్ సంస్థగా లేక దశాబ్దాలు గడిచినా ఆమె జ్ఞాపకంలో మాత్రం,  అది ఒక ప్రత్యేక అర్థంలో అట్లా మిగిలిపోయింది.

ఆమె జీవితంలో అనేక ఘటనలు పరిణామాలు కవాడిగూడెంలో ఉన్నప్పుడు, లాలాగూడెంలో ఉన్నప్పుడు, వేంసూరులో ఉన్నప్పుడు, కొడంగల్‌లో ఉన్నపుడు.. ఇటువంటి హ్యాష్‌టాగ్‌లతో రికార్డయి ఉంటాయి. మరి కొన్ని సంఘటనలు అయితే, మా అన్నయ్య కడుపులో ఉన్నప్పుడు లేదా నేను కడుపులో ఉన్నప్పుడు… ఇటువంటి కాలాల్లో  జరిగినవయి ఉంటాయి. సాహిత్యం అంటే ఇష్టం కలిగిన తరువాత,  మాకు దూరపు చుట్టమయ్యే వట్టికోట ఆళ్వారుస్వామి గురించి తెలుసుకోవాలని అమ్మను అడిగితే, ‘నువ్వు కడుపులో ఉన్నప్పుడేరా ఆయన పోయింది – అని చెప్పింది. ఆయన స్ఫురద్రూపం గురించి, ఎక్కడికి వెళ్లినా భార్యను వెంట తీసుకుపోవడం గురించి, ఆయనకున్న పేరు గురించి కూడా చెబుతుంది కానీ, ఆ డేటా అంతా నేను కడుపులో ఉండడం అన్న కీ వర్డ్ తో ముడిపడి ఉంటుంది.

కాలమే కాదు, స్థలం కూడా అమ్మ ప్రపంచంలో భిన్నమయింది. మా నాన్న స్వగ్రామం భక్తలాపురం, నాటి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటకు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమ్మ ఊరికి అది అంతా కలిపి 30 – 35 కిలోమీటర్ల దూరమే. చాలా దూరం సంబంధం చేసుకున్నారని అనుకున్నారట ఆ రోజుల్లో. అమ్మ దృష్టిలో పూర్వపు నల్లగొండ జిల్లాయే ఒక సువిశాల భూమండలం. సంచారం కోసం సిద్దిపేట వెళ్లడమే బహుదూరపు ప్రయాణం. నాన్న ఉద్యోగరీత్యా ఊర్లు మారడం, చివరకు హైదరాబాద్‌లో కూడా పదిండ్లు మారడం అమెకు విసుగు తెప్పించింది. ఊరూరు మారి, మందికొంపలకు చాకిరి చేయడం ఇక నావల్ల కాదనేది.

తన తండ్రిని తప్ప మరెవరినీ ఆమె ఆరాధనగా తలచుకోదు.  ఆఫ్‌ ద రికార్డ్‌ చెప్పమంటే,  చిన్నజియ్యర్‌ స్వామి కంటె మీ తాతగారే గొప్ప ప్రపన్నుడురా, అని చెబుతుంది. పిల్లలనెవరన్నా మెచ్చుకుంటే నిస్సంకోచంగా గర్వపడుతుంది. కొడుకుకు ఉపనయనం అయినా సంబరమే, జంధ్యం తీసేసినా సహనమే. అలాగని, ఆచారం వదలదు.  మడీ మైలా అన్నీ పాటిస్తుంది. సొంత ఉనికిలో కులం తప్ప గర్వపడడానికి ఏమీ లేదేమో దాన్ని వదులుకోదు. కానీ కఠినంగా ఉండదు. దయగా ఉంటుంది. ‘ఇంత అన్నం పెడదామంటే ఎవరూ రారేమిట్రా ఇంటిముందుకు ఈ పట్నంలో’ అంటుంది. నక్సలైట్లను ఎన్‌కౌంటర్‌ చేశారంటే అయ్యో పాపం, అంటుంది. పోలీసులకు మందుపాతర పెట్టారంటే అయ్యో పాపం అనే అంటుంది.

రామానుజ మతస్థురాలు కావడం వల్ల వ్రతాలూ నోమూలు చేయదు. ఉపవాసాలు చేయదు. అయ్యప్పలూ సాయిబాబాలూ సంతోషిమాతలూ అనాచారం అనుకుంటుంది. అట్లా అని పిల్లలకు ఏమన్నా జబ్బు చేస్తే ఏవో మొక్కులు మొక్కకుండా ఉండదు. పొంగు, అమ్మవారు వంటివి వస్తే, పనమ్మాయికి డబ్బులు ఇచ్చి ఎల్లమ్మకు కల్లునైవేద్యం పెట్టిస్తుంది. ఒళ్లు కాసింత వెచ్చబడితే, మసీదులో ఇమామ్‌ దగ్గరికో ఫకీరు దగ్గరికో పంపి ఊదుడు మంత్రం పెట్టించేది. శివుడు మాత్రం ససేమిరా పనికిరాడు.

అమ్మ పేరు రంగనాయకమ్మ. ఇప్పుడు ఎనభై ఏళ్లు దాటాయి. చిన్న కైవారపు జీవితం ఆమెది. ఈ జీవితాన్ని ఆమె కథనం చేయవలసి వస్తే, అది ఒక ప్రత్యేకమైన పరిభాషలో, ఒక భిన్నమయిన క్రోనాలజీతో, అరుదైన అలవరసలో ఉంటుంది.

*

కె. శ్రీనివాస్

కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక ఎడిటర్.

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Sreenivas Garu,
    Mee Ammagari gurinchi antha atmeeyanga vrastoo vunna mimmalni abhinandinchakunda undalenu! Innella daaka aaa Sunnitatwanni kapadukogaluguthunnanduku meeku naa prasansalu!

  • Beautiful sir…మీ అమ్మగారి గురించి చదువుతుంటే ఏదో సరికొత్త ప్రపంచంలో సంచరిస్తున్నట్టే ఉంది

  • బావుంది, ఇంకాస్త రాసుంటే బావుండేదనిపించింది.

  • మీరు చెప్పినదాన్ని బట్టి సుమారుగా మీ అమ్మ గారికి, తన ముప్పైలలో ఉన్నప్పుడు యద్దనపూడి రచనలు తనకి అందుబాటులో ఉండి ఉండాలి. యద్దనపూడి తొలి నవల 67 ఆ ప్రాంతలలో. వారి కాలంలో, తన చుట్టూ…లేదా ఆ నాటి ప్రపంచంలో, ఆ నాటి సాంఘిక, సామాజిక, ఆర్ధిక పరిస్థితుల మధ్య ఆ కాల్పనిక సాహిత్యం ఆ నాటి స్త్రీల మీదా ఎటువంటి ప్రభావం చూపిందో తెలియజేస్తున్నది.

    ఒక చక్కని మైక్రో హిస్టరీకి నమూనా మీ తల్లి గారిమీద మీ ఈ జ్ఞాపకాలు.

  • శ్రీనివాస్ గారు, చిక్కటి పరిచయంతో ఆ జీవితాన్ని గిర్రున, కళ్ళకి కట్టినట్టు చూపించారు.
    అప్పుడే అయిపోయిందా అనిపించింది.

  • శ్రీనివాస్ గారూ

    చాలా ఆర్ద్రంగా వుంది . కడుపులో ఏదో పేగు కదిలినట్టు .
    అమ్మ ఎవరికైనా అమ్మే

    కృతజ్ఞతలు

  • చాలా తడిగా , ఆర్ద్రతగా .. గొప్ప అనుభూతి నిచ్చేలా రాశారు సార్ .

  • మీ అమ్మ‌గారి గురించి మీరొక న‌వ‌ల రాసేటంత స‌మాచారాన్ని సంక్షిప్తంగా అందించారు.
    సంప్ర‌దాయాల్ని తూచ త‌ప్ప‌కుండా పాటిస్తూనే ప‌రాయి మ‌తాల‌ను, సంస్కృతుల‌ను గౌర‌వించ‌డం బాగుంది.
    గంగా జెమునా తెహ‌జీబ్‌ను బ‌తికిస్తున్న “న‌డుస్తున్న తెలంగాణ” సార్ అమ్మా.
    అమ్మ‌కు న‌మ‌స్తే. మీకు ధ‌న్య‌వాదాలు. సారంగ‌కు కూడా…
    -ప‌సునూరి ర‌వీంద‌ర్‌

  • చాల బాగుంది శ్రీనివాస్ గారూ మీ అమ్మ గారి గురించి తెలుసుకోవడం – అమ్మ గారి జీవితాన్ని అత్యాధునిక భాష లో రాయడం ఇంకా బాగుంది – నమ్మకాల్లో ఆచారాల్లో చాల విషయాల్లో మా నాయనమ్మ ను యాది చేసుకున్న మీ అమ్మగారి గురించి చదువుతుంటే.

  • ఇది ఆనాటి అందరి అమ్మలను యాదికి తెస్తున్నది..

  • సకల సిద్దాంతాలని మూస ధోరణిలో వక్రీకరిస్తున్న కాలం యిది. ముఖ్యంగా వైష్ణవాన్ని ఏకశిలాసదృశ జాతీయతలో లయం చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.వైష్ణవ సంప్రదాయ నేపధ్యానికి చెందిన శ్రీనివాస్ గారి తల్లి జీవితం సామరస్యపూర్వకంగా జీవించడం ఎలాగో ఆధునికులకి బోధిస్తున్నది.

    • సకల సిద్దాంతాల వక్రీకరణ అనేది అంతకుముందు ఓ మహాతత్త్వవేత్త సూఫీని ఇస్లాంలో కలిపి, ఇక్కడే పుట్టిందని బొంకి, ఏకశిలాసదృశ జాతీయతలో లయం చేయడానికి ప్రయత్నించినపుడే ప్రారంభమైంది. ఇప్పుడు చూస్తున్నది దాని అనుకంపనయే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు