“సమూహ”మే సమాధానం!

నా చిన్నారి స్వప్నమా
నన్ను హత్తుకో
నెత్తురుతో తడిసి అలిసి పోయిన నన్ను,
ఎవరికీ కనబడకుండా అదృశ్యమైన నన్ను,
మృత్యువొక్కటే  ఆస్తిగా మిగిలిన నన్ను
నన్ను గాఢంగా హత్తుకో

నా ముఖాన్ని
ఒక్క సారి ప్రేమగా నిమురు
నాలో ఉద్వేగాన్ని నింపి
నా భూమిని పలికించే,  ,
కొత్త కళ్లున్న  మాటల్ని నింపు
అంధత్వాన్ని జయించే
కొంగ్రొత్త చూపునివ్వు

నీవు నన్ను వ్యతిరేకించినా సరే
నాకు కొత్త జన్మనివ్వు.

  • పాల్ సెలాన్

వాళ్ళ మనందరం ఒక క్రూరమైన చారిత్రిక సందర్భం లో నిలబడ్డాం. ఇది మనకు పూర్తిగా కొత్త సందర్భం కాకపోవచ్చు. గతం లోనూ అనేక సార్లు ఇట్లాంటి నియంతృత్వ అణచివేత సందర్భాలను ఎదుర్కొన్నాం. ఎదుర్కొంటూనే వస్తున్నాం. ఐతే ఈ సందర్భం అనేక రకాలుగా కొత్తదీ, ఇంతకు ముందు కానీ విని ఎరుగనిదీ కూడా. గతం లో మనం నియంతృత్వాన్ని ఎదుర్కొన్నప్పుడు,  అవి ప్రభుత్వం అధికారాన్ని  మొత్తంగా  ప్రజలమీద చలామణీ చేసిన , అప్రజాస్వామిక సందర్భాలు.   వాటిని చాలా మండి ప్రజలు అంతర్లీనంగా వ్యతిరేకించినా బాహాటంగా నిలబడలేక పోయారు. నిలబడ్డ వారు క్రూరమైన నిర్బంధానికి గురయ్యారు.

ఈ సారి అట్లా కాదు. ఫాసిజం, నియంతృత్వం, అప్రజాస్వామిక భావజాలం ప్రజల్లో అంతర్లీనంగా వ్యాపించిపోయింది. మెజారిటీ ప్రజల ఆమోదాన్ని పొందుతున్నది. గత పదేళ్లుగా  కుట్ర పద్దతిలో ఒక పద్దతి ప్రకారం ప్రజల మెదళ్ళలో విషాన్ని నింపారు. మనువాద హిందుత్వ భావజాలాన్ని, వేనవేల అబద్దాలను నిస్సిగ్గుగా నిస్సంకోచంగా ప్రజల్లోకి ప్రచారం చేశారు. ప్రజల్లో సమ్మతిని సాధించారు.  ప్రభుత్వం అధికారంతో, బలప్రయోగంతో  చేయాల్సిన పనిని చాలా సులభంగా సమ్మతితో ప్రజల్లో దుర్మార్గమైన భావజాలాన్ని వ్యాప్తి చేసి సాధించారు.

నియతృత్వానికి, ఫాసిజానికి పెద్ద నోరుతో సమ్మతి తెలియజేసే ఒక మధ్యతరగతిని తయారుచేశారు. ఇది పథకం ప్రకారం జరిగిన కుట్ర. నోరున్న మధ్యతరగతి అనేక సాధనాల ద్వారా మొత్తం దేశం లో ఫాసిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసింది. ఫాసిస్టు ప్రభుత్వాన్ని  బలోపేతం చేసింది.  మైనారిటీలను వ్యతిరేకించడం వారిపై దాడి చెయ్యడం,  దళిత బహుజనులని వివక్షకు, అణచివేతకు గురిచేయడం, స్త్రీలను అత్యాచారాలకు గురిచేయడం, మతం పేరుతో మారణహోమం చేయడం, పౌరసమాజం లోని అన్నీ పార్శ్వాల్లోకి హిందుత్వ ఫాసిస్టు భావజాలాన్ని వ్యాప్తిచేయడం,  మొత్తం భారతీయ సామాజిక వస్త్రాన్నే ఛిద్రం చేసి పీలికలు చెయ్యడం అజెండా గా పెట్టుకుని ఫాసిస్టులు తమ పాలన కొనసాగిస్తున్నారు. రోజు రోజుకూ బలపడుతున్నారు. హిందుత్వ భావజాలం వెనుక, దేశభక్తి నినాదాల వెనుక సామ్రాజ్యవాద కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేసే తమ ఆర్థికవిధానాలను ప్రజలపై రుద్దుతున్నారు. ప్రజల బతుకుల్లో చీకట్లు నింపుతున్నారు.

గత ఎనిమిదేళ్లలో ఫాసిస్టు ప్రభుత్వం డీమానిటైజషన్ దగ్గరనుండి కోవిడ్ సందర్భంగా ప్రకటించిన అత్యవసర లాక్ డౌన్, నిన్న మొన్నటి మణిపుర్ హింసాకాండ వరకు ఎన్ని ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేసినా, ధరలెంతగా పెరిగిపోయినా, నిరుద్యోగమెంత పెరిగినా, దేశ సహజ వనరుల కార్పొరేట్ దోపిడీ ఎంత పెరిగినా, పేదరికమెంత పెరిగి ఆర్టిక వ్యత్యాసాలు రెట్టింపు ఐనా ఇంకా దేశం ఆర్థిక ప్రగతి సాగిస్తుందని నమ్మిస్తున్నారు, హిందుత్వ భావజాలం వెనుక, దేశభక్తి వెనుక అన్నింటినీ దాచేసి మభ్యపెడుతున్నారు. ప్రశ్నించిన గొంతులను అణచి వేస్తున్నారు. జైళ్ల పాలు చేస్తున్నారు. కుట్రపూరితంగా కేసుల్లో పెట్టి నోరు నొక్కెస్తున్నారు. ఇటువంటి సందర్భాన్ని మనం గతం లో ఎరుగం.

ఐతే ఈ పరిస్తితి ఈ సందర్భం మన దేశానికే పరిమితం కాలేదు. గత దశాబ్ది కాలం లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమై రోజు రోజుకూ బలపడుతోంది. 1990 ల లో మొదలై 2010 కల్లా పరాకాష్టకు చేరుకున్న ప్రపంచీకరణ, నయా ఉదారవాదం (Neo Liberalism) ల వైఫల్య ఫలితాలుగా రైట్ వింగ్ ఫూండమెంటలిజం బలంగా తెరమీదకొచ్చింది. ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయంగా జాతీయవాదం ముందుకొచ్చింది. విదేశీ భయం, మైనారిటీల పట్ల భయం, వలసల పట్ల, కాందిశీకుల పట్ల భయం లాంటి తప్పుడు భయాలని ప్రజల్లో రెచ్చగొట్టి దేశభక్తి ముసుగులో రైట్ వింగ్ ఫూండమెంటలిజం ముందుకొచ్చింది. వామపక్షవాదం సాధారణంగా  నియో లిబరలిజం వలలో చిక్కుకుపోయి దిగజారిపోయి తీవ్ర వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ కొనఊపిరితో గిలగిలలాడుతున్నప్పుడు రైట్ వింగ్ ఫూండమెంటలిజం చావుదెబ్బ తీసింది.   ముస్లిం తీవ్రవాదం భయాన్ని, వలసల భయాన్ని, కాందిశీకుల  భయాన్ని బూచిగా చూపి స్టీరియో టైప్ లను సృష్టించి మొత్తం పౌర సమాజన్నే విచ్ఛిన్నం చేసి నియంతృత్వాన్ని నెలకొల్పింది.

ఇది ప్రపంచీకరణను పైకి వ్యతిరేకించినా సారాంశంలో దాన్నే కొనసాగిస్తుంది. దేశం లోని విలువైన సహజవనరులను, ఖనిజసంపదలను విదేశీ, స్వదేశీ బహుళజాతి కంపనీలకు కట్టబెట్టడానికి ఆదివాసీలపై యుద్ధం ప్రకటిస్తుంది. నెత్తురుటేర్లలో ముంచుతుంది. కొన్ని వేల కోట్ల డాలర్ల స్కామ్ లో ఇరుక్కున్న మోడీ సన్నిహిత  పెట్టుబడిదారుడు ఆదానీ పై కనీస విచారణ ఉండదు, పైగా అతి విలువైన విదేశీ కాంట్రాక్టులు ప్రభుత్వ అండదండలతో సులభంగా దక్కుతాయి. విమర్శించిన వాళ్ళు దేశద్రోహులవుతారు. దేశభక్తి సైడ్ కాలువల్లో పొంగిపొంగి ప్రవహిస్తుంది. నియంతృత్వం ప్రజల తలలమీద ఇనుపబూట్లతో విలయతాండవం చేస్తుంది.

ఇటువంటి క్రూరమైన సందర్భంలో రచయితలుగా, కవులుగా, సాహిత్యకారులుగా మనందరం ఒక్క చోటికి రావడం, ఒక్క తాటిపై నిలవడం ఎంతో అవసరం. అది ఈ నాటి మనందరి చారిత్రిక కర్తవ్యం. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడక పోతే మనం సమాజనికి, కాలానికి ద్రోహం చేసిన వాళ్ళమవుతాం. ఇంత క్రూరత్వం ఎల్లడల వ్యాపించి విలయతాండవం చేస్తుంటే మౌనంగా ఉండడం అతి పెద్ద నేరం. ఇక్కడ తటస్తత, ఉదాసీనత ఎంతమాత్రమూ పనికి రాదు. మాట్లాడగలిగే శక్తి ఉన్న మనం తప్పక ఒక సమూహంగా ఫాసిజానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే.

ఐతే మనం పడికట్టు పదాలతో, అరిగిపోయిన రొడ్డకొట్టుడు ఆలోచనలతో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు.తప్పుడు ఆలోచనలతో విషపూరితమైన భావజాలంతో విద్వేషాలతో రగిలిపోతున్న ప్రజానీకానికి మరింత దూరమవుతాం. అందుకే మనం సరికొత్త ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక ఆలోచనలతో, పదాలతో భాషలో మాట్లాడాలి. భారత దేశ సుసంపన్న చరిత్రలో, సంస్కృతిలో మనదైన ప్రజాస్వామిక ప్రత్యామ్న్యాన్ని ఎలుగెత్తి సమూహంగా చాటాలీ. మనదైన మనువాద వ్యతిరేక సంస్కృతితో , దళిత బహుజన ప్రజాస్వామిక సంస్కృతితో  హిందుత్వ ఫాసిస్టులు ఛిద్రం చేసిన సమాజాన్ని పునర్నిర్మించడానికి పూనుకోవాలి. ఇది అంత సులభమైన పని కాకపోవచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు. పెనుభూతంలాంటి ఫాసిజానికి భయపడాల్సిన అవసరం లేదు. అది మట్టికల్లా మహారాక్షసే, మన ప్రవాహం లో కొట్టుకుపోతుంది తప్పదు.

భారతదేశానికి వెలమైళ్ళ దూరం లో ఉన్న నేను నాలాంటి రచయితలు మేముంటున్న ప్రదేశాల్లోనే సమూహంగా ఏర్పడి ఒక ప్రజాస్వామిక జాగా ఏర్పాటు కోసం కృషి చేయవచ్చు. రాతల్లో ఫాసిస్టు భావజాలానికి, అన్నిరకాల మతోన్మాదానికి, శ్వేతజాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక, సజీవ సాహిత్యాన్ని సృష్టిస్తూ, చేతల్లో గుంపుగా నిరసన తెలిపే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవచ్చు. అణగారిన ప్రజానీకం పక్షం వహించడం, అన్నీ రకాల నియంతృత్వాలని, ఫాసిజాన్ని వ్యత్రికేస్తూ ప్రజాస్వామికంగా ఆలోచన, కార్యాచరణ  చెయ్యడం అనే మౌలిక సూత్రాల ఆధారంగా మనం ఎక్కడున్న కలిసి కట్టుగా పనిచెయ్యవచ్చు.

ఫాసిజం నశించాలి-మతోన్మాదం నశించాలి-అన్ని రకాల అధికారిక నియంతృత్వ బుల్ల్దోజర్ సంస్కృతులు నశించాలి

ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సంస్కృతి వర్ధిల్లాలి

మనమిప్పుడు
మాటలనూ దుఃఖాన్నే కాదు
గరళాన్నీ గొంతులో కుక్కుకుని
ఆగ్రహోదగ్రులమై  సమూహంగా బిగ్గరగా యెలుగెత్తాలి

మన ఎముకల దేహం విల్లు సంధించిన బాణంతో
విషపు నదుల్నిఆవిరి చేసి
గంగోత్రికి  కొత్త ఊటలందిస్తున్న
జీవజలాలు కావాలి.

*

నారాయణ స్వామి వెంకట యోగి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవసరమైన సందేశం నారాయణ స్వామీ , అందరం కలిసి చేయాల్సిన పని చాలా ఉంది

  • చాలా మంచి, ప్రస్తుత పరిస్థితులలో అవసరమైన వ్యాసమండీ. స్ఫూర్తిదాయకంగా ఉంది. అభినందనలు.🙏

  • అవసరమైన ఆర్టికల్ అన్న…
    శుభాకాంక్షలు💐💐

  • అందరం చేతులు కలపాల్సిన సంధర్భంలో ఉన్నాం,అందరం సామూహిక స్వరం కావాల్సిన అనివార్యతలో ఉన్నాం…

  • “ఫాసిజం, నియంతృత్వం, అప్రజాస్వామిక భావజాలం ప్రజల్లో అంతర్లీనంగా వ్యాపించిపోయింది. మెజారిటీ ప్రజల ఆమోదాన్ని పొందుతున్నది. గత పదేళ్లుగా కుట్ర పద్దతిలో ఒక పద్దతి ప్రకారం ప్రజల మెదళ్ళలో విషాన్ని నింపారు. మనువాద హిందుత్వ భావజాలాన్ని, వేనవేల అబద్దాలను నిస్సిగ్గుగా నిస్సంకోచంగా ప్రజల్లోకి ప్రచారం చేశారు. ప్రజల్లో సమ్మతిని సాధించారు. ప్రభుత్వం అధికారంతో, బలప్రయోగంతో చేయాల్సిన పనిని చాలా సులభంగా సమ్మతితో ప్రజల్లో దుర్మార్గమైన భావజాలాన్ని వ్యాప్తి చేసి సాధించారు……..

    ఐతే మనం పడికట్టు పదాలతో, అరిగిపోయిన రొడ్డకొట్టుడు ఆలోచనలతో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు.తప్పుడు ఆలోచనలతో విషపూరితమైన భావజాలంతో విద్వేషాలతో రగిలిపోతున్న ప్రజానీకానికి మరింత దూరమవుతాం. అందుకే మనం సరికొత్త ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక ఆలోచనలతో, పదాలతో భాషలో మాట్లాడాలి. భారత దేశ సుసంపన్న చరిత్రలో, సంస్కృతిలో మనదైన ప్రజాస్వామిక ప్రత్యామ్న్యాన్ని ఎలుగెత్తి సమూహంగా చాటాలీ. మనదైన మనువాద వ్యతిరేక సంస్కృతితో , దళిత బహుజన ప్రజాస్వామిక సంస్కృతితో హిందుత్వ ఫాసిస్టులు ఛిద్రం చేసిన సమాజాన్ని పునర్నిర్మించడానికి పూనుకోవాలి. ఇది అంత సులభమైన పని కాకపోవచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు. పెనుభూతంలాంటి ఫాసిజానికి భయపడాల్సిన అవసరం లేదు. అది మట్టికల్లా మహారాక్షసే, మన ప్రవాహం లో కొట్టుకుపోతుంది తప్పదు………
    ఫాసిజం నశించాలి-మతోన్మాదం నశించాలి-అన్ని రకాల అధికారిక నియంతృత్వ బుల్ల్దోజర్ సంస్కృతులు నశించాలి
    ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సంస్కృతి వర్ధిల్లాలి”

    చాలా అవసరమయిన సందేశం గురూజీ.

  • సామూహికంగా ఏకం కావలసిన సందర్భాన్ని, ఆవశ్యకతనీ బలంగా చెప్పారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు