అమీనా! నీకు ఉత్తరం రాయాలన్న కోరిక… తపన… ఇప్పుడు, ఈ నడిరేయి… చావు ఘడియల్లో నెరవేరుతోంది.
చుట్టూ చిమ్మ చీకటిగా ఉంది. నా హృదయంలో కూడా చీకటి.
ఇంకొంచెం సేపట్లో ఈ బ్రతుకు కూడా చీకటిమయమైపోతుంది.
నగరంలో దూరంగా గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి. నా మనసున వెలుగివ్వగల దీపం ఒకటీ లేదు… నా ఆశాజ్యోతివి నీవు లేవు.
జనరల్ వార్డు హాలులో ఓ మూల కుర్చీలో కూర్చుని, ముందున్న టేబుల్ మీద తలవాల్చి నైట్ డ్యూటీ నర్సు మాత్రం నిద్రపోతోంది.
నైట్ డ్యూటీ డాక్టర్ యెక్కడున్నాడో!
నేనిలా మంచం మీద కూర్చుని రాసుకోవడం వాళ్ళు చూస్తే అనుమతించరు -కట్ల వెనుక వున్న పచ్చిగాయాలు నెత్తురోడుతాయని.
అమీనా! నేను కూడా నీ దగ్గరికి వస్తాను. నీవు ఈ సమయానికే మరో లోకానికి – ఈ మనుషులు చూడని మరో లోకానికి వెళ్లిపోయుంటావు.
నేనూ అక్కడికే వస్తాను… తొందరలో – మరో కొద్ది గంటల్లో.
నన్ను తీసుకువచ్చిన పోలీస్ ఆఫీసర్‌తో ఆ డాక్టర్ చెప్పాడు – ఇతడిక బ్రతకడని. మహా అంటే ఉదయం వరకూ అని.
అతి శ్రమతో బ్రతికించే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వ డాక్టర్లు అంత శ్రమ తీసుకుని అనామకమైన వాళ్ళందరినీ బ్రతికించరు… నేను కోరుకునేది అదే!
ఈ నడిరేయి ఉలిక్కిపడి లేచాను… నీకు ఈ ఉత్తరం రాయడానికేమో!
నీకు వుత్తరం రాస్తే నాకు మనశ్శాంతిగా వుంటుంది.
ఇది నీవు చదివే అవకాశం లేదని తెలిసినా, లేని ఓపిక తెచ్చుకొని ఈ ఆసుపత్రి మంచం మీద నుండి – ఈ చావు పడక మీద నుండి రాస్తున్నాను.
ఆరే దీపానికి వెలుగెక్కువట. మామూలు స్థితిలో కన్నా దిట్టంగా కూర్చుని నెత్తురు, కన్నీళ్లు కలిపిన సరికొత్త సిరాతో రాస్తున్నాను. శరీరానికి యెక్కడ బడితే అక్కడ కట్టిన కట్ల లోపల యేదో పారాడుతోంది. గాయాలు నెత్తురు స్రవిస్తున్నాయేమో!
ఇన్నాళ్లూ నీకోసం నేను పడ్డ వేదనను నీ ముందు ఉంచుతున్నాను – నీవు ఇంకా నాకు చేరువలోనే ఉన్నావన్న వెర్రి భావనలో.
అవునూ… ఇన్నాళ్లూ నేను ఎందుకు ఉత్తరం రాయలేకపోయాను!
ఇంత ప్రేమను దాచుకొని భారంగా బ్రతుకునెందుకు గడిపాను!
పరిస్థితుల ప్రభావమా! ఈ కుళ్ళుబోతు మనుషుల వల్లా!
ఏమో… అలా చెబితే ఆత్మవంచన అవుతుందేమో!
నేను ఉత్తరం రాయకపోవడానికి నా పిరికితనమే ముఖ్య కారణమేమో!
అమీనా! ఇప్పుడు నాకు కొండంత ధైర్యంగా ఉంది. ఈ అక్షరాలు కూడా ఎంత ధగధగ లాడుతున్నాయో చూశావా!… ఏమిటలా చూస్తున్నావు!
అక్షరాలు ఎరుపు సంతరించుకున్నాయనా?
పైశాచికం పరవళ్ళు తొక్కుతూ ఉంటే, కసిగా… కసిక్కసిగా నన్ను పొడిచారుగా, ఈ మనుషులు!
ఆ కత్తిగాట్ల నుండి వెచ్చగా స్రవిస్తున్న రుధిరపు మరకలు నీ ఉత్తరానికి కూడా అంటుకున్నాయి.
వాళ్ళు ఎంతటి మేలు చేశారు నాకు!
నా చివరి ఘడియల్ని ఒక్కొక్కటిగా ఈ ఉత్తరంలో కెక్కించడానికి అవకాశం కల్పించారు.
నా అమీనాకు స్వచ్ఛంగా… ప్రేమగా రాయడానికి కొండంత ధైర్యాన్నిచ్చారు.
ఈ ధైర్యం నా మనసు నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిన క్షణం నుండే వుండింటే ఎంత బాగుణ్ణు!
అప్పుడు నేను చాలా పిరికివాడిని.
★ ★ ★ ★
అప్పుడు నీకోసం ఎంత పరితపించే వాడిననీ!
నీవు కనపడకపోతే మనసంతా ఎంత వెలితిగా ఉండేదనీ!
నువ్వు కనిపించీ చూడనట్లు వెళ్లిపోతే ఎంత గిలగిల్లాడే వాడిననీ!
నన్ను చూసి చిన్న చిర్నవ్వు… మల్లెలా స్వచ్ఛంగా… పున్నమి వెన్నెల్లా… పలకరింపుగా నవ్వితే నా మనసు ఆనందంతో ఎంతగా పరవశించేదనీ!
ఆ ఆనంద తరంగాలు ఎగిసెగిసి గుండెల్ని తడిపేస్తూ వుంటే ఆరోజు ఆకలి కూడా మర్చిపోయావాన్ని.
కానీ, నువు నన్ను ప్రేమించలేదు కదూ?
ఈ భావన మెదిలినప్పుడు ఎంతగా కుమిలిపోయేవాడినో తెలుసా!
ఎలా రోదించేవాడినో తెలుసా!
ప్చ్… నా బ్రతుకే అంత. నేను అందర్నీ ప్రేమిస్తాను. నన్ను ఎవ్వరూ ప్రేమించరెందుకో!
కనీసం నా ప్రేమనైనా స్వీకరించరు.
చివరకు నేను ఎంతో ముద్దుగా ముద్దాడుకునే నల్ల కుక్క పిల్ల నా ‘బ్లాకీ’ కూడా నన్ను విడిచి వెళ్లిపోయింది. ఎంతగా ఏడ్చానో తెలుసా! అయినా ‘నోరు లేని జంతువులే’ అని సరి పెట్టుకోగలిగాను.
మనసు మమత మానవత్వం ఉంటుందనుకునే ఈ మనుషులతో ఎలా సరిపెట్టుకోను!
నన్ను ప్రేమించకపోతే, పురుగును విదిలించినట్లు విదిలిస్తే బాధపడకుండా ఎలా ఉండను?
ఏడవకుండా ఎలా ఉండను?
అమీనా! నేను అందర్నీ ఎందుకు ఇట్లా ప్రేమించి ఏడుస్తాను!
అమ్మ, అక్క, చెల్లి వీళ్లంతా నన్ను ప్రేమించరెందుకో! నేను ఎవరికీ ఉపయోగపడకుండా ప్రపంచానికి వ్యర్థున్నై బ్రతుకుతున్నానని వీళ్ళందరికీ కోపం.
నేను ఉద్యోగం చేస్తూ ఉండింటే… నేను మంచి స్థితిలో ఉండింటే… నాకు డబ్బు ఉండింటే… ఈ ప్రపంచంలో అందరూ నన్ను ప్రేమించే వాళ్లు కదా! అటువంటి దాన్ని ప్రేమ అని ఎలా అనుకోను?
అవేమీ లేని నా మీద నా వాళ్లకు కూడా ప్రేమ… కనీసం సానుభూతి కూడా లేదు.
నా చెల్లెల్ని ఎంత ప్రేమగా ‘చిన్నా’ అని పిలుస్తాను. పలకదు.
‘కన్నా’ అని దగ్గరకు చేరి ఆప్యాయంగా తలమీద చెయ్యి వేయబోతాను.
‘ఊఁ’ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చి లేచి వెళ్ళిపోతుంది – మరి ఇంక నాతో మాట్లాడటం యిష్టం లేనట్లు.
నీవు కూడా చాలాసార్లు అలా లేచి వెళ్ళిపోయావు కదూ!
అందుకే ‘నువు నన్ను ప్రేమించలేదు కదూ!’ అంటున్నాను.
ఒకవేళ ప్రేమిస్తున్నానని నువ్వనుకున్నా, ఆ ప్రేమలో పరిపక్వత లేదు. తెలియని తన మున్నింది. దాన్నే నువ్వు ప్రేమ అనుకున్నావు.
లేకుంటే, మరి నీ పుట్టినరోజున స్వచ్ఛంగా… మంచు ముత్యంలా… కనిపించే నిన్ను చూసి ముద్దు పెట్టుకోపోతే యెందుకు విసిరి కొట్టావు! నీ వాళ్ళు వున్నప్పుడు నిష్కపటంగా నాతో మాట్లాడవెందుకు!
నీ వాళ్లు కూడా మనుషులు కారు. నీవు నాతో ఒంటరిగా మాట్లాడడం చూసి, ఆ తర్వాత ఇంట్లో అందరూ నిన్ను తిట్టారన్నావు. నీ అన్న నిన్ను కొట్టాడు కూడా కదూ!
వీళ్లంతా ఇంతే!
ఈ మనుషులంతా ఇంతే! కట్టుబాట్లతో… వాళ్లలో కమిలి పోతున్న కామంతో… ఎదుటి వాళ్ళ మీద అనువణువణువునా అనుమానంతో వేగిపోతుంటారు.
అందరూ వాళ్ళలాగే కామంతోనే ఉన్నారునుకుంటారు.
నిజమేలే! వాళ్ళను అనుకోవడానీకీ యేం లేదు.
ఈ లోకంలో ఇద్దరు ప్రేమికులు ఏకాంతంగా చీకట్లో కలుసుకుంటే వాళ్ల ప్రేమను కామం కప్పేస్తుంది. ఆ బురదలోనే అదే ప్రేమ అనుకుంటూ దాంట్లోనే కొట్టుమిట్టాడుతారు. వీళ్లకు ప్రేమంటే అదేనేమో!
తాను బలవంతంగా అనుభవిస్తున్న స్త్రీకి మధ్యలో ఊపిరాగిపోయిందని తెలిసినా కక్కుర్తితో చివరి వరకు రతి సాగించి గాని లేయని రాక్షసులెందరో ఈ మనుషులలో… ఈ మగవాళ్లలో.
ఒకే రాత్రి పదిమందితో రతి సాగించి, యింకా ఏదో వెలితి ఉన్నట్టు పొద్దు పొడిచే వేళ కూడా మరెవడి కోసమో ఎదురు చూడగల కామిని పిశాచాలెందరో ఈ మనుషులలో… ఈ ఆడవాళ్లలో.
ఇంతటి పైశాచిక భావాలున్న మనుషుల మధ్య బ్రతికే మనుషులు, మనల్ని రాత్రివేళ ఒంటరిగా చూసి తప్పు పట్టడంలో సందేహం వుండకూడదు! అందుకే నీవాళ్లు నిన్ను తిట్టారు కదూ! కొట్టారు కదూ!
నీవి కూడా కూడా బూజు భావాలే. అందుకే నేను ముద్దు పెట్టబోతే, మరేదో నీచ భావం నీలో మెదిలి నన్ను విసిరి కొట్టావు, కదూ?
అమీనా! అందుకే పరిపక్వం లేని నీ ప్రేమను అడగడానికి నేను చేయి చాచలేదు. నీకు ఉత్తరం రాయలేదు. నాకు బిక్ష మడగడమంటే అహం అడ్డొస్తుంది… ప్రేమ కోసమైనా సరే! చివరకు నీ దగ్గరైనా సరే!
ఇట్లాంటి దిక్కుమాలిన ఆత్మాభిమానాలే మనల్ని ఆ దిక్కునొకర్నీ… ఈ దిక్కునొకర్నీ నిలబెట్టాయేమో!
ఏదోరోజు నీకు నిష్కామంగా ప్రేమించే మనస్తత్వ మొస్తుందని తెలుసు.
అప్పుడు ఈ మనుషులకూ… లోకానికీ… ప్రపంచానికి… విశ్వానికీ అతీతంగా కలిసి పోతామని తెలుసు.
కానీ అమీనా! నీవు నన్ను ప్రేమిస్తున్నావో లేదో తెలియక ముందే నీవాళ్లు నీకు నిఖా ఏర్పాటు చేశారు. అది తెలిసి మీ వాళ్ళ మీద ఎంత కోపం వచ్చిందనీ!… ఎంత అసహ్యమేసిందనీ! ఒక్కొక్కరినీ… అడ్డొచ్చిన వాళ్లందర్నీ నరుకుదామని బయలుదేరాను.
అమ్మ అడ్డొచ్చింది.
‘నువు ఆ మతం గాని పిల్లను తెచ్చుకునే ముందు నన్ను నరికి వెళ్ళు’ అంటూ కాళ్లకు చుట్టుకుంది.
వీళ్లంతా ఎందుకు ఇట్లా కులమతాలను పట్టుకొని వేలాడుతారు!
మతం అంటే ఏమిటసలు! ఈ సంఘంలో నేను ఎక్కువ నీవు తక్కువ అన్న భేదం ఏమిటి!
నా రక్తం చిక్కటి ఎరుపుగానూ నీ రక్తం లేత ఎరుపుగానూ ఉంటుందా! అదేమీ లేదే!… అలా ఉండదే!
అదే మాట అమ్మతో అన్నాను. అడ్డు తొలగమన్నాను.
అమ్మ, అక్క, చెల్లి అందరూ నన్ను పిచ్చివాడిని చూసినట్లు చూశారు.
వాళ్ళ బాధల్లా ఒకటే, నేను నిన్ను తెచ్చుకుంటే నా చెల్లెలికి పెళ్లి కాదు.
నిజమే, ఈ సంఘంలో బ్రతికే వాళ్ళు… వాళ్ళ బాధ వాళ్ళది. ఎవరి స్వార్థం వాళ్లది.
తర్వాత అక్క నన్ను తెలివిగా నా బలహీనత మీద దెబ్బ కొట్టింది.
‘ఆ పిల్లకు నువ్వంటే ప్రేమ లేదు. మరొకరిని ప్రేమించింది, వాళ్ళ ముసల్మాన్ అబ్బాయినే. నేను చూశాను. ఇప్పుడు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటోంది. నిన్ను ప్రేమించని దానికోసం నువ్వు వెళ్లడం సిగ్గులేని పని.’ – అని నా బలహీనత మీద దెబ్బ కొట్టింది. పౌరుషాన్ని రెచ్చగొట్టింది. నా అక్క నన్ను తెలివిగా మభ్యపెట్టింది. మభ్యపెడుతోందని నాకు తోచలేదు.
జీవితంలో ఎదురయ్యే ఒకే ఒక్క చెడ్డ క్షణం మనిషి వివేకాన్ని చంపి జీవిత గతినే మార్చేస్తుందేమో!
నీకు పెళ్లి జరిగిపోయింది.
అప్పుడు ఎంత వెర్రిగా రోదించాననుకున్నావు.
నా నిస్సహాయతకు ఎంతగా కుమిలి పోయాననుకున్నావు.
ఆరోజు గుర్తుతెలిసి మొదటిసారిగా ‘భగవంతుడా!’ అని స్మరించాను.
‘అల్లాహ్!’ అని అరిచాను. ‘ప్రభువా!’ అని పిలిచాను.
వీళ్లంతా నన్ను దగ్గరికి చేర్చుకున్నట్లే చేర్చుకొని వెలివేస్తారెందుకు?… ఎందుకు?… అంటూ పిచ్చిగా అరిచాను.
మగతగా పడుకొని యేడ్చాను.
★ ★ ★ ★
అమీనా! ఆ రోజు నుండి ఈరోజు వరకు – నీ దగ్గర నుండి ఉత్తరం చేరిన ఈరోజు వరకు – నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు.
అంత బాధలోనూ, ‘నువు కోరుకున్న వాని దగ్గర సుఖపడుతున్నా’ వని అన్పించే భావన కొంచెం ఆనందాన్ని ఇచ్చేది.
ఈరోజు నీ ఉత్తరం చేరింది. పరిపూర్ణమైన ప్రేమతో, ఎంతో ఆప్యాయంగా నీవు రాసిన ఉత్తరం ఎన్నిసార్లు చదువుకున్నాననీ!… ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాననీ!
నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడని, అతడు ఒక శాడిస్ట్ అని చదివేటప్పుడు వణికిపోయాను. నీరై పోయాను.
నీ వతనికి ‘ఖులా’ యివ్వ నిశ్చయించు కున్నావన్న వాక్యం చూసి గర్వంగా తలుచుకున్నాను.
నువు నాదానిగా, నా వెంట ప్రేమ సామ్రాజ్యంలోకి అడుగిడాల నుకున్నప్పుడు కలిగిన ఆనందం… ఓహ్! ఆ ఆనందాన్ని అక్షరాల్లోకి అనువదించడం నాకు చేతకావడం లేదు.
ఆ క్షణంలోనే నీ దగ్గరకు నడిచాను.
నరకం నుండి విడివడాలనుకున్న నిన్ను అందుకోవడానికి.
అమీనా! ప్రేమ సముద్రంలో పడి యేదో అనుభూతి తీరాలకు మనం కొట్టుకుపోతూ వుంటే, ఈ మనుషులంతా యేం చేస్తున్నారో తెలుసా!
నగరంలో ఒకరి తలలు ఒకరు పగులగొట్టు కుంటున్నారు.
ఒకరినొకరు ఎదురెదురుగా నిలబడి పొడుచుకుంటున్నారు.
ఒకడు హిందువుననీ… మరొకడు ముస్లింననీ తలెగరేసి చెప్పుకుంటూ ఒకరితలను ఒకరు నరుక్కుంటున్నారు.
ఏ కుల రాజకీయమో! ఏ మతోన్మాదమో! మానవత్వాన్ని మసి చేస్తోంది.
చిత్రమేమిటో తెలుసా అమీనా!
అందరినెత్తురు ఒక్కటై కలిసి పారుతోంది.
ఏ భేదమూ లేనట్లు కలిసి పోతుంది.
మత పిచ్చి సంకెళ్లు తెంపుకుందని, దాన్ని అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించారు.
రోడ్లన్నీ నిర్మాణస్యంగా ఉన్నాయి.
అమీనా! ఈ స్పందన లేని మనుషులతో మనకేం పని! మన గమ్యం ఒక్కటే… మనం కలిసి పోవాలి.
నిన్ను కలవాలన్న ఆరాటమే నన్ను నీ దగ్గరకు నడిపించింది.
ఆ నిర్మానుష్యమైన రోడ్ల వెంబడి… ఆక్షణంలోనే నీ దగ్గరకు నడిచాను.
ఏ పోలీసైనా చూస్తే అడ్డగిస్తాడన్న ఆలోచన కూడా రాలేదు.
మార్గమధ్యంలో మసీదు చూశాను. నువ్వు ప్రేమించేదేదైనా నేను అభిమానిస్తాను. అందుకే అల్లా అంటే నాకు కూడా గౌరవం.
ఒక్క క్షణం ప్రేమగా మసీదు వంక చూశాను – నీ మీది ప్రేమ నంతా కళ్ళలో నింపుకొని.
ఆర్తిగా మసీదు వైపు చూసి వెనుతిరిగాను.
వెనుక నుండి మసీదు నుండి యెవరో పరిగెత్తుకొస్తున్న చప్పుడు. వెనుతిరిగి చూశాను.
క్షణంలో సగం లోనే… కసిగా ఆవేశంగా ఉక్రోషంగా నా కడుపులోకి దిగబడ్డ కత్తిపోటు.
అమీనా! ఆర్తనాదంలో అందరూ ‘అమ్మా!’ అని అరుస్తారట. ఆ కత్తి పోటుకు కళ్ళలో సుళ్ళు తిరుగుతుండగా, దిక్కులు పిక్కటిల్లేలా ‘అమీనా!’ అంటూ అరిచాను.
కళ్ళు బైర్లు కమ్ముతుంటే నిలదొక్కుకొని చూశాను.
అమీనా! ఆ వచ్చిన దెవరో కాదు… నీ భర్త, నీ అన్న, యింకా నీ వాళ్ళెవరో!
ఒకడి చేతిలో పిడిబాకు. ఒకడి చేతిలో కరవాలం. ఒకడి చేతిలో గండ్రగొడ్డలి… నిగనిగలాడుతూ.
మీ భాషలో తిడుతూ కలగాపులగంగా అరుస్తున్నారు. నాకు అర్థమైందొక్కటే
‘వీడు హిందువు. మనకు మొదటి శత్రువు. మట్టు పెట్టండి’ అని.
అమీనా! నిన్ను కలుసుకోవాలన్న తపన… కలవలేక పోతున్నాననే ఆవేదన… నీకోసం నిస్సహాయంగా వాళ్లకు చేతులు జోడించబోయాను… మరో పోటు బాణంలా వెన్ను నుండి దూసుకొచ్చింది. మరోసారి బాధగా… బిగ్గరగా ‘అమీనా!’ అని నా నోటి నుండి వెలువడిన అరుపు అరణ్య రోదనమై గాలిలో కలిసిపోయింది. ప్రకృతి నిస్సహాయంగా చూస్తున్నట్లుంది.
ఇంతలో పోలీస్ సైరన్ వినిపించింది.
‘ఓ హిందువును మట్టుబెట్టా’ మన్న గర్వంతో వికటాట్టహాసాలు చేస్తూ తిరిగి మసీదులోకి పరిగెత్తారు.
ఆ క్షణమే అక్కడికి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్, ఆ వెనుకే వచ్చిన అంబులెన్స్ నన్ను ఈ ఆస్పత్రికి చేర్చాయి.
అమీనా! నేను బ్రతకను. నీకు తెలుసా, నేను చాలా స్వార్థపరుడ్ని.
నన్ను ప్రేమించే వాళ్ళు నాకు దూరంగా వుంటే భరించలేను. వాళ్లు కూడా నా వెంట రావాలి.
ఆ స్వార్థంతోనే… ఆ పచ్చి స్వార్థంతోనే… అంబులెన్స్ మీ ఇంటి మీదుగా వచ్చేటప్పుడు ‘అమీనా!’ అంటూ దిక్కులు, దిగంతాలు ఊగిపోయేలా అరిచాను.
నా గొంతులో నుండి వెలువడ్డ ఆ అరుపుకు నీవు ఆత్రంగా తలుపులు తెరుచుకుని వీధిలోకి పరిగెత్తుకొస్తావని తెలుసు… నాకోసం ఖచ్చితంగా వచ్చి వుంటావు – నాకు తెలుసు.
నీ ఇంటి ఎదురుగానే ఉన్న పవిత్రమైన శివాలయం నుండి మానవత్వం లేని మనుష్య హిందూ మృగాలు ఆదుర్దాగా వచ్చి నిన్ను చుట్టుముట్టింటాయి. నిస్సహాయంగా బెదిరిన లేడి పిల్ల కళ్ళతో నువ్వు బేలగా చూస్తూ వుంటే… నిర్ధాక్షిణ్యంగా… కిరాతకంగా ఒకడి తర్వాత ఒకడు నిన్ను పొడిచుంటారు.
నీవు దీనంగా ‘భయ్యా!’ అని కాళ్ళ మీద పడితే, మరింత కర్కోటకంగా గొంతు మీద అడుగేసింటారు. నీ సుకుమారమైన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వుంటారు.
అమీనా! నేనెంతటి పాపిని కదూ! నాతో పాటు నిన్ను తీసుకెళ్తున్నాను. మన చరిత్ర తెలిసిన వాళ్ళెవరైనా నన్ను స్వార్ధపరుడని అసహ్యించుకోనీ గాక!
నా అమీనా ఆత్మ నా ప్రేమను గుర్తిస్తే చాలు.
గుర్తిస్తుందని నా మనసుకు తెలుసు.
అందుకే సంతోషంగా… చివరి ఘడియల్లో మరణశయ్యపై నుండి నా అమీనాకు నా మొదటి ప్రేమలేఖ రాస్తున్నాను. ఇదే చివరి మరణ లేఖ.
ఇది నీకు చేరదు. నువు చదవవు.
అయినా, అమీనా! పోలీసులకూ పత్రికలకూ చేరుతుంది.
మనలాంటి నిష్కామ ప్రేమికులకూ – కుల మతాతీత ప్రేమికులకూ చేరుతుందేమోనని… చేరాలనీ… ఏ మూలో సన్నటి ఆశాకిరణం…
★ ★ ★ ★








[…] View all posts క్రాస్ రోడ్స్ మరణశయ్యపై నుండి ప్రేమలేఖ! […]
ఇన్నేళ్ళూ దాక్కున్న నా కథను ప్రచురించిన ‘సారంగ’ కు ధన్యవాదాలు.
ఆన్నా
చాలా అందంగా, హృదయం ద్రవించేలా రాశారు. అంతకు మించి మాటలు లేవు.
వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి
థ్యాంక్యూ సర్!
<blockquote అచ్చం చలం శైలి.. మొదటి
కథే అంత బాగా రాసినారంటే …అప్పటికి మీరు
తెలుగు కథా సాహిత్యాన్ని ఒక్కసారైనా తిరగేసుంటారు ఖచ్చితంగా. చలం 'ఓ పువ్వు పూసింది ' ఫోర్స్ ఈ కథలో పరవళ్ళు తొక్కుతోంది. చాలా రోజులకు ఒక మంచి కథ
చదివిన స్పందన మనసులో. మీ కథలు మిస్ కాకుండా చదువుతాను.
నిజమే, ఆ కథ రాసే నాటికి నా మీద చలం శైలి ప్రభావం నామీదుంది. అందుకే కథలో ఆమె పేరు కూడా అమీనా అని పెట్టానం.
బాగుంది సార్ … మోనోలాగ్ స్టైల్ లో చాలా బాగా రాసారు . శుభాకాంక్షలు
Thank you
చాలా బావుంది సర్. సమాజాన్ని నిలతీసే ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సమాధానాలు, గుండెను మెలిపెట్టే సందర్భాలు ఇందులో ఉన్నాయ్!
అప్పుడెప్పుడో వ్రాసినా ఇప్పటి వాస్తవిక ప్రపంచానికి, మనుషుల మనస్తత్వానికీ దగ్గరగా ఉంది.