తెలుగు సాహిత్యం లో విశేష కృషి చేసిన రచయిత్రుల రచనల గురించి లోతు గా చర్చించుకునేందుకు మొల్ల పేరుతో సత్కారం మొదలుపెట్టి మొట్ట మొదటగా ఈ సత్కారానికి నిడదవోలు మాలతి గారిని ఎంపిక చేశారు రెంటాల కల్పన. ఈ సందర్భంగా ఒక జూమ్ సభ జరిగింది మార్చి 11, శనివారం నాడు (సత్కారం అంటే నగదు బహుమానమో, దుశ్శాలువ కప్పడమో, ఇలాంటివి కావు… రచయిత్రుల కృషిని గురించి వివరంగా చర్చించుకోవడమే సెలబ్రేషన్!). ఈ సభలో నేనూ పాల్గొన్నాను. ఇది ప్రధానంగా సభ గురించి నా అభిప్రాయం, కొంత ఆత్మఘోషా. సమావేశం ఇపుడు యూట్యూబులో ఉంది. కనుక ఆసక్తిగలవారు అక్కడికి వెళ్లి చూడవచ్చు. కార్యక్రమ వివరాలు సారంగ వారి పోస్ట్ లో ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న వనజ వనమాలి గారి ప్రసంగం సభలో లేదు. సత్యవతి గారు, నాగలక్ష్మి గారు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రసంగాలు పంపారు.
అసలు విషయానికి వస్తే, తెలుగు సాహిత్యం గురించి నాకు తెలిసినది చాలా తక్కువ. తెలిసినంతలో నిడదవోలు మాలతి గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఇందుకు నాకు తోచిన కారణాలు:
- కథలు, నవలలు, కొన్ని కవితలు – ఇలా తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో సుదీర్ఘ కాలం (కథానిలయంలో తొలికథ 1953 అని ఉంది. అంటే డెబ్భై ఏళ్ల రచనా కాలం!)
- వివిధ ఆధునిక, ప్రాచీన రచయితా/త్రుల గురించి సాధికారికమైన పరిచయ వ్యాసాలు, విమర్శలు కూడా అనేకం తెలుగు/ఆంగ్ల భాషల్లో రాశారు
- వందకి పైగా కథలని ఆంగ్లానువాదం చేశారు, తూలిక.నెట్ వెబ్సైట్ ఇరవై ఏళ్ల బట్టి నిర్వహిస్తున్నారు
- ఆంగ్లం లో కూడా కొన్ని కథలు, అనేక వ్యాసాలూ, స్వీయ నవల అనువాదం ఇలా అనేక రచనలు చేశారు.
- సాంకేతికతను అందిపుచ్చుకుని తెలుగు బ్లాగు లో కూడా తరుచుగా రాస్తూ ఉన్నారు దాదాపు పదిహేనేళ్ల బట్టి.
(చాలా వరకు ప్రచురణల వివరాలు మాలతి గారి బ్లాగులో ఉన్నాయి)
అసలు ఇలా ఇన్ని రకాల కృషి, ఇలా సుదీర్ఘ కాలం ఉత్సాహంతో చేసిన వారు ఇంకోరు ఉన్నారా తెలుగులో? అని నా సందేహం. లేరని నేను అనుకుంటున్నాను. అందుకే ఇది ఒక ముఖ్యమైన సందర్భం. తెలుగు సాహితీ సమావేశాల మధ్య ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది – అందరూ స్త్రీ వక్తలు. నేను ఇలాంటిది ఇదివరలో అటెండ్ అయిన గుర్తు లేదు. వ్యాసాల గురించి (కాత్యాయని విద్మహే గారు, సి.హెచ్. సుశీల గారు), కథల గురించి (శ్రీనిధి ఎల్లల గారు, విజయ కర్రా గారు), నవలల గురించి (సునీత రత్నాకరం గారు), అనువాదాల గురించి (కల్యాణి నీలారంభం గారు), మొత్తంగా సాహితీ కృషి గురించి (సత్యవతి గారు, శీలా సుభద్రా దేవి గారు, వారణాసి నాగలక్ష్మి గారు, దివాకర్ల రాజేశ్వరి గారు) ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం తీసుకుని విశదంగా చర్చించారు. ఇదివరకే ఇవన్నీ చదివాము అనుకునే వారికి, అసలు ఇంకా మాలతి గారి రచనలు అంతగా తెలియని వారికీ కూడా కొత్త విషయాలు తెలియజెప్పడం కూడా ఒక ప్రత్యేకతే అనుకుంటాను ఈ ప్రసంగాలకు. వీటిని టెక్స్ట్ రూపం లో తేగలిగితే కొంతమందికైనా అదొక విలువైన వ్యాస సంకలనం అవుతుంది.
మరొక ప్రత్యేకత కనీసం ఒక మూడు తరాల రచయితలూ, చదువరులు ఉన్నారు వక్తలలో. ఇది కూడా నేను ఎరిగినంతలో కొంత అరుదైన సంఘటనే. బహుశా శ్రీనిధి గారు అందరికంటే చిన్న అయి ఉండొచ్చు వక్తల్లో అని నా ఊహ. ఆవిడ మాలతి గారి రచనల గురించి అంత వివరంగా చర్చించడమే ఆ రచనల్లో ఇంకా సమకాలీనత ఉంది అనడానికి నిదర్శనం. ఇలా వివిధ తరాల వక్తలని కూర్చినందుకు రెంటాల కల్పన గారికి ధన్యవాదాలు. అలాగే అర్థరాత్రి అవుతున్నా కూడా, వయసులో పెద్దవారైనా కూడా కొందరు వక్తలు ఓపిగ్గా, ఉత్సాహంగా ప్రసంగించారు. వారికి నా నమస్కారాలు.
నాకు నచ్చని ఒక అంశం – ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా కూడా వక్తలు కాకుండా ఇతర సాహితీవేత్తలు, రచయితలు ఇలాంటి వారి మధ్య ఈ సమావేశం పట్ల గల ఉదాసీనత. ముఖ్యంగా స్త్రీలు కాని ఇతరులు బహుశా ఇద్దరో ముగ్గురో ఉన్నారు జూమ్ కాల్ లో ఉన్న వారిలో, అంతే. తరవాత ఎవరైనా చూశారేమో, సమావేశం గురించి వారి అమూల్య వ్యాఖ్యానం నా కంట పడలేదు సోషల్ మీడియా లో. సమావేశం తరవాత నేను చాలా బాధపడిన విషయం ఇది. అసలు ఏ విధంగా చూసినా, ఏ తరాన్ని పట్టుకు చూసినా, మాలతి గారి కృషి కనీసం తెలుగు సాహిత్యంలో అసమానమైనది, అద్వితీయమైనది. పైన రాసాను – తెలుగులో నైనా, ఆంగ్లంలోనైనా, నేరుగా రాసినా, అనువాదం చేసినా ఇన్ని ప్రక్రియలు, ఇంత సుదీర్ఘ కలం, ఇంత ఉత్సాహంతో చేసిన రచయితా/త్రి ఎవరన్నా ఉన్నారా? అసలు టెక్నాలజీని అంత చక్కగా అందిపుచ్చుకుని కాలంతో పాటు ఎదిగిన ఇంకో తెలుగు రచయిత ఉన్నారా? మరి మనం ఎంత గౌరవించుకున్నా తక్కువే నిజానికి అలాంటి సాహిత్యకృషి చేసినవారిని. ఇపుడు ఒక పుస్తకంలో, రెండు పుస్తకాల్లో వేస్తే మహా రచయిత లా భావించుకుంటున్నారు. మన గురించి మనం అలా భావించుకోవడం, అలాగే మార్కెట్ చేసుకోవడం ఆధునిక యుగ ధర్మం. అది నేను తప్పు పట్టను. కానీ పెద్దలని గౌరవించడం, వారి నుండి నేర్చుకోవడం దేశకాలాలకి అతీతంగా ఉండాల్సిన విలువ. అసలు గొప్ప కృషి చేసిన వ్యక్తులు మన భావజాలానికి సెట్ అయితే తప్ప వారిని గుర్తించకూడదు అన్న జాడ్యం నుండి మనం (అంటే తెలుగు వాళ్ళం – మిగితా వాళ్ళ సంగతి వాళ్ళ ఖర్మ, నాకు అనవసరం) బయటపడితే బాగుండునని కోరుకుంటున్నాను. దీని వల్ల మనకి, సాహిత్యానికి, జీవితానికి కూడా మంచి జరుగుతుంది అని నమ్ముతున్నాను.
సాహితీ సభలు జూమ్ గూటి నుండి చేయడం మొదలుపెట్టాక ప్రపంచంలోని వివిధ కాల మండలాలలో నివసించేవాళ్ళు ఒకే సమయంలో ఒకచోట చేరగలుగుతున్నారు. అయితే, అందరికీ అనుకూలమైన సమయం అంటూ ఏదీ ఉండదు కదా! ఈ సమావేశం మొదలవడమే భారతదేశంలో లో రాత్రి తొమ్మిదింటికి మొదలైంది. తరువాత మూడు గంటల పాటు సాగింది. అక్కడ నుంచి మాట్లాడిన వక్తలు కాకుండా ఆడియన్స్ లో సూరపరాజు పద్మజ గారు, కల్లూరి శ్యామల గారు ఇలా కొందరు అక్కడ దాదాపు అర్థరాత్రి కావొస్తున్నా ఓపిగ్గా ప్రసంగాలు విన్నారు, తరవాత ఫేస్బుక్ లో సభలో అంశాల గురించి ప్రస్తావించారు కూడా. నేను ఎక్కువ మంది రాలేదు, సాహిత్యాన్ని ఉద్ధరిస్తున్న ఎన్నారై ప్రముఖులు అసల్రాలేదు అని వాపోయాను కానీ, నిజమైన సాహిత్య అభిమానులు అంటే వీళ్ళే అనిపించింది నాకు. నేను ఇద్దరి పేర్లే ప్రస్తావించాను. కానీ ఇలా ఇంకో ముగ్గురో నలుగురో ఉన్నారు – లక్ష్మీదేవి గారు ఒకరు. ఒక పెద్దాయన కెనడా నుండి అటెండ్ అయ్యారు. ఇపుడు అందరివీ పేర్లు టక్కున గుర్తు రావడం లేదు, వారికి క్షమాపణలు.
మొత్తానికి ఇలాంటి ఆలోచన కలిగినందుకు, మంచి సమావేశం నిర్వహించినందుకు, కల్పన గారికి ధన్యవాదాలు, అభినందనలు. రాబోయే సంవత్సరాలలో మనం ఇలాగే మరి కొంతమందిని గౌరవించుకుంటామని ఆశిస్తున్నాను.
*
చాలా సంతోషం సౌమ్యా, చాలా బాగా చెప్పేవు. ముఖ్యంగా నీకు నచ్చని అంశంగురించి.
నారచనలగురించి నీదగ్గర్నుంచి ఇంత వివరంగా చూడడం ఇదే మొదలు నాకు. :)). ఏం చేస్తాం. శ్రీనిధి కోట్ చేసిన నావాక్యమే నేనిక్కడ మళ్లీ కోట్ చేస్తాను. నిద్రపోతున్నట్టు నటించేవాళ్లని లేపలేం. :)).
ఫేస్బుక్ లో నేను ఇప్పుడు లేను కనక ఎవరు సభకి వచ్చేరో, ఎలా స్పందించేరో తెలీదు. వారికి ధన్యవాదాలు ఇక్కడే చెప్తాను. నీకు కూడా ధన్యవాదాలు నీవిపుల వ్యాఖ్యానానికి.
“నారచనలగురించి నీదగ్గర్నుంచి ఇంత వివరంగా చూడడం ఇదే మొదలు నాకు” – ఫలాన ముక్క ఇంకెవ్వరు చెప్పట్లేదు, ఇకపై చెప్పేలా కూడా లేరు అనుకుంటే తప్ప నేను నా అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పను .. హీహీహీ…
హాహా. సరే.
నిన్న చెప్పడం మరిచిపోయేను. “ముఖ్యంగా స్త్రీలు కాని ఇతరులు” -:)), సాహిత్యాన్ని ఉద్ధరిస్తున్న యన్నారై ప్రముఖలు మున్నగువారు చూడడం చూస్తారు. మనకి చెప్పరు. వాళ్లలో వాళ్లు రహస్యంగా చర్చించుకుంటారు. నామీద కన్నేసి ఉంచడం అన్నమాట. నేనంటే వాళ్లకి గౌరవం లేదు. వాళ్లంటే నాకూ గౌరవం లేదు. సరికి సరి.
ఫేస్బుక్ మిత్రులు పద్మజ సూరపరాజుగారికి, శ్యామల కల్లూరిగారికి, లక్ష్మీదేవిగారికి, మిగతా మిత్రులకూ ధన్యవాదాలు. నేను ఫేస్బుక్కులో లేను కనక వారు తమఅభిప్రాయాలను నాబ్లాగు, తెలుగుతూలికలో తెలుపవలసిందిగా కోరుతున్నాను.
You tube లో చూస్తాం
సౌమ్యకి నాసమాధానం కొనసాగింపుగా,
సౌమ్యవ్యాఖ్యకింద రాయబోతే duplicate అని వస్తోంది. అంచేత విడిగా పోస్టు చేస్తున్నాను.
—
హాహా. సరే.
. “ముఖ్యంగా స్త్రీలు కాని ఇతరులు” -:)) (మంచి పదబంధం), సాహిత్యాన్ని ఉద్ధరిస్తున్న యన్నారై ప్రముఖలు చూడడం చూస్తారు. మనకి చెప్పరంతే. వాళ్లలో వాళ్లు రహస్యంగా చర్చించుకుంటారు. నామీద కన్నేసి ఉంచడం అన్నమాట. నాకృషి అంటే వాళ్లకి గౌరవం లేదు. వాళ్లకృషి అంటే నాకూ గౌరవం లేదు. సరికి సరి.
ఫేస్బుక్ మిత్రులు పద్మజ సూరపరాజుగారికి, శ్యామల కల్లూరిగారికి, లక్ష్మీదేవిగారికి, మిగతా మిత్రులకూ ధన్యవాదాలు. నేను ఫేస్బుక్కులో లేను కనక వారు తమఅభిప్రాయాలను నాబ్లాగు, తెలుగుతూలికలో తెలుపవలసిందిగా కోరుతున్నాను.
[…] వాళ్లేమంటున్నారో విందాం! మార్చి 22, 2023 […]