కథ పుట్టిన తొలి రోజులు!

మతం ఏదైనా ఒక దశలో వ్యక్తికి కష్టాలు సహించే శక్తికీ, పాలక, ఆధిపత్య వర్గాలపై ఐక్య పోరాటానికీ దోహదపడటం ఎంత నిజమో అది ప్రజల అజ్ఞానం మీద మాత్రమే బ్రతకటమూ అంతే నిజం.

థానిక, నవల, ఆధునిక కవిత్వం వంటివి లిఖిత ప్రక్రియలు. అవి ప్రధానంగా అక్షరాస్యత మీద ఆధారపడినవి. జనం తీరిక మీద ఆధారపడినవి. వారి మానసికావసరం మీద ఆధారపడినవి.

దవటం, రాయటం అనేవి రెండు టెక్నాలజీలు. ఈ రెంటికీ మూలం  లిపి. అది క్రీ.పూ. 3,4 వేల సంవత్సరాల క్రితమే పుట్టింది. మత, రాజకీయ అధికారాల కోసం అవి చాలాకాలం వినియోగపడ్డాయి. ఆ అధికార వర్గాల మానసికావసరాల కోసం కూడా కొంత వినియోగపడ్డాయి. ఆ దిశలోనే అభివృద్ధి చెందాయి.  19వ శతాబ్దం వరకూ మానవుని ఉత్పత్తి శ్రమ సామర్ధ్యంలో వాటి అవసరం దాదాపు లేకపోయింది. అంతకుముందున్న  ఉత్పత్తి విధానాన్ని వెనక్కినెట్టి  పరిశ్రమలు కొత్త విధానాన్ని అనివార్యం చేసాయి. దీనికి సార్వజనిక విద్య అవసరమయింది. దానికి ఖర్చుపెట్టటం  ప్రభుత్వాలకి తప్పనిసరి అయింది. ఈ సార్వజనిక విద్య(universal education)కి భూమిక క్రైస్తవ మతంలోని పునరుజ్జీవన శకం ఏర్పరచింది. పారిశ్రామికీకరణ దానికి వనరులు సమకూర్చింది. అక్షరాస్యత శాతం లోని అసమానత సామాజిక అసమానతగా పరిగణింపబడింది. క్రమంగా అది ఒక దేశపు, ఒక సమూహపు వెనకబాటుతనానికి కొలబద్ద అయింది.

ఈ దృష్ట్యా చూస్తే-

16వ శతాబ్ధం ఆరంభానికి నవల స్థిరపడింది. ఆనాటికి ఫ్రాన్స్ 19, బ్రిటన్ 16, జర్మనీ 16, ఇటలీ 18 అక్షరాస్యత. 19 వశతాబ్ధం మధ్యనాటికి పత్రికలు వ్యాపారపరంగా లాభాలు చూస్తున్నాయి. అప్పటికి అమెరికా 89 శాతం,  యూరప్ 62 శాతం అక్షరాస్యత. వ్యవసాయేతర సమూహాలకి నిర్దిష్టమైన రోజువారీ తీరిక సమయం ఏర్పడింది. దాంతో  నూతన విద్యావంతుల కాలక్షేపసాధనంగా పత్రిక చాలా చవకగా అమరింది. ఆ తర్వాత వందేళ్లకి పైగా పత్రిక, కథానికలకి చవకగా   కాలక్షేపం అందించటంలో పోటీలేకపోయింది. ఆ సమయంలో  కథానిక (అంటే రూపపరంగా చిన్ని కథ) పత్రికల పేజీలు నింపింది. రచయితలకి గిట్టుబాటే కాకుండా అనుకోనంత డబ్బుని కూడా ఇచ్చింది. సర్క్యలేషన్కి దోహదపడింది. లాభాలకి తోడ్పడింది. మరో ఏభై అరవై ఏళ్లకి కథానిక వ్యాపారపరంగానూ, సామాజికచలనాన్ని చదువరికి ఆకళింపు చేయటంలోనూ ఉచ్ఛస్థాయికి చేరింది. కథానిక చదవటంలో విమర్శ మెలకువలు నేర్పింది. కల్పనాశక్తి పెంపుదలలో రచయితకి విమర్శ తోడయింది.

