తలెత్తుతున్న మొలక

బాలకవి నీరజ్. కె రాసిన ‘నా జీవితం శూన్యం’ కవితలోని వస్తువు ‘తల్లిదండ్రులు’. ‘మిమ్మల్ని అనాథా శ్రమాలకెలా పంపిస్తాను ?’ అని స్వీయ అంత:పరిశీలన(self introspection) చేసుకోవడం కనిపిస్తది.

డిజిటల్ యుగంలో వున్నం. A. I నిర్దేశిత ఆలోచనల్ని ప్రసవిస్తున్నం. దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలకు దుక్కాన్ని ధారపోస్తున్నం. మానవీయ విలువల కోసం ఆరాట పోరాటాలు చేస్తున్నం. ఆహ్లాదకరమైన, శాంతియుత ప్రపంచాన్ని కలగంటున్నం. యుద్ధ భీభత్సాల్ని నెమరు వేసుకుంటున్నం. భవిష్యత్తు పట్ల దిగులుతో వున్నం. మనుషులు, మనిషితనం, మానవత్వం రూపురేఖలు రేపటి రోజున ఎలా వుంటాయో ఊహకు అందకుండా వున్న నేటి పరిస్థితుల్లో విలువల్ని కాపాడే కవిత్వం రాస్తున్న పాఠశాలస్థాయి విద్యార్థుల్ని చూస్తున్నప్పుడు ముచ్చటేస్తుంది. రేపటి కవితావరణపు పచ్చదనానికి తలెత్తుతున్న మొలకల్ని చూస్తున్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది.
నీరజ్ ఆలేరు ప్రభుత్వ పాఠశాలలో 9వతరగతి చదువుతున్నడు. మహబూబాబాద్ జిల్లా,నెల్లికుదురు మండలం, నర్సింహులగూడెం గ్రామనివాసి. తల్లి కవిత, తండ్రి హరికృష్ణ. నీరజ్ తండ్రి హరికృష్ణ  డ్రైవర్ గా పనిచేస్తున్నడు.  నీరజ్ చదువుతో పాటు కవిత్వాన్ని సాధన చేస్తున్నడు. విద్యాప్రణాళికలో పాఠ్యాంశాలతో పాటు, సహ-పాఠ్యాంశాలను బోధనాభ్యసనలో భాగం చేయడం, క్రీడలు, కళలు, సాహిత్యం పట్ల అభిరుచి కల్గించడం వల్ల విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతూ సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి తోడ్పడుతుంది. ఒత్తిడి లేని చదువు సృజనాత్మక ప్రక్రియలైన కవిత్వం, కథ మొ.న వాటికి అవకాశం కల్పిస్తది. తద్వారా విద్యార్థుల్లోని అంతర్గత శక్తులు బహిర్గతమైతయి.
*
నా జీవితం శూన్యం 
~
కుటుంబమనే వృక్షంలో
మొదలు, చివర మీరే
మీ ఒడిలో నిద్రిస్తున్నప్పుడు 
స్వర్గంలా అనిపించేది 
మీరు నాకు బుజ్జగిస్తూ చెప్పిన 
కథలు వింటున్నప్పుడు 
నా మనసు ఆకాశం 
ఎంత ప్రశాంతంగా ఉంటుందో!
మిమ్మల్ని విడిచి 
దూరం వెళ్తున్నాననే ఆలోచనొస్తేనే
నా మనసంతా నల్లమేఘాలు కమ్మినట్టుగుంది 
ఇక మిమ్మల్ని ఆనాథాశ్రమాలకెలా
పంపిస్తాను?
మీరు లేని జీవితం 
తాడు లేని బొంగరం 
మీరు నన్ను విడిచివెళ్తే 
నా జీవితం శూన్యం
*
బాలకవి నీరజ్. కె రాసిన ‘నా జీవితం శూన్యం’ కవితలోని వస్తువు ‘తల్లిదండ్రులు’. ‘మిమ్మల్ని అనాథా శ్రమాలకెలా పంపిస్తాను ?’ అని స్వీయ అంత:పరిశీలన(self introspection) చేసుకోవడం కనిపిస్తది. ఎందుకు? అనే ప్రశ్నకు ‘శీర్షిక అవకాశం కల్పిస్తది. కుటుంబాన్ని వృక్షంతో పోలిక చెబుతూ అమ్మా నాన్నలను మొదలు, చివర మీరే అనే ఎత్తుగడతో కవిత ప్రారంభమైతది. ఎక్కడా వాచ్యంగా ‘పేరెంట్స్’ అనే మాట వాడకుండా కవిత్వ నడక కొనసాగుతది. పేరెంట్స్ తో గడుపుతున్న క్షణాల్ని అనుభూతిస్తున్నడు కవి. స్వర్గంలా అనిపిస్తుందని, ప్రశాంతంగా వుంటుందని అందుకు తగిన సందర్భాల్ని జోడించడం కనిపిస్తది. ‘మనసు ఆకాశం’ అనే మెటఫర్ కవి ఊహను పట్టిస్తది. ఒడిలో నిద్రించడం, కథలు వినడం వాస్తవమో, కల్పనో గానీ బాల్యాన్ని ఆస్వాదించే గుణం చిత్రించబడుతది. కవిత ఒక మలుపు తీసుకోవడం కనిపిస్తది. ‘దూరం’ అనే భావన కల్గించే ఉద్వేగాన్ని నల్ల మేఘాలు కమ్మిన మనసుతో పోలిక చెబుతడు. అనుబంధపు విలువ తెలిసిన కవి భవిష్యత్తును ఊహిస్తడు. చిన్న ఎడబాటును  తట్టుకోలేని తనంతో ‘అనాథాశ్రమాలకు తల్లిదండ్రులు’ అనే ఊహను భరించలేడు. తల్లిదండ్రులు లేని జీవితం తాడులేని బొంగరమని, శూన్యమనే సందేశాన్ని వినిపిస్తడు. ‘శీర్షిక’ ను ‘ముగింపు’ తో సమన్వయపరుస్తడు.
*
వసుంధర విజ్ఞాన వికాస మండలి 33వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయస్థాయిలో నిర్వహించిన ‘ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కర్క ముత్తారెడ్డి స్మారక కవితల పోటీ ‘లో ప్రథమ బహుమతి అందుకున్నందుకు బాలకవి నీరజ్ కు శుభాకాంక్షలు. ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, మార్గనిర్దేశనం చేస్తున్న ఉపాధ్యాయులకు నమస్సులు.
*

బండారి రాజ్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొత్త పిల్లలను ప్రోత్సహించే మీ సమీక్ష బాగుంది అన్న

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు