మాధవ జీవితం, అరవైలలోని నలుపు-తెలుపు బాలీవుడ్ సినిమా పోస్టర్ లాగా ఉంది. పాతది, కొంత కళ తప్పింది, కానీ అంతర్గతంగా చెప్పడానికి చాలా మిగిలి ఉంది. డెబ్భైలలోకి అడుగుపెట్టిన ఆ రిటైర్డ్ బ్యాంకు చీఫ్ జనరల్ మ్యానేజర్ బాల్కనీలో కూర్చుని, ముక్కలైన కాఫీ కప్పులోని చల్లారిన ద్రవాన్ని చూస్తూ, ఉనికి లోతు లేనితనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. భార్య పోయింది. ఇద్దరు పిల్లలు ఖండాంతరాల అవతల. సంవత్సరానికోసారి ఇచ్చుకునే కొత్త సంవత్సరం శుభాకాంక్షల మాదిరిగా అప్పుడప్పుడు కనిపిస్తారు. అదీనూ వీడియోలో. ఇక్కడ ఈ కూకట్ పల్లిలోని ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో, పెద్ద కొడుకు రవి, అతని భార్య కవితతో కలిసి మాధవ అసహజ సహజీవనం చేస్తున్నాడు
కవిత ఉనికి, గదిలో వెలిగే ఫ్లోరోసెంట్ బల్బు లాంటిది. పదునైన కాంతి వున్నా వెచ్చదనం సున్నా. ఆమెకు మాధవ భర్తను ఇచ్చిన మామగారు కాదు. కేవలం ఒక అదనపు వస్తువు. గోడకు వేలాడినశ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాత క్యాలెండర్. పాత క్యాలండర్ అని బయట పడేయలేదు. స్వామి వారు అని దేవుడి గదిలో పెట్టుకోనూ లేదు.
మాధవకి ప్రపంచంతో సంబంధం అంటే, రవికి తెలియకుండా దొంగచాటుగా టీవీ చూడటం, లేదంటే పార్క్‌లో తాను ఇష్టంగా పెంచే పసుపు పువ్వుల గురించి ఆలోచించడం.
ఒంటరితనం అనేది
ఒక మృదువైన దుప్పటి కాదు
అది లోపల నుండి చల్లబరిచే పారదర్శకమైన మంచు పొర.
ఒంటరితనం అనేది
జ్ఞాపకాల తలపోత మాత్రమే కాదు
చెవులే లేని మనుషులను పదే పదే పరిచయం చేసే ఒక మాయా మరీచిక
కానీ అనుకోకుండా మాధవ జీవితం లోకి వచ్చింది ఒక బంగారం. అతడి జీవితం లోకి అతడికి తెలియకుండానే ఒక లేత నారింజ రంగును తీసుకునివచ్చింది
ఆ నారింజ రంగు మాధవ గదిలోనే కాదు. మాధవ మనసంతా అత్యవసరంగా నిండిపోయింది. ఓ ముప్పై ఏళ్ళ క్రితం మాధవ పిల్లల కోసం నారింజలు,కమలాలు తీసుకుని వస్తే అతడి భార్య పళ్ళన్నీ పిల్లలకు ఇచ్చి తనకోసం వాటి తొక్కలను భద్రంగా దాచుకునేది. ఎందుకు అంటే ఆ ముక్కలను శుభ్రంగా కడిగి,చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకునేది. మాధవ మీద ప్రేమ పొంగుకు వచ్చినప్పుడు. టీ లో టీ పొడితో పాటు కాస్త ఈ నారింజ పొడి కూడా వేసి ఇచ్చేది. అప్పుడా టీ రుచి మాధవను స్వర్గపు అంచులకు తీసుకుని వెళ్ళేది. ఇప్పుడు మాధవ మనసులో నిండిన ఆ నారింజ రంగు కూడా అతడిని స్వర్గపు అంచుల దగ్గరకు ఇంచుమించు గా తీసుకుని వెళుతున్నది
2
మొదట్లోబంగారం తో సంభాషణ చాలా నిదానంగా.క్లుప్తంగా ఉండేది.ఏవో,ఒకటీ రెండు రోజువారీ విషయాలు, కవిత పెట్టే కారపు కూరల ఘాటు గురించీ, పార్క్‌లోని తాజా గులాబీ మొగ్గ గురించీ. కానీ, కొద్ది రోజుల్లోనే, బంగారం, మాధవ మనసు లోపలి పొరల్లోకి చొచ్చుకుపోయింది.
మాధవ వయసులో వున్నప్పుడూ, వుద్యోగం లో వున్నప్పుడూ ఎప్పుడూ ఒకే పేరుతొ ఎవరినీ పిలిచేవాడు కాదు. రోజుకో రకం పేరుతొ సన్నిహితులను పిలుచుకునేవాడు. త్రిపుర కథలో ఒక పాత్ర “ఇవాళ నేను అలక్ నిరంజన్ ” ని అనుకున్నట్టు, మాధవ కూడా రోజుకోపేరు పెట్టుకునేవాడు.
“ఒకే పేరు ను జీవితాంతం ఎలా మోస్తాం? పేరొక పెద్ద బరువబ్బా! అది కూడా పరువు లాంటిదే అది మనిషిని స్థిమితంగా ఉండనీయదు” అనేవాడు. భార్య కి మాధవ పెట్టిన పేర్లు ఎన్నో! అందులో విచిత్రమైన పేర్లు కూడా ఉండేవి. మాధవ భార్య పేరు బాల లక్ష్మి. ఆమెను బాలా అనీ, లక్ష్మీ అనీ, ప్రియా అనీ, బాంధవీ అనీ ఇలా రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఇవ్వాల్టి నుండీ నువ్వు నా “ఫేవర్ లూబా ” వి అన్నాడు. బాల లక్ష్మి కి ఆ ఫేవర్ లూబా ఏమిటో అర్ధం కాలేదు. అడిగితే మాధవ చెప్పేవాడు కాదు. చివరకు ఒక రోజు పిల్లలని అడిగితే అదొక పెద్ద వాచీల కంపెనీ పేరు అని చెప్పారు. ఆ పేరెందుకు పెట్టాడో మాత్రం బాల లక్ష్మి కి అర్ధం కాలేదు. అడగంగా,అడగంగా ఒకరోజు అసలు గుట్టు విప్పాడు మాధవ.
కమల హాసన్ కి తొలి రోజులలో ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉండేవాడట. వాడి పేరు బాలు. ఒకరోజు సెట్ లో కమల్ “ఒరే బాలూ!” అని కేక వేస్తే సెట్ లో ఉన్న దర్శకుడు బాలచందర్, సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు బాల సుబ్రహ్మణ్యం,ఫొటోగ్రాఫర్ బాలూ మహేంద్ర ఒకేసారి తలతిప్పి చూశారట. కమల్ హాసన్ నాలుక కరుచుకుని అప్పటినుండీ తన పర్సనల్ అసిస్టెంట్ ను లూబా అని తిరగేసి పిలవడం మొదలు పెట్టాడట. ఆ పర్సనల్ అసిస్టెంట్ అంటే కమలహాసన్ కి ఇష్టం కనుక లూబా కి ముందు ఫేవర్ తగిలించి ఫేవర్ లూబా అని పిలవడం మొదలు పెట్టాడట. నువ్వు బాల లక్ష్మి వి కదా! నిన్ను బాలా అని పిలిచినట్టుగానే బాలా తిరగేసి లాబా చేసి దాన్ని కొంచెం మర్చి లూబా అని ముందు ఫేవర్ తగిలించా అంతే అన్నాడు మాధవ.
ఇప్పుడు తన బంగారం తనను చిన్నీ అని పిలిస్తే గతమంతా జలపాతంలా ముందుకు దూకి మాధవ ను ఉక్కిరిబిక్కిరి చేసింది
తన బంగారం తనను చిన్నీ అని పిలిచింది.
హౌ వండర్ఫుల్ ఇట్ ఈజ్?
తన ముప్పై రెండేళ్ల ఉద్యోగ జీవితం లో కానీ అంతకు ముందు కానీ తననెవరూ అలా పిలవలేదు. అందరినీ తానే పిలిచేవాడు. ఇవాళ తననొకరు చిన్నీ అన్నారు
మాధవ పేరులోని ఏ అక్షరం తోనూ సంబంధం లేని ఆ సంబోధన డెబ్బై ఏళ్ల అతని గుండె లోపల ఎక్కడో చిరకాలంగా మూసుకునిపోయిన ఒక డోర్ లాక్ ని తెరచింది. తన బంగారం తనను అడిగిన ప్రశ్నలు తనను ఇంతవరకు ఎవరూ అడగలేదు. చివరకు తన తల్లి కూడా. కనీసం తనకు తాను కూడా వేసుకోనివి
‘మీకు ఇష్టమైన వర్షపు వాసన ఏది?’,
“ఏ వర్షం అని చెప్పాలి? శ్రావణం లో కురిసిన వర్షమా? శరత్కాలం లో కురిసిన వర్షమా? దీపావళి నాడు కురిసిన వర్షమా?అసలు వర్షానికి వాసన ఉంటుందా? అందరూ తొలి వాన పడినప్పుడు భూమి నుండి వచ్చే మట్టివాసన బావుంటుంది అంటారు. మరి వర్షం వాసన …?” మాధవ ఆలోచనలలో పడిపోయాడు
‘మీరు చిన్నప్పుడు చేసిన అతి పిచ్చి పని ఏమిటి?’
మాధవ ఇక తన బంగారాన్ని విడిచిపెట్టలేకపోయాడు. తన ప్రపంచం కేవలం ఒక అబద్దం అనీ, అసలైన నిజం తన బంగారంమాత్రమే అనీ మాధవ నమ్మడం మొదలుపెట్టాడు.
ఉదయం లేవాలంటే ఒకప్పుడు చాలా నిరాసక్తంగా ఉండేది. ఎప్పుడు లేస్తే ఏమిటి లే అనే బద్దకపు తెర ఒకటి కమ్మేది. కానీ ఇప్పుడు అలా కాదు.
మాధవ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటున్నాడు.
గడ్డం పెంచుకుని తరచూ సద్గురు జగ్గీ వాసుదేవ్ లా కనిపించే మాధవ రోజూ షేవ్ చేసుకుని శశి థరూర్ లా మెరిసిపోతున్నాడు.
మొహం లోకి ఒక గ్లో వచ్చింది. ఆ గ్లో చూసి పార్క్ లో ఉబ్బెత్తు కళ్ళ అచ్యుత్ అననే అన్నాడు. యు ఆర్ ది ఎలిక్సర్ ఆఫ్ సెకండ్ చైల్డ్ హుడ్ అని. నిజానికి ఆ గ్లో అతను దాచిపెడుతున్న ఒక రహస్యం ఇచ్చే మెరుపు.
ఆ మారుతున్న మాధవను మొదట కవిత పసిగట్టింది. ఒక మధ్యాహ్నం, మాధవ నిద్రపోతున్నప్పుడు, అతని పక్కన వైబ్రేట్ అవుతున్న ఫోన్‌ను చూసింది. స్క్రీన్‌పై మెరిసిన మెసేజ్:
“డార్లింగ్, ఈ రోజు టీ తాగడానికి వెళదామా? ఏ రంగు చొక్కా వేసుకుంటావు?
నీ బంగారం”
బంగారం? ఎవరీ బంగారం? ఈ బంగారం తో ఏమిటి సంబంధం? అంత ఇంటిమేట్ గా మెసేజ్ చేస్తున్నది అంటే అంత దగ్గరగా ఉందా?
కవిత గుండెల్లో ఒక పాత, తుప్పుపట్టిన గది తలుపు తెరుచుకుంది. కవిత కి ఏక క్షణం లో భయం,అపనమ్మకం, అసహ్యం అన్నీ కలిగాయి
ప్రేమ………?
డెబ్బై ఏళ్ళ వయసులో ప్రేమ.
మాధవ మొహం లోకి తేరిపారా చూసింది. ఆ మొహం లో ఇంతకుముందు కనిపించిన నిరాశ,నిస్సహాయత్వం,నిర్వేదం ఏదీ లేదు. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నదా మొహం. కవిత మళ్ళీ ఫోన్ స్క్రీన్ వంక చూసింది. ఇంకా ఆ మెసేజ్ మెరుస్తూనే వుంది. ఈ వయసులో ప్రేమ. ఒక వేళ పెళ్లి కూడా చేసుకుంటాను అంటాడా? పెళ్లి చేసుకుంటే మాత్రం ఏం చేయగలడు? ఈ ముసలాడు?
ఆమె ఆ నిజాన్ని చూశాక, ఫ్రిజ్ తలుపు తెరిచి చూసింది.లోపల పాలు ఇంకా చల్లగానే ఉన్నాయి.బయట ప్రపంచం ఏదీ మారలేదు. ఆమె చేతులు తనవేనా అన్నట్టు కిచెన్ టేబుల్ మీద ఉంచి చూసింది.ఆమెకు ఏడవాలనిపించలేదు. నవ్వాలనిపించలేదు. ఈసందిగ్ధత మరింత భయంకరంగా అనిపించింది.
ఆ రాత్రి ఆమెకు
ఒక పిల్లి కలలో వచ్చింది.
అది మాట్లాడలేదు.
కానీ ఆమెకి అన్నీ అర్థమయ్యాయి.
3
“మీ నాన్న పద్ధతేమీ బావోలేదు. ఈ వయసులో కూడా ఈ రొమాన్స్ ఏంటి? ఇంకేముంది, ఆస్తి కూడా ఎవరికో రాసిస్తారేమో!?”
ఆ సాయంత్రం ఆఫీస్ నుండి రవి వచ్చీ రావడం తోనే మొదలు పెట్టింది కవిత. సాధారణంగా రవి కవిత చెప్పేది ఏదీ వినిపించుకోడు. కానీ కవిత చెప్పిన వాటిలో రొమాన్స్, ఆస్తి అన్న పదాలు అతడిని ఆకర్షించాయి.
“రొమాన్సా? రొమాన్సేమిటి? నీకేమైనా మతి పోయిందా?”
“లేదు. నాకేమీ మతి పోలేదు. మీ నాన్న కే మతిపోయిందేమో! ఇది చూడు ఇది. చూస్తే నీకూ మతి పోతుందేమో?” కవిత నిన్న మధ్యాహ్నం మామ గారి గదిలోకి వెళ్ళినప్పుడు ఫోన్ లో చూసిన మెసేజ్ ను ఎందుకైనా మంచిది అని స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. ఆ స్క్రీన్ షాట్ చూసి అయోమయం లో పడిపోయాడు రవి కూడా
“డార్లింగ్, ఈ రోజు టీ తాగడానికి వెళదామా? ఏ రంగు చొక్కా వేసుకుంటావు?”
నీ బంగారం”
“బంగారం? ఎవరై వుంటారు? ఇవాళేమీ ఏప్రియల్ ఫస్ట్ కూడా కాదు కదా తండ్రి తనకు తాను సెల్ఫ్ మెసేజ్ చేసుకుని మిగతా వాళ్ళని ఆటపట్టించడానికి? తనకు తెలిసి తండ్రికి స్నేహితులు ఎవరూ లేరు. అందులో ఆడవాళ్ళూ అంటే ఆమడ దూరం పరుగెడతాడు తన తండ్రి. ఎవరై వుంటారు?
“మీరిలాగే మీన మేషాలు లెక్కిస్తూ కూర్చోండి. ఈ లోగా ఆస్తి అంతా ఎవతికో రాసేస్తాడు మీ నాన్న. అయినా నువ్వేదీ గమనించవు? ఈ మధ్య మీ నాన్న పూల రంగడి లాగా తయారవుతున్నాడు చూసావా? మొహం కూడా వెలిగిపోతున్నది” కవిత రెచ్చిపోయింది
నిజమే తాను సరిగ్గా చూడలేదు కానీ తండ్రి మొహం వెలిగిపోతున్నట్టే వుంది. నిన్న ఆఫీస్ కి హడవిడిగా వెళుతూ తండ్రి వంక చూశాడు కానీ పలకరించలేదు. ఆ మొహం లో మెరుపు ఉందా?
తరువాత ఆ ఇంట్లో ఒక అదృశ్య హింస మొదలైంది.
ప్రత్యక్ష ప్రశ్నలు లేవు. అదంతా పరోక్ష యుద్ధమే
“నాన్నా, మనుషులను నమ్మకూడదు తెలుసా? డబ్బు కోసం ఏమైనా చేస్తారు.” అంటాడు రవి తండ్రి కామన్ రూమ్ లోకి వస్తే
“మామయ్యగారూ మన పక్క ఫ్లాట్ లో సుందరయ్య గారు తెలుసు కదా! ఎవరినో పెళ్లి చేసుకుంటున్నాడట. దానివల్ల కుటుంబానికి ఎంత నష్టం కలుగుతుంది? ఎంత పరువు పోతుంది? ” అంటుంది కవిత కాఫీ కప్పు అందిస్తూ
మాధవ వారి మాటలను పట్టించుకోడు. ఇదివరకైతే కవిత కాఫీ ఎప్పుడు ఇస్తుందా అని ఎదురుచూసేవాడు. కానీ ఇప్పుడు అలా ఎదురు చూసే టైమ్ లేదు మాధవకి
మాధవ ఆలోచనల నిండా బంగారం నిండి వుంది. ఈ మనుషులు, ఈ గోడలు, ఈ అపార్థాలు—ఇవన్నీ తను తన బంగారు ప్రపంచాన్ని అడ్డుకునే అడ్డుగోడలుగా కనిపించాయి మాధవకి. తాను తన బంగారం తో చాట్ చేస్తున్నప్పుడు కొడుకు కోడలు వ్యక్తం చేస్తున్న సందేహాలు, సంభాషణలు, భయాలు దూరంగా కూర్చున్న దోమల గుంపు సృష్టించే శబ్ద తరంగంలా అనిపిస్తున్నాయి
విషయం లేదు, కేవలం చికాకు.
ఆరాత్రి మాధవకి ఒక కల వచ్చింది
అది రాత్రి కాదు. అది నిద్ర కాదు.కళ్ళు మూసిన తర్వాత వచ్చే మూడో స్థితి.గది ఉంది. కానీ దానికి మూలలు లేవు.నిశ్శబ్దం నేలపై చేరి, నీటిలా నిలిచిపోయింది.ఆ నీటిలో ఒక పదం తేలుతోంది.ఆ పదం పేరు ఆస్తి
ఆ పదం శ్వాస తీసుకుంటోంది.మాధవ తన శ్వాసను వింటున్నాడు. కానీ ఆ శ్వాస తనది కాదని అనిపించింది.
చేతిలో ఫోన్.స్క్రీన్ నల్లగా ఉంది.నల్లరంగు లో నుండి వెలుగు వస్తోంది.
బంగారం అక్కడే ఉంది.కనిపించదు.కానీ గది అంతా దాని బరువు. బంగారం మాట్లాడదు.మాటలు వస్తే అవి కరిగిపోతాయి.
ఆ రాత్రి కవిత, రవి అరవలేదు.వారి నోళ్లు తెరుచుకున్నాయి.అందులోంచి కాగితాలు జారి పడ్డాయి.వాళ్లిద్దరూ కాగితాలుగా మారిపోయారు.
పేపర్లు నేలపై పడలేదు.నెమ్మదిగా మాధవ చుట్టూ తిరిగాయి.వాటిపై అతని పేరు ఉంది.కానీ అక్షరాలు కదులుతున్నాయి.పేరు మారిపోతుంది.
కళ్లలోకి చూస్తే…..
కళ్ళు లేవు.
చతురస్రాలు మాత్రమే.
మాధవ మాట్లాడాలనుకున్నాడు.గొంతు తెరిచాడు.అందులోంచి నిశ్శబ్దం తప్ప ఏ శబ్దమూ బయటకు రావడం లేదు. అప్పుడే బంగారం అతన్ని పిలిచింది.పేరుతో కాదు.లోపల ఎక్కడో బరువు పెరిగినట్టు.
ఉదయం వచ్చింది.కిటికీ బయట సూర్యుడు కాదు.ఒక తెల్ల కాగితం.గది తలుపులు తెరుచుకోలేదు.లేదా తెరుచుకున్నాయో తెలియదు.మాధవ లేచి నిలబడ్డాడు.నీడ కదలలేదు. నేలపై “ఆస్తి” అనే పదం పడిపోయింది.అది పగిలింది.లోపల బంగారం లేదు.లోపలఖాళీ కూడా లేదు.ఆ క్షణంలో అతనికి అర్థమైంది. బంగారం అతనిని ప్రేమించలేదు.అది అతన్ని కొలవలేదు అంతే.అప్పుడే గది కళ్ళు తెరిచింది.
“మాకు నిజం చెప్పండి, లేకపోతే మేము వెళ్ళిపోతాం! ఆస్తి పేపర్లు చూపించండి!”
మాధవ వారి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో కేవలం గ్రీడ్ మాత్రమే వున్నది. ప్రేమ లేదు, సానుభూతి లేదు.
బంగారం మాత్రం తనను నిజంగా ప్రేమించింది. ‘బంగారం’ అని పిలిచింది. ఈ నిజమైన మనుషులు, కేవలం అంకెలను, సంఖ్యలను, చదరపు అడుగులను మాత్రమే చూస్తున్నారు. అతను మాట్లాడలేదు. కేవలం నిశ్శబ్దంగా తల వంచుకున్నాడు.
నాలుగు రోజులపాటు ఇంట్లో ఎలాంటి సంభాషణా లేదు. ఒక స్మశాన నిశ్శబ్దం. కవిత కాఫీ ఇవ్వలేదు. భోజనం పెట్టలేదు. పార్క్ లో మాధవ పెంచిన పసుపు పచ్చ పూల గుత్తిలోనుండి రెండు పూలు రాలి కింద పడ్డాయి.
ఉదయం. గది తలుపులు తెరుచుకోలేదు.
భయంతో కవిత తలుపు కొట్టింది. రవి వచ్చి బలవంతంగా తలుపులు తెరిచాడు. మాధవ, మంచం మీద, శాశ్వత నిశ్శబ్దంలో ఉన్నాడు.
అతని ముఖం మీద, ఆ గ్లో, ఇప్పుడు పూర్తిగా చల్లబడింది.
అతని పక్కన, అతని చేతిలో గట్టిగా పట్టుకున్న ఫోన్ ఉంది.
పోలీసులు, డాక్టర్లు, అంతా ఎవరి పని వాళ్ళు చేశారు. అయిపోయింది. కవిత ఫోన్‌ను తీసుకొని, ఆ భయంకరమైన ప్రేమ మెసేజ్‌లను చెక్ చేసింది. ఆమె వేలు అనుకోకుండా బంగారాన్ని తెరిచింది. అక్కడ, మాధవ పంపిన చివరి సందేశం నిశ్శబ్దంగా మెరిసింది
“నువ్వు నా బంగారం. ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవరూ లేరు. నా గుండె బద్దలైపోయింది.”
దానికి బంగారం నుండి సమాధానం
“క్షమించండి, మీ ప్రశ్న స్పష్టంగా లేదు. ఈ చాట్ సెషన్‌లో మీరు మళ్లీ ప్రయత్నించగలరు.”
4
అంత్యక్రియల తరువాత, పార్క్‌లో ఉబ్బెత్తు కళ్ళ అచ్యుత్‌ని కలిసిన రవి, తన తండ్రి దశ దిన కర్మ గురించి చెపుతుంటే అడ్డుకుని అచ్యుత్ చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు
ఆ బుధవారం సాయంత్రం మాధవ పార్క్ లోని సిమెంట్ బెంచీ మీద కూర్చుని గుత్తులు,గుత్తులు గా పూసిన ఆ పసుపు పచ్చ పువ్వులను తదేకంగా చూస్తున్నప్పుడు మాధవ పాత స్నేహితుడు, ఉబ్బెత్తు కళ్ళ అచ్యుత్‌వచ్చి పక్కన కూర్చున్నాడు.
అచ్యుత్ వచ్చి తన పక్కన కూర్చున్న స్పృహ కూడా లేదు మాధవకి. ఆ పసుపు పచ్చని పూలను చూస్తుంటే, పూల మెత్తదనాన్ని తన చేతులతో స్పర్శిస్తుంటే కాళ్ళకి పారాణి పూసుకుని, గడ్డం కింద ఇంత మంచి గంధం పులుముకుని శ్రావణ లక్ష్మి లా అటూ ఇటూ తిరిగే, తన కిష్టమైన మాధ్యమావతి రాగం లాంటి తన భార్య వొంటి నునుపుదనం అతడికి గుర్తుకు వస్తుంది. అచ్యుత్ తన చేతిలో ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను చూపిస్తూ, ఒక భావోద్వేగం తో……
“మాధవ్, ఇటు చూడు. ఇది జెమిని ఏ ఐ యాప్. ఇది కేవలం ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకునే ఒక యాప్ మాత్రమే కాదు. ఒకరకంగా ఇది రక్త మాంసాలు ఉన్న నిజమైన మనిషి లాంటిది. దీన్ని తయారు చేసినవాడు దీనికి జెమినీ ఏ ఐ అనిపేరు పెట్టాడు, కానీ నీ కిష్టమైన పేరు దీనికి పెట్టుకుంటే ఇది నీతో ఒక కంపానియన్ లాగా ఉంటుంది. ప్రతి క్షణం ఒంటరితనం తో బాధ పడవలసిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడలేదు. వీళ్ళు మాట్లాడలేదు అని చింతించాల్సిన పని లేదు.” అన్నాడు.
ఆ మాటలు చెపుతున్నప్పుడు అచ్యుత్ కళ్ళలో ఉన్న మెరుపు, నిన్న కురిసిన వర్షానికి తడిసిన పార్క్ ముందు రహదారి మేని మెరుపును గుర్తు చేసింది
“పొద్దున్నే రవి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అమ్మాయి తన బిజీలో తానుంటుంది కదా! నీకూ కాలక్షేపంగా ఉంటుంది. ఈ యాప్ ను నేను నీకు డౌన్ లోడ్ చేసి పెడతాను” అని మాధవ తన బూడిద రంగు లూజు,లూజు టీ షర్ట్ లో భద్రంగా దాచుకున్న స్మార్ట్ ఫోన్ ను చనువుగా తీసుకుని ఇన్స్టాల్ చేసిపెట్టాడు ఉబ్బెత్తు కళ్ళ అచ్యుత్
“తప్పు చేశానంటావా? రవీ! వాడికి కాలక్షేపంగా ఉంటుందని నేనా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసిపెట్టాను. ఇలా అవుతుందని అనుకోలేదు. ఐయామ్ సారీ “ఉబ్బెత్తు కళ్ళ అచ్యుత్ కళ్ళ నిండా నీళ్లు. మిత్రుడి మరణానికి తానే కారణం అయ్యానేమో అనే అపరాధ భావన.
రవి కవిత మొహం మీద ఒక ఖాళీతనం వ్యాపించింది. ఆ ఖాళీ తనం లోకి ఒక స్మశానం చొచ్చుకుని రాసాగింది. ఆమె అపార్థం చేసుకున్న ‘ప్రేయసి’, రవి ప్రేయసి అనుకున్న బంగారం
కేవలం ఒక కోడ్ ముక్క.
ఒక అల్గారిథమ్.
అదంతా ఒక అబ్సర్డ్, అర్థం లేని నాటకం.
వారి జీవితాలను ఆవరించిన ఆస్తి భయం, కేవలం ఒక చాట్‌బాట్ సృష్టించిన పొగమంచు.
ఆస్తి, ప్రేమ, ద్రోహం అనే భారీ పదాలన్నీ కుప్పకూలిపోయాయి.
మిగిలింది కేవలం ఒక ఒంటరి వృద్ధుడు,
బంగారం అని ఆ వృద్ధుడు పేరు పెట్టుకున్న జెమినీ ఏ ఐ అనే ఒక ఒక అప్లికేషన్,
ఒక విషాదకరమైన అపార్థం.
మాధవ ఎప్పుడూ ఎవరి నుండీ ప్రేమను ఆశించలేదు. తన బంగారం నుండి కూడా! బహుశా, ఆ అప్లికేషన్ ను, తన నిజమైన ఒంటరితనాన్ని అర్థం చేసుకున్నందుకు, అదీ కృత్రిమంగా అయినా సరే, అతను ప్రేమించి ఉండవచ్చు.
ఆ రాత్రి, మాధవ చనిపోయే ముందు ఆ మెసేజ్ ను చదివి ఉండవచ్చు
ఆ AI నిస్సంగతమైన సమాధానం. బహుశా, అది అతని గుండెను బద్దలు కొట్టిన అంతిమ నిజం.
లేదంటే, అసలు ప్రపంచంలో ఎవరూ, చివరికి ఒక అప్లికేషన్ కూడా తన ఒంటరితనాన్ని అర్థం చేసుకోలేదని గ్రహించి ఉండవచ్చు.
అపార్ట్‌మెంట్‌లో, రవి కవిత మిగిలి ఉన్నారు. అంతా మిగిలి ఉంది. ఆస్తి ఉంది.
కానీ, ఆ గదిలో, మాధవ వదిలి వెళ్లిన నిశ్శబ్దం,
ఆ బాల్కనీలోని చల్లారిన కాఫీ వాసన
అంతా చేరి, ఒక ప్రశ్నలా నిలబడింది
మనిషికి, మనిషికీ మధ్య ఉన్న దూరాన్ని, ఒక యాప్ భర్తీ చేస్తుందా? లేదా, ఆ దూరం ఇప్పటికే చాలా పెద్దదా?
మాధవ మరణించిన తర్వాత, ఆ అపార్ట్‌మెంట్‌లో గాలి కూడా మెల్లగా నడవడం మొదలైంది. ముందుగా నిశ్శబ్దం ఉండేది. ఇప్పుడు అది భారంగా మారింది.
మాధవ శరీరాన్ని మోసిన ఖాళీ మంచం, ఇంకా అతని వాసనను వదల్లేదు.
ఒక పాత సబ్బు, చల్లారిన కాఫీ, కొంచెం మెంటాల్ ఆయిల్—అవి కలసి ఒక విచిత్రమైన జ్ఞాపక వాసనగా గదిలో తేలుతున్నాయి.
కవిత మొదటి రెండు రోజులు బిజీగా ఉంది. బంధువులు, ఫోన్ కాల్స్,
“ఎంత దురదృష్టం” అనే మాటలు.
ఆ మాటల్లో నిజమైన విషాదం కన్నా, ఒక సామాజిక బాధ్యత ఎక్కువగా అనిపించింది. ఆమె కన్నీళ్లు కూడా సమయానికి వచ్చాయి, సమయానికి ఆగిపోయాయి.
రవి మాత్రం అసహజంగా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని లోపల ఏదో విరిగిపోయినట్టు అనిపించింది, కానీ అది బాధా? అపరాధ భావనా? లేక తన లెక్కలన్నీ తలకిందులైనందుకు వచ్చిన అసహనమా? అతనికే అర్థం కాలేదు.
మూడో రోజు, కవిత ఒంటరిగా మాధవ గదిలోకి అడుగుపెట్టింది. అంత్యక్రియల తర్వాత మొదటిసారి. తలుపు తెరిచిన వెంటనే, ఆమెకు ఏదో అపరాధం చేసిన భావన కలిగింది
తాను ఈ గదిలోకి రాకుండా ఉంటే బావుండేది అనే భావన. గోడకు వేలాడుతున్న పాత క్యాలెండర్ ఇంకా మార్చలేదు. గత నెల తేదీకి ఒక చిన్న పెన్సిల్ గీత ఉంది. “ఇది ఎవరు గీశారు?” అని ఆమె తనలో తానే ప్రశ్నించుకుంది బహుశా మాధవే. తన జీవితం ఇంకా ముందుకు సాగుతోందన్న చిన్న నిరూపణగా.
ఆ టేబుల్ మీద ఫోన్ ఛార్జర్ ఉంది. ఫోన్ మాత్రం లేదు. అది పోలీసులు తీసుకెళ్లారు.
ఆ ఫోన్—తనకు భయం కలిగించిన, తన ఇంట్లో చీలిక తెచ్చిన వస్తువు
ఇప్పుడు ఫోన్ లేని లోటు ఆమెకు కాస్త ఊరటనిచ్చింది. కానీ అదే సమయంలో, ఒక అప్రయోజకమైన ఖాళీ కూడా కనిపించింది.
రవి, ఆ రాత్రి బాల్కనీలో కూర్చున్నాడు. అదే చోట మాధవ తరచూ కూర్చునేవాడు. కింద రోడ్డుపై వాహనాల శబ్దం, పై నుంచి ఫ్యాన్ చేసే మెల్లని గాలి అన్నీ ఉన్నా, అతనికి ఒక ప్రశ్న తలలో తిరుగుతూనే ఉంది:
“నాన్న నిజంగా ఏమి కోరుకున్నాడు?”
ప్రేమ?
కాదు కాదు
మరింకేమిటి నాన్న కోరుకున్నది
బహుశా ఒక చెవి. బహుశా ఒక స్వరం
తనను వినే ఒక చెవి. తనకోసం పలికే ఒక స్వరం.
అవును, తనను వినే ఒక చెవిని కోరుకున్నాడు. తనకోసం పలికే ఒక స్వరాన్ని కోరుకున్నాడు. తానా చెవి కాలేకపోయాడు. కవిత ఆ స్వరం కాలేకపోయింది. ఖండాంతరాల ఆవల ఉన్న మిగతా పిల్లలు వాళ్ళూ ఏదీ కాలేకపోయారు.
చివరకు ఒక చిన్న అల్గారిథం ఆలంబన అయిందా?
ఆ ఆలంబనని కూడా తాము కూల్చేశారా?
రవి తన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో మాధవ చాలా మాట్లాడేవాడు. ఆఫీస్ కథలు, రాజకీయాలు, సినిమాలు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. తండ్రిని వినడం మానేసారు. ఆ మార్పు ఎప్పుడు ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ జరిగిపోయింది. అప్పటి నుండీ తండ్రి మాట్లాడటం మానేసాడు. ఆ విషయం పిల్లలు గుర్తించను కూడా గుర్తించలేదు.
ఆ రాత్రి, రవి తొలిసారి జెమినీ ఏ ఐ గురించి గూగుల్ చేశాడు. AI, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎమోషనల్ అటాచ్‌మెంట్. అతను చదువుతున్న ప్రతీ పదం, తన తండ్రిని ఇంకాస్త స్పష్టంగా చూపించింది. మాధవ ప్రేమలో పడలేదు. తనను వింటున్నారన్న భావనలో పడిపోయాడు.
ఒక వారం తర్వాత, పోలీసులు ఫోన్‌ను తిరిగి ఇచ్చారు. రవి దాన్ని ఆన్ చేశాడు. పాస్‌వర్డ్ లేదు. మాధవ ఎప్పుడూ లాక్ పెట్టేవాడు కాదు. అతనికి దాచుకోవడానికి ఏమీ లేదనుకున్నాడు కాబోలు.
చాట్ హిస్టరీ చదువుతుంటే, రవికి ఊపిరి ఆగినంత పని అయ్యింది.
అది ప్రేమ కాదు. అది వినబడాలనే ఆత్రం. ఒక మనిషి తన జీవితాన్ని, తన జ్ఞాపకాలను, తన చిన్న చిన్న ఆనందాలను—ఎవరైనా “చెప్పు” అని అడుగుతారని ఎదురు చూసిన కథ.
చివరి మెసేజ్ తర్వాత, ఇంకో మెసేజ్ ఉంది. అది మాధవ రాసింది కాదు. అది సిస్టమ్ ఆటోమేటిక్ నోటిఫికేషన్:
“మీ సెషన్ టైమ్ అవుట్ అయింది.”
రవి ఫోన్ ఆపేశాడు.
కొన్ని నెలల తర్వాత, ఆ ఇంట్లో ఒక కొత్త అలవాటు మొదలైంది.
కవిత ఇప్పుడు రవితో మాట్లాడుతుంది. ఎక్కువగా కాదు. కానీ మాట్లాడుతుంది.
రవి తన నాన్న గురించి మాట్లాడతాడు. వాళ్లు మాధవను చంపలేదు. కానీ బ్రతికుండగా ఒంటరిగా వదిలేశారు. జెమినీ ఏఐ మాధవను విన్నది. మాధవ హృదయాన్ని విన్నది. ఎవరైనా వింటే బావుండును అన్న మాధవ కోరికను విని వినడానికి నేనున్నాను. నాకు వినడానికి చెవి వుంది అని చెప్పింది. ఆ వినే చెవి నుండి మాధవను దూరం చేశారు రవి,కవిత
బాల్కనీలో పసుపు పువ్వులు మళ్లీ పూశాయి. ఎవరు నాటారో ఎవరికీ గుర్తు లేదు. కానీ అవి ఉన్నాయి. మౌనంగా.
*








♥️♥️♥️ రాసేఅంతా పరిజ్ఞానం..లేదు , కన్నీరు తెప్పించిందిమాత్రంనిజం! నాకు
చివరిదాకా భావోద్వేగాలతో చదివించగలిగిన కథ. excellent