షేప్ ఆఫ్ ది మ్యూజిక్

జీవితంలో సమృద్ధి అనేది డబ్బులో ఉండదు. జీవన విధానంలో ఉంటుంది.

ర్షం కాస్త తగ్గింది. Robert Frost నా గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడుతున్నట్టున్నాడు. పట్టుదలగా నా చెవిలో పదే పదే చెబుతున్నాడు.

​”The woods are lovely, dark and deep.

But you have promises to keep,

And miles to go before you sleep”

ఆయన మీది గౌరవంతో ముందుకు కదిలాను.

కొండ దిగి మొక్కజొన్న చేను దాటి కొంత దూరం వెళ్ళాకా  Anan Ta Pad Chaye Apad Ti Te Tena (Annana Pathiya Appata Ketiya) అనే థాయిలాండ్ పాట వినిపించింది. హఠాత్తుగా నాకు తెలియకుండానే బైక్ కి బ్రేక్స్ పడ్డాయి. ఇంత దట్టమైన అడవిలో ఈ థాయ్ పాట ఎవరు పడుతున్నారో అర్థం కాలేదు. చుట్టూ వెతుకుతూ చూశాను.

మూడు కొండల మధ్యన త్రికోణంలా ఉన్న ఒక చిన్న ఇరుకైన అంతగా వెలుతురు లేని చోటుకి గిరిజనులు నా చిన్నతనంలో నన్ను, నాన్న గారిని తీసుకొని వెళ్ళారు. అందుకు కారణం వారు ఒక భారీ తేనెపట్టును కనిపెట్టారు. మా మీద ప్రేమతో వారు రెడ్ వుడ్ చెట్టులా ఎంతో ఎత్తుకు, ఎంత ఎత్తంటే సుమారు రెండు మూడు తాడి చెట్లకు పైగా, ఎదిగే ఈ ప్రాంతపు ఒకే ఒక జాతి చెట్టు అయిన కోవెల చెట్టు (Cullenia exarillata కావచ్చు) ఎక్కి ఆ అతి పెద్ద తేనె పట్టును కిందకి దించారు.

దాని కోసం ఆరుగురు బలిష్టమైన పలుకలుదేరిన దేహాలు గల యువకులు రెండు గంటలు కష్టపడాల్సి వచ్చింది.

అటువంటి జీవన విధానంలో కాలం ఒకటి అనేది ఒకటి ఉందనే ఎరుక ఉండదు. దేనికోసం తొందర ఉండదు. దేనినీ  ఆశించాల్సిన అవసరమూ ఉండదు. వారి జీవితాలకు వారే అధిపతులు.

ఆ యువకులు తేనె పట్టు నుండి ఒక బిందెకు పైగా తేనెను తీసి విజయగర్వంతో దరహాసం చిందించారు. తేనెపట్టులో కాస్త మృదువైన మైనంతో నిండిన ఒక భాగాన్ని(honeycomb) కోసి, రుచిగా ఉంటుంది తినమని చెప్పి ఇచ్చారు. దానిని తింటుంటే దానిలోని తేనె అంతా పీల్చుకున్నాకా చివరికి పిప్పి(మైనం) మిగిలిలేది. దానిని కూడా వారు తినమన్నారు. నా వల్ల కాలేదు.

చాలా తక్కువ మొత్తంలో లభించే ఖరీదైన royal jelly ని కూడా తాగమన్నారు. అది తేనెటీగల డింభకాలను చంపే ప్రక్రియ ద్వారా తీసే ద్రవం కావడం వల్ల, క్రూరమైన చర్య కావడం వల్ల దానిని నాన్న గారు వద్దని చెప్పారు. అప్పటికే నాన్నగారు ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించడంతో ఆయన, అమ్మ మాంసాహారం పూర్తిగా మానివేసారు. మాంసాహారం తినడం విషయంలో నా నిర్ణయాన్ని నేను స్వయంగా తీసుకోమని నాకు 5 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు చెప్పారు. అయితే నేను తినాలనే అనుకున్నాను. కానీ నేను చూసిన కొన్ని దృశ్యాలు నన్ను కలత పరచడంతో కొన్ని నెలల్లోనే నేను పూర్తిగా మానివేయాలని నిర్ణయం తీసుకుని నాన్న గారికి చెప్పాను. ఆయన చాలా సంతోషపడ్డారు.

 ఒక లీటరు తేనెను సేకరించడానికి, తేనెటీగలు సుమారు 3,55,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే భూమి చుట్టూ 7 సార్లు తిరిగి రావడంతో సమానం. ఇంకా చెప్పాలంటే సుమారు భూమి నుండి చంద్రుని వరకు ప్రయాణించడం. ఇది ఏ స్థాయి శ్రమ దోపిడియో అర్థమయ్యాక ఆ తరువాతి కాలంలో నేను తేనెను తాగడం మానివేశాను.

గిరిజనులు పురుగుల తుట్టె అని పిలిచే భాగాన్ని, వాటిలోని డింభకాలతో సహా పిండి ఆ ద్రవాన్ని(royal jelly) కూడా ఇష్టంగా తాగేవారు.

సరే, ఈ మనసుకు కష్టం కలిగించే భాగాన్ని పక్కన పెడితే, వారు రెండు పెద్ద గిన్నెల్లో, ఒక్కొక్క దానిలో సుమారు రెండు లీటర్లు మధురమైన తేనె పోసి తాగమని ఎంతో ప్రేమతో ఇచ్చారు. రోజూ రెండు చెంచాలు తాగడం అలవాటు ఉన్న మాకు వారు అలా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రోజు నా చేత వారు లీటరుకు పైనా తేనెను తాగించారు.

జీవితంలో సమృద్ధి అనేది డబ్బులో ఉండదు. జీవన విధానంలో ఉంటుంది.

ఆ మూడు కొండల పైనున్న చిన్న ఆకాశాన్ని నల్లని మబ్బు ఒకటి మూసివేసింది. ఆ వెలుతురు చొరని మసక చీకటి చోటు మరింత చీకటిగా మారింది. ఎత్తైన చెట్ల పై అంచులు మాత్రం గాలికి ఊగుతున్నాయి. ఎందుకంటే అవి ఆ కొండల ఎత్తుకి సరిసమానంగా ఉన్నాయి. కింది భాగం అంతా నిశ్చలంగా ఉంది. గాలి పెరిగింది. క్రమంగా పై భాగం నుండి ఆకులు కింది భాగం వరకూ కదలడం మొదలు పెట్టాయి. ఒక్కసారిగా ఉధృతంగా గాలి ఆ ప్రాంతం లోపలికి చొరబడింది. అప్పుడే ఒక సంగీతంలాంటి ధ్వని వినిపించింది. ఆ మూడు కొండల మధ్యన ఇరుక్కున్న బలమైన గాలి చెట్లను ఒరుసుకుంటూ, రాళ్లను రాసుకుంటూ ఆ ఇరుకైన చీకటి చోటు నుండి బయటపడి స్వేచ్ఛను పొందాలని పెనుగులాడుతోంది. శంఖంలా అనిపించే ఆ స్థలంలో, ఒత్తిడితో కూడిన గాలి కదలికల వల్ల ఏదో natural resonance ఏర్పడి ఉండొచ్చు. అప్పుడు గాలి చేసిన వింత ధ్వని ఒక దివ్య నాదంలా వినిపించింది. అది గాలి చేసే ఈల వంటిది కాదు. అది ఎంతో సంగీతబద్ధంగా, శ్రావ్యంగా, దివ్యనాదంలా అనిపించే ధ్వని. అక్కడ ఏదో ఒక దృగ్విషయం సంభవిస్తోంది. గాలి సంగీతం పాడుతోంది. నా జ్ఞాపకాలలో అది ఎలా ఉందంటే, దానిని పోల్చడానికి సరిపోయే రాగమో, వాద్యమో, కంఠస్వరమో ఏదో ఒకటి నాకు తారసపడుతుందని చాలా దశాబ్దాలు ఎదురు చూసాను.

ఆఖరికి 2017 లో The Shape of The Water చిత్రంలో జర్మనీకి చెందిన సంగీతకారుడు Alexandrer Desplat సృజించిన, ఆస్కార్ గెలుచుకున్న నేపథ్య సంగీతంలో దొరికింది. అలాగే ఆ చిత్రంలో వచ్చే ఆఖరి వాక్యాలను నీటిని ఉద్దేశించి మాస్టర్ దర్శకుడు Guillermo del Toro ఉపయోగించినా, నేను జీవితంలో ప్రతి చోటా, ప్రతి క్షణం నాకు నా హృదయంలో వినిపించే దివ్య సంగీతానికి అన్వయించుకుంటాను. ఆ సంగీతం మన ఆత్మలోనే ఉంది. అంతేకాదు, లోకమంతటా నిండి ఉంది.

“Unable to perceive the shape of you, I find you all around me. Your presence fills my eyes with your love, it humbles my heart, for you are everywhere.”

ఈ వాక్యాలను రూమీ రాసినట్టుగా చాలా మంది భావించినా నిజానికి ఈ వాక్యాలు రాసింది 11 వ శతాబ్దానికి చెందిన సూఫీ మిస్టిక్ Hakim Sanai.

నేను ఆ స్వచ్ఛమైన తేనెను తాగుతుంటే, ఆ మాధుర్యానికి దేహస్పృహ కోల్పోయి కేవలం మాధుర్యంగా మాత్రమే నా ఉనికి మిగిలింది. దానిని నా ఉనికి అని చెప్పడం కన్నా కేవలం ఉనికి అని చెప్పడం సమంజసం. సరిగ్గా అప్పుడే వినిపించింది గాలి చేసే ఆ దివ్యసంగీతం. అప్పుడు ఉనికి ఆ సంగీతంగా మారింది. అది ఎంతో లోతైన అనుభవం. మరొక గుక్క తేనెను తాగాను. ఉనికి తేనె యొక్క మాధుర్యంలోకి వచ్చింది. గాలి పెరిగింది. అప్పుడు అది దాని సంగీతం యొక్క మాధుర్యంలోకి వచ్చింది. ఒక సమయంలో ఆ రెండూ కలిసి ఉనికి విస్తరించింది. అది మరింత అంతర్ముఖమూ, అదే సమయంలో మరింత బహిర్ముఖమూ అయింది. అంతిమంగా సర్వవ్యాప్తం అయింది.

అప్పుడే నా ఎదుట కూర్చుని తేనెను తాగుతున్న వృద్ధుడికి ఏదో అనుభవం కలిగింది. కొంత ఆ మాధుర్యానికి, మరికొంత ఆ దివ్య గానానికి వివశుడై, తాగుతూ తాగుతూ ఆ తేనె గిన్నెను మాట్లాడడం కోసం కిందకు దించి, తన్మయత్వంతో అతని కళ్ళు సోలిపోతుండగా అతనికి చేతనైన ముతక మాటల్లోనే ఇలా అన్నాడు

“అది గాంధార దేవత పాట. దానిని ఇంటే మనకి మైకం కమ్ముతాది. నిలబడలేం. దానిని ఎతుక్కుంటూ అడవంతా తిరుగుతాం. తప్పిపోతాం. అయినా ఆ పాట ఎక్కడ నుండి వత్తాదో మనం కనిపెట్టలేము. సివరకు మనం పిచ్చోళ్ళం అవుతాం.”

అతడు చెప్పగానే తెల్లని వదులైన వస్త్రాలు ధరించి, దివ్యకాంతితో మెరుస్తున్న వదనంతో; అందమైన, పొడవైన, సన్నని దేహంతో అడవిలో నడుచుకుంటూ వెళుతున్న – Arwen (The Lord of the Rings) లాంటి ఆకారం నా మనసులో అస్పష్టంగా మెదిలింది.

Elves గురించి Galadriel చెప్పిన opening monologue (voiceover) ఇప్పుడు గుర్తుకు వస్తోంది.

​ “…the Elves, immortal, wisest and fairest of all beings.”

ఇంచుమించుగా ఇలా ఊహించుకున్న గాంధార దేవతను వెతుకుతూ చాలా రోజులు నేనూ, సరస్వతి అడవుల్లో తిరిగాం.

దూరంగా 300 సంవత్సరాల వయసుండే ఒక పురాతన పనస చెట్టు కింద, ఐదు నుండి పది సంవత్సరాల వయసు గల గిరిజన బాలికలు కొందరు థాయ్ పాట పాడుతున్నారు.

ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నా మేధస్సుకు అందలేదు. Surreal గా అనిపించింది. ఈ phenomenon కి logical conclusion కోసం వెతుక్కుంటూ చుట్టూ చూశాను. దూరంగా ఒక కొండ పైన, ఒక మొబైల్ సిగ్నల్ టవర్ కనిపించింది. అంత దట్టమైన అడవిలో ఆ నిటారు అయిన కొండ పైన ఆ టవర్ ని ఎలా బిగించారో అర్థం కాలేదు. వాటి విడి భాగాలను ఎంతో శ్రమపడి గిరిజన కూలీలు అంత పైకి మోసుకుని వెళ్లి ఉంటారు అనిపించింది.

మావోయిస్టులకు గిరిజనులు ఆకర్షితులు కాకుండా వారి దృష్టిని వినోదంతో మళ్లించడానికి – నాగరికత, అభివృద్ధి, మంచి భవిష్యత్తు పేరుతో మార్కెట్ల విస్తృతిని పెంచుకోవడానికి మూలమూలకు ఇప్పుడు మొబైల్ టవర్లు చేరుకున్నాయి. ​

Amazon Leo (Project Kuiper), Globalstar, Starlink, Stratobus, ​OneWeb, Project Taara లాంటి projects తో balloons, airships, long-endurance solar-powered drones, low earth orbit (LEO) Satellites లాంటి ఆధునిక సాంకేతిక సాధనాలను ఉపయోగించి ప్రపంచపు మూలమూలకు చొచ్చుకొని వెళ్లి ఇంటర్నెట్ అందించి తమ మార్కెట్లను విస్తృతపరచుకోవాలని బహుళ జాతి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రపంచాన్ని వినిమయ సంస్కృతితో ముంచెత్తడానికి, మానసికంగా బానిసలను చెయ్యడానికి పావులు కదుపుతున్నాయి.

ఆ పిల్లలు పాడుతున్న థాయ్ పాటలోని తప్పుల్ని సరిచేసి, వారి చేత ఆ పాటను తిరిగి పాడించుకొని, వారి చేత ఇంకొంచెం సేపు ప్రాక్టీస్ చేయించి, వారు బాగా పాడడం మొదలుపెట్టాక ముందుకు సాగాను.

(సశేషం)

శ్రీరామ్

5 comments

Leave a Reply to గిరి ప్రసాద్ చెలమల్లు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తేనె వల్ల రక్తం లోని షుగర్ విపరీతంగా పెరుగుతుంది.35 యేళ్లు దాటాక, foods with high glycemic index ని తాక రాదు. వాసన చూడ వచ్చు .లేదా వీలైనంత తక్కువ వాడవచ్చు.
    ఉదా:
    అరటి ,పనస పండ్లు.
    పరోటాలు
    ఇడ్లీలు/ దోసెలు/ పొంగలి
    కొబ్బరి నీళ్లు/ తాటి ముంజలు/ పుచ్చ కాయలు.

  • What a writeup! Fell in love with the jungle deeply.
    Its so intoxicating. Eagerly waiting for the next

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు