రేపటి కవుల వాగ్ధానం ‘మిలన్​’

సూడో మానవత్వ ప్రవచనాల కన్నా, చెమట చుక్కలను గురించి గొంతెత్తి గానం చేయడమే గొప్పనే సోయి. ఎవరి మెప్పు కోసమో వెంపర్లాట కంటే జాతి చైతన్యం కోసం అక్షరమై నిలవడమే న్యాయమనే తపన. తమ తమ అస్తిత్వాలను ఆత్మగౌరవ బావుటాలుగా ఎగరేయడం ఒక వేడుక.

తెలుగు సాహిత్యంలో బహుజన స్పృహ బలపడుతున్నది. ఇంతకాలం విస్మరణకు గురైన సమూహాల నుండి కొత్తతరం పుట్టుకొస్తున్నది. ప్రశ్నల దగ్గరే ఆగిపోకుండా, సమాధానాలు వెతుకుతున్నది. ప్రత్యామ్నాయ సాహిత్య సృజనతో కొత్త చరిత్రను లిఖిస్తున్నది. 2000 తర్వాత పుట్టిన యువ కవుల తరం ఒకటి బలమైన అక్షర ప్రభంజనాన్ని సృష్టిస్తున్నది. దానికి పెరిగిన సామాజిక చైతన్యం కూడా ఒక కారణం. మరోవైపు సోషల్​ మీడియా వల్ల సాహిత్యం మరింత చేరువవుతున్నది. ఈ నేపథ్యంలో రకరకాల ప్రభావాలతో రాస్తున్న యువ కలాలను దారిలో పెట్టగలిగే సాహిత్య సంఘాలు లేవు. వారికి సామాజిక బాధ్యతగా రాయాలని బోధించే శిక్షణ తరగతులూ లేవు.

దీంతో పలు రకాలైన ప్రలోభాల నడుమ దారి తప్పుతున్నది కూడా ఈ యువతరమే. సరిగ్గా అలాంటి వారి కోసమే బహుజన రైటర్స్​ ఫోరమ్​ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7,8 తేదీలలో ఈ రెండు రోజుల ‘మిలన్​’ కార్యక్రమం జరిగింది. ఇందుకు ఫూలే అంబేద్కర్​ ఫర్​ ఫిలాసఫికాల్ అండ్​ ఇంగ్లీష్​ ట్రైనింగ్​ సెంటర్​ వేదికగా నిలిచింది. పలు జిల్లాల నుండి పలు విశ్వవిద్యాలయాల నుండి యువ కవులు తరలివచ్చారు. గొంతులు సవరించుకున్నారు. అప్పటి దాకా వినడమే తప్ప, చూడని ప్రముఖులను నేరుగా కలుసుకున్నారు. కొత్త ఉత్సాహమేదో నింపుకున్నారు.

ఇవాళ్టి యువ కవులను దృక్పథ సమస్య వెంటాడుతున్నది. తమది కాని జీవితం వారి వస్తువుగా మారుతున్నది. అధ్యయనం కంటే ఎక్కువగా ప్రచార పటటోపాల మీదనే దృష్టి సారించడం పెరిగిపోయింది. సరిగ్గా ఇలాంటప్పుడే ఎవరో ఒకరూ వారి లెన్స్​ను సెట్​ చేయాలి. స్పష్టతను ఇవ్వాలి. ఆలోచనలు కలిగించాలి. దారి చూపి ముందుకు నడిపించాలి. ఎందుకు రాయాలి? ఏ ప్రయోజనాల వైపు మన అక్షరాలు నిలబడాలి? వంటి సైద్ధాంతిక, తాత్విక విషయాలు అర్థం చేయించాలి. నిజానికి ఇవన్నీ పెద్దపెద్ద విషయాలైనా, వాటి పట్ల కనీస అవగాహన అవసరం. ప్రతీ యువకవి మీద ఏవేవో ప్రభావాలు ఉన్నాయనే విషయం ఈ రెండు రోజుల వర్క్​ షాప్​లో అర్థమయ్యింది. బహుజన స్పృహతో రాయడానికి ఉన్న అడ్డంకులేవో తెలిసింది. తమ మూలాల్లోకి వెళ్లకుండా వారిని ఆపుతున్న శక్తులేవో బట్టబయలైంది. ఇప్పుడు వారేం రాయాలో వారే సరిగా నిర్ణయించుకునే చూపును ఈ మిలన్​ (కలయిక)అందించింది. తక్కువ సమయంలోనైనా వీలైనంతగా వారిని వినే ప్రయత్నం ఇక్కడ జరిగింది. కవిత్వ నిర్మాణ రహస్యాల దగ్గరి నుండి ‘‘బహుజన కవిత్వం–కళాత్మకత’’ దాకా వక్తలు అందించిన ప్రసంగాలు ఎన్నెన్నో ఆలోచనలు రేకిత్తించాయి.

యువ కవుల అక్షరాలకు ఒక నమ్మకం కావాలి. సీనియర్లు వారిని వినాలి. మంచి చెడులను చెప్పాలి. అదే ఇప్పుడు అసలు సమస్య. తమ కవిత్వాన్ని పట్టించుకునేది ఎవరని వెతుక్కుంటున్న సందర్భం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మిలన్​ ఇందుకు వేదికగా నిలిచింది. సూడో మానవత్వ ప్రవచనాల కన్నా, చెమట చుక్కలను గురించి గొంతెత్తి గానం చేయడమే గొప్పనే సోయి. ఎవరి మెప్పు కోసమో వెంపర్లాట కంటే జాతి చైతన్యం కోసం అక్షరమై నిలవడమే న్యాయమనే తపన. తమ తమ అస్తిత్వాలను ఆత్మగౌరవ బావుటాలుగా ఎగరేయడం ఒక వేడుక.

ఈ రెండు రోజుల మిలన్​ నిర్వాహకులుగా స్కైబాబ, పసునూరి, మెర్సీ మార్గరెట్​, పేర్ల రాము, హతిరామ్​ వ్యవహరించారు. సీనియర్​ కవి, విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య రెండూ రోజులూ యువ కవులతోనే గడిపి, తన అభిప్రాయాలు, సలహాలు సూచనలతో వారిని మరింత ఆలోంచింపజేశారు.  సీనియర్​ కవులు యాకూబ్​, నారాయణస్వామి వెంకట యోగి, ఆచార్య పిల్లలమర్రి రాములు, జూపాక సుభద్ర, చరిత్ర పరిశోధకులు డా.సంగిశెట్టి శ్రీనివాస్,  సాహిత్య విమర్శకులు డా.జిలుకర శ్రీనివాస్​, ​డా.కోయి కోటేశ్వర్​రావు, రహీముద్దీన్​, బండారి రాజ్​ కుమార్​, తగుళ్ల గోపాల్​లు చక్కని ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

ఎప్పటికప్పుడు సాహిత్య గమనపు గమ్యాన్ని అంచనా కట్టడం ఇవాళ్టి అవసరం. పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఒక కనురెప్పలాంటి ఎరుక కావాలి. దోసెడు అక్షరాలే కావచ్చు. పడిలేచే కెరటాలే కావచ్చు. ఒక ఆత్మీయ అలాయి బలాయి. రేపటి మీద చిగురించే ఆశ. తమ అస్తిత్వ నేపథ్యం ఇదీ అని, ధైర్యంగా చెప్పుకున్న సందర్భం. భవిష్యత్​ కవులను వాగ్ధానం చేసిన బహుజన సంరంభం. ఒక చేయూత.

*

పసునూరి రవీందర్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ వేదిక మాలాంటి కొత్తగా రాస్తున్న ఎంతోమందికి చక్కని దిక్చూచి అని నేను బలంగా నమ్ముతున్న, మాకంటే ముందుతరం మాకు నేర్పిన పాఠమే ఈ మిలాన్ కార్యక్రమం
    సలహాలు, సూచనలు తప్పోప్పులు తెలియజేసిన పెద్దలకు నా ధన్యవాదాలు

  • యువతరం కవిత్వం భవిష్యత్తు పట్ల భరోసాను కలిగించింది. దృక్పథం సోయిని రెండు రోజుల శిక్షణ పురాగ అందించింది. ఏ కంటితో చూడాలన్న అంశాల్ని ఔపోసన పట్టారు. బహుజన కవిత్వం, తాత్వికత, కళా సౌందర్య అంశాన్ని నేర్చుకోవడానికి శిక్షణ అవకాశం కల్పించింది.

    కవిత్వ నిర్మాణం విషయంలో, వస్తువు విషయంలో వారిదైన శైలి పొడచూపింది. శిక్షణకు ముందే ఓనమాలు నేర్చుకున్న అనుభవం వారిది. సరైన మార్గ నిర్దేశనం చేయడానికి మాత్రమే ఈ రెండు రోజుల కార్యక్రమం చాలా బాగా ఉపకరించింది. వారి కవిత్వం లోని మేలిమి గుణాల గురించి మరో వ్యాసం రాయొచ్చు.

    జయహో కవిత్వం

  • స్రవంతిమహిపాల్. తెరవే సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి says:

    అన్నా జై భీమ్
    మంచి వ్యాసం
    బహుజన కవులకు కావలసిన కవితావస్తువు గురించి
    చాలా బాగా వివరించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు