“అమ్మా! పింఛనందింది కదా ఆ సొమ్మేదే.”
“ఇంకెక్కడ సొమ్మురా నాయన! సేతిలో ఎట్టినట్టే ఎట్టి మల్లా ఆ బాంకోలే తీసుకుంతే.”
“ఆలు ఏల తీసుకుంతరే! ఆలు తీసుకుంతుంతే నువ్వేల పల్లకున్నావు. గట్టిగా గరిసి గోలసెయ్యలేకపోనావా? దెబ్బకి జడిసి ఇచ్చెద్దురు.”
“గోలేల సెయ్యడం! ఐదేళ్లు పతీ నెల నా పించను ఆలకిత్తే, ఆనిక ఆలే మరి కూసింత సొమ్ము కలిపి ఇచ్చేత్తరు కదేటి.”
“ఏటి ఐదేళ్లు పతీనెలా నీ పించను ఆలకిత్తావా? అలేటన్నారసలు. నువ్వు ఏల ఆలకి డబ్బులిచ్చినావో ఇవరంగా సెప్పే.”
“ఇయ్యాల పింఛను కోసం బ్యాంకీకెళ్ళానా అక్కడ ఆలు ఫ్రీ.సూరమ్మ(పి.సూరమ్మ) యవులు అని అడిగినారు! అవుడు నేనే అని సెప్తే, ఫ్రీ.సూరమ్మ గోరు నెల నెలా మీరు సొమ్ము తీసుకుంటే కరుసయిపోతాయి. అదే ఐదేళ్లు మా బేంకీలో ఆర్డి కడితే తర్వాత మీకు వడ్డీతో కలిపి సొమ్ములిత్తామన్నారు. ఆలంత గవురువం ఇత్తుంతే ఆలమాట కాదనలేకపోనాను. తర్వాత నీ పేరడిగితే శివయ్యని సెప్పినాను. ఆలు ఏవో కాయితాలు రాసుకొని ఏలిముద్రలు యేయించి సొమ్ములు తీసుకున్నారు. ఇదిగో ఇది ఇచ్చి పతీ నెలా తెమ్మన్నారు. జాగరత సెయ్యు బిడ్డ.”
అని చెప్పి కొడుకు చేతిలో బ్యాంకు బుక్కు పెట్టి వెళ్ళిపోయింది సూరమ్మ.
నెలసరి ఆదాయంలో పెరిగిన తల్లి పించను కూడా కలిస్తే శ్రమ తగ్గుతుంది అనుకున్న శివయ్య ఆశ , అడియాశ అయ్యింది.
*
“ఏటే గంగ! ఇపుడు ఏటైపోనాదని, అలగ ఏడత్తనవు. నీ ఏడుపు సూసి పిల్లలెలగ బెదిరిపోతనర్రో సూడు.”
“నెత్తిమీద సెయ్యెట్టి ఇవుడే ఇదంతా జరగాల, ఇవుడు నేనేటి సెయ్యార్రా దేవుడా!” అని సోకాలు తీస్తున్న గంగని సముదాయిస్తూ అంది పక్కింటి మంగ.
“ఏటిసెయ్యాలో తెలక, కాలు సేతులు ఆడటం లేదప్ప!” ఏడుస్తూనే చెప్పింది గంగ.
“ఎక్కడ జరిగంది ఇక్కడ జరిగినాదా ఏటే నువ్వలగ అయిపోడానికి! ముందు మా మరిదికి పోను సేసి రమ్మని సెప్పు. ఈ లోపు నేను మీయమ్మకి, అన్నకి పోను సేసి సెప్తాను.” జాకెట్ లో పెట్టిన చిన్న కీప్యాడ్ ఫోన్ బయటికి తీస్తూ అంది మంగ.
“ఇలగ అయినకానుండి సేత్తూనే ఉన్నాను! ఈ మడిసి ఏటిసేత్తన్నాడో తెల్దు కాని పోను మాత్రం ఎత్తలేదు. నాకు భయమేత్తంది. మాయమ్మని బేగి రమ్మని చెప్పప్పా.” అనేసి మొగుడికి కబురెట్టడానికి ఎవరైనా కనబడతారేమోనని వీదిలోకొచ్చింది గంగ.
మంగ పోను సేసి చెప్పడంతో వీధిలోనోలందరూ గంగ ఇంటి దగ్గర కొచ్చారు.
“ఈపాటి దానికి ఏడత్తనవేటే గంగా! ఒక మాట సెప్పుంటే నీకు తోడుగా మేమంతా రాకపోదుమేటి. అయినా నువ్విపుడు బయటికేలొచ్చినావు.” అంది ఎదురింట్లో ఉండే పార్వతమ్మ.
“మావ ఫోన్ ఎత్తలేదత్తా! ఎవులైనా కనబడితే కబురెడుదుమని వచ్చినా.” అందర్నీ చూసాక కొంచెం ధైర్యం వచ్చిన ఇంకా కొంచెం భయం ఉండడంతో నెమ్మదిగా చెప్పింది గంగ.
మంగ సెప్పగానే శివయ్యని తోలుకు రమ్మని మా ఇంటాయన్ని పంపినానులే! నువ్వు లోనికి పద.” అని పార్వతమ్మ చెప్పడంతో లోపలికెళ్ళిపోయింది గంగ.
“అదేటే పిన్ని ఎదురింట్లోనే ఉన్నావు! అంత గోలగా ఉంటే నీకు తెల్లేదు ఏటి. సెప్పుంటే వచ్చేదాన్ని అంటనవు”. మూతి తిప్పుతూ అడిగింది ఆ వీధిలో ఉండే కమల.
“తలుపేసుకుని పడుకున్నానే నాకెలగ తెలుత్తాది!” అని పార్వతమ్మ అంటుంటే…
“యెంటనే పరిగెత్తుకునొచ్చి నీకు సేప్పలేదని ఇంతసేపు లోన కూకుని, మంగ పోన్ సేసేసరికి తప్పక వచ్చినానని సెప్పకుండా ఈ కబుర్లేల పిన్నే!” వెటకారంగా అంది కమల.
“అది ఇవుడికే బెంగెట్టుకుని ఏడత్తుంటే ఇలాటి మాట్లాడి తగువెడ్డానికి నీకు సిగ్గునేదటే గుడిసేటుదాన! నోరు మూసుకుని దానికి సాయమెళ్ళండి.” అని అందరికీ పనులు పురమాయించింది పార్వతమ్మ.
ఇంతలో కబురందుకొని సేలో నుండి బయటకొచ్చిన శివయ్య, ఫోన్లో ఉన్న మిస్సుడు కాల్స్ సూసి, ఏమయిందో అనుకొని బిరబిరమని ఇంటికొచ్చాడు.
ఇంటి ముందున్న మందిని సూసి, “గంగా!” అని గాబరాగా కేకేసాడు శివయ్య.
“మావ!” అని పరుగున ఎదురెళ్లి…
“ఫోను సేత్తుంటే ఎత్తవేటి మావ?” అని గయ్యిమని అరిసింది.
“ఫోను గట్టునెట్టి, సేలో గావు తీత్తన్నానే! సేలో ఆ మూలకి యెళ్లిపోవడం వల్ల నువ్వు ఫోన్ సేసినా నాకు ఇనబడలే. ఏటైనాదే ఏలన్ని తూర్లు పోను సేసినావు. నువ్వేల ఏడిసినావు.”
కళ్ళు ఉబ్బిపోయి చెంపలపై కన్నీటి చారలతో ఉన్న భార్యను దిగులుగా చూస్తూ అడిగాడు శివయ్య.
“అమ్మి ఎదిగినాది మావ! సమయానికి ఇంటికాడ ఎవలూ లేకపోయేసరికి భయమేసినాది. నీకు పోను సేత్తే నువ్వెత్తనేదు. నాకు ఏడుపొచ్చేసినాది.” భర్త వైపు బేలగా చూస్తూ చెప్పింది గంగా.
“పిచ్చి మొఖమా! ఏటికేడాలో, ఏటికి సంబర పడాలో తెలకపోతే ఎలాగే. ఇంతకి మా బామ్మరిదికి సెప్పినావ లేదా? ఆడే సాపెయ్యాల గాదేటి.” సంబరంగా అడిగాడు శివయ్య.
“మీ అప్పకి, బామ్మరిదికి నేను పోను సేసినాను కాని మిగిలిన పనులు సూడు మరిది.” అని మంగ సెప్పడంతో ఏటిసెయ్యాలన్నట్టు గంగకాసి సూసాడు శివయ్య.
“గంగకాసి సూత్తావేటల్లుడు ఏటి సెయ్యాలో నాకు తెలుసు నువ్వు రా!” అని మంచి సెడ్డ తెలుసుకోవడానికి ఆ ఊరి పంతులు కాడికి శివయ్యను తీసుకెళ్లాడు పార్వతమ్మ మొగుడు రాజయ్య.
పంతులతో చాలాసేపు మాట్లాడి వెనక్కొస్తూ, “పూజలేటి సెయ్యాల్సిన పనిలేదని పంతులు సెప్పినాడు! ఇక 11 రోజులకి కక్కముక్క ఎంతమందికెట్టాలో మా యమ్మితో మాటాడి అయినోలందరికీ చెప్పడమే.” అంటూ నవ్వాడు రాజయ్య.
ఆ మాట వింటూనే బిడ్డ ఎదిగిందన్న సంబరం ఆవిరయిపోనాది శివయ్యకి.
తర్వాత రాజయ్య ఎంత వాగతన్నా సెవిన పడనట్లు పల్లక ఇంటికి సేరిన శివయ్య, నిండా పసుపు రాసుకొని, నొసట పావలా కాసంత కుంకుమ బొట్టెట్టుకొని, గయనాం పోసి కట్టిన కోకలో ఎంతో ఎదిగిపోయినట్టు కనబడుతున్న కూతుర్ని చూసి, “ఒక్క పూటలోన ఎంత ఎదిగిపోయినాది.” అనుకోకుండా ఉండలేకపోయాడు.
“మీ అమ్మి ఈ గడపలోనే 11 రోజులు ఇలాగే కూకుంటాది! ఆనిక తీరిగ్గా సూద్దువు ముందు అచ్చింతలేసి దీవించు శివయ్య.” అని పార్వతమ్మ చేతిలో అక్షింతలు పెట్టడంతో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ బిడ్డను దీవించాడు శివయ్య.
*
“ఏటికేడాలో, ఏటికి సంబర పడాలో తెలకపోతే ఎలాగేపిచ్చి మొఖమా! అని నన్ను తిట్టి నువ్వు ఏటి మావ మూడు రోజులు కానుండి ఇలాగయిపోనావు.” వాడిపోయిన ముఖంతో దిగులుగా కనిపిస్తున్న మొగుణ్ణి అడిగింది గంగ.
“అప్పుడే అమ్మెదిగి మూడు దినాలైపోనాది! 11 రోజులకి అయినోలందరికి కక్కబువ్వ ఎలగెట్టాలో తెల్డం లేదు గంగ.” దిగులుగా అన్నాడు శివయ్య.
“మా సెల్లికి పెళ్లి చేసి ఐదు మాసాలయినాది! అమ్మమ్మ సచ్చిపోయి రెండు మాసాలయినాది. ఉన్న సొమ్ములన్నీ ఆటికే అయిపోనాయి. ఇపుడు మల్లంత కరుసంటే కట్టం కదా మావ. అలికిరి సెయ్యకండా తానం పోసి ఇంటిలెట్టెద్దుంలే.” బాగా ఆలోచించి అంది గంగ.
“ఏటే అలికిరి సెయ్యకండా తానం పోసి ఇంటిలెట్టెద్దుమా! ఇంటిలో కూకునే నువ్వు ఎన్నయినా సెప్తావు. యీదిలోకెళ్ళే నానే కదేటి అందరి దెప్పులికి తలొంచాల.” పెళ్ళాం మీద గయ్యిమన్నాడు శివయ్య.
“కక్కా, ముక్కతోటి బువ్వెట్టడమంటే మాటలేటి మావ! లచ్చలు కావాలి. ఇపుడు అందరూ యితనాలకి, గుండకి, మందులికి కరుసెట్టెత్తారు. అప్పు సేయడానికైనా ఎవుల కాడ ఉంటాయి.” అని అడిగింది గంగ.
“ఆ ఇసయం తెల్దేటి నాకు! నా బాధ కూడా అదే కదేటి.” అని శివయ్య అనడంతో ఆలోచనలో మునిగిపోయింది గంగ.
*
“అమ్మా! బోల్డన్ని అప్పులున్నాయి. నీ ఆర్డీ సొమ్ము ఇయ్యే.” ఐదేళ్ల తర్వాత తల్లి చేతికి వచ్చిన రెండు లక్షలు పైచిలుకు సొమ్ము చూసి ఆశగా అడిగాడు శివయ్య.
“అప్పులేల సేసినావవురా! ఇల్లు కట్టినావ? భూమి కొన్నావా? పిల్లకి పెళ్లి సేసినావా? పోనీ నీ పెళ్ళాం కి నగలు సేయించినావా? పలానాదానికి అప్పు సేసినానని సెప్పు. అన్ని పైసలు నీకే ఇత్తాను.” గట్టిగా అడిగింది సూరమ్మ.
“ఏటో సేసినాను అవన్నీ నీకేల? అప్పులున్నాయని సెప్తంటే సొమ్మివ్వకండా నీ గోలేటే.” చిరాగ్గా అన్నాడు శివయ్య.
“నీ అప్పులు ఎప్పుడు ఉండేవే! నేనీ సొమ్ముతో కాసులపేరు కొనుకుంతాను.” అన్న తల్లి వైపు బిత్తరపోయి చూసాడు శివయ్య.
“అదేటమ్మమ్మా! మావ అప్పులున్నాయంతంతే ఇవుడు నీకు కాసులపేరు అంత అవసరమేటి.” మొగుడు అప్పులు అనేసరికి కంగారుగా అడిగింది గంగ.
“నువ్వు నోరుమొయ్యే!” అని సూరమ్మ, గంగని కసిరేసరికి…
“నీకు కాసులపేరు కావాలంటే పంట సేతికొచ్చాక సెయ్యిత్తానమ్మా! ఇవుడా సొమ్ములియ్యే.”
“పెళ్లికి మా అయ్య కాసులపేరు సెయ్యిత్తానంటే, ఇవుడు సానా కరుసులున్నాయి మావ పైసలు సేతికిచ్చీ మావ, పంట సేతికొచ్చినాక నేను సెయ్యిత్తాను అన్నాడు నీ అయ్య. అవుడు ఆ పైసలు కరుసయిపోయినాయి. తర్వాత వచ్చిన అవసరాలకి పంట డబ్బులు సరిపోయేటివి. నా కాసులపేరు కలగా మిగిలిపోనాది. మల్లా ఇన్నాళ్ళకి నా సేతిలోకి ఇన్ని పైసలొచ్చినాయి. ఇవుడివి నీకిచ్చినాననుకో మరొకపాలి కాసులపేరు కలైపోతాది. నీ పంట సొమ్ముతో అప్ఫు తీరుసుకో.”
అని కొడుకు మాట వినకుండా తన మాటే నెగ్గాలి అన్నట్లు గట్టిగా మాట్లాడింది సూరమ్మ.
తల్లీ, కొడుకుల మధ్య చాలాసేపు వాదులాట జరిగిన తరువాత సూరమ్మ నోటికి తగ్గక తప్పలేదు శివయ్యకు.
తర్వాత కంసాలి దగ్గరికెళ్ళి కాసుల పేరు చేయించుకుంది సూరమ్మ.
పది రోజులకి చేతికొచ్చిన కాసుల పేరు గంగకు చూపిస్తూ మురిసిపోనాది సూరమ్మ.
“మావ అప్పులున్నాయి సొమ్ములు ఇమ్మంటే ఇయ్యకుండా కాసులపేరు సెయ్యించినావు! ఇవుడు ఇది సూసుకొని మురిసిపోవడం తప్ప, ఈ వయసులో ఏసుకొని తిరగగలవేటే నువ్వు?” మూతి తిప్పుతూ అంది గంగ.
“ఇలగుంటే ఎలగ బతుకుతావే! మన కాడ పైసలు సూత్తే ఈ మగోలికి ఏదోక అవసరం గేపకం వత్తాది. ఆల మాటలు నమ్మి మనకాడున్నవన్నీ ఇచ్చేత్తే నిజంగా అవసరమయినవుడు యెర్రిమొఖాలేసుకుని నిలబడ్డం తప్ప ఏటిసెయ్యలేము. మా అమ్మమ్మ ఏటిసేసిన నాకోసం సేత్తంది అనకండా ఆడినెనకేసికొత్తావేటే.” గంగ నెత్తిమీద మొట్టి జ్ఞాన బోధ చేసింది సూరమ్మ.
*
“గంగా!” మాట్లాడుతూ ఆలోచనలో మునిగి కన్నీళ్లు పెట్టుకుంటున్న పెళ్ళాన్ని పిలిచాడు శివయ్య.
“ఒక్క నిమిషం మావ!” అంటూ కళ్ళు తుడుచుకొని పరుగున వెళ్లి పెట్టెలో దాచిన కాసుల పేరు తెచ్చి మొగుడి చేతిలో పెట్టి…
“ఆవేళ అమ్మమ్మ గొడవాడి మరీ సేయించుకున్న కాసులు పేరు! అమ్మమ్మ అన్నట్టు ఈయేళ ఇదే మనల్ని కాపాడతంది. దీన్నొట్టుకొనియెళ్లి బేంకులో కుదువ పెట్టి పైసలు తీసుకొని రా. పంట సొమ్మొచ్చాక యిడిపిద్దాము.” అంది గంగ.
“కాసులపేరు సేయించుకుంతానంటే అంత గొడవ పడినావు! ఇవుడదే నీ భారం దించినాది.” గోడ మీద ఫోటోలో ఉన్న తల్లి చెప్పినట్లు అనిపించి కళ్ళు తుడుచుకుని బ్యాంకు కు బయలుదేరాడు శివయ్య.
*








Add comment