హరికృష్ణ S/O స్వరాజ్యం C/O తెలంగాణా

నాకు మార్క్వెజ్  రాసినదానికీ, అరుంధతి రాయ్ రాసిన దానికీ ఒక లోకల్ తెలంగాణా రచయిత రాసిన దానికీ తేడా కనిపించదు సందర్భాలు వేరేమో.. దుఃఖం ఒక్కటే, ఆ వేదనా, జీవనాస్తిత్వ పోరాటమూ ఒక్కటే.

“నిన్ను నువ్వు తెలుసుకోవటమే మనిషిగా నువ్వు సాధించే  అత్యున్నత విజయం” ఈ చైనా సామెత అతనికి తెలుసో లేదో గానీ అతను మాత్రం ఆ సామెతని నిజం చేసే పనిలోనే నిరంతరం ఉంటాడు. అలాగని అతనేమీ ముక్కు మూసుకొని అరణ్యాలలో లేడు, మనుషులందరినీ దూరం పెట్టుకొని ధ్యానంలోనూ మునిగిపోలేదు. నిత్యం తీరికలేని బిజీ షెడ్యూల్ లో కూడా అతని చేతిలో ఉన్న మొబైల్ లో చార్లీ చాప్లిన్ సినిమా నడుస్తూ ఉంటుంది, ఆ పనులు చేయిస్తూ తిరుగుతున్నప్పుడు చిన్న చిన్న గమ్యాల మధ్య అదే మొబైల్లో ఏ కవో రచయితో రాసిన అక్షరాలతో అతని అటాచ్మెంట్ తెగిపోదు.

అవును అతను జీవితాన్ని ఉత్సవం చేసుకుంటాడు, పనినీ, తనని కలవటానికి వచ్చే మనుషులనీ ఆ ఉత్సవంలోనే భాగం చేసుకుంటాడు. ఎలా సాధ్యం? అని ఎవరన్నా అడిగితే ఒక్క సారి భుజం మీద చెయ్యేసి ఓ నవ్వు నవ్వేస్తాడు. కాస్మో పాలిటన్ కాలపు ఒక సాధువు లాంటి ఈ జీవితానికి ఉన్న పేరు మామిడి హరికృష్ణ. తెలంగాణా భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనలో ఒక రచయితా, కవీ, చిత్రకారుడూ…. ఇలా చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆయనని కదిలిస్తే ఈ ఙ్ఞాపకాలనీ తనలోలోపలి మాటలనీ ఇలా చెప్పుకొచ్చారు.  ఈ 19 ప్రశ్నలకు సమాధానాలివ్వటానికి ఆయనకు 6 గంటలు పట్టింది. రవీంద్ర భారతిలోని ప్రతీ మూలా తిరుగుతూ ఏదో ఒక పని చేయిస్తూ, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ- “ఏపనినీ లైట్ తీసుకోలేను. మనం మాత్రమే చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అవి అలా మిగిలిపోకూడదు” అంటూ లైవ్లీగా ఉండే ఈ మనిషిలా జీవించటమూ ఒకసవాలేమో అనిపించింది.

దాదాపు నలభైయ్యేళ్ళకిందట అంత మారుమూల పల్లెలో మొదలైన మీకు సాహిత్య పరిచయం ఎలా జరిగిందీ?

అందరిలాగానే.. ఎవ్వరికైనా మొదటి పుస్తకం అమ్మేకదా అమ్మనుంచే ఈ అలవాటు. ఒక చేత్తో నన్ను ఎత్తుకొని రెండో చేత్తో పుస్తకం పట్టుకొని చదువుకునేది అమ్మ లీలగానే అయినా నాకు బాగా గుర్తున్న ఙ్ఞాపకం అదే..ఇక్కడ నా బాల్యం కంటే ముందు విషయాలనీ చెప్పుకోవాలి. (కొద్దిగా ఎమోషనల్ ఫీలింగ్)

కావాల్సింది కూడా అదే… ఒక మనిషి ఇలా తయారు కావటానికి బాల్యంలోనే పునాదులు ఉంటాయి కదా…

ఇప్పుడు మర్చిపోయి ఉంటారు గానీ యాబై, అరవై ఏళ్ళ కింద హనుమకొండ ప్రాంతంలో ఆకుల మల్లయ్య అనే పేరు తెలియని వాళ్ళు లేరు. నిజానికి ఆయన ఇంటిపేరు బండారి మల్లయ్య అయినా మచిలీపట్నం నుంచి “పాన్” కోసం వాడే తమలపాకులని దిగుమతి చేసి ఇక్కడ మార్కెట్ చేసేవాళ్ళు అలా ఆయన పేరు ఆకుల మల్లయ్యగా స్తిరపడిపోయింది. అదేకాకుందా హనుమకొండ  చౌరస్తా టైలర్స్ స్ట్రీట్ లో ఆయనకి పెద్ద సైకిల్ షాప్ ఉండేది అప్పట్లో అది గొప్పవిషయమే. ఆకాలంలో ఒక ఎంటర్ఫ్రెన్యూరనుకోవచ్చు. కులవృత్తినుంచి బయట పడాల్సిన అవసరాన్ని ఆయన ముందే గుర్తించారు. ఇవేకాకుండా చేపల దిగుమతి కూడా చేసే వాళ్ళు. ఆర్థికంగా పెద్ద కష్టాలు లేని కుటుంబం, అందులోనూ కొంత ప్రోగ్రెసివ్ ఆలోచనలున్నవాడు కావటం వల్ల తన ముగ్గురు ఆడపిల్లలనీ చదివించారు. అమ్మ చిన్న కూతురు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరమే అమ్మ పుట్టిందట. అందుకే అమ్మకి స్వరాజ్యం అన్న పేరు పెట్టుకున్నారు. ఇంటి అవసరాలకోసం  టాంగా (గుర్రం బండి) ఉండేది అప్పట్లో అదే కారుకన్నా ఎక్కువ.

ఇక అమ్మ పెళ్ళి విషయంలో కూడా తాతయ్య నిర్ణయం ఆశ్చర్యమే..మామూలుగా ఆ స్థాయిలో ఉన్న ఏ తండ్రయినా ఏ హైదరాబాద్ కో, మరో పట్టణంలో ఉన్న కుటుంబంలోకో పంపాలనుకుంటాడు కానీ…. తాతయ్య మాత్రం అమ్మని చిన్నపల్లెటూరుకి పంపాడు. నాన్న కుటుంబం కూడా అప్పట్లో చిన్న స్థాయి ఫ్యూడల్ లార్డ్ అనుకోవచ్చు. మాతాత గారు మామిడి వెంకట్రాజం అయినా శాయం పేట ఏరియాలో మొదటి మేడ ఆయనదే కావటంతో “బంగ్లా వెంకట్రాజం” అనే పేరు స్తిరపడిపోయింది. ఆకాలం లో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంత సంపాదించడం  అంటే మామూలు విషయం కాదు. ఇక నాన్న అయిదేళ్ళ సర్టిఫైడ్ ఆయుర్వేద కోర్స్ చేసిన మొదటి డాక్టర్. వైద్యుడు దర్షన్ గా చాలా పరిచయస్తుడు. మొదటి సారి కరెంట్ వచ్చిందీ, రేడియో మోగిందీ మా ఇంట్లోనే. ఆయనకీ పుస్తకాలన్నా సాహిత్యం అన్నా ఇష్టం కావటం తో ఇల్లంతా పుస్తకాలే ఉందేవి. పొద్దున బయల్దేరిన ఆయన ఊళ్ళలో సైకిల్ మీదే తిరుగుతూ పేషెంట్లని చూసుకొని ఏ అర్థరాత్రో ఇంటికి వచ్చేవాళ్ళు. నిజానికి డాక్టర్ గా సంపాదించే అవసరం లేదు కానీ ఊరికే ఉండేవాళ్ళు కాదు. అంతా దాదాపు ఉచిత సేవే. అలా ఏరాత్రో ఇంటికి చేరినా ఆ సమయానికి నేను నిద్రలేచి ఉంటే నాతో కాసేపు గడిపి, ఏదో ఒక పుస్తకం చదివుతూ పడుకునే వాళ్ళు. వారానికి ఒకసారి తప్పకుండా వరంగల్ వెళ్ళేవారు తిరిగి వచ్చేటప్పుడు చందమామ నుంచీ మార్కెట్లో ఉండే నవలల వరకూ పుస్తకాలు అమ్మకోసం, నాకోసం తెచ్చేవాళ్ళు.

ఇంతకు ముందు అనుకున్నట్టు ఇక అమ్మకి భర్తా, ఇల్లూ, భాధ్యతల తర్వాత నేనూ పుస్తకాలే ప్రపంచం. అలా పుస్తకం అమ్మతో సమానం అయ్యింది. ఇంకో అందమైన జ్ఞాపకం  ఏమిటంటే అప్పట్లో వరంగల్ లో ఇప్పుడు జీవన్ లాల్ కాంప్లెక్స్ ఉన్న ప్రదేశానికి వెనుక జీ.ఆర్ టాకీస్ ఉండేది. అమ్మ వరంగల్ వెళ్ళినప్పుడు చూసిన సినిమాల కథలూ, పుస్తకాల్లో చదివిన కథలనీ వాళ్ళకు చెప్పేదన్న మాట. చుట్టుపక్కల బీడీలు చేసుకునే ఆడవాళ్ళంతా పగలు అమ్మ చుట్టూ కూచుంటే అమ్మ వాళ్ళకి చూసిన సినిమా గురించో చదువుతున్న పుస్తకంలోని కథనో చెప్తూ ఉంటే అలాగే అమ్మని కౌగిలించుకొని నిద్రపోయేవాన్ని. అప్పటికి వాళ్ళందరికీ అమ్మ చెప్పే ఈ ముచ్చట్లే ఎంటర్టైన్మెంట్.  అలా నేను స్కూల్లోకి అడుగు పెట్టే సమయానికే తెలుగూ, ఇంగ్లీష్ అక్షరాలు వచ్చేసాయ్. పత్రిక చదివే వాన్ని. అలా మా అమ్మే నాకు పుస్తకాన్ని ఇంకో అమ్మగా పరిచయం చేసింది.ఇప్పటికీ అనిపిస్తుంది “నేను మా అమ్మకి కొనసాగింపుని మాత్రమే. హరికృష్ణ అంటే స్వరాజ్యం అనే మా అమ్మకి ఇంకో రూపాన కొనసాగుతున్న ఒక దేహం అంతే. ఇప్పటికీ నేను ఏ రోజైనా ఒక పుస్తకం చదవకుండా, ఒక అక్షరమైనా రాయకుండా ఉన్నానూ అంటే… ఆరోజు ఉదయాన్నే నేను చనిపోయానూ అని అర్థం.  ఇదీ నా నేపథ్యం…

స్కూలింగ్ అంత ఎక్కడ? ఇంట్లో ఉన్న పుస్తకాలతోనే మీ బాల్యం గడిచిందా?

స్కూల్ లేకుండా ఎలా? అప్పట్లో మా ఊల్లో కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది. అక్కడే నన్నూ చేర్పించారు. అయితే నన్ను రెండేళ్ళలోనే డబల్ ప్రమోషన్ తో ఫోర్త్ క్లాస్ లోకి  ప్రమోట్ చేసారు. అది ఎస్సెస్సీలో కాస్త ఇబ్బంది పెట్టిందనుకోండి. అప్పుడు బోర్డ్ఎగ్జాం రాయటానికి వయస్సు తక్కువ అయి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా మా క్లాసులో ఉన్న అందరికన్నా నేనే చిన్న వాన్నికావటంతో ఎవ్వరూ నాతో కలిసే వాళ్ళు కాదు, దాంతో మళ్ళీ పుస్తకాలే నా స్నేహితులయ్యాయి.ఇది పక్కన పెడితే ఇక్కడ స్కూల్ టైం అయిపోగానే ఊళ్ళో ఉన్న లైబ్రరీలోకి వెళ్ళేవాన్ని. అది ఊళ్ళో ఉన్న కొంతమంది కలిసి స్వచ్చందంగా పెట్టుకున్నలైబ్రరీ “రవీంద్ర గ్రంథాలయం” దానికి మా నాన్నే భాండాగారీకుడు అంటే లైబ్రేరియన్ అన్నమాట. ఇక అక్కడ మనదే సామ్రాజ్యం ఒక్క పుస్తకాన్నీ వదలాలి అనిపించేది కాదు అట్లా ఎనిమిదో తరగతికివచ్చేసరికి చలం సాహిత్యంతో పరిచయం ఏర్పడింది.

కాలేజ్ లో కి వచ్చేసరికే మెయిన్ స్ట్రీం  సాహిత్యంతో పరిచయం ఏర్పడింది అన్నమాట!

అవును, అయితే దాహం తీరలేదు ఇంకా ఎక్కువ అయ్యింది. నమ్మరేమో గానీ నా డిగ్రీలోనూ, పీజీ లోనూ నేను క్లాసులకి వెళ్ళింది తక్కువే. పొద్దునే అమ్మ ఇచ్చిన బాక్స్ తీసుకొని బస్ ఎక్కి వరంగల్ లో దిగగానే నేరుగా లైబ్రరీలోకి వెళ్ళేవాన్ని. మొదటిరోజు అక్కడ లైబ్రేరియన్ ని “ఎన్సైక్లోపిడియా బ్రిటానికా కావాలని అడిగాను.   వెంటనే ఇవ్వలేదాయన. రెండుమూడు రోజులు మళ్ళీ మళ్ళీ అడిగేదాకా చూసి అప్పుడు ఇచ్చారు. ఇక అక్కడినుంచీ ఆ లైబ్రరీనే లోకం. పొద్దున్నే తొమ్మిదిన్నరకల్లా లోపలికి అడుగుపెడితే మళ్ళీ సాయంత్రం తలుపులు మూసేదాకా అక్కడే గడిచిపోయేది. అది ఎంతదాకా వచ్చిందీ అంటే ఎవరైనా ఏదైనా పుస్తకం కావాలి అని లైబ్రేరియన్ ని అడిగితే “అదిగో ఆ అబ్బాయిని అడగండీ..!” అంటూ నన్ను చూపించే వాళ్ళు ఇక అక్కడ ప్రపంచ సాహిత్యం కొంత దొరికింది.

ఆ సమయంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలెవరన్నా ఉన్నారా?

ఇంటర్ డిగ్రీ లలో కి వచ్చేసరికి ఆఖ్టోవియా పాజ్ కవిత్వంలో పడ్డాను ఎంతగా ఆ కవిత్వం నచ్చిందీ అంటే ఆ కవితలని తెలుగులోకి అనువాదం చేసి నేనే ఒక పాఠకుడిగా చదువుకోవాలన్నత పిచ్చి. ఇక ప్రపంచ సాహిత్యం కూడా నన్ను ఆకర్షించింది. ఒలే సోయంకా, నోర్ధిన్ గోల్డ్ లనుంచీ మొదలుపెడితే ఆల్బర్ట్ కేమూ, కాఫ్కా, మొపాసా ఇట్లా చదవటం అంటేనే ఇదే జీవితమేమో అన్నట్టుగా చదివేసాను. సల్మాన్ రష్దీ, మార్క్వేజ్ తరహా మాజిక్ రియలిజం నన్ను బాగా అకర్షించేది. ఇలా ప్రపంచ సాహిత్యంలో మునిగిపోయాను. ఇక తెలుగు కవులూ రచయితలూ అని చెప్పాలంటే ఒకటీ రెండు పేర్లతో ఎలా కుదురుతుందీ ప్రతీ కవీ రచయితా అప్పుడే కాదు ఇప్పటికీ నన్ను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు.

 ప్రతీ రోజూ ఇంత బిజీగా ఉంటారు, అటు రవింద్ర భారతి పనుల్లో క్షణం తీరిక ఉండదు ఇంత బిజీలోనూ ఎలా సమయాన్ని అడ్జెస్ట్ చేసుకుంటారు?

ఆఫీసు పనులు దాదాపుగా రాత్రి పదకొండు గంటలకు ఉంటాయి. ఆ తర్వాత నుంచీ నా టైం మొదలవుతుంది అంటే కేవలం మామిడి హరిక్రిష్ణ కోసమే ఉండే సమయం అన్నమాట. రెండున్నరా మూడుగంటల వరకూ ఇక నా ప్రపంచంలో ఉండిపోతాను. ఆ సమయంలోనే చదవటం, సినిమాలు చూడటం ఏదైనా రాయాలనిపిస్తే రాసుకోవటమూ. ఇవన్నీ ఆ సమయంలోనే.  నాకు విశ్రాంతి అంటే చేస్తున్న పనిలోనే దొరుకుతుంది. సినిమా చూడటంలోనో, ఏదైనా రాసుకోవటంలోనో ఉన్నప్పుడే నాకు కావాల్సిన విశ్రాంతి, రీచార్జ్  దొరుకుతుంది.

రచనా వ్యాసంగంలోనూ ఒక ప్రత్యేక స్థానం ఉంది కదా… ఇప్పటికీ పుస్తకాల సంపాదకత్వం కూడా మీరే చేస్తూంటారు కదా?

డిపార్ట్ మెంట్ పుస్తకాల విషయం లో నేనెప్పుడూ రాజీ పడలేను. ఎందుకంటే అవి ఒక చరిత్రకి ఒక రికార్డ్ వంటివి. అక్కడ ఏ చిన్న తప్పు దొర్లినా అది క్షమించరానిదే. అందుకే ప్రూఫ్ రీడ్ దగ్గరినుండీ అన్నీ నేనే చూసుకుంటాను. ఇక నా సొంత రచనల విషయానికి వస్తే..  పైన అనుకున్నట్టే నాకోసం కేటాయించుకున్న సమయంలోనే రాయటం కూడా ఆ నిజానికి అర్థరాత్రి సమయంలోనే ప్రశాంతంగా రాయగలను. ఆ సమయంలోనే కవిత్వం రాసుకున్నా, సినిమా రివ్యూ, సినీ విమర్శ ఇలా ఏది రాసుకున్నా ఆ సమయంలోనే. ఏ విషయమైనా కొత్తగా తెలుసుకున్నప్పుడు నా ఒక్కడితోనే ఇది ఆగిపోకూడదు అనిపించినప్పుడు రాయటం నా బాధ్యత అనుకుంటాను ఇదే రాయాలి, ఇదిమాత్రమే నా జానర్ అని ఎప్పుడూ అనుకోలేదు. అంతగా లెక్కలు ఎప్పుడూ వేసుకోలేదు గానీ రకరకాల విషయాల మీద రాసినవి కనీసం పదివేలు దాటి ఉంటాయి.

అంటే అవన్న్నీ పుస్తకాలు వేయాలంటేనే పేద్ద ప్రాజెక్ట్ వర్క్ అయ్యేలా ఉందే.. కవిత్వం పుస్తకంగా తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా?

హ..హ..! ఒక్క సినిమా మీద వచ్చిన వ్యాసాలు విడిగా వెయ్యాలంటే ఓ ఇరవై పుస్తకాలు వెయ్యాలి. మొత్తం అన్ని సబ్జెక్ట్ లమీద రాసినవన్నీ కలుపుకుని చూస్తే 60 దాటొచ్చు.  సినిమాల విషయంలో  నా ఎరుకలోకి వచ్చిన ఏ విషయాన్నీ వదిలిపెట్టాలనుకోలేదు. అదంతా ఆ సమయానికి ఒక డాక్యుమెంటేషన్ అనుకున్నాను. ఒక కాలపు ఎరా ని బందించి మనవాళ్ళకి అందించటం అనేది కూడా నా బాధ్యత కదా.. ఇక కవిత్వం వరకూ పుస్తకంగా తేవాలనే ఆలోచన మాత్రం ఉంది అది కూడా ఖచ్చితంగా ఎప్పుడూ అని మాత్రం చెప్పలేను.

చదవటం అమ్మనుంచి వచ్చింది మరి ఈ రాయటం? దీనికీ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా?

ఇన్స్పిరేషన్ కాదు గానీ రాయటం ఒక అవసరం అయ్యింది. ఎందుకంటే చిన్నప్పటినుంచీ నాకు పెద్దగా స్నేహితులు లేరు. చిన్నప్పుడు అమ్మా, నాన్న తప్ప స్నేహితులు అంటే బాబాయిలే. ఎప్పుడైనా పొలానికి తీసుకు వెళ్ళటమో లేదంటే బయటకి వెళ్ళేటప్పుడు వెంట తీసుకు పోవటమో చేసింది బాబాయిలే. ఆతర్వాత స్కూల్ లోకి వచ్చాక కూడా నా ఇంట్రావర్టిక్ మెంటాలిటీ వల్ల పుస్తకాలు తప్ప వేరే స్నేహితులెవరూ లేకుండాపోయారు. అందరితో కల్సే ఉండేవాన్ని కానీ నా ఏకాంతం నాదే.అలాంటి పరిస్తితుల్లో రాయటం నాకో అవసరం అయ్యింది.అందులోనూ ఒక అనుభూతిని ఒక స్నేహితునితో చెప్పుకున్నాక ఆ విషయంలోని గాఢత పలుచబడిపోతుంది, రాయాలన్న కోరికా, రాసేటప్పుడు ఆ ఫీల్ తగ్గిపోతాయి, అంతే కాదు నేను చెప్పాలనుకున్న విషయం అందించటానికి నా టార్గెట్ ఒక్క మనిషి కాదు వీలైనంత ఎక్కువ మందికి చెప్పాలి దానికి మర్గం కేవలం రాయటమే అని అర్థం అయ్యింది. అలా రాయటం మొదలయ్యింది. ఆ రాయటం రాయటం ఎంతవరకూ వచ్చిందీ అంటే నా డిగ్రీ,పీజీ చేస్తున్న కాలం లోనే నెలలో కనీసం పది ఆర్టికల్స్ వివిధ పత్రికల్లో వచ్చేవి.

మరి కవిత్వంలోకి ఎలా వచ్చారు?

విస్తృతంగా రాయటాన్ని సంక్షిప్తీకరించాలన్న ఆలోచన కవిత్వంలోకి అడుగు పెట్తించింది. అంతే కాకుండా నాకు నేనే ఒక ఎగ్జాస్ట్ గా మారటానికి కవిత్వాన్ని ఆశ్రయించాను. ఒక సినిమా, లేదా ఒక నవల గురించి రాసే వ్యాసం వేరు. దానికి కావాల్సిన ఇన్పుట్స్, కావాల్సిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కానీ చిన్నప్పటినుంచీ చదివిన, నేర్చుకున్న స్టఫ్ ఉంటుంది, అది మనకు తెలియకుండానే లోపల్లోపల మనలని బద్దలు కొట్టుకొని రావటానికి చూస్తుంది. అయితే ఆ భావసంఘర్షణని మామూలు భాషలో చెప్పటం కష్టం. పూర్తి వివరంగా రాయాలంటే వంద పేజీలు పట్టే భావనని కూడా కవిత్వంలో సులభంగా, అందంగా చెప్పేయవచ్చు. ఇక్కడే కవిత్వం వైపు అడుగులు పడ్డాయి. ఒక కథ రాయాలన్నా, నవల రాయాలన్నా వాస్తవికత అనేది కొన్ని హద్దులని నిర్ణయిస్తుంది కానీ కవిత్వం లో అలాంటి అడ్డంకులేమీ ఉండవు కవి కోరుకున్నంత స్వేచ్చ ఉంటుంది, భూమికీ ఆకాశానికీ తేడా లేనంత స్వేచ్చగా కవిత్వం లో విహరించగలడు. ఇలాంటి వెసులుబాటు మరే సాహిత్య ప్రక్రియలోనూ లేదు అందుకే కవిత్వాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.

మొదటి కవిత ఎప్పుడు రాసారో గుర్తుందా?

హ్మ్మ్..!శ్యాయం పేట జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు.. అప్పుడు మా స్కూల్ హెడ్మాస్టర్ ఒక గొప్ప ఆలొచన చేసారు అదేమిటంటే “కెరటం” అనే పేరుతో వచ్చిన మా “స్కూల్ మాగజైన్”. ఆయనే నాకో ఇంగ్లిష్ కవిత ఇచ్చి అనువాదం చేయమన్నారు. అలా నా మొదటికవిత ఒక అనువాదం. నా సొంత కవిత కాదు అయినా సరే ఆ ఆనందం వేరు కదా. నిజానికి ఆ కవిత ట్రాస్లేషన్ చేయటానికి కూడా అమ్మే సహాయం చేసింది. అలా కవిత్వంలోని రుచి కనిపించింది ఇక ఎప్పటికీ వదలలేననిపించింది.

అంటే జీవితంతో పాటే సాహిత్యమూ కొనసాగుతూ వచ్చిందన్నమాట!

నిజానికి ఆనందాన్ని శాశ్వతం చేసుకోవాలన్న మానవుడి తపననుంచే కళలన్నీ పుట్టాయి. ఏ విషయంలో అయితే నీకు ఆనందం ఉందో అదే పనిని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఆనందం పొందుతూ ఉంటాడు. అలాగే నేనూ కవిత్వంలోకి పడిపోయాను. దొరికిన కవిత్వాన్ని దొరికినట్టు చదవటం మొదలు పెట్టాను. అప్పటికే చలం, తకళి శివశంకరన్ పిళ్ళై, శరత్ సాహిత్యం, నన్నయ, పాల్కురికి సోమనాథుడి బసవపురాణం అయిపోయాయి. వాటితో పాటే కాలేజ్ లోకి అడుగుపెట్టేటప్పటికి ఆక్టోవియాపాజ్, తోమస్ ట్రాన్స్ తోమర్ లాంటి కవిత్వాన్ని చదివేసాను. అంతే కాకుండా ఆ వయసులోనే చదివిన చందమామా, బుజ్జాయి లాంటి పుస్తకాలు చదవటం వల్ల ఆ ప్రభావమూ కొంత ఉండటం తో నేనే ఒక మ్యాగజైన్ ఎందుకు చేయకూడదు అనిపించింది, అంతే నా చేతిరాతతోనే “హరివిల్లు” మ్యాగజైన్ తయారు చేసుకున్నాను. అందులో బొమ్మలు కూడా నేనే వేసుకునే వాన్ని. ఒక్క 20 పేజీల కాపీ చేసి స్నేహితులకి ఇచ్చేవాన్ని. అందులో ఉండాల్సిన సైన్స్ విషయాలూ, చిన్న కథలూ, బీవీపట్టాభిరాం గారి చిన్న మ్యాజిక్ ట్రిక్ లాంటిదో అందులో చేర్చేవాన్ని. వీటితో పాటు ఒక సీరియల్ కూడా ఉండేది అలా రెండేళ్ళు నడిపాను. అలా నన్ను డిజైన్ చేయటం లో మా స్కూల్ మ్యాగజైన్ కూడ ఉపయోగ పడింది.

స్కూల్ మ్యాగజైన్ అనేది అద్బుతమైన ఆలోచన కదా…

అవును ప్రతీ పిల్లవాడికీ ఆ తరహా ఆసక్తికూడా వుంటుంది. వాళ్ళకి సాహిత్యాన్ని అందుబాటులోకి తేవాలి. ఇప్పటికీ ఆ పద్దతి స్కూళ్ళ్లో లేకపోవటం కాస్త భాద కలిగించే అంశం. “సర్వశిక్షా అభియాన్” లో ఉన్నప్పుడు చాలా స్కూళ్ళలో ఆ ప్రతిపాదన చేసినా అది కార్య రూపం దాల్చలేదు.

ఈ “ఫ్యుజన్ షాయిరీ” ఏమిటి? మీకే ప్రత్యేకమిన శైలికదా?!

హ్మ్…! ఫ్యుజన్ షయిరీ నేను తయారు చేసుకున్న ప్రక్రియ. కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటునే కొన్ని కవితా సాంప్రదాయలను బద్దలు కొట్టే ప్రక్రియ ఇది. అయిదునుంచి ఎనిమిది పేరాలు ఉండాలి కానీ రెగ్యులర్ కవిత్వం లాగా లైన్ బై లైన్ మాత్రమే రాయాల్సిన పని లేదు పేరా గ్రాఫ్ అయినా ఉండొచ్చు. అంటే ప్రోజ్ పొయెట్రీ అన్నమాట. ఇక ప్రతీ స్టాంజాకీ ఒక ఫ్లాష్ అంటే కొసమెరుపు ఉంటుంది. ఒక రకంగా ఫ్యూజన్ షాయిరీ అంటే సంపూణమైన జీవితం అన్నమాట. మనం బతుకుతున్న ప్రపంచం, ఆ ప్రదేశం అంతే… ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి, చాలా భాషలు కలిసి పోయీ ఉంటాయి. మనం ఒకప్పటిలాగా ఒకే రకమైన జీవితాన్ని గడపటం లేదు. పొద్దున మన గదిలో లేచిన దగ్గరైనుంచీ.. ఇంట్లో, బయటా, స్నేహితుల దగ్గరా, రోడ్డుమీదా ఇలా రకరకాలుగా క్షణక్షణం మనం అప్పటికప్పుడు వేరే రకంగా మారిపోతూంటాం. మరి ఒకే రకమైన జీవితాన్ని చూపిస్తూ అదే రాయటం ఎలా కుదురుతుందీ?? అందుకే మన బహుముఖీనతనీ, మన కలగలుపుల భాషనీ, ఇన్ని రకాల సంస్కృతుల సందేశాన్ని అలా “రా” గా పరిచయం చేయాలన్నది నా ఆలోచన.

ఉదాహరణకి తెలంగాణాలో ఒక పదం ఉంది “గోస” అని ఈ పదానికి సరిపోయే ఇంగ్లిష్ పదాన్ని ఎక్కడ తేగలను, పోనీ తెలుగులోనే వేదన అనో, బాధ అనో అందామనుకున్నా ఆ పదంలో ఉన్న “ఇంపాక్ట్” ఉండదు. అలంటప్పుడు ఆ పదాన్ని అలాగే ఉంచేస్తాను. అదే “ఫ్యూజన్ షాయరీ”. ఇప్పటికి ఇరవై వరకూ ప్రచురించబడ్డాయి. ఈ ప్రక్రియలో వచ్చిన మొదటికవితని ప్రచురించింది సారంగా పత్రిక. దానికి బొమ్మ వేసింది కూడా నేనే.

కొత్తగా రాసేవాళ్ళకి మీరిచ్చే సలహా ఏదైనా ఉందా? అంటే కొన్ని భావజాలాలమీద రాసే కవిత్వమే ముఖ్యం అనీ, లేదా అలాంటి కవిత్వం అనుభూతిని చంపేస్తుందనీ చెప్పే మాటల్లో దేనిని నమ్మాలి?

చెప్పటానికి ఏమీ లేదు జస్ట్ ఫాలో యువర్ ఎమోషన్స్ అంతే… ఇంకొక రకంగా చెప్పాలీ అంటే హ్యూమన్ బాడీ ఇంజినీరింగ్ ని అర్థం చేసుకుంటే చాలు మన కాళ్ళు నేలని ఆనుకొనే ఉంటాయి మనఊహలూ, భావాలూ, ఆశయాలూ అన్నిటినీ మోసే బుద్ది తలలో ఉంటుంది కానీ ఈ రెండిటినీ కలిపి సమన్వయం చేసే స్పందించ గలిగే గుండె మాత్రం మధ్యలో ఉంటుంది. అలా ఈ నేలనీ, ఆ ఆకాశాన్నీ కలిపి వాస్తవ ప్రతిస్పందనని గుర్తించగలిగితే చాలు. ప్రపంచం లో మరెవ్వరూ చెప్పే మాటలు వినే అవసరం లేదు. మీ ఆలోచన ఏం చెబుతోంది, అది ఎంతవరకూ హాని చేయకుండా నువ్వు ఉన్న సమాజానికి మేలు చేస్తుంది అనేదే ముఖ్యం, అది మానసిక సాంత్వన కావొచ్చు, కావచ్చు లేదా సమాజాన్ని మేల్కొలిపేదీ కావచ్చు ఏది నిజం అన్నది నీ హృదయమే నీకు చెబుతుంది.

అంటే ఇప్పటివరకూ వచ్చిన సాహిత్యం ఇదే పద్దతిలో నడిచిందా?

అబ్జల్యూట్లీ… కవి ఒక నిరంకుశుడు ఎవ్వరినుంచి ఏమి నేర్చుకున్నా చివరిస్థాయిలో అతను చెప్పేది తను అనుకున్నదే, తన సొంత ఆలొచనే.. అందుకే ఒకే వాదం మీద రాసినా ఏ కవికి ఆ కవి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదిస్తూనే వచ్చాడు. నేను నమ్మే సత్యం ఒకటుంది అదేమిటంటే మనం అనుకునే పేరూ, ప్రాంతం, దేశం ఇలాంటి అస్తిత్వాలన్నీ ఒక దశదాటే వరకే. నా దృష్టిలో ఒక్కొక్క మనిషీ ఒక్కొక్క గ్రహం. అతను ప్రాంతమూ, దేశమూ, జాతీ లాంటి విషయాలని దాటి ఒక కొత్త ప్రపంచాన్ని తన తలలో మొస్తూనే ఉంటాడు అందుకే ఏ ఇద్దరి జీవితాలూ ఒకలా ఉండవు, ఎవరివో సలహాలు ఇంకోరికి పని చేయవు నీ జీవితాన్ని నువ్వు మాత్రమే మలుచుకోగలవు… అలాగే నీ ఆలోచనలని నువ్వు మాత్రమే చెప్పగలవు. అందుకే ఇంకొకరి సలహామీద రాస్తే ఆకవిత్వంలో జీవం ఉండదు కాబట్టే ఇప్పటివరకూ ఏ కవీ ఇంకొకరి ఆలోచనలని రాయలేదు రాసినా నిలబడలేదు అని నమ్ముతాను….

ఎప్పుడైనా ఈ ఉద్యోగం, పనులూ అన్నిటినుంచీ కాస్త విశ్రాంతి  కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు?

ఇంత వరకూ అలాంటి ఆలొచనే రాలేదు. ఒక పని బోర్ అనిపించిందీ అంటే కొద్ది సేపు వేరే పని చేస్తాను. నా ఉద్దేశ్యం లో పని నుంచి విశ్రాంతి కావాలి అనిపించటం అంటే కాసేపు మరణించటమే… నేను జీవించటాన్నే ఇష్టపడతాను. నాకు మల్టీ టాస్కింగ్ ఇష్టం ఒక్కటే పనిని చేస్తూ ఉంటే మెదదు కొనాళ్ళకి ఆ పనిలో నైపుణ్యం వచ్చాక ఇక ఆ పనిని నిర్లక్ష్యం చేయటం మొదలుపెడుతుంది. అలా అవ్వకూడదూ అంటే మనం ఒకే పని చేస్తూ రోబోలం అయిపోకూడదు. పనికీ పనికీ మధ్య ఉండే సమయమే నాకు విశ్రాంతి సమయం  ఆ కొద్ది సమయం లోకూడ మొబైల్ లో ఏదో ఒక సినిమా చూడటమో , ఎవరిదైనా కవిత్వం చదవటమో చేస్తూ ఉంటాను అంతకంటే రిఫ్రెష్మెంట్ అంతకన్నా రీచార్జ్ నాకు కనపడలేదు.

మీ కవిత్వం లోనూ, రచనల్లోనూ రకరకాల షేడ్స్ కనిపిస్తాయి తెలంగాణా వాతావరణాన్ని గురించి చెప్తూనే జపనీస్ తరహా తాత్వికతలోకి వెల్తారు, లేదా ఆఫ్రికన్ పోలికల వాతావరణ వర్ణనలు ఉంటాయి…. ఈ వైవిధ్యం ఏమిటీ?

హ్మ్…! ఇప్పుడు నేను జీవిస్తున్న నేల గొప్పది. ప్రపంచంలో అత్యంత యుద్ద నేపథ్యం ఉన్న ప్రదేశాలలో ఈ భూమి ఒకటి. అందుకే నాకు మార్క్వెజ్  రాసినదానికీ, అరుంధతి రాయ్ రాసిన దానికీ ఒక లోకల్ తెలంగాణా రచయిత రాసిన దానికీ తేడా కనిపించదు సందర్భాలు వేరేమో.. దుఃఖం ఒక్కటే, ఆ వేదనా, జీవనాస్తిత్వ పోరాటమూ ఒక్కటే అందుకే ఆవిషయం ప్రపంచానికి తెలియజేయటంలో భాగంగానే కొన్ని తెలంగాణాకవితలని ఇంగ్లిష్ లోకి అనువదించాను. ఆఫ్రికా, లాటిన్ అమెరికా చరిత్రనీ, రచనలనీ చదువుతున్నప్పుదు తెలంగాణా ప్రాంతీయ విషయాలనీ, ఇక్కడి వలపోతని చెబుతున్నట్టే అనిపించేది. అందుకే నా రచనల్లోనూ ఆ ప్రభావం ఉందేమో. ఇప్పుడున్న కాలం లో ఇటు స్తానికతనీ అటు కాస్మోపాలిటన్ సంస్కృతినీ కలిపి రాస్తాను. అదే పాత కొత్త తరాలని అనుసంధానం చేయటానికి సరైందనిపిస్తుంది.  అదీ ప్రయత్నపూర్వకంగా చేసేది కాదు అలా వచ్చేస్తుంది దాన్ని మార్చెఅ ప్రయత్నం మళ్ళీ చేయను.

చివరగా ఒక్క ప్రశ్న…. మీ గురించి మీరు చెప్పుకోవాల్సి వస్తే “మామిడి  హరికృష్ణ గురించి ఏం చెప్తారు??

“హరికృష్ణ సన్నాఫ్ స్వరాజ్యం కేరాఫ్ తెలంగాణా”  నేను భూమిమీదకు వచ్చానూ, ఏదో ఒకనాదు వెళ్ళిపోతాను అంతే. మధ్యలో నేను చేసిందీ జీవించిందీ అంతా ఓషో చెప్పినట్టు ఒక మజిలీ మాత్రమే. నేను మ అమ్మకి ఒక ఎక్స్టెన్షన్ ని, ఈ ప్రపంచానికి కొంత పని చేసి పెట్టే ఒక టూల్ ని ఇంతకంటే ప్రత్యేకంగా “నేనూ” అంటే శూన్యం ఇంకేమీ లేదు.

అంతా అయిపోయాక భోజనం చేసివెళ్ళు తమ్ముడూ అంటూ ఆఫీసులోపలికి వెళ్ళబోతూ…  గేటుదగ్గరున్న మొక్కల కుండీని కాస్త సరిగ్గా సర్ది మరీ ఆయన లోపలికి వెళ్ళిపోయాక అనిపించింది….  “అవునూ..! మనం మాత్రమే చేయాల్సిన కొన్ని పనులుంటాయి ఆ పని ప్రపంచంలో ఇంకెవ్వరు చేసినా దానికి పరిపూర్ణత రాదేమో

నరేష్కుమార్ సూఫీ

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాల మంచి ఇంటర్వ్యు చాల తెలియని విషయాలు తెలుసుకున్న ఐతే హరికృష్ణ సార్ ఒక కవి గా
    ఈ లోకానికి ముందే తెలుసు దాని వెనక నేపద్యం కూడా చాల ఇంట్రెస్ట్ గ సాగింది సార్ చేసే మిగితా పనులు వాటి మిద ఆసక్తి ,పట్టు, ఎలా వచ్చాయో అడిగి తెలుసుకొని పెడితే బాగుండు అనిపించంది
    జవాబుకి హమ్మ్ ఆడ్ చేయడం బాగుంది అన్నిటికి ఉండేసరికి ఎదో ఇబ్బంది అనిపించింది
    నెక్స్ట్ సినిమా మిద ఒక ఇంటర్వ్యు ప్లాన్ చేయు సూఫీ ..యీద్దరికి శనర్తులు

    • తాంక్యూ అక్షరన్నా..! “సారంగా” కోసం ఇంటర్వ్యూ కదా అందుకే.. సాహిత్యం తప్ప మిగతా విషయాల జోలికి ఉద్దేశపూర్వకంగానే వెళ్ళలేదు.
      “హ్మ్మ్…!” ఎందుకంటే రికార్డ్ చేసుకొని తర్వాత టైప్ చేసాను ఎలా విన్నది అలా రాసేసాను. ఈసారి కరెక్ట్ చేసుకోవాల్సిన విషయమే ఇది. వన్స్ ఎగైన్ థాంక్ యు 🙂

  • తెలిసిన వ్యక్తి గురించి తెలియని లోతులు .. నచ్చింది

    • థాంక్ యౌ అన్నా…! పైన ఇదే ఆన్సర్ చెప్పాను. కేవలం సాహితీ కారుడు అన్న కోణం వరకే మా ప్రశ్నలు అని ముందే అనుకున్నం…

  • నేను మా అమ్మ కు ఎక్స్ టెన్షన్ ని….ఈ వాస్తవాన్ని ఎంత మంది గుర్తిస్తారు. ఇంటర్వ్యూ బాగుంది తమ్మీ. సినిమా గురించి, తెలంగాణ సినిమా గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుండు.
    ఇద్దరికీ అభినందనలు

    • థాంక్ యౌ చందు అన్నా…! పైన ఇదే ఆన్సర్ చెప్పాను. కేవలం సాహితీ కారుడు అన్న కోణం వరకే మా ప్రశ్నలు అని ముందే అనుకున్నం…

  • ఆయనలోని సాహిత్య కోణం చక్కగ ఆవిష్కరించారు. అయితే ఆయన ప్రారంభిస్తున్న సినీ విప్లవం గురించి, దానికి మూలాలు ఆయన జీవితంలో ఎక్కడున్నాయో, ఆయన ఊహిస్తున్న భావి తెలంగాణ కళ ఎలావుంటుందో – ఇలాంటి పరిపాలన సంబంధమైన విషయాల గురించి ఇంకో ఇంటర్వ్యూ చెయ్యాలి. మీరే చెయ్యాలి.

    • ఆ అవకాశంకోసం ఎదురై చూస్త్యున్నా 🙂 తాంక్ యు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు