అమ్మ చేతి ముద్దలో
బోసినోటి నవ్వులో
తియతియ్యటి ముద్దులో
పసితనంలోంచి తొంగిచూసే చందమామలా పరిచయమయ్యావు.
ఇసుకలో చెదిరిన అడుగుల్ని
నిశిలో కలిసిన వెలుగుల్ని
జడిలో తడిసిన కలల్నీ
కదిలించడానికే నువ్వొచ్చావు.
పున్నాగపూల పరిమళంలా
పురివిప్పిన నెమలిలా
హరివిల్లులా
సహజాతిసహజంగా
జీవితాన్నావహించింది
నీ స్నేహం
కలిసి బొమ్మలేద్దామంటావు
చిక్కటి ఫిల్టరు కాఫీలో
పాలచుక్కలా కలిసిపోదామంటావు
పాత పాటవై వెంటాడుతావు
నీలాంటివాళ్ళెప్పుడూ
అమృతం కురుస్తున్న రాత్రిళ్ళ గుండె
చీల్చుకుని వస్తారు
కొన్ని బంధాలు
మనల్ని మనకే అద్దంలో కొత్తగా చూపిస్తాయి
చినుకై, చిగురై, మొలకై, మానై
నిగూఢ మూలాల్లోంచి ఎదిగి
తెగిన ఆశలు మొలిపిస్తాయి
ఊహలకి రెక్కల విలువ తెలుస్తుంది
ఆకాశం నట్టింట్లోకి వస్తుంది
ప్రపంచం గుప్పిట్లో ఇమిడిపోతుంది
ఏ నిద్రాంకిత సముద్ర కెరటాలపై తేలిపోతున్నానో
ఏ సరంగు పాటలో పడవనై ఊగిపోతున్నానో
నడివయసు తుఫాను రాత్రి
జ్ఞాపకాలు మాత్రమే తోడు
ఎప్పుడు ఏ ఏకాంతం ఎందుకు భళ్ళుమంటుందో —
*
Add comment