తాత్వికంగా- ఆనాటికి సామాన్య మానవుడు లేదా ఆధునిక మానవుడి పాత్ర, ప్రాధాన్యత గత ప్రపంచంతో పోలిస్తే పెరిగింది. అంటే వ్యక్తి దైవాన్ని ప్రబోధించే మతం, కట్టడి చేసే రాజరిక వ్యవస్థల నుంచి విముక్తుడవుతున్నాడు. స్వయం వివేచనకి అవకాశమే కాక అవసరం కూడా పెరిగింది. పుట్టుకతో ప్రాప్తించే అస్తిత్వం నుంచి స్వయంగా ఎంచుకునే అస్తిత్వం వైపు ముఖంపెట్టి తొలి అడుగులు వేస్తున్నాడు.

సామాజికంగా- సాంప్రదాయంగా ఉన్న సామాజిక అంతస్తుల పునాదులు పారిశ్రామికీకరణతో కదిలాయి.  కొందరు వ్యక్తులు పాత ఆధిపత్యాలను పోగొట్టుకుంటున్నారు. కొందరు నూతన గౌరవాలకి అర్హతలు ధనం ద్వారా, జ్ఞానం ద్వారా, కళ ద్వారా పొందసాగారు.

ఈ తాత్విక సామాజిక మార్పులతో కథానికకి  వస్తువు లభించింది. అంతకు పూర్వం వేలాది సంవత్సరాలుగా కథకుడు శ్రోతకి ఉపదేశం చేసేవాడు. కథానికా రచయత చదువరితో సహఆలోచనాపరుడయాడు. సూచ్యంగానే తన భావాన్ని చెప్పటం కళ అనిపించుకుంది. దీనిగురించి వివరంగా మరోమారు చెప్పుకుందాం.

కథానిక పుట్టిన యూరప్ అమెరికాల  పరిస్థితి స్థూలంగా అది.

 

భారతదేశంలో 1881 నాటికి అక్షరాస్యత 3.2, 1937 నాటికి 7.2 శాతం.

కలకత్తా సమీపంలో శ్రీరామపురాలో క్రైస్తవ మిషనరీలు 18వ శతాబ్దపు చివరలోనే తెలుగు అక్షరం అచ్చు పోత పోసారని జోళిపాళెం మంగమ్మ గారు తమ పుస్తకంలో రాసారు. ఈ అచ్చులో మతవార్తలతో మొదట కరపత్రాలు తెచ్చారు. ఆ తరవాత క్రమబద్దంగా వచ్చే పత్రికలకూ శ్రీకారం చుట్టారు.1818లో మొట్టమొదటి భారతభాషా పత్రిక దిగ్దర్శన్ ను  వంగభాషలో అక్కడనుంచే తీసుకువచ్చారు. ఈ పత్రికను చూసి రాజారాంమోహనరాయ్ సంవాదకౌముది అనే వార్తా పత్రికను 1821 నవంబరులో ఆరంభంచారు. జాతీయ భావాల వ్యాప్తి, సంఘ సంస్కరణ లక్ష్యాలతో ఈ పత్రిక నడిపారు. అతిత్వరలోనే దాని ప్రభావంతో అనేక భారతీయ భాషలలో ఇవే లక్ష్యాలతో పత్రికలు మొదలయాయి. జాతీయ భావాల వ్యాప్తిలో భాగంగా ప్రాచీన సాహిత్యం ముద్రణ చాలామంది చేపట్టారు.

తెలుగులో సత్యదూత అనేపేరిట ఒక పత్రికను బళ్లారి క్రైస్తవ మిషనరీలు మద్రాసులో 1835లో అచ్చువేసారని ఆరుద్ర, బంగోరె వంటి పరిశోధకులు చెపుతారు. 1838లోనే వృత్తాంతిని అనే పత్రిక మండిగల వెంకటరాయశాస్త్రి సంపాదకత్వంలో ఆరంభమైనట్టుగా తెలుస్తుంది. 1841లో ఈ పత్రిక ఆగిపోయిందని తెలుస్తోంది. ఇది ఇంతవరకూ లభించలేదు. మిషనరీ ప్రచారానికి ప్రతిగా తత్వబోధిని అనే పత్రికని బ్రహ్మసమాజం తీసుకువచ్చింది. ఇలా తెలుగు పత్రికలు పుట్టాయి. క్రమంగా తెలుగు ప్రాంతాలలోని ఇతర నగరాలలో కూడా అచ్చు యంత్రాలు వాటితోబాటు పత్రికలు వెలిసాయి.

ఈ పత్రికలకి లక్ష్యం మతప్రచారం, సంఘ సంస్కరణ, జాతీయభావాల వ్యాప్తి. వాటిలోనే అప్పుడప్పుడు స్థానికులకు జరుగుతున్న అన్యాయాలు రిపోర్టు చెయ్యటం జరిగింది. ఇవన్నీ కల్పనాసాహిత్యానికీ  లక్ష్యాలయాయి.

ఈ పత్రికలకు లభించిన ఆర్ధిక వనరులను మూడు రకాలుగా విభజించవచ్చు. మత ప్రచారం కోసం ఏర్పడిన నిధులు. సాహిత్యానికి సేవ చేయటం రాజుల కర్తవ్యం అన్న భావంతో జమిందారులు ఉదారంగా ఇచ్చిన ధనం. మూడవది అభిరుచి గల వ్యక్తులు పోషకులను చేర్చుకుని సంపాదించిన సొమ్ము. అచ్చుయంత్రం కొని ప్రెస్సులు ఏర్పరుచుకున్నవారు దానికి పని అంతగా దొరకనపుడు కొన్ని పత్రికలు తేవటం కూడా జరిగింది. ఉదాహరణకి సత్తిరాజు సీతారామయ్య గారు పెట్టిన దేశోపకారి ప్రెస్సు నుంచి దేశోపకారి, హిందూసుందరి వెలువడ్డాయి, ఇదంతా తొలిదశ.

ఈదశలో వీటికి  బతికి బట్టకట్టటమే గాని లాభం అనేది ఊహకి అందే విషయంకాదు. ఆనాడు పత్రికలు నడవటానికి సంపన్నుల ఆదరణ ప్రధానంగా ఉండేది. అమ్మగలిగిన ప్రతుల సంఖ్య కూడా కొంత ఖర్చులు గిట్టించేది.

అనుకరణ, ఆదరణ, అబిరుచి  ఈదశలో పత్రికల స్థాపనకి ప్రేరణలు. ఆంగ్లపత్రికలు. గ్రందాలు తెప్పించుకోవటం ఒక హోదా గానూ మంచి అభిరుచి గానూ ఆనాటి సాంప్రదాయక ఉన్నతవర్గాలకు చెందిన జమిందారులూ, ప్రభుత్వాధికారులూ భావించేవారు. వారి ఆశ్రితులు వాటిని చదవగలిగేవారు.

ఈ స్థితిలో ఇక్కడ కథానిక 1870 ప్రాంతాల నుంచి పత్రికలలో కనపడసాగింది.

అక్కడ జనం అవసరాలైన వినోదం, వికాశాల నుంచి కథానిక పుట్టింది. పత్రికల వ్యాపారాన్వేషణలో కథానిక రూపు దిద్దుకుంది. సాధారణంగా వినోదం రూపమైతే వికాశం వస్తువయింది. కేవలం వినోదపరిచే వస్తువులతోనూ కథానికలు వచ్చాయి. చదువరులలో కొందరి కల్పనాశక్తికీ, వికాశానికీ(enlightenment) అనువైన రూపాన్వేషణ కూడా సాగింది.

దానికి భిన్నంగా –

ఇక్కడ ఆలోచనాపరుల సాంఘిక చైతన్యం నుంచి కథానిక పుట్టింది. ఇక్కడి పత్రికలు  అక్కడి పత్రికలను నమూనాగా చేసుకోటం మన కథానికకి బీజం అయింది.

తొలిసారి నవల కథానికలు ఎలా ఉండాలన్న దాని మీద రెండు పత్రికలు స్పష్టత కోసం ప్రయత్నించాయి. 1892 ఏప్రిల్ చింతామణి సంచికలో చింతామణి బహుమానములు పేరుతో ఒక సవివర వ్యాసం వచ్చింది. A note to correspondents /ఉపవిలేఖకులకు మనవి అనే పేరుతో తెలుగుజనానా పత్రిక 1901నవంబరు సంచికలో ఒక చిన్ని వ్యాసం వచ్చింది.

ఈ పత్రికలకి చదువరులు ప్రధానంగా విద్యావంతులు. వారిని ఉత్తేజపరచటం, చైతన్యవంతులను చేయటం అనే లక్ష్యంతో సాంఘిక సంస్కరణాభిలాషులైన వ్యక్తులు కథానిక చేపట్టారు.

ఈ భిన్న పరిస్థితుల వల్ల వారిదీ, మనదీ కథానిక నడిచిన లేదా ఎదిగిన దారులు భిన్నమైనవి. ఈ దారులలో వారి విమర్శ, మన విమర్శ భిన్నమైనవి.

 

సామాజికంగా-

మన సమాజంలో వ్యక్తిపై ఎక్కువ ఒత్తిడి సంఘం కట్టబాట్లనుంచి ఏర్పడింది. ఈ సంఘం అనేది అక్కడి మతం కన్న, రాజరికం కన్న భిన్నమైనదీ బలమైనదీ. ప్రధానంగా గ్రామీణ వ్యవస్థ నుంచి రూపొంది అమలుచేయబడే సాంఘిక కట్టుబాట్లవి. కుటుంబం వాటిని అమలు చేయక తప్పనిస్థితి. సంఘం అనేది కులం అనే సమూహపు రూపంలో కనబడుతుంది. మరోరూపం గ్రామం. గ్రామాన్ని వదిలి పట్నం చేరుకున్న వారిపై కూడా కులం ఒత్తిడి తగ్గలేదు. ఒకనాడు కులపెద్దలకి, గ్రామ పెద్దలకీ ఉండే న్యాయ విచారణ, శిక్ష అధికారాలు చట్టం అనే మరో కట్టడికి దాదాపు తలొగ్గాయి. కాని వ్యక్తి అతని కుటుంబం సాంఘిక కట్టుబాట్లను పూర్తిగా వదులుకునే పరిస్థితి ఇప్పటికి కూడా ఏర్పడలేదు.

తాత్వికంగా-

మన ఆలోచనలు దాదాపు మనదేశంలో ఉన్న మతం వంటిదాని ప్రభావానికి చెందినవి. ఈ ఆలోచనలలో భక్తి, మౌడ్యం వంటివి ఒక రకమైనవైతే సృష్టి తత్వం గురించి, వ్యక్తి జన్మ లక్ష్యాల గురించి, ప్రవర్తనావళి గురించి చాలా లోతైన, ఆలోచించవలసిన అంశాలతో కూడినవి మరో రకం. వాటి ప్రభావంతో రాసిన చాలా సంపద్వంతమైన సాహిత్యం కూడా మనకి గతం నుంచి లభించింది. దాని ప్రభావం చదువుకున్నవారి మీద ఉంది. పరోక్షంగా జనంకి చేర్చే విధానాలు ఉన్నాయి.  మన వ్యక్తీకరణకీ వారి వ్యక్తీకరణకీ కూడా తేడా ఉంది. వాటిని మనవాటినీ సమన్వయపరచుకునే స్థితి మనకి ప్రత్యేకమైనది.

వాస్తవికంగా-

మన ఆలోచనలు అక్కడి ఆలోచనాపరులకి మాత్రం చేరాయి.అవి వారి దైనందిన జీవితంలోకి ప్రవేశించలేదు. వారి ఆలోచనలు మన దైనందిన జీవితంలో భాగమయాయి. మతం గురించి వారి అవగాహనతో మనం ఒక కొత్తరూపంలో మన మతాన్ని నిర్మించుకునే ప్రయత్నం చెయ్యటమూ ఉంది. మనదైన దానిని పూర్తిగా నిరాకరించటమూ జరిగింది. దైనికావసరాల కోసం అలమటిస్తున్న సామాన్యజనం అవసరాలు తీరుస్తాయన్న ఆశతో పైనుంచి వచ్చిన మతాలలోకి మారిన మారుతున్న పరిస్థితి ఉంది. అందులో ఐచ్ఛికత ఎంత ఉందో బలవంతమూ అంతే ఉంది. మతం అనేది ఏదైనా ఒక దశలో వ్యక్తికి కష్టాలు సహించే శక్తికీ, పాలక, ఆధిపత్య వర్గాలపై ఐక్య పోరాటానికీ దోహదపడటం ఎంత నిజమో అది ప్రజల అజ్ఞానం మీద మాత్రమే బ్రతకటమూ అంతే నిజం.

జీవితం గడవటం కోసం, బాగుపడటం కోసం అక్కడ జనం పట్టణాలకూ విదేశాలకూ వలసలు పోయారు. ఫ్యాక్టరీలలో చేరారు. ఇక్కడ జనం కూడా అలాగే వలసలు పోయారు. కాఫీ, తేయాకు తోటల్లోకీ, సైన్యంలోకీ పోయారు. వాళ్లు అమెరికాకి పోతే మనవాళ్లు వెస్టిండీస్ చెరుకుతోటల్లోకి, బర్మా వంటి దేశాలకీ పోయారు.

కాకపోతే అక్కడి సామాన్యులలో అక్షరాస్యత వల్ల కథానికలు రాయగలిగారు. చదవగలిగారు. వ్యక్తి అందులో భాగస్వామి అయాడు. స్వానుభవానికి సాహిత్యంలో చెప్పుకోదగినంత స్థానం అక్కడ లభించింది.

మనలో అలాంటి స్థితిలో ఉన్నవారు రాయలేరు. చదవలేరు. ఆదిలో ఆలోచనాపరులే రాసారు. చదివారు. వారి సాంఘికావేశమే వస్తువయింది.

సామాజికంగా, తాత్వికంగా విద్యావంతుడైన ఆలోచనాపరుడున్న స్థితినుంచి  మన కథానిక ఆరంభమయింది. సామాన్యుని వాస్తవ జీవితం వారు పట్టుకునే ప్రయత్నమూ చేసారు. తమ సమస్యలనూ రాసారు. ఇలా మన కథానిక  చాలాకాలం నడిచింది.

వారి, మన సాహిత్య పరిణామాలు ఏమిటో తర్వాత సంచికలలో చూద్దాం.

*

వివిన మూర్తి

తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి పరిశీలనతో తెలియచేసిన వివరాలు బావున్నాయి. వివినా మార్క్ ఉంది.

  • ప్రథమ లిపి (శరాకార లేక క్యూనిఫాం) క్రీ.పూ. 3200 నాటిది.

    The cuneiform script, created in Mesopotamia, present-day Iraq, ca. 3200 BC, was first. It is also the only writing system which can be traced to its earliest prehistoric origin. This antecedent of the cuneiform script was a system of counting and recording goods with clay tokens.

    The Evolution of Writing | Denise Schmandt-Besserat
    https://sites.utexas.edu/dsb/tokens/the-evolution-of-writing/

  • వివినమూర్తి గారూ, భాషాపుట్టుపూర్వోత్వరాల విశ్లేషణ మరియు భావప్రసార వాహికల పరిణామక్రమంం గురించి రెండు వ్యాసాలు యిస్తున్నాను. ఇది మీ పరిశీలనకు ఉపయోగపడుతుందేమో చూడగలరు!

    Analysis of 2,135 of the world’s known languages traces evolution of human communication

    http://shc.stanford.edu/news/research/analysis-2135-
    world%E2%80%99s-known-languages-traces-evolution-human-communication

    • సర్ మీ వ్యాసాలు చూసాను. మీ సహకారానికి కృతజ్ఞుడిని. నా వెతుకులాట ప్రధానంగా కథకి సంబంధించినది. భాష అనేది ఒక టెక్నాలజీ. అది మాటగా అందరికీ సంబంధించినది. రాతగా అది అందరికీ దూరమై కొందరికే పరిమితమయింది. ఈ అంశం గురించి ఆలోచించటానికి భాష అభివృద్ధి చెందిన క్రమం ఎంతవరకూ నాకు ఉపయోగపడుతుందో అంతవరకూ మీ వ్యాసాలు నాకు తప్పక సహాయపడతాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు