ఇక అందని స్నేహ హస్తం

కొందరి పరిచయంలో వారితో గడిపిన సమయాలు జీవితంలో పోగుల్లా ఉంటాయి. కానీ ఆ పోగులన్నింటినీ ఒక చోట చేరిస్తే అందమైన అల్లిక అవుతుంది. మరువలేని స్మృతి అవుతుంది.

కె.బి.లక్ష్మిగారిని నేను మొదటిసారి కలిసింది నవంబరు 2004లో. మిత్రులు వడ్డి ఓం ప్రకాష్ నారాయణ, వేదాంతం శ్రీపతి శర్మ, కస్తూరి మురళీకృష్ణతో కలిసి నేను వెలువరించిన “4 x 5″ అనే కథా సంకలనం ఆవిష్కరణ సభకి ఆవిడ అతిథిగా వచ్చారు. నేనప్పట్లో ఉద్యోగరీత్యా విజయనగరంలో ఉండేవాడిని.

ఆ రోజు మాటలలో తెలిసింది – విపులలో ప్రచురితమైన నా మొదటి రెండు కథల (‘వృత్తి ధర్మం’, ‘మిగిలిపోయినవి’) ఎంపిక ఆవిడ సంపాదకత్వంలోనే జరిగిందని. ఇంకా మంచి మంచి కథలు అనువదించమని అన్నారు. ఆ ప్రోత్సాహంతో మరిన్ని చక్కని కథలను అనువదించాను. అవన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇలా ప్రచురితమైన అనువాద కథల్లోంచి 19 కథలను ఎన్నుకుని 2006లో ‘మనీప్లాంట్’ పేరిట ఒక అనువాద కథా సంకలనం కస్తూరి ప్రచురణల ద్వారా వెలువరిద్దామని తలచాను. డిటిపి పూర్తయ్యింది.

ముందుమాటలు ఎవరితో రాయిద్దామని ఆలోచిస్తుంటే, కస్తూరి మురళీకృష్ణ గారు – కె.బి.లక్ష్మి గారి పేరు, గుడిపాటి గారి పేర్లు చెప్పారు. నేను సంశయించాను. వాళ్ళు పెద్ద ఎడిటర్లు, నాలాంటి వర్ధమాన రచయిత పుస్తకానికి ముందుమాట రాస్తారో లేదో అని. కాని మురళీకృష్ణ వారిద్దరితో మాట్లాడారు, వారు పెద్దమనసుతో అంగీకరించారు. డిటిపి చేసిన ప్రతి పట్టుకుని లక్ష్మిగారింటికి వెళ్ళాను. ఆవిడ చక్కగా మాట్లాడి, నా బెరుకు పోగొట్టారు. వీలైనంత త్వరలో రాసి ఇస్తానని చెప్పి, నా కాంటాక్ట్ నెంబరు (అప్పటికి నాకు సెల్ లేదు, మా అక్క వాళ్ళింటి లాండ్‍లైన్ నెంబర్) అడిగి తీసుకున్నారు.

తర్వాత మూడు రోజులకి ఓ సాయంత్రం పూట అక్క వాళ్ళింటికి ఫోన్ చేసి నన్ను పిలిపించమన్నారు. ఓ పావుగంట తర్వాత నేను అక్క వాళ్ళింటికి వెళ్ళి ఆవిడ ఫోన్ కోసం ఎదురుచూడసాగాను. మనసులో ఏదో భయం… కథలు నచ్చాయో లేదో… ఏవైనా తప్పులున్నాయోమో… ఏమంటారో అని!

ఆవిడ ఫోన్ చేసి, పలకరింపులయ్యాక, “కథలు బావున్నాయి సోమ శంకర్” అనగానే మనసు కుదుటపడింది. అప్పుడు ఆవిడ రాసిన ముందుమాట మొత్తం ఫోన్‌లో చదివి వినిపించారు. నేను ఆశ్చర్యపోయాను. ఆవిడ స్థాయికి ఆవిడ నన్ను పిలిపించి, ముందుమాట కాయితాలు చేతికివ్వచ్చు. కాని ఫోన్ చేసి, రాసినదంతా వినిపించి, నాకు ఓకే కదా అని అడగడం ఆవిడ గొప్పతనం. తర్వాత పుస్తకావిష్కరణ సభలోనూ ఆ కథల గురించి చక్కగా మాట్లాడారు.

ఆ తర్వాత ఆవిడ నా కథలని చదువుతూ వచ్చారు. నాకు మొబైల్ ఫోన్ వచ్చింది. ఆవిడ అప్పుడప్పుడూ ఫోన్ చేసేవారు.

మధ్యలో నేను ఉద్యోగాలూ, ఊర్లూ మారడం వల్ల… అనువాదాలు చేయడం తగ్గించాను. మేడమ్‌తోనూ గ్యాప్ వచ్చింది.

***

మళ్ళీ హైదరాబాదు వచ్చి కినిగెలో చేరాను. కినిగెలో చేరాకా సాహితీ మిత్రుల పరిచయాలు బలపడ్డాయి. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా ఎందరో రచయితల పుస్తకాలు అప్‌లోడ్ చేసాను. ఈ క్రమంలో ఓ రోజు కె.బి.లక్ష్మిగారి కొత్త పుస్తకం ‘జూకామల్లి’ వచ్చింది. పుస్తకం అప్‌లోడ్ చేసే ముందు వీలైనంత తొందరగా ఆ పుస్తకాన్ని చదివేసేవాడిని. అలా ఆ పుస్తకం చదివేసి కినిగె పత్రికలో (http://patrika.kinige.com/?p=3281) దాన్ని పరిచయం చేశాను.

అది చదివి లక్ష్మిగారు ఫోన్ చేశారు.

నేను “చెప్పండి మేడమ్” అన్నాను.

“నా నెంబర్ ఇంకా నీ మొబైల్‌లో ఉంచుకున్నావే” అన్నారు.

“అదేంటి మేడమ్. ఎందుకు తీసేస్తాను?” అన్నాను.

ఆవిడ నవ్వేసి పుస్తకంలోని కథలని బాగా పరిచయం చేశానని అన్నారు. ఆవిడ ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు.

***

తర్వాత హైదరాబాద్‌లో జరిగే సభలలో కలవడం, మాట్లాడుతుండడం జరిగాయి.

2016 డిసెంబరులో హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లోనూ, 2017 జనవరి విజయవాడ పుస్తక ప్రదర్శనలలోనూ, 2018 జనవరి హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లోనూ ‘ఆలంబన’ తరఫున స్టాల్ నిర్వహించడంతో నా ఇతర పుస్తకాలతో పాటు ‘మనీప్లాంట్’ పుస్తకం కొన్ని కాపీలు అమ్మగలిగాను.

ఒక బుక్ ఫెయిర్‌లో స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగారు ‘మనీప్లాంట్’ కొనుక్కుని చదివారు. ఆ కథలన్నీ వారికి నచ్చడంతో ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ రాశారు. ఆ పోస్ట్‌లో కె.బి.లక్ష్మిగారి ముందుమాట గురించి ప్రస్తావించి, ఆ ముందుమాట పుస్తకానికింకా అందాన్నిచ్చిందనీ రాశారు.

ఒక రోజు జ్యోతి గారు ఫోన్ చేసి స్ప్రెడింగ్ లైట్ వారి సాహితీ సమావేశంలో ‘మనీప్లాంట్’ పుస్తకం గురించి మాట్లాడమన్నారు. “మేడమ్, పుస్తకం వచ్చే దాదాపు 12 ఏళ్ళు అయిపోతోంది. ఇప్పుడేం మాట్లాడను ఈ పుస్తకం మీద?” అన్నాను. “పర్వాలేదు, ఆ కథలని ఎందుకు ఎంచుకున్నారో చెప్పండి, వాటి అనువాదంలో ఏవైనా ఇబ్బందులెదురయితే వాటి గురించి చెప్పండి” అన్నారు. సరేనన్నాను.

6 అక్టోబరు 2018నాడు తార్నాక లోని స్ప్రెడింగ్ లైట్ వారి సమావేశ స్థలానికి చేరేసరికి దాదాపు పదిహేను మంది వచ్చి ఉన్నారు. అక్కడ కె.బి.లక్ష్మి గారు ఉండడం మరీ ఆనందం కలిగించింది. సమావేశం జరుగుతుండగా మరికొందరు వచ్చి చేరారు.

కె.బి.లక్ష్మి గారి ప్రసంగంలో నా అనువాద కథల ఎంపిక గురించి ప్రస్తావించి, ఆ పుస్తకంలోని తనని ఎందుకు ఆకట్టుకున్నాయో తెలిపి, ఆ ముందుమాట రాసినప్పటి ఘటనలను ఆహుతులతో పంచుకున్నారు.

నేను ఆ కథల గురించి తెలిపాను. సమావేశం బాగా జరిగింది.

***

“4 x 5″ అనే కథా సంకలనం ఆవిష్కరణ నాటి ఫోటో దొరికితే ఆ మధ్య ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. దాన్ని కె.బి.లక్ష్మిగారు కూడా షేర్ చేసుకున్నారు. దాన్ని ఈ మధ్య మళ్ళీ షేర్ చేసి, “కొత్త పుస్తకం ఎప్పుడు వేస్తున్నావ్ సోమ శంకర్” అని ఆ పోస్ట్‌లో అడిగారు.

పుస్తకం సిద్ధం చేసి అప్పుడు చెబుదామనుకున్నాను.

ఇక ఎన్నటికీ చెప్పలేను.

కొందరి పరిచయంలో వారితో గడిపిన సమయాలు జీవితంలో పోగుల్లా ఉంటాయి. కానీ ఆ పోగులన్నింటినీ ఒక చోట చేరిస్తే అందమైన అల్లిక అవుతుంది. మరువలేని స్మృతి అవుతుంది.

కె.బి.లక్ష్మిగారికి కృతజ్ఞతాపూర్వక అంజలి ఘటిస్తున్నాను.

*

 

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను,  ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు