I am dream of yesterday and memory of tomorrow.
– Kahlil Gibran
నిన్న వచ్చిన కల ఒక యాదిగా మారే యాల్ల
నిద్రలేచిన ఉదయం నిన్నటి వలెనే ఉన్నది.
ఊహ మాత్రం కొత్తగా ఉన్నది.
ఒక వర్షం వెలిసిన తర్వాత ఊరు కడిగిన
ముత్యమోలె వుంటది.
పిల్లలు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తడిసి పోయి ఉంటాయి.
వాళ్లు వండుకొని
అర్ధాంతరంగా వదిలిపోయిన బువ్వ కూరలు ఉంటాయి.
లేత చిగురుల గుట్టలకే
గోగుపూల గాయాలు ఉంటాయి.
గూగుల్ లో కాదు గూగుల్ లో కాదు గీ తోవ లోనే
కాడెద్దుల వెనుక నాగలి భుజానికెత్తుకున్న రైతు ఎదురై తడు.
ఇక్కడనే మన్నుబువ్వగా మారే జీవక్రియలు
చూడగలవు నువ్వు.
ఇక్కడి మట్టికి ప్రాణం ఉంటదిరా మనిషి!
ఇక్కడి చెట్టుకు మహిమ ఉంటదిరా మనిషి!
నడిచే ప్రతి చోట నిన్ను అలై బలై దీసుకునే మనిషి ఒకడుంటాడు.
నీ పూర్వీకుల ఆకలి నిన్ను నడిపించాలె.
నీ చేతిలో చెయ్యేసి నిండిన చెరువు
నీకు బంగారుపంటను అభయమియ్యాలే.
ఉబికిన వూటబాయి దరి మీద
నీ మది నిండా మోట గిరుకల సప్పుడు మోగాలె.
అలుకుడు జేసిన నారుమడి మొగులు మీద
ఆశల సింగిడి పూత పూయాలె.
పజ్జొన్న కంకి మీద పాలపిట్ట గాలి ఊయల ఊగాలె.
మంచె మీది రైతు మా రాజుగా నిదురపోవాలె.
అతని వాకిట కొట్టం ముందు
చిన్న లేగల ధుంకుడు జూసి మనసు చెంగలియ్యాలె.
తెలిసిందా?
ఇక్కడ అయితేనే ప్రాణవాయువువేదో
నీకు పిల్లగాలై సోకుతుంది.
ఇక్కడైతేనే నీ దుఃఖాన్ని పంచుకునే భుజాలు ఉంటాయి.
పల్లేరు గాయల్లో నడిచొచ్చిన నీ పాదాలను
విశ్ర మింపజేసే పరుపు బండలుంటాయి.
ఇక్కడ నడవగలి గినవాళ్లే
జనం పాద ధూళితో పావనమైపోతారు.
ఇక్కడి నీళ్లను నెత్తిన జల్లుకొని పోయినోళ్ళు
పరమ పవిత్రులు అయిపోతారు.
Add comment