అట్లా శ్రీకారం చుట్టుకుంది బామ్మాయణం…!

సరిగ్గా ఆ రోజుల్లో మాకు మేట్రిక్స్ ఆల్జీబ్రా అనే అతి క్లిష్టమైన లెక్కల సబ్జెక్ట్ ఉండేది.

నేను బొంబాయి ఐఐటీ లో అడుగు పెట్టిన రెండో సంవత్సరం .. 1967…… రచయితగా నేను కలం పట్టిన సంవత్సరం… అంటే యాభై ఏళ్ల క్రితం.

అదెలా జరిగిందంటే ….ఒక రోజు ఆ నలుగురితో..అంటే చందూ. కిషోర్, రావు. మూర్తి… లతో 1967 ఉగాదికి ఇంకో డ్రామా వేద్దాం అనుకుంటున్నప్పుడు ఎవరో మాట వరసకి “రాజూ, ఈ సారికి నువ్వు రాయకూడదూ ఓ డ్రామా.” అన్నారు. వెంటనే మూర్తి “అవును. నేను మణిపాల్ లో ఓ సారి బామ్మ వేషం వేశాను. భలే వచ్చింది. ఆ వేషం పెట్టి ఓ సరదా నాటకం రాయి.” అన్నాడు. “బోడి బామ్మ వేషమా?” స్టేజి మీదా?” అన్నాను వెంటనే మా 80 ఏళ్ల అమ్మమ్మ గుర్తుకు వచ్చి. అంటే తెల్ల చీర, తల మీద ముసుగుతో సహా. “అవును. ఇప్పటి దాకా అలా అసలు సిసలు గం.భా.స వేషాన్ని ఏ డ్రామాలోనూ చూడ లేదు.”  అన్నారు అందరూ అలాంటి డ్రామా ఏదైనా ఉందా జ్ఞాపకం చేసుకోడానికి అని బుర్రలు గోక్కుంటూ. ‘ఆ బోడి నాటిక నువ్వే రాయాలి గురూ’ అని ఏకగ్రీవంగా తీర్మానించేశారు ఆ నలుగురూ. అలా నా మొట్ట మొదటి నాటికకి ప్రేరేపణ కలిగింది. ఇదేదో బాగానే ఉందే అనుకుని, నేనూ, చందూ, మూర్తి, కిషోరూ వేషాలు వేసేలా ఊహించుకుని వారం రోజులలో “బామ్మాయణం అను సీతా కళ్యాణం “ అనే మూడు అంకాల నాటకం వ్రాశాను.

ఆ సరదా నాటికలో నేనూ, చందూ యువకులం. నేను..అంటే నా పాత్ర .. సీత అనే అమ్మాయిని ప్రేమిస్తాను. ఆ అమ్మాయికి ఒక ఛండశాసను రాలైన బామ్మ ఉంటుంది. ఆ బామ్మ పాత్ర మూర్తి కోసం రాసినది. ఆ బామ్మని ప్రసన్నం చేసుకుంటే కానీ పెళ్లి ప్రసక్తి కుదరదు. దానికి సీతే ఒక ఉపాయం చెప్తుంది. దాని ప్రకారం వాళ్ళిద్దరూ నానా అబద్దాలూ ఆడి బామ్మ ఇంట్లో ఒక గది అద్దెకి తీసుకుని ఆవిడకి మస్కా కొట్టి మంచి చేసుకోడానికి ప్రయత్నిస్తారు. తీరా చూస్తే ఆ బామ్మకి నా బదులు శేఖర్ ఎక్కువ నచ్చి సీతకి అతనే తగిన జోడు అనుకుని నన్ను చీదరించుకుంటుంది. దాంతో ఖంగు తిన్న వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఆపద్భాంధవుడిలా ఆ బామ్మ తమ్ముడు పరంధామయ్య రంగప్రవేశం చేసి శేఖర్ కి ఎప్పుడో పెళ్లి అయిపోయింది అని బామ్మతో అబద్ధాలు చెప్పి మొత్తానికి నాతో..అదే నేను వేద్దాం అనుకున్న పాత్రతో సీత పెళ్ళికి బామ్మని ఒప్పిస్తాడు. అన్నీ చెప్పి అలా పరంధామయ్యని పంపించినది కూడా సీతే. కిషోర్ గాడు పరంధామయ్య వేషం వెయ్యాలి. విశేషం ఏమిటంటే సీత పాత్ర స్టేజ్ మీద కనపడదు. పాత్రల సంభాషణ లోనే సీత గురించీ, ఆ అమ్మాయి ఆ యువకుల చేత నడిపించిన డ్రామా గురించీ ప్రేక్షకులకి తెలుస్తుంది. మొత్తం 30 నిముషాల ప్రదర్శన.     

తీరా నాటకం వ్రాశాక శేఖర్ పాత్ర చందూ, మూర్తి బామ్మ గానూ వెయ్యడానికి సమస్య లేదు కానీ కిషోర్ గాడు “ఆ ముసలి పరంధామయ్య వేషం చస్తే వెయ్యను. అ యామ్ ఎ హీరో” అన్నాడు. అంతే కాదు. అందరూ కలిసి ఆ యువకుడి వేషానికి నేను పనికి రాను అని తేల్చేశారు. ఎందుకో ఇప్పటికీ నాకు అర్ధం కాదు. ఆ విధంగా నేను నా కోసం వ్రాసుకున్న పాత్ర నన్ను వెయ్యనివ్వ లేదు. ఏం చేసేది లేక ఒప్పేసుకున్నాను.  ఆ వేషానికి ఆ రోజుల్లో అండర్ గ్రాడ్యుయేట్స్ లో ఒన్న ఇద్దరు తెలుగు కుర్రాళ్ళలో ఒకడయిన చివుకుల కృష్ణ ని ఎంపిక చేసి అతడిని ఒప్పించాం. అలాగే పరంధామయ్య పాత్రకి కంప్యూటర్ డిపార్ట్ మెంట్ లోనే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బ్రహ్మానందం అనే అతడి చేత వేయించాం. ఈ బ్రహ్మానందం నాకు కాకినాడలోనే బాగా తెలుసును. అక్కడ పోలీటెక్నిక్ కాలేజ్ కి అతను క్రికెట్ కెప్టెన్ గా ఆడేవాడు. నేను మా ఇంజనీరింగ్ కాలేజ్ కి ఆడేవాడిని కాబట్టి చాలా క్రికెట్ మేచేస్ లో ఎదురు పడేవాళ్ళం. చాలా మంచి వాడు. భార్య, కొడుకులతో లేక్ సైడ్ క్వార్టర్స్ లో ఉండే వాడు. మా ముగ్గురు బ్రహ్మచారులం అప్పుడప్పుడు వాళ్ళింటికి భోజనానికి వెళ్ళే వాళ్ళం.

మొత్తానికి చందూ దర్శకత్వంలో నేనూ, కిషోరూ, రావూ ప్రేక్షకులలో కూచుని ఉండగా కృష్ణ, చందూ, మూర్తి, బ్రహ్మానందం నా మొట్ట మొదటి రచన- “బామ్మాయణం” నాటకాన్ని చాలా సహజంగా, అద్భుతంగా వేశారు.

ఆ నాటి ముహూర్త బలం చాలా మంచిది. ఎందుకంటే సరిగ్గా పది సంవత్సరాల తర్వాత…1977 ఉగాది నాడు మా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి వారి తొలి కార్యక్రమంలో అదే నాటిక ప్రదర్శించబడి చరిత్ర సృష్టించింది. అంతే కాదు, నాకు తెలిసినంత వరకూ యావత్ అమెరికా ఖండంలో, కనీసం టెక్సస్ లో ప్రదర్శించబడిన మొట్ట మొదటి తెలుగు నాటిక అదే! ఆ నాటి ప్రదర్శనలో నేను బామ్మ వేషం వేయగా అనిల్ కుమార్, మోహన రావు యువకులు గానూ, దువ్వూరి నారాయణ రావు గారు పరంధామయ్య గానూ నటించారు. వారిలో అనిల్, నారాయణ రావు గారు ఇప్పుడు దివంగతులు. నాకు తెలిసీ ఆ “బామ్మాయణం” నాటిక  అమెరికాలో అనేక నగరాలలోనూ, ఇండియా లోనూ, యుకె లోనూ ప్రదర్శనకి నోచుకుని నాకు హాస్య రచయిత గా మంచి పేరు తెచ్చి పెట్టింది. దురదృష్టవశాత్తూ అలనాటి బొంబాయి ప్రదర్శన తాలూకు ఫోటో ఒక్కటి కూడా లేదు కానీ 1977 లో హ్యూస్టన్ ప్రదర్శన ఫోటో మాత్రం పైన జత చేశాను, చూడండి.

1967 రోజుల్లోనే నాకు బాగా నచ్చినది, ఇంకా బాగా జ్ఞాపకం ఉన్నదీ తెలుగు వారి పిక్నిక్. అదే బొంబాయి ఐఐటి తెలుగు వారి మొదటి పిక్నిక్. బొంబాయికి దగ్గరలో ఉన్న మధ్ ఐలండ్ కి బస్సు, పడవ ల ద్వారా ఆ ద్వీపానికి చేరుకుని ఒక రోజంతా ఆటపాటలతో గడిపాం. కేంపస్ లో ఉన్న తెలుగు వారు అందరూ వచ్చి ఆనందించిన ఆ పిక్నిక్ ప్రధాన నిర్వాహకులం మేము ముగ్గురమే. ఇక్కడ జతపరిచిన కొన్ని ఆ నాటి పిక్నిక్ ఫోటోలలో నేను, చందూ, రావు. మూర్తి, చివుకుల కృష్ణ, పాలంకి బాలకృష్ణ, ఎ.వి. హనుమంత రావు మొదలైన వారు ఉన్నారు. వీటిల్లో పేకాట ఫోటోలో ఎదురుగా ఉన్న జి.వి.వి.ఎస్. మూర్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే నా మాస్టర్స్ థీసిస్, డాక్టరేట్  థీసిస్ రెండూ కూడా టైప్ చేసి పెట్టిన సహృదయుడు ఆయనే. ఆయన మా డిపార్ట్ మెంట్ లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గా అని చేసి , తర్వాత హైదరాబాద్ వెళ్లి పారిశ్రామిక వేత్తగా నిలదొక్కుకున్నారు. ఇప్పుడు మా హ్యూస్టన్ లోనే ఉండే వాళ్ళబ్బాయి రవి గొర్తి, అతని భార్య వైష్ణవి అన్ని కళలలోను అభినివేశం ఉన్న ఆప్తులు. ఆ దంపతుల కూతురు చి. శ్రేయ ఇటీవల ‘పాడుతా తీయగా’ లో ఫైనలిస్ట్. వాళ్ళని చూడడానికి మూర్తి గారు సతీమణి పద్మతో అమెరికా వచ్చినప్పుడూ, ఫేస్ బుక్ లోనూ ఇప్పటికీ పలకరించు కుంటూనే ఉంటాం.

1967 లో వ్యక్తిగతంగా జరిగిన ముఖ్యమైన ఘటన నాకు అనుకోకుండా టైఫాయిడ్ రావడం. ఇది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కేంపస్ లోనే ఉన్న ఐఐటి హాస్పిటల్ లో నెల్లాళ్ళు ఉండ వలసి వచ్చింది. నా జన్మలో అదే మొదటి సారి నేను హాస్పిటల్ లో ఉండడం. చెప్పొద్దూ, భలే బోరు కొట్టింది. పాపం, మూర్తి, రావు రెండు, మూడు రోజులకి ఒక సారి వచ్చి చూసి వెళ్ళే వారు. నా టైఫాయిడ్ విషయం హైదరాబాద్ లో మా అక్కా వాళ్లకి కానీ, కాకినాడలో మా అమ్మా, బాబయ్య గారికి, ఇతర కుటుంబ సభ్యులకి కానీ చెప్ప లేదు. చెప్పడం అంటే…ఇప్పటిలా జేబులో ఫోన్లు ఉండి ఉంటే రోజూ ఫోన్ చేసే వాడినేమో. కానీ ఆ రోజుల్లో ఆ చిన్న ఆసుపత్రిలో ఉన్న ఒకే ఒక్క ఫోన్ పేషెంట్స్ వాడడానికి వీల్లేదు. అలా అని హాస్టల్ నుంచి ఫోన్ చేయిద్దామా అంటే అక్కడ కూడా ఒకే ఒక్క పబ్లిక్ ఫోన్ ఉండేది. అదీ కాక ఈ విషయం చెప్పి మా వాళ్ళని కంగారు పెట్టడం తప్ప ఏమీ ఉపయోగం లేదు కదా. అంచేత మరో ఆరు నెలల తర్వాత శలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పి మా అమ్మ చేత చివాట్లు తిన్నాను.

GVVS మూర్తి ఇల్లు

ఈ టైఫాయిడ్ ఉదంతంలో నాకు ఇప్పటికీ నవ్వూ, ఆశ్చర్యం కలిగించే అంశాలు రెండు ఉన్నాయి. మొదటిదేమిటంటే, సరిగ్గా ఆ రోజుల్లో మాకు మేట్రిక్స్ ఆల్జీబ్రా అనే అతి క్లిష్టమైన లెక్కల సబ్జెక్ట్ ఉండేది. దాన్ని వర్తక్ అనే మరాఠీ ప్రొఫెసర్ గారు బాగానే చెప్పే వారు కానీ నాకు అక్షరం ముక్క అర్థం అయ్యేది కాదు. అలాంటిది నా టైఫాయిడ్ వలన ఆ సబ్జెక్ట్ లో మిడ్ టర్మ్ పరీక్ష వ్రాయలేక పోయాను కాబట్టి ఆయన నా ఒక్కడికీ విడిగా ఆ పరీక్ష పెట్టాడు. మా కాకినాడ కాలేజ్ లాంటి వాటి బ్యూరాక్రాటిక్ కళాశాల లతో పోలిస్తే ఐఐటి లో ప్రొఫెసర్ల కి అలాంటి విషయాలలో, ఆ మాట కొస్తే సిలబస్ విషయాలలో కూడా చాలా స్వాతంత్ర్యం ఉండేది. తన ఆఫీసులో ఎదురుగా కూచోబెట్టుకుని వర్తక్ గారు నాకు ‘మొదటి ప్రశ్న రాసుకో’ అని ఆ ప్రశ్న చెప్పి తన పని చేసుకుంటూ, పది నిముషాల తర్వాత “ఏదీ, ఆన్సర్ చూపించు” అని అడిగారు. టైఫాయిడ్ తో మహా నీరసంగా ఉన్న నా కళ్ళలో నీరు చూసి “ఏమయిందీ?” అని అడిగారు. ఏమయిందీ  అంటే ..సమాధానం మాట దేవుడెరుగు…నాకు ఆ ప్రశ్న కాగితం మీద వ్రాసుకోడం కూడా రాలేదు. ఆ సబ్జెక్ట్ అంత క్లిష్టమైనది. ఇప్పుడు ఆశ్చర్య పోవడం ఆయన వంతు అయింది. అదే మరొక మామూలు ప్రొఫెసర్ అయితే నన్ను కోప్పడి పరీక్ష లో ఫెయిల్ చేసే వాడు. కానీ ఈయన జాలి పడి, మరో రెండు సులభమైన ప్రశ్నలు అడిగి, వాటిల్లో కూడా నేను తడబడినా పాస్ మార్కులు వేసి పుణ్యం కట్టుకున్నాడు.

సరిగ్గా అలాంటిదే మరోటి రష్యన్ భాష. మా ఐఐటి లో మాస్టర్స్ డిగ్రీకి రష్యన్, జర్మన్ భాషలలో ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే నిబంధన ప్రకారం అప్పటికి ఆరు నెలల పైగా మాకు ఒక రష్యన్ ప్రొఫెసర్ గారు మాకు ఆ నోరు తిరగని ఆ భాష నేర్పే వాడు. ఇది కూడా ఆ మేట్రిక్స్ ఆల్జీబ్రా లాగానే. ఏదో…అదిన్, ద్వ, త్ర్…ఇలా సంస్కృతానికి దగ్గరగా ఉండే ఉచ్చారణ తో ఉన్న రష్యన్ అంకెలు,  ‘దస్విదానియా’..అంటే గుడ్ బై…”పజాలుస్త”..అంటే ప్లీజ్, “జక్రోయిత్ ద్వర్’..అంటే “తలుపు మూసేయ్”….ఇలాంటి చిలక పలుకులు తప్ప ఆ రష్యన్ భాష నాకు అస్సలు వంటికి పట్ట లేదు. నా టైఫాయిడ్ తర్వాత ఆయన పెట్టిన పరీక్ష నాకు ప్రాణ సంకటంగా సంక్రమించింది. పైగా ఈయనకి ఒక దురలవాటు ఉండేది. ఒక్కొక్క విద్యార్ధి ఆన్సర్ పేపరూ తీసుకుని, వాళ్ళ సమాధానాలు చదివి విశ్లేషించి అప్పుడు మార్కులు చదివే వాడు. క్రమ ప్రకారం అయితే మా ముఫై మంది లోనూ నా వంతు రాగానే అది పక్కన పెట్టేసి, అన్నింటికన్నా ఆఖర్న ఆరున్నర అడుగుల పొడుగు ఆ ప్రొఫెసర్ గారు నా పేపర్ ఎత్తి పట్టుకుని “దిస్ ఈజ్ ది వరస్ట్ పేపర్” అని ప్రకటించగానే మిగిలిన సహాధ్యాయు లందరూ ఘొల్లు మని నవ్వి చప్పట్లు కొట్టి ఆనందించారు. ఆ తర్వాత నా టైఫాయిడ్ సంగతి ఆయనకి తెలిసి నాకు పాస్ మార్కులు వేసాడనుకోండి. అది వేరే విషయం.

అదే సమయంలో …ఆగస్ట్ -సెప్టెంబర్ 1967 లలో సిక్కిం సరిహద్దులో ఉన్న నాథు లా &  చోలా ప్రాంతాలలో ఇండియా -చైనా యుద్దం మొదలయింది. ఆ యుద్ధ ప్రభావం మా మీద బాగానే పడింది….ముఖ్యంగా వంట చెయ్యడంలో…. ఆ విశేషాలు ..తర్వాత సంచికలో …..

*

వంగూరి చిట్టెన్ రాజు

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సమాజానికి ఏదో చెయ్యాలనే చైతన్యం చాలామందిలోనే ఉంటుంది. కానీ ఎలాచెయ్యాలో తెలీదు. అలాంటి వారికి మార్గదర్శకత్వం చేసే లీడర్ కావాలి. మీ విద్యార్ధిదశలో, ప్రవాసభారతీయునిగా అమెరికాలో తెలుగువారిని సంఘటితపరచి, నాయకునిగా మార్గదర్శకత్వం నెరపిన మీకు వందనాలండి. ఇకపోతే ఏదయినా మన మంచికే అని మీ టైఫాయిడ్ జ్వరం తెలియకనే తెలియచేసింది.

    • ధన్యవాదాలు, శశికళ గారూ…

  • మీ మేట్రిక్స్ ఆల్జీబ్రా ప్రొఫెసర్ వర్తక్ గారు బహు మంచివారండి 🙂

    • వర్తక్ గారు ఆ రోజు దయచూపించక పొతే నేను ఇప్పటికీ ఆ లెక్కల ప్రశ్న కాగితం ఎలా వ్రాయాలా అని నేర్చు కుంటూ నే ఉందునేమో!

  • సూపర్ మామయ్యగారూ 👏🏻👏🏻👏🏻 . బామ్మాయణం
    భలే బావుంది . అలాగే స్త్రీ పాత్రలు మాత్రమే ఉందే నాటకం ఉందా ?
    మీ బొంబై photos బావున్నయ్ . మీరు మోడలా ? చెప్పనేలేదు … 😉

    • ఉంది. “మగ పాత్ర లేని నాటిక” అని 1980 లో వ్రాశాను. అమెరికాలో చాలా చోట్లే వేశారు.

  • మీరు రష్యన్ ఒకటేనేమో,
    నేను నేర్చుకుందికి ప్రత్నించి, నాలుగైదు పదాలు మాత్రమే గుర్తుంచుకున్నభాషలు మూడు. జర్మన్, ఫ్రెంచ్ మరియు రష్యన్.

    విదేశీభాషలు నేర్చుకోలేకపోవటంలో మీకన్నా నేనే ఎక్కువ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు