మారిపోయింది!

ఏకాదశి ఉపవాసాలు , ధనుర్మాసం స్నానాలూ గట్రా మామూలే , ఇవన్నీ భార్యకి , పిల్లలకీ మప్పడానికి చూసేడు , కానీ వాళ్లెప్పుడూ పెద్దగా లొంగలేదు.

‘రేపటితో ధనుర్మాసం మొదలవుతూంది .. తెల్లవారుఝామునే మన కుంతీ మాధవస్వామి గుడి కోనేట్లో స్నానం చేసి , దేవుడి దర్శనం చేసుకున్నామంటే బోలెడు పుణ్యం అట , పైగా ఈ నెలంతా దేవతలు అదే టైములో లేచి స్నానాలు చేసి, దేవుణ్ణి పూజిస్తారట .. కాబట్టి రేప్పొద్దున్న అంతా తెల్లవారుఝామునే లేచేడవండి ‘ అని గెట్టిగా చెప్పాడే గానీ , బాబ్జీ కి అస్సలు నమ్మకం లేదు, తన మాట విని పెళ్ళాం పిల్లలు  తెల్లారకట్టే లేస్తారని ! అప్పటికే పెద్ద కొడుకు అప్పల్రాజు ‘మరి ఆ దేవతలు ఈ నెల్లో తెల్లారుజామునే లేస్తే , మరి మిగతా నెలల్లో ఎప్పుడు లేస్తారు నాన్నా ?’   అని అడిగితే , ఒళ్ళు మండుకొచ్చిన బాబ్జీ వాడి వీపు మీద రెండు వాయించేసేడు .

అతను అనుకున్నట్టే తర్వాతి రోజు ఉదయం ఎవ్వరూ లేవలేదు , అప్పటికీ వీలైనంతగా ఆ గదిలోంచి ఈ గదిలోకి , ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్తూ , తలుపుల్ని కాస్త గెట్టిగా శబ్దం వచ్చేలా వేసాడు కూడా . ‘ఛస్ .. ఎదవలందరికీ మొద్దు నిద్ర .. పుణ్యం చేసుకోవాలని ఈళ్ళకి రాసిపెట్టి లేదు ‘ అనుకుంటా ఒక్కడే గుడికి బయల్దేరేడు . ఇంట్లోంచి వీధిలోకి వచ్చేసరికి , ఎదురింటి టైలరు చిట్టి దేవరాజు అరుగు మీద  దీపం పెట్టుకుని కుట్టుమిషన్ తొక్కుతూ కనిపించేడు ‘పండగలొస్తున్నాయి కదండీ .. కాసిన్ని గిరాకీలు ఎక్కువున్నాయండి మరి ‘ అంటూ ఆ చీకట్లోనే చెయ్యూపితే, ఏమ్మాట్లాడకుండా గబగబా కోనేటి వేపు నడుచుకుంటా వెళ్ళిపోయేడు బాబ్జీ .

పెద్దపాటి బాబ్జీ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే ఆర్టీసీ డ్రైవరు గా చేసే పన్జేసే తండ్రి పోవడం తో , ఆడి పెంపకం అంతా ఆళ్ళమ్మ అమ్మాజీ చూసుకుంది . ఆవిడకి  విపరీతమైన దేవుడి భక్తి . తను ప్రతిరోజూ దణ్ణమెట్టుకునే అన్నారం సత్యనారాయణస్వామి , పిఠాపురం కుక్కుటేశ్వరుడు, కుంతీ మాధవస్వామి  , తిరుపతి వెంకటేశ్వర స్వామి వీళ్లందరి మూలంగానే తన భర్త పోయిన వెంటనే ఏ ఇబ్బందీ కలగకుండా  తనకి ఆర్టీసీ లో క్లర్కు ఉద్యోగం వచ్చిందని సంబరపడింది.

బాబ్జీ గాడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే , వాళ్ళమ్మ అమ్మాజీ ‘ఒరే మీ మాస్టారికి రోజూ దణ్ణం పెట్టడం మానకు .. మాస్టారంటే దేవుడితో సమానం .. రోజూ దణ్ణం పెట్టేవనుకో , ఓ వేళ నువ్వు సరిగా పరీక్షలు రాయకపోయినా , నీ భక్తికి సంతోషపడి ఆ దేవుడు నిన్ను పాస్  చేయిస్తాడు .. ‘  అంటూ చెప్పేది . సోమరాజు టాకీసులో సినిమాకి తీసికెళ్ళినప్పుడల్లా , తెర మీద వెంకటేశ్వర స్వామి స్లైడు పడగానే , ‘ఒరే ..ఎదవకానా .. దేవుడి కి దణ్ణమెట్టుకో .. లేకపోతే సినిమా బావుండదు మరి ‘ అంటూ ఓ మొట్టికాయ మొట్టేది , ఇలా ప్రతీదానికీ దేవుడితో లింకెట్టేయడంతో బాబ్జీ గాడికి చిన్నప్పట్నుంచీ , దేవుడంటే భయం తో కూడిన భక్తి అబ్బేసింది .

ప్రతీదానికీ దేవుడి మీద భారమెట్టేయడంతో , ఏదో అత్తెసరు మార్కులతో డిగ్రీ దాకా వచ్చేడు , అలా డిగ్రీ పాసవగానే , అమ్మాజీ గారు ఏదో పనున్నట్లు దేవుడి దగ్గిరికెళ్ళిపోయింది ! సర్వీసు లో ఉండగానే పోవడం తో ఆవిడ ఉద్యోగం బాబ్జీ గాడికి వచ్చింది , బాబ్జీ కూడా తల్లి కి మళ్లే ఈ ఉద్యోగం  నేను రోజూ దణ్ణమెట్టుకునే ఆ దేవుళ్ళ దయ అంటూ, ఇందాక చెప్పిన లిస్టులోని దేవుళ్లందరికీ మొక్కులెట్టేసుకున్నాడు!

వాకతిప్ప ఎల్లైసీ ఏజెంట్ మూర్తి గారమ్మాయి విమల తో పెళ్ళైనా కూడా, బాబ్జీ తన భక్తి కార్యక్రమాలు వదులుకోలేదు. మూణ్ణెల్లకోసారి అన్నారం వెళ్లి , ఏడాదికోసారి తిరుపతెల్లి గుండు చేయించేసుకునేవాడు. పిఠాపురం చుట్టుపక్కల ఏ దేవుడి విగ్రహం పెట్టించినా , అందులో బాబ్జీ గాడి విరాళం ఎంతో కొంత ఉండి తీరాల్సిందే ! ఏకాదశి ఉపవాసాలు , ధనుర్మాసం స్నానాలూ గట్రా మామూలే , ఇవన్నీ భార్యకి , పిల్లలకీ మప్పడానికి చూసేడు , కానీ వాళ్లెప్పుడూ పెద్దగా లొంగలేదు.

కోనేట్లో స్నానం చేసి , కుంతీ మాధవస్వామిని దర్శించుకుని ఇంటికొస్తూంటే , బాబ్జీ కి ఓ ఆలోచన వచ్చింది , ఇప్పుడు తనకి తన తల్లి దేవుణ్ణి నమ్ముకునుంటే ఎలా సుఖపడతావో నేర్పింది , కానీ అదే విషయం తను తన భార్య కి , పిల్లలకి నేర్పలేకపోయేడు . అంటే వాళ్ళు ఒకవేళ పాపం చేస్తే, తను చేస్తున్న పుణ్యాలన్నీ మట్టిగొట్టుకుపోవచ్చేమో .

ఎందుకైనా మంచిది, ఓసారి కనుక్కుందామని చింతావారి రామాలయం పక్కనుండే సిద్ధాంతి పేరి రంగశాస్త్రి గారిని కలిసి , తన అనుమానం చెబితే , ఆయన ‘నీ పెళ్ళాం పిల్లలు నీ అదుపాజ్ఞలలో ఉండాలి .. అంటే నువ్వేం చెబితే వాళ్ళు పాటించాలి , అలా కాకుండా నీ మాట పట్టించుకోకపోతే, నువ్వేం ఉద్ధరించినట్టు ?’ అన్నారు

‘అమ్మో.. ఈ విషయమై ఏదో గట్టిగా ఆలోచించాలి ..స్వామీ నువ్వే దిక్కు ‘ అనుకుని తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కేసుకున్నాడు . ఇంటి కొచ్చి ఈనాడు పేపర్ చూస్తూంటే , అందులో కనిపించిన ఓ ప్రకటన బాబ్జీ ని ఆకర్షించింది . ‘బాబూ .. నీ కోసమై మూడు నెలలుగా వెతుకుతున్నాం .. నువ్వు చెప్పినట్టే వింటాము .. దయ చేసి ఇంటికి తిరిగి వచ్చెయ్యి ‘ అంటూ ఎవరో కుర్రాడి గురించిన ప్రకటన అది !

‘హమ్మ .. వెంకటేశ్వర స్వామే తనకి ఈ మార్గం చూపించేడు .. ఇప్పుడు నేను కూడా ఓ మూణ్ణాలుగు నెలలపాటు కనబడకుండా వీళ్ళు కూడా ఇలాంటి ప్రకటన ఒకటిచ్చి నాదారికొచ్చేస్తారు ‘ అనుకుని , ఎలాగా తిరుపతి కి వస్తానని మొక్కుకున్నాను కదా , ఆ వంకన స్వామి కార్యం స్వకార్యం కూడా తీర్చుకున్నట్టుంటుంది అనుకుని , రెండ్రోజులు ప్లానేసుకుని , సెల్ఫోను కూడా ఇంట్లో వదిలేసి, మూడోరోజు తిరుమల ఎక్సప్రెస్ ఎక్కేసి తిరుపతెల్లిపోయేడు బాబ్జీ !

నెల రోజులపాటు తిరుపతి చుట్టుపక్కల గుళ్లన్నీ తిరిగేసి , కొండ పైన సత్రాల్లో ఉంటూ  వీలైనంతగా స్వామిని దర్శించుకుంటూ , వీలైనప్పుడల్లా పేపర్ తిరగేస్తున్నాడు , తనని వెతుకుతూ ఏదైనా ప్రకటన ఏదైనా కనిపిస్తుందేమోనని . రెండు నెలలు గడిచిపోయింది, ఏ రోజూ అలాంటి ప్రకటన కనబడకపోయేసరికి, మెల్లగా ఇంటి మీద బెంగ మొదలయ్యింది . కొంపతీసి నేను ఏమైపోయోనోనని వీళ్ళందరూ ఏమీ ఆత్మహత్య లాంటివి చేసుకోలేదు కదా అనే ఆలోచనొచ్చేసరికి , ఏడుపొచ్చేసింది .

వెంటనే ఇంటికి ఫోన్ చేసేడు , ‘హలో ‘ అంటూ పెళ్ళాం మాట వినగానే ,  సంతోషంతో ఏడుపొచ్చేసి , ఫోన్ పెట్టేసి , కొండ దిగి ,అప్పటికప్పుడు అందిన రైలెక్కి ,పిఠాపురం  బయల్దేరేడు .

పిఠాపురం లో రైలాగ్గానే , స్టేషన్ బయటనున్న ఆటో ఎక్కి , ‘నువ్వెంతైనా తీసుకో , అర్జంటుగా మున్సిపల్ పార్కు వెనకీదిలోకి పోనియ్యి’ అన్నాడు .

ఇంటి దగ్గిర ఆటో దిగ్గానే , ఎదురింటి టైలరు దేవరాజు ‘హమ్మ .. మొత్తానికొచ్చేసేరండీ బాబూ .. నా మాట నిలబెట్టేరు  ‘ అనేసరికి , ‘నీ మాట నేను నిలబెట్టడేమిటి ?’ అని మనసులోనే అనుకుని , ఇంటి తలుపు తీసేసరికి , ఎదురుగానున్న భార్యని చూసేసరికి ఆశ్చర్యపోయేడు .

‘ఇదంతా ఆ ప్రభువు దయండి .. క్రితం వారమే .. “మా ప్రభువుని నమ్ముకుంటే మీ ఆయనగారు వారం రోజుల్లో ఇంటికొచ్చేస్తారు” అని ఎదురింటి దేవరాజన్నయ్య చెబితే , మతం పుచ్చుకున్నామండీ ‘ అంటూ చెప్పుకుంటూపోతూంది మేరీ విమల !

 

రవీంద్ర కంభంపాటి

ఊరు విశాఖపట్నం , ప్రస్తుతం ఇన్ఫోసిస్, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాను .

ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాను. సరదాగా ఓ ఏడాది క్రితం నుండి రాయడం మొదలెట్టాను . దేవుడి దయ, నా అదృష్టం ల కాంబినేషన్ కుదిరి , నలభై ఎనిమిది కధలతో పిఠాపురం క్రానికల్స్ అనే పుస్తకం వేయగలిగాను

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హహహహ! Perfect twist! ఏమి రాయాలో తెలీడంలేదు. అవాక్కు అయిపోవడం అంటే ఇదేనేమో. భక్తి అయినా, భయం అయినా అతి సర్వత్ర వర్జయేత్ అంటారు పెద్దలు.

  • హహ-అహ్హ్హ– పాపము.. తానొకటి తలిస్తే దైవము మరికటి తల్చాడన్నట్లు— అహ్హహ.. పోనిండి పాపము ఏదొ ఒక దైవము–

  • హహహ సూపర్ ట్విస్ట్ ఇంకేం కొత్త దేముడండి అని మతం లో cheripovatame ఏ రాయి ఐతేనేమి mottukovataniki

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు